Thursday, July 3, 2008

ఆహా! ఏమి ఆ రాజవైభవము...అందమైన భవనములోని గదిలో హంసతూలికా తల్పముపై పవళించి (అలా ఫీలైపోవాలి) ఉంటే స్నేహితులు, చుట్టాలు అందరు మన చుట్టూ ఆదుర్దాగా, ఆత్రుతగా మాట్లాడతారు. మనకంటే పెద్దవాళ్ళు వచ్చినా లేచి నిలబడాల్సిన పనిలేదు. ఎవ్వరిని పిలవాల్సిన పనిలేదు. సమాచారం తెలియగానే ఒకరికొకరు ఫోన్లు, చేసుకుని పరుగెత్తుకుని వచ్చేస్తారు మనకోసం.. వట్టిచేతులతో రారు. తినడానికి ఏదో ఒకటి, పళ్ళు తప్పనిసరి ..


ఇది వింటుంటే, చదువుతుంటే, ఊహించుకుంటే చాలా బావుంది కదా!!..


కాని ఈ యాంత్రిక జీవనంలో ఎవరి జీవితంలో వాళ్ళు బిజి బిజీ ఐపోయినా కూడా ఎవరైనా ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో ఉంటే పరుగెత్తుకుని వచ్చేస్తారు. ఇంకా మానవ సంబంధాలు పూర్తిగా చచ్చిపోలేదు అనిపిస్తుంది అటువంటి సమయంలో.

అందరి సంగతేమో గాని, నాకు మాత్రం ఆసుపత్రి పడక రాజవైభోగం లాగే అనిపిస్తుంది ( బిల్లు గురించి ఆలోచించకుంటే ). మామూలుగా ఒంట్లో నలతగా ఉంటే పడకేయడం, మందులేసుకోవడం, లేదా డాక్టరు దగ్గరకు పరిగెత్తడం అంటే అస్సలు పడదు. అలాటి నన్ను రెండు సార్లు మేజర్ ఆపరేషన్లు, ఒక చిన్ని ఆపరేషన్ ఆసుపత్రిలో పడేసింది.. అది కూడా ఇక ఆపరేషన్ తప్పదు అనే పరిస్థితిలో సుమా. అంటే అంతవరకు లాక్కొచ్చా. ఐనా మనకొచ్చేవి అన్ని స్పెషలే కదా.


మొదటిసారి కడుపునొప్పితో రెండేళ్ళు బాధపడ్డా. చివర్లో తేలిందేంటంటే అది అప్పెండిక్స్ అని. ఇక ఆసుపత్రిలో చేరక తప్పలేదు. పిల్లలు చాలా చిన్నవాళ్ళు అప్పుడు. ఎవరిని తోడు ఉండడానికి పిలవాలన్నా కష్టమే. ఎవరి సంసార భాద్యతలు వారివే. ఐనా మా ఆడపడుచులు ఇద్దరు వచ్చి ఉన్నారు. ఒకరు ఇంట్లో, ఒకరు నాతో. అమ్మ కూడా వచ్చి రాత్రి వెళ్ళేది. అక్కడ తను కూడా ఇల్లు వదలలేదు. ఒకరోజు ముందు ఆసుపత్రిలో చేరాను, ఇంట్లో పిల్లలను అప్పగించి, అన్ని జాగ్రత్తలు చెప్పి. రాత్రంతా నిద్ర పడుతుందా. ఎవేవో పిచ్చి ఆలోచనలు. మొదటిసారి కదా ఆపరేషన్ చేయిచుకోవడం. మళ్ళీ ప్రాణాలతో బయటికొస్తానా? ( అప్పుడు సినిమాల్లోని ఆసుపత్రి సీన్లే కళ్ళ ముందు తిరిగేవి ). ఎప్పుడో నడిఝాములో కాస్త కళ్ళు మూతలు పడేవి. ఇక అసలు ప్రహసనం పొద్దున. మావారు టెన్షన్‌గా ఉన్నారు. నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసికెళ్ళారు. అప్పుడు నిజంగా మనసంతా ఒకలాంటి శూన్యంతో నిండిపోయింది. నేను బ్రతుకుతానో లేదో అన్న అనుమానం లేదు కాని. నాకు ఏమైనా అయితే పిల్లల సంగతేంటి. అప్పుడు ఆయన సంగతి ఆలోచించలేదులెండి. ఎందుకంటే పెళ్ళాం పోతే కొద్ది సమయంలొనే మళ్ళీ పెళ్ళి చేసేసుకుంటారు. పిల్లలు ఎలా. అప్పుడే డాక్టర్ వచ్చి ఏదో మాట్లాడిస్తూ మత్తు మందు ఇచ్చారు. నిజంగా ఆ మత్తు శరీరంలోకి పాకుతుంటే ఎంతా తియ్యగా, చల్లగా, హాయిగా ఉంటుందో ఇప్పటికీ మర్చిపోలేను. అది మాత్రం నాకు చాలా ఇష్టం. మధ్యలో డాక్టర్లకు ఏదో డౌట్ వచ్చి పేషంటు భర్తను పిలవండి అన్నారంట ( నాకు తర్వాత తెలిసింది ) . అంతే బయాట ఉన్నవాళ్ళందరి గుండెల్లో పిడుగు పడింది. సినిమాల్లో చూస్తుంటాము కదా అలాగే. కాని నేను బాగానే ఉన్నా అని తెలుసుకుని స్తిమిత పడ్డారు. ఇక రూం కొచ్చాక డాక్టర్లు వచ్చి నా పేరు , ఇల్లెక్కడా అని అడిగి నేను నార్మల్‌గానే ఉన్నా అని తెలుసుకుని వెళ్ళిపోయేవారు. ఇక బందువులు, స్నేహితుల వరద మొదలు. వస్తూ వస్తూ పళ్ళు పట్టుకువస్తారు ( నేనేమో తిట్టుకునేదాన్ని బ్రెడ్, బత్తాయిలు తప్ప కేకులో, స్వీట్లో తేవచ్చుగా అని ) కాని ఆసుపత్రి మంచం మీద ( నీరసంగానైనా ) శేషతల్పం మీద విషుమూర్తిలా పడుకుని ఉంటే , వచ్చినవాళ్ళు కొద్ది సేపు మనగురించి మాట్లాడి, కొద్దిసేపు ఇలాంటి ఆసుపత్రి సంఘటనలు మాట్లాడాక రాజకీయలు మొదలెడతారు. అదో గొప్ప ఫీలింగ్.. అనుభవిస్తే కాని తెలీదు. :). ఇంటికొచ్చాక కూడా కొంతమంది వస్తారు, ఫోన్ల మీద ఆరోగ్యం గురించి అడగడం, సలహాలు ఇవ్వడం. బిల్లు, చేదు మందులు మింగడం తప్పితే అసలు ఆసుపత్రియోగం రాజభోగమే అని నా నమ్మకం.


రెండోసారి కాస్త ఈజీగానే గడిచిపోయింది ఆల్రెడీ ఒకసారి అనుభవమైంది కదా. మొదటిసారి ఐదురోజులవరకు మంచం దిగలేదు కాని రెండోసారి మూడోరోజు దిగి నడిచాను. మనకు కాళ్ళు ఒక చోట నిలవవు కదా. ఇక మూడోసారి ఐతే మత్తుదిగగానే మంచం దిగి నా పనులు నేను మెల్లిగా చేసుకున్నా. మూడోరోజు మెల్లిగా నడుచుకుంటూ ఆసుపత్రి గేటుదాటి అక్కడి క్యాంటీన్ లో కర్రీ పఫ్స్ తిని టీ తాగా. రూములో ఉన్న మా అమ్మకు తెలీకుండా. అదో అడ్వెంచర్.


కాని..


ఇప్పుడు జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరకు వెళితే అతని ఫీజు, మందుల బిల్లే గూబ గుయ్యిమనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు ఈ గత స్మృతులు నెమరేసుకోవడం. తుత్తి పడిపోవడం..

12 వ్యాఖ్యలు:

sujata

ఆహా.. సూపర్ మీరు. నేనూ... ఒక సారి మేజర్ ఆపరేషన్ చేయించుకున్నాను. వెన్ను మీద. అంత పెద్ద ఆపరేషన్ అని నాకు తెలియదు. గానీ ఆపరేషన్ అయ్యాకా.. నెల రోజులు నన్ను మా చుట్ట పక్కాలూ, కజిన్లూ.. స్నేహితులూ.. ఆఫీసు వాళ్ళూ, హీరొయిన్ లా చూసారు. సంవత్సరం దాకా నడవలేక పోయేను. అది మనసు లొ ఉండిపొయి, ఇప్పటికీ.. అంతా... వొంగకు.. పరిగెట్టకు.. రెస్టు తీసుకొ.. అని చెప్తుంటారు.

జ్యోతి

కదా!! నెల రోజులు మహారాణి, మరో మూడు నెలలు యువరాణిలా పెత్తనం చెలాయించొచ్చు. ...

సుజాత

అబ్బ, అలాంటి రాజ భోగం నాకొద్దండి బాబూ! సిజేరియన్ అయిన తర్వాత అందరూ చేసిన హడావుడి తల్చుకుంటే ఒళ్ళు మండిపోతుంది. అసలు స్వేచ్చ లేదు. మనం ఎప్పుడూ ఆరోగ్యంగా తిరుగుతూ, పని చేస్తూ, చేయిస్తూ, మాట్లాడుతూ, అందర్నీ మాట్లాడేలా చేస్తూ ఉండాలి.

సుజాత

అబ్బ, అలాంటి రాజ భోగం నాకొద్దండి బాబూ! సిజేరియన్ అయిన తర్వాత అందరూ చేసిన హడావుడి తల్చుకుంటే ఒళ్ళు మండిపోతుంది. అసలు స్వేచ్చ లేదు. మనం ఎప్పుడూ ఆరోగ్యంగా తిరుగుతూ, పని చేస్తూ, చేయిస్తూ, మాట్లాడుతూ, అందర్నీ మాట్లాడేలా చేస్తూ ఉండాలి.

teresa

haayigaa niddaroneekumDaa, evry 2 hours kee vacchi nOTlo thermometer tOsi, arm cuff bigimchae narsuloo, kaLLu teristae chaalu kaLLalOki choostoo koorchunae moguDoo, visiting hours avvagaanae mookummaDigaa vacchi paDi juTTu savarimchae mitruloo- amdari palakarimpulakee talakaya oopDamoo, pedaalu saagadeesi navvaDamoo... BhOgamae mari :)

ramya

ఈ రాజభోగం నాకూ వద్దండీ బాబు హాయిగా తిరుగుతూ పనిచేసుకుంటూ ఆరోగ్యం గా నే జరిగి పోవాలి చావైనా బతుకైనా:)

కత్తి మహేష్ కుమార్

నిజంగా ఇది రాజభోగమేనంటారా???

రాధిక

నాకూ వద్దండి అలాంటి రాజ భోగం.

జ్యోతి

ఎవరూ ఈ రాజభోగం కావాలని అనుకోరు. కాని తప్పనిసరి దొరికినపుడు అనుభవించాలి.. నేనూ తప్పనిసరై చేరాను..

netizen నెటిజన్

రాజభోగం సంగతి తరువాత.
"ఎందుకంటే పెళ్ళాం పోతే కొద్ది సమయంలొనే మళ్ళీ పెళ్ళి చేసేసుకుంటారు."
ఇది చాల దారుణమైన వ్యాఖ్య!.

చదువరి

ఆయువుండాలేగానీ గాయమంతటి హాయి లేదట! :)

రమణి

ఈ అనుభవం నాకింతవరకు కలగలేదు కాని మీరు రాసినది చదువుతుంటే నాకు ఈ భోగం వద్దనె అనిపిస్తుంది. వంట ఇంటి సామ్రాజ్యాన్ని ఎవరికో ఇచ్చెసి ఆ రాజ వైభోగం కూడా ఒక భోగమేనా? జీవితం మూన్నాళ్ళ ముచ్చట అన్నట్లుగా జాలిగా చూసే బంధువులు? (మనకేమి కాకపోయినా) ఆస్తుల వివరాలు కోసం కాచుకూర్చునే వారసులనబడేవాళ్ళు, ఇందరి మధ్య ఇంతేనా ఈ జీవితం అని ఓ విధమైన విరక్తి తో మన అనుకొనే మన మనిషి మన పతి దేవుడు, (బార్య పోగానే మళ్ళి పెళ్ళి అనేది కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల జరుగుతుంది కాని, ఏ మనిషి బార్య మీద ప్రేమ లేక ఇంకో పెళ్ళి వైపు మొగ్గుతారని నేను అనుకోవడం లేదు) ఇందరి మధ్య జీవితం మీద చిన్న ఆశతో మనం... అమ్మో జ్యోతిగారు ఇలంటి జీవితం వద్దండీ.. చక్కగా మన ఆయుదాలైన గిన్నెల కిరీటాలతో, గరిటెల గదలతో, గాజుల గల గలతో, మూతివిరుపులతో, మన సంసారం మీద అజమాయిషీ చేస్తూ, ఆడది కోరుకొనే వరాలు రెండే రెండు, చల్లని సంసారం, చక్కని సంతానం అని , చెమర్చే కళ్ళని తుడుచుకొంటూ... అలకల,కులుకుల ఆలిగా జీవితం అద్భుతం కాని, ఆస్పత్రి వైభోగం ఇంకోసారి వద్దు అనుకొండి. ఈ ఆసుపత్రి విరహమేమిటండీ బాబు మీకు? పైగా వైభోగమనేసారు వెరైటీగా.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008