Friday, July 11, 2008

అమ్మో పదో క్లాసు !!!!!!!......
ఇప్పటి పిల్లలకు ఆరో క్లాసునుండే చదువుల టెన్షన్, ఒత్తిడి ఉంటున్నాయి. తల్లిదండ్రులకు ఇంకాస్త ఎక్కువ. కాని నేను చదువుకునేటప్పుడు ఆడుతూ పాడుతూ, డాన్సులు, నాటకాలు వేసుకుంటూ గడిపేసాను. నిజంగా స్కూలు జీవితం మధురమైనది. మరపురానిది. ఎటువంటి కల్మషాలు లేనిది కూడా. అందుకే ఆ పాత జ్ఞాపకాలు మరోసారి గుర్తు చేసుకోవాలనిపించింది.


తొమ్మిది పాసై, పదో క్లాసులోకి వచ్చాము అనగానే మనసులో భయం, దడ మొదలయ్యింది. దానికి పోపు పెట్టినట్టు మా ట్యూషన్ సార్ మా అమ్మకు సెలవుల్లోనే ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. నో టివి. నో సినిమాలు, నో పెళ్ళిళ్ళు పార్టీలు, పొద్దున నాలుగుకే లేచి చదువుకోవాలి. అది చాలదన్నట్టు అల్లరి చేస్తే కొట్టడానికి, చింతబరికెలు కొనమని అవి హైదరాబాదులో ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్పారు. అప్పుడు నేను ,మా తమ్ముళ్ళూ ఎంత తిట్టుకున్నామొ సార్‌ని. కాని దాని అవసరం మా పెద్ద తమ్ముడికే ఎక్కువ పడేది.అప్పట్లో లెక్కలలో జనరల్, కాంపోజిట్ అని రెండు ఆప్షన్స్ ఉండేవి.నాకేమో లెక్కలు ఇష్టమే. కాని ఆల్జీబ్రా అంటే గుండె గాబ్రా గా ఉండి, ఎక్కడ ఫెయిల్ అవుతానో అని జనరల్ తీసుకున్నాను. నిజం చెప్పాలంటే నేను ఎపుడూ చదువును చాలా సీరియస్ గా తీసుకోలేదు. అలాగే పెద్ద పెద్ద రాంకులు తెచ్చుకుని ఏదో ఉద్ధరించాలనే సదుద్ధేశ్యం నాకెప్పుడూ లేదు. రెండు నెలల వేసవి సెలవులు చాలా భారంగా గడిచేవి. అందుకే ఫలితాలు రాగానే తర్వాతి క్లాసు లెక్కల పుస్తకం కొనేసి , ఇంట్లోనే చెయడం మొదలుపెట్టేదాన్ని. మా ట్యూషన్ సార్ ప్రభుత్వ పాఠశాలలో లెక్కలు చెప్పేవారు. నేను పదో క్లాసుకు రాగానే , అంతకుముందు పది సంవత్సరాల పరీక్షా పేపర్లు తెచ్చి టైప్ చేయించమన్నారు. నేను మొదటి పేపర్ , మా ఫ్రెండ్ కి రెండో పేపర్ ఇచ్చి టైపింగ్ చేయించుకున్నాము. అప్పుడు జెరాక్స్ అంటే తెలీదు మరి. పేపర్లు చేయడంతో లెక్కలలో మంచి పట్టు దొరికింది. క్లాసులో ఎప్పుడు టీచర్ చెప్పే పాఠాల కంటే ఎంతో ముందు ఉండేదాన్ని.స్కూల్లో కూడా ఆంక్షలే. అంటే కొన్ని సడలింపులు కూడా అన్నమాట. పదో క్లాసు వాళ్ళకు ఎటువంటి పోటీలు పాల్గోనే పని లేదు. ఆటలైనా . డాన్స్ పోటీలైనా ఐనా మనల్ని తీసికెళ్ళరు . నాకు మాత్రం సంతోషంగా ఉండేది. ఎందుకంటే ఎప్పుడు తప్పించుకుందామన్నా వీలు పడేది కాదు. పొడుగ్గా ఉన్నవాళ్ళని ముందు పట్టుకుపోయేవారు. ఇంకో విషయంలో కూడా నాకు పదో క్లాసు అంటే ఇష్టముండేది. అది ఉపాధ్యాయ దినోత్సవం రోజు పదో క్లాసు పిల్లలు చీరలు కట్టుకుని టీచర్లవడం. కాని అసలు రోజు భయమేసి స్కూలుకే డుమ్మా కొట్టా.( చీర కట్టుకుని పిల్లల క్లాసులు తీసుకునే ధైర్యం లేక ) . మా అమ్మతో జ్వరంగా ఉంది అని ఫోన్ చేయించా. లేకుంటే ఊరుకుంటారా..? ఇంట్లో స్ట్రిక్ట్ , స్కూల్లో ఎప్పుడు చదువు. తప్పదు కదా.నేను మాత్రం లెక్కలు , తెలుగు, హిందీ ఇష్టంతో చదివితే సైన్సు, సోషల్ కష్టంతో చదివా. ఎందుకో సోషల్ లో మ్యాపులు, నదులు, యుద్ధాలు , ఫార్ములాలు, చచ్చినరోజు, కొట్టుకున్న రోజు గుర్తుపెట్టుకోవాలంటే చచ్చే చావొచ్చేది. అందుకే క్లాసులో నాలాంటి మేధావులు కలిసి, కొన్ని కొండ గుర్తులు పెట్టుకునేవాళ్ళం. పాస్ మార్కులు తప్పకుండా వచ్చేవి. లెక్కల్లో మాత్రం అర మార్కు తగ్గినా మా ట్యూషన్ సారుతో తధిగినతోం తప్పేది కాదు. ఆడపిల్లను కాబట్టి ఘాటుగా తిట్టేవారు. అందుకే జాగ్రత్తగా చేసేదాన్ని.ఇక పదో క్లాసు అంటే స్కూలు మొత్తంలో ఎంతో గౌరవం. చిన్న క్లాసు పిల్లలు అందరు మనముందు చాలా వినయంగా ఉండాలి. టీచర్లు కూడా పెద్ద తరహా పనులు పదో క్లాసు వాళ్ళకే చెప్పేవారు. అందులో ఒకటి ప్రతి రోజు జరిగే ప్రార్ధన సమావేశంలో పదోక్లాసు అమ్మాయిలు రోజుకొకరు రోజు వార్తలు చదవాలి. మనం క్లాసులో నలుగురైదుగురు ముందే వాగుడుకాయ, కాని ఇక స్కూలు మొత్తం ముందు స్టేజీ మీద నిలబడి వార్తలు చదవాలి. అసలే మా ప్రిన్సిపాల్ చండీరాణి. చావుకు దగ్గరైన రోగి లెక్కబెట్టుకున్నట్టు నేను రోజు నా రోల్ నంబర్ వచ్చేవరకు రోజులు లెక్కబెట్టేదాన్ని. నాది చివర్లో ఉండేది 64 ఇంకా టెన్షన్ ఎక్కువ. కాని దేవుడు కరుణించాడో రోజు ఎవరో లీడర్ చనిపోయాడని స్కూలు మూసేసారు. చచ్చిపోయిన నాయకుడికి థాంక్స్ చెప్పుకున్నా. ఇక పదో తరగతి జీవితంలో చివరి ఘట్టం. పబ్లిక్ పరీక్షలు…. యుద్ధకాండ అనుకోవచ్చు. అన్ని చదువుకున్నట్టే ఉంటాయి. మళ్ళీ ఏదీ గుర్తుకురాదు. సైన్సు ప్రశ్నలకు సోషళ్ పుస్తకంలోని జవాబులు గుర్తొచ్చేవి. లెక్కలు పర్వాలేదు. తెలుగులో ప్రతిపదార్ధం , గణవిభజన అంటె నాకు ఒకటే వణుకు. అర్ధం చేసుకుని రాస్తే మొత్తం మార్కులు రావొచ్చు. అంత ఈజీ. కాని మా తెలుగు టీచర్ మా బుర్రల కెక్కేలా చెప్పలేదు .. ఏదో మాకు మాత్రమే అర్ధమయ్యే చిట్కాలు గుర్తుపెట్టుకుని పరీక్షకు తయారవుతున్నాము. ఇక హాల్ టికెట్ కోసం పాస్‌పోర్ట్ ఫోటో దిగడం అదే మొదటిసారి. ఇంట్లో ఉన్న కొత్త డ్రెస్ వేసుకుని స్టూడియోకెళ్ళి లైట్లు, గొడుగు పెట్టి ఫోటో దిగడం భలే అనుభవం. తలుచుకుంటే నవ్వొస్తుంది ..


నేను పదోక్లాసు పరీక్షలు రాసేటప్పుడు ఒక తమాషా జరిగింది. పరీక్షాపత్రాలు ఉన్న గోడౌన్‌లో దొంగలు పడి కొన్ని పేపర్లు ఎత్తుకుపోయారని తెలిసింది. పరీక్ష సెంటర్‌లో గంట ముందే చేరుకునేవాళ్ళం. అక్కడ ఎవరో గెస్ పేపర్ అని చెప్పేవాళ్ళు. కాని ఒకోసారి అవే వచ్చేవి, ఒకోసారి రాలేదు. కాని శనివారం లెక్కల పరీక్ష మొదటి పేపర్. అదే రోజు మొదటి పేపర్, సోమవారం జరగబోయే రెండో పేపర్ కూడ తెలిసిపోయింది.నేను మాత్రం అన్నీ చదువుకుని చివర్లో పేపర్ ఒకసారి చూసుకునేదాన్ని. అశ్చర్యంగా లెక్కల పేపర్ మొత్తం అచ్చు గుద్దినట్టుగా అలాగే వచ్చింది. రెండో పేపర్ కూడా అంటే. తర్వాతి రోజు సైన్స్ పేపర్ . ఉదయం ఈనాడు పేపర్లో ఇలా పరీక్షా పెపర్లు లీక్ అయ్యాయి . ఇది ఒక సాంపిల్ అని ప్రచురించారు. ఇక అదేం వస్తుంది లెమ్మని నేను లైట్ తీసుకున్నా. తీరా చూస్తే ఏముంది మొత్తం పేపర్ అలాగే వచ్చింది. ఇక బిట్ పేపర్ ఐతే ప్రశ్నలు కాకుండా సమాధానాలు ఔట్ అయ్యాయి. తర్వాతి రెండు పేపర్లు కూడా తెలిసిపోయాయి. కాని నేను ఎప్పుడూ వాటి మీద ఆధారపడలేదు. తర్వాత ఈ పేపర్ లీక్ విషయమై చాలా గొడవ జరిగింది. చివరి మూడు పరీక్షలు మళ్ళీ పెట్టాలని కూడా అనుకున్నారు ,కాని పేపర్లు కొన్ని జిల్లాలలో మాత్రమే లీక్ అయ్యాయి కాబట్టి అక్కరలేదు అని తీర్మానించేసారు. అప్పుడు కాని నేను కుదుటపడలేదు. మళ్ళీ అన్ని పరీక్షలు , అందునా నాకు పడని సబ్జెక్టులు. ఒక్కో పరీక్ష ఐపోతుంటే ఒక్కో బండరాయి తల మీదనుండి తీసేసినట్టు ఫీల్ ఐపోయేదాన్ని . హమ్మయ్య ఇక పుస్తకం చదివే పని లేదు . ఏడాది నుండి చదువుతున్నాము అని....


ఇప్పుడు పిల్లలకు 90% కి పైగా మార్కులు ఉంటేనే కళ్ళకు కానరావట్లేదు. అదే నేను చదువుకునే రోజుల్లో ఐతే 60% కంటే ఎక్కువ వస్తే చాలా గొప్ప. ఇక 70% దాటితే ఇక చెప్పక్కర్లేదు డిస్టింక్షన్.. పదో తరగతి ఐపోయిందంటే మాకందరికి ఒక పెద్ద రిలీఫ్ ఏంటంటే ఇక స్కూలు డ్రెస్సు, రెండు జడలు వేసుకునే పని లేదు. ఇంచక్కా రోజుకో డ్రెస్ వేసుకుని, హాయిగా ఒక జడ వేసుకోవచ్చు అని ఎదురు చూసేవాళ్ళం..

మరోసారి ఇంటర్ ప్రాక్టికల్స్ సంగతి చూద్దాం...13 వ్యాఖ్యలు:

lOOney Tunes

Akka I dont understand Telugu. Still I believe you can write a Book

రాజేంద్ర కుమార్ దేవరపల్లి

చాలా చక్కగా వివరించారు.అసలు నాపదో తరగతి అనుభవాల మీద ఏకంగా ఒక బ్లాగు ఒకసంవత్శరం పాటు రోజూ రాసుకోవచ్చు.అన్ని ఎక్కడ రాస్తామని మొదలు పెట్టలేదు.అవన్నీ ఒక్కసారి గుర్తు చేసారు.:)

పూర్ణిమ

God!!! I can't believe this!!

అది నేను చదువుకున్న స్కూల్ !! మీరు అదేనా?? (photo??) .. టపా అంతా చదివలేను.. మీరా సమాధానం చెప్పేవరకూ.. I'm waiting!!

కత్తి మహేష్ కుమార్

నిజమే! 10వ తరగతికొచ్చే సరికీ జీవితం పూర్తిగా మారిపోతుంది.

ఏకాంతపు దిలీప్

@జ్యోతి గారు

మరి ఆ తరవాత ఎప్పుడైనా రెండు జడలు వేసుకున్నారా? ఈ మధ్య ఎప్పుడైనా? :-)

Srividya

నిజంగానే పరీక్షలు అయిపోతే ఎంతో హాయిగా వుంటుంది. చదివాలన్న బెంగ వుండదు. నా పదో తరగతి ఫొటో చూస్తే నాకు తెగ నవ్వు వస్తుంది. జిడ్డు మొహం వేసుకుని, తెగ చదివేసి కష్తపడిపోయినదానిలా నీర్సంగా వుంటానందులో..

వేణూ శ్రీకాంత్

భలే వుందండీ... పదో తరగతి ప్రత్యేకమే...
"అన్ని చదువుకున్నట్టే ఉంటాయి. మళ్ళీ ఏదీ గుర్తుకురాదు." నాదీ ఇదే ప్రాబ్లం :-) ఓ సారైతే పదో తరగతి half-yearly English పరీక్ష లో వ్యాసం వ్రాస్తూ విమానాన్ని ఆంగ్లం లో ఏమంటారో ఎంత ఆలోచించినా గుర్తు రాక vimaanamu అని వ్రాసి వచ్చేసా :-) పరీక్ష అంటే అంత గాభరాగా ఉండేది.

జ్యోతి

పూర్ణిమ..
అవును . నేను St.anns high school, vijayanagar colony లో చదివాను.నువ్వు అదే స్కూలా. గ్రేట్.. Old Students Meet ఉన్నప్పుడు చెప్పు వస్తాను. ఆర్కుట్ లొ ప్రయత్నించా అప్పటి స్నేహితులు దొరుకుతారేమో అని, నా పిచ్చి కాని ఈ వయసులో నాలా కంప్యూటర్ ముందు ఎవరు కూర్చుంటారు.కొందరు అమ్మమ్మలైపోయుంటారు. కొందరు తమ పిల్లలకు పెళ్ళి సంబంధాలు చూస్తుంటారు. ఎందరో ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు. ఈ టపా రాస్తున్నప్పుడు మనసులో అనుకుంటూనే ఉన్నాను. ఈ బొమ్మ చూసి నా స్కూలు వాళ్ళు ఎవరైనా కలుస్తారా అని. ఐ యామ్ లక్కీ.. మళ్ళి ఆ స్కూలు ప్లే గ్రౌండ్, స్టేజీ, క్లాస్ రూమ్‍లు అన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడెలా ఉందో తెలీదు మరి. ఎప్పుడైనా అ స్కూలు ముందునుండి వెళ్ళినా, ఆ కాలనీగుండా వెళుతున్నా, స్కూలు నుండి మాసాబ్ టాంక్ వరకూ బస్ కోసం నడుచుకుంటు వెళ్ళడము, మధ్యలో JNTU హస్టల్ అబ్బాయిల కోతివేషాలు అన్నీ మనసులో కదులుతుంటాయి.
అసలు వరూధినిగారికి థాంక్స్ చెప్పాలి. ఆవిడ తన స్కూలు గురించి చెప్పింది చదివి నేను రాయకుండా ఉండలేకపోయాను. అదృష్టవశాత్తు నా స్కూలు ఫోటో నెట్‍లోదొరికింది.

మహేష్.. నిజమే. ఇప్పుడు పిల్లలు చాలా ఈజీగా పరీక్షలు రాసేస్తున్నారు. మా టైమ్‍లో ఐతే టెన్త్ క్లాస్ అనగానే అమ్మో బోర్డ్ ఎగ్జామ్ అనే భూతం లా ఉండేది. అంతదాకా పరీక్ష పేపర్లు స్కూలు వాళ్ళే ఇచ్చి, వాళ్ళే కరెక్షన్ చేసేవాళ్ళు. కాని పదో తరగతి వేరేవాళ్ళు దిద్దుతారు అనగానే ఎంతో భయంగా ఉండేది.

దిలీప్ : :)

విద్య ,, నిజమే నా ఫోటో ఉంది , జిడ్డు మొహం, తెగ చదివేసి కష్టపడీపోయినట్టుగా నువ్వు చెప్పినట్టె ఉంది నా ఫోటో కూడా. ఇక్కడ పెడదామనుకున్నా. ఎవరూ గుర్తుపట్టరు కదా అని.

రమణి

ఆ పాత మధురాలు ఎంత పంచుకొన్నా ఏదో వెలితి గానే ఉంటుంది అందులో ముఖ్యంగా మనము చదివిన స్కూల్, మన బాల్య మిత్రులు, మన అల్లర్లు, పరీక్షల భయం, టీచర్ల భరోసా, అప్పుడే అవన్నీ అయిపోయాయా అన్న ఫీలింగ్ కలుగుతుంది. కాని బాల్య స్మృతులను తలుచుకొవడం, ఇతరులతో పంచుకోడం కూడా ఓ అందమైన ఫీలింగ్.

నా స్కూల్ డేస్ గురించి కూడా రాయాలనే ఆసక్తిని రేకెత్తించారు.. ఈ టపా ద్వారా. నెనర్లు

మురళీ

జ్యోతి ఆంటీ..ఇంతకు మీకు ఏంత శాతం మార్కులు వచ్చాయో చెప్పలేదు..మీ అనుభవం పాత రొజులను గుర్తుతెస్తున్నాయి..అందుకే అంటారు అమ్మమ్మలు నాయానమ్మలు ఉండాలి బ్లాగుల్లొ.ఆ పాత విషయాలు గుర్తుచెయ్యాటానికి

జ్యోతి

నాయనా మురళి,
ఆంటి అనకు తండ్రి.. జ్యోతిగారు అను చాలు నువ్వు చాలా చిన్నవాడివైతే..
నాకు పదో క్లాసులొ 72% వచ్చాయి. దానికి వంద రూపాయల స్కాలర్‍షిప్ కూడా ఇచ్చారులే.. లెక్కలలొ నూటికి 93 .. అప్పుడు అది ఆకాశంలో ఉన్నట్టే లెక్క ..

meenakshi.a

జ్యోతి గారు టెంత్ క్లాస్ రోజులన్ని గుర్తుకు తెప్పించారు...
ఆ రోజులు,ఫ్రెండ్స్,ఆ కోతి చేష్టలు,ఆ రెండు జుట్లు.....అన్నీ కల్ల ముందు కదిలాయి..
మీ టపా చదివి...థ్యాంక్స్...

పూర్ణిమ

నేనింకా excitement లోనే ఉన్నాను.. ఇంకా టపా చదవలేదు.. ఇక్కడికి రాగానే.. ఆనందంతో అసలేమీ చేయడం లేదు. బ్లాగ్లోకంలోకి వచ్చినప్పటి నుండి.. "థ్రిల్" అనే ఆంగ్ల పదం ఇదివరకూ ఎప్పుడూ వాడనంతగా వాడుతున్నా!! ఇది అన్నింటికన్నా పెద్ద థ్రిల్ల్.. అసలెంత ఆశ్చర్యంగా ఉందో!! మీ బాచ్ నుండే కాదు.. నా బాచ్ నుండి తెలుగులో బ్లాగేవారు తక్కువే అని నా అభిప్రాయం. చూద్దాం.. ఎవరైనా కనిపిస్తారేమో.. అందాకా.. నాకు మీరు, మీకు నేను. :-)

ఈ టపా నేనెప్పటికీ చదవలేనేమో!!

ఇప్పుడే అందిన వార్త: క్లాస్ రూమ్స్ సరిపోవటం లేదని.. గ్రౌండ్ లో కూడా బిల్డింగ్ కట్టేసారట. :-(

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008