Tuesday 29 April 2008

జలకాలాటలలో ...


సాధారణంగా నాకు నీలాకాశం, నీరు అంటే ఇష్టమే. కాని ఈత నేర్చుకోలేదు. అస్సలు నేర్చుకుంటా అని కూడా అడగలేదు మా అమ్మా నాన్నని, అది మగవారికే అవసరం అనో, మనకేదైనా ఐతే మగవాళ్ళే చూసుకుంటారు అనవసరంగా ఎందుకు కష్టపడడం అనో నేర్చుకోలేదు. కాని నాకు గుర్తున్నంతవరకైతే మా ఇల్లు చాలా ఎత్తులో ఉండేది. ఎంత భారీ వర్షమొచ్చినా ఇంటిముందు నీరు నిలవదు. అలాగే హైదరాబాదులొ వరదలొచ్చే ప్రమాదం అస్సలు లేదు. ఇంకెందుకు ఈత నేర్చుకోవడం అని నా ఉద్దేశ్యం చిన్నప్పుడే. దాని అవసరం కూడా పడలేదు ఇంతవరకు.

ఇక నేను మొదటిసారిగా నీళ్ళలో దిగింది అంటే మహానందిలోని పుష్కరిణిలో. అదికూడా స్వచ్చంగా అడుగున ఉన్న రాళ్ళు కూడ క్లియర్‌గా కనిపిస్తుంటే పర్లేదు అని.ఈత అనేకంటే హాయిగా ఆ నీళ్ళలో నడిచాను అని చెప్పొచ్చు. మరి సినిమాల్లోలాగా నీళ్ళలో దిగగానే ఈత కొడుతూ పాట పాడతారా? . అరగంట తర్వాత కాని కొట్టుకుపోతానేమో అనే భయం పోలేదు. కాని అక్కడికి మళ్ళీ నాలుగైదు సార్లు వెళ్ళినా నీళ్ళలో దిగలేదు. మావారు పిల్లలు నీళ్ళలో ఉంటే నేను పైనే కూర్చున్నా. పవిత్రమైన తిరుపతి పుష్కరిణిలో కూడ నేను అస్సలు దిగలేదు.అంతమంది దిగి స్నానాలు, బట్టలు ఉతికిన నీళ్ళు అందులోనే .. బాబోయ్. కనీసం నీళ్ళు కూడా నెత్తిన చల్లుకోలేదు ఇంతవరకు మావారు తిట్టినా సరే.

నా కల:

పైన చిత్రంలో ఉన్నట్టు కొండల నడుమ ఎటువంటి శబ్ద కాలుష్యం లేని చోట, చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఒక చిన్ని ఇల్లు.ఇంటివెనక ఒక ఈత కొలను. ఎండాకాలంలో చల్లగా, చలి,వాన కాలంలో గోరువెచ్చగా ఉండే నీళ్ళు.హాయిగా పాత పాటలు వింటూ ఒక్కదాన్నే ఈత కొడుతూ, పక్కనే ఓ షాంపేన్ బాటిల్, వేయించిన జీడిపప్పు పెట్టుకుని సిప్ చేస్తూ (మావారికి చెప్పకండే) ఎంజాయ్ చేయాలని నా తీరని (అస్సలు తీరే చాన్సే లేని) కోరిక. కలలోనే కదా నో ప్రాబ్లం.

వాస్తవం :

హైదరాబాద్ మహానగరంలో ఉన్న నీటి సమస్య తెలియనిదెవరికి. రోజుకు అరగంట వచ్చే నీళ్ళతో ఎన్ని అవసరాలు తెర్చుకోవాలి. అప్పుడే బట్టలు ఉతుక్కోవడం, గిన్నెలు కడుక్కోవడం, ఇంకా పట్టిపెట్టుకోవడం.. హాయిగా స్నానం చేసే అదృష్టం కూడానా. బకెట్ నీళ్ళతో స్నానం పూర్తి చేసుకోవాలి. అదే ఈతకొలను, వానజల్లు అనుకుంటూ. ఐనా " జలకాలాటలలో గల గల పాటలలో ఏమి హాయిలే హలా! అహ ఏమి హాయిలే హలా" అనుకుని ఎంజాయ్ చేస్తూ ఆల్ హ్యాపీస్.

7 వ్యాఖ్యలు:

ramya

అరే నేను ఈ రోజే స్విమింగ్ లో జాయిన్‌ ఐ వచ్చాను ఈ టూమంత్స్ కోసం. ఇలా వచ్చి నెట్ తెరవగానే మీటపా :)

Naveen Garla

>> ఓ షాంపేన్ బాటిల్
మద్యపానం మహాపాతకం :)

Aditya

మీ కల ఖచ్చితంగా నిజం అవుతుంది లెండి జ్యోతి గారు. రాస్తూ ఉండండి!

Sujata M

జ్యోతి గారు.. ఎప్పటి లాగే మీరు షాంపైన్ కల, అల.. అంటూ గమ్మత్తు గా రాసేసారు. ఒక చిన్న విషయం. నేను ఎన్నాళ్ళు గానో.. ఈ 'ఈ వారం తెలుగు పదం' లో longitude తప్ప కొత్త పదాలు చూడలేదు. మీరు బ్లాగ్ పెద్దలు కాబట్టి.. కాస్త నోటీసు చెయ్యండి.

Sujata M

జ్యోతి గారు.. ఎప్పటి లాగే మీరు షాంపైన్ కల, అల.. అంటూ గమ్మత్తు గా రాసేసారు. ఒక చిన్న విషయం. నేను ఎన్నాళ్ళు గానో.. ఈ 'ఈ వారం తెలుగు పదం' లో longitude తప్ప కొత్త పదాలు చూడలేదు. మీరు బ్లాగ్ పెద్దలు కాబట్టి.. కాస్త నోటీసు చెయ్యండి.

ఓ బ్రమ్మీ

జ్యోతి గారూ షాంపేన్ బాటిల్ కావాలంటే, నాకు ఒక చిన్న ఉత్తరం వ్రాసేయ్యండీ.. మా ఇంట్లో ఎప్పుడు సిద్దంగా ఉంటాయి.

ఇక పోతే, ఇల్లు, వగైరా.. వగైరా .. మనవల్ల్ కాదు కానీయ్యండీ.. పకోడీలైతే, నా భార్య బాగా చేస్తుంది, కాబట్టి మీకు అవి మాత్రం on demand సప్లై చెయ్య బడతాయి.

ఇక కాచుకోండి

రాధిక

కలలు ఎందుకున్నాయి అనుకున్నారు.తీరని కోరికలు అలా అన్నా తీర్చుకున్నామని ఆనందపడడానికే.
నేను మొదటి సారి ఈత కొట్టింది నా అతి చిన్న వయసులో మా ఇంటిపక్కన ఉండే పంటపొలాలకి నీళ్ళు పెట్టే చిన్న బోదెలో.తరువాత సముద్రంలో,కాలువలో కార్తీకమాస స్నానాలు చెయ్యడమే.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008