Monday, June 16, 2008

అల్లంత దూరానా ఆ తారక....ఎవరేమనుకుంటే నాకేంటి. నేను అనుకున్నది నేను చేస్తాను అనుకుని నిన్న రాత్రి 7.30 నుండి 8.30 వరకు మా ఇంట్లో బత్తీబంధ్ పాటించా. మనస్పూర్థిగా సుమా!.

ప్రమదావనంలో చర్చను 7.25 కి వదిలేసి సిస్టమ్ ఆఫ్ చేసి, ఇంట్లో అన్ని లైట్లు ఆఫ్ చేసి (ఇంట్లో పిల్లలు లేరు కూడా), మావారు ఏదో డ్రాయింగ్స్ చేసుకుంటున్నారని ఆయన దగ్గర ఒక ట్యూబ్‌లైటు ఉంచేసి బాల్కనీలో చాప వేసుకుని పడుకున్నా. చల్లని పిల్ల గాలులు వీస్తున్నాయి. ప్రశాంతంగా ఆకాశంలో తారల కోసం వెతుక్కుంటూ మనసులో పాత మధురాలను గుర్తు చేసుకున్నాను. నిజంగా ఎంత హాయిగా ఉండిందో ఆ నిశ్శబ్దం. అలా ఆకాశంలో తారలను చూస్తుండగా ఒక బ్రహ్మాండమైన (తిక్క) ఆలోచన వచ్చింది. అది నా బుర్రలో లాక్ చేసి పెట్టేసా. ఎప్పుడు బ్లాగుతానో??. అలా ఆలోచిస్తుండగానే ఆ చల్ల గాలికి నిద్ర పట్టేసింది. 9 గంటలకు పిల్లలు వచ్చి , ఏంటి ఇల్లంతా చీకటిగా ఉండి "మమ్మీ" అని అరుస్తూ అన్ని రూములు వెతికారు. చివరగా బాల్కనీలోకి వచి "ఎంటీ? డాడీతో గొడవైందా ఇలా పడుకున్నావ్" అన్నారు. అదేం లేదు అని లేచి వచ్చి మళ్ళీ ఇంటిపనిలో పడ్డా.

కాని గత పదిహేను రోజులుగా బత్తీబంధ్ బ్లాగు నిర్వహిస్తున్న కొత్తపాళీగారికి నా అభినందనలు. కృతజ్ఞతలు.ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న బ్లాగర్లను కోరి(పోరి), బత్తీబంద్ అనగానే ఏదో ఒక గంట దీపాలార్పేయడం కాదు, గ్లోబల్ వార్మింగ్ మీద ఆలోచించడానికి మనందరిని కదిలించారు.ఎవరి శైలిలో వారిని రాసేలా ప్రోత్సహించారు. రోజు కొక బ్లాగరు రాసిన టపాను ప్రచురించి, అది చాలదన్నట్టు అందరిని ఒకే వేదిక మీద సమావేశపరిచి చర్చించారు. ఇలాంటి ఉపయోగకరమైన మరిన్ని కార్యక్రమాలు మనమందరం కలిసి నిర్వహిద్దాం.

ఈ కార్యక్రమం ఒక్క రోజుతో ముగించకుండా, కనీసం మన ఇంటిలో జరిగే దుర్వినియోగం గురించైనా ఆలోచించాలి. నేను ఇన్ని రోజులు మా పిల్లలను లైట్లు, ఫాన్లు ఆఫ్ చేయరని అరుస్తూ ఉండేదాన్ని. కాని ఇప్పుడు కాస్త కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.ముఖ్యంగా మా అబ్బాయి. అలా ఆఫ్ చేయకుండా వదిలేస్తే ప్రతి నెల కరెంట్ బిల్లు వాడినే కట్టమని చెప్పా. అప్పుడు కాని తెలిసిరాదు. హన్నా.

6 వ్యాఖ్యలు:

vani

అందరూ బత్తీ బంద్ చేస్తున్నారు బాగానే ఉంది. విజయవాడకు ఈ గోల లేదు. కాబట్టి బత్తీ బంద్ కాకుండా, నేను ఒక మాట చెప్పదలచాను. అందరూ పాలిథిన్ బ్యాగ్స్ గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సాధ్యమైనంత వరకు మనం ఇంటి దగ్గర నుండి బయలుదేరేటపుడే సంచులు తీసుకువెళితే బాగుంటుంది. ఇది వరకు అంతా చేతి సంచులు వాడేవారు. కూడలి ఛాట్ లో ఇలాంటి విషయాలపై కూడా చర్చించి, ఆచరిస్తే ఎలా ఉంటుందో పెద్దలు ఆలోచించండి.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి

అభినందనలు జ్యోతిగారు,కొత్తపాళీగారికి,చురుకుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికందరకి నా ధన్యవాదాలు

రాఘవ

వాణిగారూ, మీ ఆలోచన బాగుంది. ఇక కూడలి చాట్ సంగతంటారా, ఏమండీ వీవెన్ గారూ, మేమంతా ఇలా చెయ్యాలనుకుంటున్నాం అంటే మీరు అవకాశం ఇవ్వరూ?

కొత్త పాళీ

good show!
వాణి గారూ, బత్తీబందు చర్చా నివేదికలో పాలిథీన్ సంచుల విషయం కూడా చాలామంది చెప్పారు. మా కమల్ చక్రవర్తి అయితే ఉచుఇతంగా గుడ్డ సంచులు అందిస్తానని కూడా వాగ్దానం చేశాడు.

జ్యోతి

రాఘవ గారు, వాణి,,

కూడలి కబుర్లలో జరిగిన సమవేశ వివరాలు ఇక్కడ చూడొచ్చు.

ఇంకా ఇలాటి చర్చలు ఎన్నో మనం కబుర్లలో చేయొచ్చు. వీవెన్ తప్పకుండా పర్మిషన్ ఇస్తాడు.

కత్తి మహేష్ కుమార్

బాగుంది. తారక బొమ్మ ఇంకా బాగుంది.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008