Monday, 7 July 2008

ఇంతులు - ఈవ్ టీజింగ్




అసలు ఈవ్ టీజింగ్ అనేది ఒక అలవాటో, మానసిక దౌర్భల్యమో అర్ధం కాదు. కొందరు అబ్బాయిలు, మగాళ్ళు అమ్మాయిలను కామెంట్ చేయడం, తాకాలని ప్రయత్నించడం. శృతి మించితే అసభ్య , అశ్లీల వేధింపులు.. ఇలా చదువుకునే అమ్మాయిలు, ఉద్యోగం చేయడానికి వెళ్ళే స్త్రీలు సమస్యను ఎదుర్కోక తప్పడంలేదు. అబ్బాయిలకు అదొక పైశాచిక ఆనందం, అమ్మయిలకు ఒక గండం. ఇది ఎలా ఎదుర్కోవాలనే చిట్కాలు ఉన్నా అవి అన్ని చోట్లా అన్ని వేళలా పనికి రావు. వాటిని చూసి చూడనట్టు వదిలేస్తే ఎక్కువ కావొచ్చు. లేదా వాగి వాగి ఊరుకోవచ్చు, ఎదురు తిరిగి జవాబిస్తే , ప్రతీకారంగా ఇంకా ఏదైనా చేయొచ్చు. మరి దీనికి పరిష్కారం లేదా? ఎప్పుడు పోలీసులు వచ్చి రక్షించేదాకా ఆగాలా? వాళ్ళు మాత్రం సకాలంలో స్పందిస్తారనే నమ్మకముందా?. ఇప్పుడు దాదాపు అన్ని కాలేజీలలో ర్యాగింగ్ ప్రక్రియను నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఐనా బయట జరిగే వాటినెలా ఎదుర్కోవడం?




సమస్య ఇప్పటిది అని చెప్పలేము. నేను కాలేజిలో చదువుకునేటప్పుడు కూడా చూసాను. ఇంటినుండి బస్ స్టాప్ కెళ్ళేవరకు బిక్కు బిక్కు మంటూ వెళ్ళడం. మెయిన్ రోడ్ ఐతే ఏం కాదు. . సందులు గట్రా ఐతే టెన్షన్ తప్పదు. నాకు ఇంటర్‍లో చదువుతుండగా ఇలాగే జరిగింది. ఒకతను రోజు మేము ఎక్కే బస్ లో వచ్చేవాడు. మా స్నేహితులమందరం నిలబడి ఏదో మాట్లాడుకుంటుండగా పక్కకు వచ్చి తాకుతూ నిలబడడం. ఎన్ని సార్లు తప్పుకుని ముందుకు జరిగినా అతను వచ్చేవాడు. మూడు రోజులు చూసా. అసలే ఆ రోజు పరీక్ష ఉండింది. ఇదో సమస్య. అంతే నా ఓణీ కి ఉన్న పిన్నీసును తీసి, నా పక్కన తాకుతూ నిలబడ్డ అతని చేయికి కసితీరా గుచ్చా. అంత తిక్క రేగింది నాకు. మళ్ళీ కనపడితే ఒట్టు. రష్ లో ఉంటే ఇలా చేస్తే ఎవరికి తెలియదు అనుకుంటారు యెదవలు. ఇలాంటి చదువుకున్నవాళ్ళే కాదు, చదువురాని , పని చేసుకునేవాళ్ళు కూడా ఆడవాళ్ళను ఏదో విధంగా సతాయించాలని చూస్తారు. ఒకసారి మా అమ్మాయిని తీసుకుని షాప్ కెళ్తున్నా , తనకేవో బుక్స్ కావాలంటే. అంతకుముందే బాగా వర్షమొచ్చి, రోడ్డంతా నీరు నిలిచింది. సో ఫుట్‍పాత్ మీద నడుస్తున్నారు అందరు. ఒకతను బుట్టలో ఏదో అమ్ముకునేవి పెట్టుకుని నాకు ఎదురుగా వస్తున్నాడు. కాస్త పక్కకు జరిగి నడవకుండా కావాలని నన్ను నీళ్ళలో పడేలాచేయాలని నేరుగా వస్తున్నాడు. అది తెలుసుకుని నేను సరిగ్గా వాడికెదురుగ్గా నడిచా మా అమ్మాయి చేయిపట్టుకుని . ఇది వాడు ఊహించలేదు. కాస్తలో తలమీద బుట్టతో సహా నీటిగుంటలో పడబోయి ఆగిపోయాడు.




.


మహేష్ చెప్పినట్టు ఇలా చేసేవాళ్ళు మానసిక రోగులు. ఆడవాళ్ళను కామెంట్ చేయడం ( అది వారి స్వభావాన్ని బట్టి వివిధ రీతుల్లో ఉంటుంది) అలా చేయడం వల్ల పైశాచికానందం పొందుతారు. సున్నితమనస్కులైన అమ్మాయిలు ఎంత బాధ పడతారు అనేది వాళ్ళకు పట్టదు. వాళ్ళు బాధ పడుతుంటే మగ పురుగులకు ఆనందంగా, సంతృప్తిగా ఉంటుంది. అదే వాళ్ళ చెల్లెలికో,అక్కకు జరిగితే అనే ఆలోచన కూడా రాదు అనుకుంటా. సరదాగా ఉంటే ఇది సమస్య కాదు. కాని అది తీవ్రంగా ఉంటే మాత్రం ఉపేక్షించి లాభం లేదు.






'ఈవ్ టీజింగ్' ని ఎదుర్కోవడానికి నా పరంగా కొన్ని సలహాలు అమ్మాయిలకు..





సరదాగా ఉంటే చిరునవ్వుతో వదిలేయండి. పట్టించుకోవద్దు. పట్టించుకుని బాధపడ్డారో, గొడవ చేసారో. అనవసరంగా సమయం వృధా. అలా కాకుండా అది అభ్యంతరకరంగా, తీవ్రంగా ఉంటే ఎదుర్కోండి. కాని ఒంటరిగా కాదు. ఇది మీకు ప్రమాదం. వ్యక్తి పగబట్టి హాని కలిగించవచ్చు. మీ తోటి స్నేహితులకు, లేదా కాలేజీ విద్యార్థి సంఘాన్ని సంప్రదించండి. అమ్మాయిలు , అబ్బాయిలు కలిసి ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళను నిలదీయండి మర్యాదగానే. వినకుండా తిక్క వేషాలేస్తే ఉతికేయండి అందరు కలిసి. లేదా అతనిని పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని కుటుంబ సభ్యులతో , ముఖ్యంగా అతని తల్లితో ఇదీ సంగతి అని చెప్పండి. ఇంత డ్రామా అవసరమా అనుకోవచ్చు. ఒకరోజు , రెండు రోజులైతే ఏం కాదు. కాని కాలేజికి వెళ్ళే అమ్మాయిలకు బస్ స్టాపులలో, బస్సుల్లో రోజూ ఇలాంటి వాళ్ళు తగుల్తారు. అలా ప్రతి రోజు భయపడుతూ వెళ్ళాలా?. పోలీసులకు చెప్పి లాభం లేదు. సమస్యను మీరే ఎదుర్కోండి. అందరు అమ్మాయిలు కలిసి అబ్బాయిని బస్ స్టాపులోనే పట్టుకుని అన్నా అని రాఖీలు కట్టండి నడిరోడ్డు మీదే అందరి మధ్య. కాని ఎప్పుడు ఒంటరిగా తిరగొద్దు. మెయిన్ రోడ్ ఐతే పర్వాలేదు కాని సందుల్లో, నిర్మానుష్యంగా ఉండే రోడ్లపై వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తప్పదు. కొందరు పిరికినాయాళ్ళు బైకులమీద వెలుతూ ఒంటరిగా అమ్మాయి వెళుతుంటే వీపుమీద చరిచి స్పీడుగా వెళ్ళిపోతారు. పట్టుకోవాలన్నా, తిట్టాలన్నా కనుచూపు మేరలో కనపడరు. ఫోన్ నంబర్లతో జాగ్రత్తగా ఉండండి. నంబర్లు తెలుసుకుని సతాయించేవాళ్ళు ఎందరో. ఒకసారి హైదరాబాదులోనే ఇలాంటి సంఘటన జరిగింది. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న అమ్మాయి సెల్ నంబరు తెలుసుకున్న ఒక వ్యక్తి ఊరికే కాల్ చేసి పిచ్చి పిచ్చిగా వాగేవాడు. తిట్టినా, మెల్లిగా చెప్పినా వినలేదు. ఊర్లో ఉన్న తల్లితండ్రులకు చెప్తే చదువు మానిపించేస్తారని అమ్మాయి భయం. ఒకసారి వ్యక్తి తనను పెళ్ళి చేసుకోమని వేధించసాగాడు. అప్పుడా అమ్మాయి తన స్నేహితులకు చెప్పింది. అందరు కలిసి వ్యక్తిని ఉస్మానియా యూనివర్సిటీ గార్డెన్ కు రమ్మన్నారు. అతను వచ్చాక అందరు కలిసి బాగా తన్ని పోలీసులకు అప్పగించారు. ఇందులో అమ్మాయి క్లాస్‌మేట్స్ ఐన అబ్బాయిలు కూడ ఉన్నారు.





ముఖ్యంగా అమ్మాయిలు ఇది గుర్తుంచుకోండి.. చదువుకోసమైనా, ఉద్యోగం కోసమైనా మీరు బయట కాలు పెట్టినప్పుడు , రోజుల్లో పిరికితనం, నిస్సహాయత పనికిరాదు. ఎప్పుడైనా కాని ధైర్యంగా ఉండండి. మీలోని ఆత్మవిశ్వాసం మీ నడకలో ,ప్రవర్తనలో కనిపించాలి. తప్పు చేయనప్పుడు ఎవరి మాట పడాల్సిన అవసరం లేదు. Be Brave and confident of urself ..


14 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar

నిత్యజీవితంలో ఈవ్ టీజింగ్ ని ఎలా ఎదుర్కోవాలో బాగా చెప్పారు. నా బ్లాగులో చర్చ ఇప్పటివరకూ సైద్ధాంతికమైతే, మీ ఆలోచన ఆచరణీయాలు. ఈ స్ఫూర్తితో నేనూ అర్జంటుగా పరిష్కారాల వైపుగా టపా రాయాల్సిందే!

Purnima

Be Brave and confident of urself.. Thats the key your honour!! :-)

If you can't fight it out, no one else would do it for you. bhayam bhayam anTE vanTillu kooDaa manaki safe place kaadu. :-(

Ramani Rao

కత్తి మహేష్ గారు కాస్త లేట్ గా చదివాను మీ టపా, అందుకు సారీ. ఇకపోతే మీ అర్ధశతక టపాకి శుభాబినందనలు. మొత్తం మీ టపా మరియూ కామెంట్లు చదివిన తరువాత నా చిన్ని బుర్ర కి అర్ధమయ్యింది ఏమిటంటే ఈ ఈవ్ టీజింగ్ కి కారణం అబ్బాయిలే, అమ్మాయిలందరూ ఝాన్సీ లక్ష్మి లాగో, లేడీ అమితాబచ్చన్ లాగో పొరాడాలి అని, ఇక్కడ ఒక్కవిషయం! బుద్దిగా తలంతా నున్నగా దువ్వుకొని, చేతిలో రెండు పుస్తకాలతో, అడుగుపెట్టే నూనుగు మీసాల కుర్రాడిని (నున్నంగా షేవింగేనా కాస్తయినా రఫ్ గా ఉండాలంటూ) ఏడిపించే అమ్మాయిల సంగతి?? ఈరోజుల్లో, ఈ ఏడిపించడం అనే విషయానికి వస్తే, అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా ఎక్కడుందండీ? తప్పుగా అనుకోకండీ, కాలేజ్ రోజుల్లో నా స్నేహితురాలి విషయంలో జరిగిన ఓ సంఘటన చెప్తాను, నా స్నేహితురాలు చాలా అందంగా ఉంటుంది. మేమిద్దరము స్కూల్ నుండి ఫ్రండ్స్ మి. మా యింటికి వస్తే, మా కబుర్లకి రోజులు గడిచిపోతాయి, ఇంటికి ఏ రెండురోజుల తరువాతో వెళ్ళేది. ఈ కబుర్లలో, ఆ అమ్మాయి లో ఒకే ఒక నిరాశ, మా యింటి దగ్గర అబ్బాయిలు ఓరోజు చూడడం లేదనో, ఇంకో రోజు చూస్తున్నారనో రెండు విధాలా బాధపడిపోయేది, ఈ క్రమంలో అప్పుడే కాలేజ్ లో నిలదొక్కుకొంటున్న ఓ అబ్బాయిని "నేను ప్రేమిస్తున్నా" అంటూ ఆశ పెట్టింది ఇలా అనే కన్నా ఆట పట్టించింది కరెక్టేమో . చివరికి అది ఆకర్షణగా తేలి ఇంకో రెండు మూడు ప్రేమాయాణల తరువాత పెద్దలు కుదిర్చిన అబ్బాయితో పెళ్ళి చేసుకొంది. ఇక్కడ ఏమి తెలియకుండా ప్రేమలో పడ్డ ఈ మొదటి అబ్బాయి ఇప్పుడు ఎర్రగడ్డ పిచ్చసుపత్రి లో ఆమె పేరు తలుచుకొంటూ కాలం గడుపుతున్నాడు, మరి దీనినేమంటారు? సరదాగా ఆటపట్టించిన ఆ అమ్మాయి తను హ్యాపీ గా ఉంది. సమస్య ఇద్దరివైపు వుందండి. అమ్మాయిలు తెలియకుండా జీవితాంతం ఏడిపిస్తారు, అబ్బాయిలు ఆ కాసేపు సరదా అంటూ ఏడిపిస్తారు. నేను ఏ ఒక్కరి పక్షం కాదు సమస్య ఇద్దరివైపు ఉందీ! అని చెప్పడమే ఈ ప్రయత్నం.

జ్యోతిగారి బ్లాగులో కూడా ఇప్పుడే చదివాను, అక్కడ ఇదే రిప్లై.

Kranthi M

మహేష్ గారూ,
రమణిగారూ అన్నట్లుగా ఇది రెండు వైపుల పొదునున్న కత్తేనండి.కాకపోతే మగవాడి వైపునుండి తీవ్రత ఎక్కువగా ఉంది.ఏమో మన సమాజాన్ని బట్టి చూస్తే అలాంటి ఆడవారు కూడా ఉన్నారు.కాని వీరు స్పందిచే తీరే తేడా.మగవాడు మనిషినే చంపుతున్నాడు.ఆడది మనసుని మాత్రం చంపుతుంది.ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు రమణిగారూ చెప్పినట్లుగా.మగవాడు బయటికి కనపడెలా చెసాదు కాబట్టి మగవాడిదే తప్పవుతుందని నా అబిప్రాయం.

Naveen Garla

తరగతిలో చదువు చెప్పిస్తారు కానీ...సంస్కారాలు కాదు కదా!!!
ఇక్కడే ఉంది అసలు లోపం.

Kathi Mahesh Kumar

@క్రాంతి; ఇద్దరికీ సరదాగా ఉండే ఏడిపించుకోవడానికీ, మానసిక క్షోభకు గురిచేసే వీధిలోని అల్లరికీ చాలా తేడా ఉంది. ఈ క్రింది లంకె చూడగలరు. http://parnashaala.blogspot.com/2008/07/blog-post_07.html

ఇక రమణిగారు చెప్పిన ప్రేమ-మోసం కేసు కాస్త వేరు స్థితి. దానిగురించి ప్రత్యేకంగా చర్చించాలి.

శిశిర

ఈవ్ టీజింగ్ గురించి జ్యోతి గారు మరియు మహేష్ గార్ల చర్చ అభినందనీయం. జ్యోతిగారి బ్లాగులో నవీన్ గారి వ్యాఖ్య "తరగతిలో చదువు చెప్పిస్తారు కానీ...సంస్కారాలు కాదు కదా!! ఇక్కడే వుంది అసలు లోపం" అన్న వ్యాఖ్యాకు నా స్పందన ఇది.
నవీన్ గారూ, తరగతి గదిలో చదువు చెప్పే వారందరూ సంస్కారవంతులు కారండీ.నా అనుభవంతో చెపుతున్నాను.నేను చదువుకున్నప్పుడు అలాంటి లెక్చరర్లను చూసాను.స్వయంగా ఇప్పుడు లెక్చరర్ గా సంస్కారంలేని తోటి అధ్యాపకులను చూస్తున్నాను. అమ్మాయిలు నా దగ్గరికి వచ్చి "మేడం,ఫలానా సర్ మాతో ఇలా ప్రవర్తిస్తున్నారండీ,భరించలేకపోతున్నాము" అని చెప్పినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. ఈ విషయమై నేను, నాతోటి ఇంకొక లెక్చరర్(అమ్మాయి) కలసి మిగిలిన అమ్మాయిలని కూడా ఎంక్వయరీ చేసి, వాళ్ళు చెప్పినది నిజమని రూఢి అయిన తరువాత అన్ని వివరములతో ప్రిన్సిపల్ ని కలిస్తే ఆయన నుండి నాకొచ్చిన సమాధానం "ఈ ఆడపిల్లలని మీరు నమ్మకండి మేడం,వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక విషయమై గొడవ చెస్తూనేవుంటారు. మనం ఇలాంటివి పట్టించుకోకూడదు" అని.
తరువాత తెలిసింది, మేము కంప్లైంట్ చేసిన లెక్చరర్ కాలేజ్ మేనేజ్ మెంట్ దగ్గర పలుకుబడి వున్నవాడట.అతనిని ఏమైనా అంటే ఇతని పదవి ఊడుతుందట. ఇంతకీ ఈ గొడవ ఫలితం ఏమిటంటే ఈ వీరుడు విషయం ఎలాగూ తెలిసింది కదా అనుకున్నాడెమొ, తన ప్రతాపం మామీద కూడా చూపించడం మొదలుపెట్టాడు. కట్ చేస్తే, మేమిద్దరం నెక్స్ట్ ఇయర్ వేరే కాలేజ్ లో వున్నాం.
అందువల్ల నవీన్ గారూ, నీతి ఏమిటంటే, సంస్కారం గురువుకైనా సరే తల్లిదండ్రుల నుండే వస్తుంది కనుక, విలువలు నేర్పవలసిన బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులదే అని నా అభిప్రాయం.

maa godavari

జ్యోతి గారూ మీ వ్యాసం చదివాను.మిగిలిన మిత్రుల అభిప్రాయాలు చదివాను.
నా ఉద్దేశ్యం లో ఈవ్ టీజింగ్ అనే పదమే తప్పు.దాన్ని హింసగానే పిలవాలి.ప్రాణాలతో చెలగాటమాడే చోట,ఆసిడ్ బాటిళ్ళతో అటాక్ చేసే చోట,మోటారు సైకైళ్ళతో డాష్లిచ్చి దారుణ ప్రమాదాలకు తెగబడే చోట ఇంకా నానా రకాల హింసలతో ఆడపిల్లల్ల్ని కాల్ల్చుకు తినే సాడిష్టులు వీళ్ళు.వీళ్ళు మానసిక రోగులు కారండీ మగాహంకారం నరనరాన జీర్ణించుకున్న పురుషాధిపత్య ప్రతినిధులు.అమ్మాయిలు కూడా ఏడ్పిస్తుండొచ్చు.అయితే ఎంత శాతం?మనం హైదరాబాదునే చూస్తే ఎలా?పట్టణాళ్ళో, గ్రామాల్లో ఆడపిల్లల్లు ఈ హింసకి ప్రతి క్షణం ఎదుర్కొంటారు.

మనం డిక్షనరీలోంచి ఈవ్ టీజింగ్ అనే పదాన్ని తీసెయ్యాలి.సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ లాగానే ఇది కూడా పబ్లిక్ ప్లేస్ లో ఆడపిల్లల మీద ,ఆడవాల్ల మీద అమలయ్యే హింస.చట్టపరంగా శిక్షార్హమైన నేరం.

Naveen Garla

@Lasya గారు,
ఆ గురువు కూడా ఒకప్పుడు విద్యార్థే కదండీ. లెక్చరరైనంత మాత్రాన స్వభావ సంస్కారాలు, విపరీత బుద్దులు మారిపోతాయా? అందుకే కొత్త తరం ఐనా ఇలా కాకుండా ఉండాలని ఆశిస్తున్నాను.
ఇక సంస్కారం ఎవరు నేర్పినా మంచిదే కదా. చదువుతో పాటూ విధ్యార్థుల సంస్కార పరివర్తనకు రోజూ ఒక గంట కెటాయిస్తే బాగుంటుంది కదా!!
>> సంస్కారం గురువుకైనా సరే తల్లిదండ్రుల నుండే వస్తుంది కనుక..
అందరు తల్లి తండ్రులు మాత్రం మంచి సంస్కార వంతులుగా ఉన్నారనుకోను. మంచిని నేర్చుకోవటంతో పాటూ అసలు తల్లితండ్రుల నుంచే ఎన్నో అవలక్షణాలు నేర్చుకుంటారు పిల్లలు. ఈ పరిస్థితుల్లో కొంత మంచిని పాఠశల చిన్నప్పుడే నేర్చుకోవడం అవసరం.

రాధిక

"విలువలు నేర్పవలసిన బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులదే అని నా అభిప్రాయం"totally agree with lasya garu.

Naveen Garla

నేను చెప్పేది "విలువలు ఒక్క తల్లి తండ్రుల దగ్గరే" కాకుండా, వేరే దగ్గర కూడా నేర్చుకోవచ్చు అని. తల్లితండ్రుల సంస్కారాలే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది...కాదంటారా?

జ్యోతి

మనిషికి సంస్కారం అనేది తల్లితండ్రుల నుండి, ఉపాధ్యాయుల నుండి, ఆ తర్వాత స్నేహితులు , అతని చుట్టు ఉన్న వాతావరణం బట్టి వస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తిని ఎంతకాలమని నీతులు చెప్పగలడు. కాని నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. మగపిల్లలకు చిన్నప్పటినుండే ఆడవాళ్ళని (అమ్మైనా, అక్కైనా, ఆలైనా, ఎవరైనా సరే) గౌరవించాలి అని, ఆడపిల్లలకు తమను తాము గౌరవించుకోవాలని, ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలని తల్లితండ్రులు నేర్పించాలి.
కాని ఈ సమస్యను చాలా మంది ఆడపిల్లలు రోడ్డుమీదైనా , స్కూలులో, కాలేజీలలో ఐనా ఎదుర్కోక తప్పదు. అలాంటప్పుడు ఏం చేయాలనేది ఆలోచింఛాలి. ఒంటరిగా కాకుండా స్నేహితులందరు కలిసి ఆ వ్యక్తిని ముట్టడించి, మళ్ళీ తలెత్తుకోకుండా చేయాలి. లేదా అతని తల్లిని, భార్యను కూడా పిలిపించి అందరు కలిసి మాట్లాడాలి అతని ముందే. ఇది లాస్యగారు చెప్పిన అమ్మాయికి కూడా వర్తిసుంది. ఎన్నాళ్ళని ఇలా బాధపడుతుంటారు. ఆ మనిషికి జైలు శిక్ష వేసినా, ఉరి శిక్ష వేసినా , ప్రయోజనమేముంది. అతని కుటుంబ సభ్యులే బాధపడతారు. ఆ వ్యక్తికి ప్రతి రోజు తను చేసిన తప్పు తెలుసుకుని సిగ్గు పడేలా చేయాలి. అది అసలైన శిక్ష. ...అది చూసి మరి కొందరు బుద్ధి తెచ్చుకుంటారేమో. సినిమా స్టోరీ అనుకుంటున్నారా?? వేరే పరిష్కారం ఉందా??

Unknown

eve teazing ki palpadi eedhavalu ooti periki eedhavalu.vvellaki comment chetsi vellaypu chustarni andhichi eedhavalu.veelakanna ladis eekuvani vallni oopukulekha comment chestuttaru idats.ladis kuda marali.ladis kuda house lo freedom eevvali.samajam ani bayapadakunda eduru tragali.eduru trkiti janam cheddavallu anukutarani monam ga comments ni barichadam challa thapu.comments ni barichdam anti eduti vadiki manami avakasm eechi nati avuthudi. adina frist time clear ga warnig evali.frist time house lo ati prants ki collage lo ati princpal ki office lo ati boss cheppali.avasaram ati police ki chepali.

Unknown

eve teazing ki palpadi eedhavalu ooti periki eedhavalu.vvellaki comment chetsi vellaypu chustarni andhichi eedhavalu.veelakanna ladis eekuvani vallni oopukulekha comment chestuttaru idats.ladis kuda marali.ladis kuda house lo freedom eevvali.samajam ani bayapadakunda eduru tragali.eduru trkiti janam cheddavallu anukutarani monam ga comments ni barichadam challa thapu.comments ni barichdam anti eduti vadiki manami avakasm eechi nati avuthudi. adina frist time clear ga warnig evali.frist time house lo ati prants ki collage lo ati princpal ki office lo ati boss cheppali.avasaram ati police ki chepali.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008