SATURDAY NIGHT FEVER
తిన్నామా , పడుకున్నామా , తెల్లారిందా!!!!!!!!!!!
అర్ధం కాలేదు కదా!!
మనకు నచ్చిన విషయమో, పుస్తక సమీక్షో, రాజకీయ సంచలనాలో, సంగీతమో, ప్రేమకథో టక్కున మన బ్లాగులో రాసేసుకుంటున్నాము. ఆ తర్వాత కామెంట్లకు ఎదురుచూపులు. అయితే గియితే సంతోషం. లేకుంటే కొద్దిగా వాడి వేడి చర్చలు.. ఇంతేనా మన బ్లాగర్ల పని. మరి ఏం చేయాలి అంటారా?? కాసింత కళాపోసన చేద్దామా??....
గత శనివారం కొత్తపాళీగారి ఆధ్వర్యంలో గ్లోబల్ వార్మింగ్ పై కూడలి కబుర్లలో జరిగిన సమావేశానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. అలాగే బ్లాగర్లందరూ ప్రతి శనివారం సాయంత్రం ఇలా కలిసి , సరదాగా అప్పుడప్పుడు సీరియస్ విషయాలు చర్చించుకుంటే బాగుంటుంది అనే ఓ చిన్ని ఆలోచనకు రూపమే ఈ SATURDAY NIGHT FEVER .
భారతదేశంలో ఉన్నవారికి సాయంత్రం మరి మాకు కాదుగా అని అమెరికావాసులు అంటారా. కానీ ఎలాగూ మీకు సెలవే కదా. ఇక్కడున్నా అక్కడున్నా మీరు భారతీయులే కదా అందుకే ఈ సాటర్‌డే నైట్ ఫీవర్ అన్నది. మనకంటూ ఒక వేదిక ఉన్నప్పుడు దానిని సద్వినియోగపరుచుకుంటే తప్పేంటి? దీని కోసమై వీవెన్‌తో మాట్లాడి అనుమతి తీసుకోవడం జరిగింది . ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు బ్లాగర్ల సమావేశం జరుగుతుంది. కాని ప్రతీ వారం ఒకో విషయంపై ఆధరపడి ఉంటుంది.(theme based meeting).
ఈ శనివారం (14.6.08) విషయం.... అంతులేని అంతాక్షరి (non -stop antakshari)..
కొత్త బ్లాగర్లందరూ తమకు వచ్చే సందేహాలు, సమస్యలు (బ్లాగులకు సంబంధించినది) సీనియర్లతో చర్చించాలనుకుంటె చెప్పండి. ఆ పైవారం పెట్టుకుందాం. ఇంకా ఎలాంటి విషయాలు మనం ముచ్చటించుకోవచ్చో ఆలోచించండి. ముఖ్యంగా యువ బ్లాగర్లు మీ అవిడియాలు చెప్పండి.
కాని ఒక ముఖ్యగమనిక. ఈ సమావేశాల్లో తెలుగు మాత్రమే రాయాలి. నో ఇంగిలిపీసు. రాకుంటే నేర్చుకోండి. అంతాక్షరిలో ఇంగ్లీషులో పాటలు పాడితే(రాస్తే) అవి అంగీకరించబడవు. తెలుగు పాటలు తెలుగులోనే రాయాలి. లేఖినిలో రాసినా సరే (కాని కాపి పేస్ట్ చేయాల్సి వస్తుంది ), బరహ, అక్షరమాల (నేరుగా రాసేయొచ్చు ) వాడినా సరే . మీ ఇష్టం. ఈ కబుర్లు చాట్ రూం మంటనక్కలో తెరవండి. వేగంగా ఉంటుంది. టైమవుట్స్ రావు. అందుకు మంటనక్కను దింపుకుని దానికి తెలుగు నేర్పి ఉంచుకోండి మరి.
చాలా చాలా ముఖ్యమైన గమనిక:
ఈ సమావేశాల నివేదిక మాత్రం ఇవ్వబడదు. తెలుసుకోవాలంటే పాల్గొనాల్సిందే. లేదంటే మీరే ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కోల్పోతారు అని మాత్రం చెప్పగలను. సంగీత ప్రపంచానికి స్వాగతం...
1 వ్యాఖ్యలు:
జ్యోతి గారు పాటలు కూడా నేర్చుకుని రామ౦టారా:) నాకు ఒక్కపాట కూడా సరిగ్గా రాదు ,మన జాతీయ గీత౦ తప్ప.
Post a Comment