అమ్మా నాన్నలకు అపురూప కానుక...
ఇది జరిగి సుమారు 15 సంవత్సరాలు గడిచాయి. కాని తలుచుకున్నప్పుడల్లా ఆ సన్నివేశాలు కళ్ళ ముందు కదులుతాయి. మా అమ్మా నాన్న నన్ను, ఇద్దరు తమ్ముళ్ళను ఒకేలాగా పెంచారు. ఎప్పుడూ వేరుగా చూడలేదు. నాకు పెళ్ళయ్యాక కూడా. అందరి పిల్లలను సమానంగా చూసేవారు. కోడళ్ళను గాని ,నన్ను గాని సమానంగా చూసేవారు. ఎప్పుడు బట్టలు కొన్నా వాళ్ళకు నాకు, అందరి పిల్లలకు సమానంగా కొనేవారు. మాకోసం ఎన్నో చేసిన అమ్మానాన్నలకు మరిచిపోలేని కానుక ఇవ్వాలని ఎప్పటినుండో నా మనసులో ఉండింది. కాని అది నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకోకుండా, వాళ్ళకు తెలియకుందా చేయాలని నా ఆలోచన. అలాంటి అవకాశం ఒకసారి వచ్చింది.
ఒకసారి మా చిన్న తమ్ముడి కూతురి నామకరణం ఫంక్షన్ చేయాలని అనుకున్నారు మా నాన్న. ఆ మరునాడే మా అమ్మా నాన్నల ముప్పయ్యవ పెళ్ళిరోజు. ఎప్పుడూ వాళ్ళు పెళ్ళిరోజు జరుపుకోరు . నాకు అప్పుడే ఆలోచన తట్టింది. ఆ ఫంక్షన్ కి వారం ముందు నుండి ప్లానింగ్. నేను కాని, మా తమ్ముళ్ళు కాని మొత్తం ఖర్చు పెట్టుకోలేము . అది బాగుండదు కూడా. అందుకే నామకరణ కార్యక్రమం మరునాడు ఎలాగూ దగ్గరి చుట్టాలకోసం భోజన కార్యక్రమం ఉంటుంది. అందునా నాన్ వెజ్, మందు పార్టీ. అప్పుడు వాళ్ళకోసం ఒక సర్‌ప్రైజ్ ఇవ్వాలని నేను అనుకుని మా తమ్ముళ్ళు, మరదళ్ళకు చెప్పాను. వాళ్ళూ ఒప్పుకున్నారు. నేను వాళ్ళకు బట్టలు తీసుకుంటాను. పెద్ద తమ్ముడు మా నాన్నగారికి ఏదైనా బంగారు గొలుసు చేయిస్తా అన్నాడు. చిన్నాడికి కేకు, పూల దండలు అప్పచెప్పాను. ఈ చర్చ అంతా ఫోన్ల మీదే నడుస్తుంది. మావారికి తెలుసు. అమ్మా వాళ్ళింట్లో ఫంక్షన్ కి ముందు రోజు సాయంత్రం ... ఇంట్లో హడావిడిగా ఉంది . బట్టలు కొనాలి. ఎలా? ఎవ్వరికీ చెప్పకూడదు. అంత పనిలొ ఇంట్లోనుండి బయటపడేది ఎలా అని ఆలోచించి నేను మా మరదలు మా అమ్మాయికి గొరింటాకు పెట్టిస్తామని బయటపడి, మా అమ్మాయిని మా మార్వాడి ఫ్రెండ్ ఇంట్లో దింపేసి మేము షాపింగ్‌కి వెళ్ళాం . మా అమ్మ ఎప్పటినుండో మనసుపడ్డ ముత్యము రంగు గద్వాల్ పట్టు చీర , మా నాన్న గారికి లాల్చీ, ధోవతి అన్నీ కోనేసి మళ్ళీ ఎమీ ఎరగనట్టు ఇంట్లో పడ్డాం. ఎవ్వరికీ చూపించలేదు. మరునాడు ఫంక్షన్ జరిగింది. ఇక ఆ తెల్లారి అసలు కార్యక్రమం. కంసాలి దగ్గర గొలుసు రెడీ అవుతుంది. ఇంట్లో వంటలు తయారవుతున్నాయి. .. మాకు పిల్లలు పుట్టినా కూడా మా నాన్నకు ఇప్పటికీ భయపడతాము. అందుకే మా తమ్ముళ్ళు, మరదళ్ళు భయపడసాగారు, తీరా అసలు టైమ్ కి నాన్నగారు వద్దంటే ఎలా. ముందే చెప్పేద్దాము అన్నారు. నేను మాత్రం అస్సలు చెప్పొద్దు నేను చూసుకుంటా అని. పొద్దున్న మా అమ్మానాన్నలకు మామూలుగా ఒక చిన్న కేకు తెచ్చి కట్ చేయించాక చెప్పా.. "నాన్నా మేము ఒక చిన్న పార్టీ చేయాలనుకుంటున్నాము" అని. నవ్వుతూ సరే అన్నారు. ఇంట్లో కొందరు చుట్టాలున్నారు. లంచ్ టైం దగ్గర పడుతుంది. గొలుసు ఇంకా తయారు కాలేదు. మా పెద్ద తమ్ముడు, వాడి ఫ్రెండ్ వెళ్ళి దుకాణం లో కూర్చుని చేయించసాగారు . అందరికి ఆకలి మొదలైంది. మా అమ్మా నాన్న " ఎందుకు ఆపుతున్నారు. కానివ్వండి. లేకుంటే పార్టీ భోజనాలు అయ్యాక పెట్టుకుందాము" అన్నారు. నేను కాదు కూడదు . ఐపోయింది అని చెప్పాను. వచ్చిన చుట్టాలు కూడా ఏమైంది , ఏం జరుగుతుంది అని ఆశ్చర్య పోతున్నారు .కాని మేము ఎవ్వరికీ అసలు సంగతి చెప్పలేదు. అప్పుడే పెద్ద తమ్ముడు పగడాలు, బంగారు పూసలతో చేసి, సాయిబాబా లాకెట్టు పెట్టిన గొలుసు తీసుకుని వచ్చాడు. చిన్న తమ్ముడు మూడు వరుసలతో ఉన్న స్పెషల్ పది కిలోల పెళ్ళి కేకు, పెద్ద పూల దండలతో వచ్చాడు. అంతే అప్పుడు అందరు చుట్టాలను మెయిన్ హాల్లోకి పిలిచి, టేబిల్ వేసి కేకు, పూలు, బట్టలు తెచ్చి పెడుతుంటే చూడాలి మా అమ్మా నాన్న కళ్ళలోని ఆనంద వీచికలు. మేము ఏం చేస్తున్నామో అర్ధం అవుతుంది , అర్ధం కాదు. సంతోషం, ఆశ్చర్యం అన్నీ కలిపి వాళ్ళకు నోట మాట రాలేదు. ఇన్నేళ్ళు మాకు బొట్టు పెట్టి, బట్టలు పెట్టి పూల దండలు వేసి ఎన్నో ఫంక్షన్స్ చేసిన మా అమ్మా నాన్నలకు మేము అదే విధంగా చేసాము. ఆ అవకాశం అలా రావడం ఎంత అదృష్టం కదా. వాళ్ళకు ఇష్టమైన బట్టలు పెట్టి, కట్టుకోమన్నాము అసలు వాళ్ల సైజు బట్టలు ఎలా రెడీ అయ్యాయి, ఎప్పుడు తెచ్చారు అని అడుగుతూనే వేసుకుని వచ్చారు. ఇంకా ఇద్దరూ అయోమయంలోనే ఉన్నారు. తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి దండలేసి, మా నాన్నగారికి గొలుసు వేసి, ఇద్దరితో కేక్ కట్ చేయించాము. ఆ తర్వాత అందరం పాదభివందనం చేసి ఆశీర్వాదం పొందాము. అప్పుడు వాళ్ళిద్దరి కళ్ళలో నేను చూసిన ఆనంద భాష్పాలు ఇంకా నాకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇద్దరికీ మనసులోనుండి వెల్లువెత్తుకొని వస్తున్న ఆనందం. నిజంగా అందరికీ మరిచిపోలేని అనుభూతి అది. దానికి ఐన ఖర్చు తక్కువే కాని లభించినా ఆనందం వెల కట్టలేనిది.
మా వారు కాస్త లేటుగా వచ్చారు. మా నాన్నగారు ఆయనకు దగ్గరకు పిలిచి కేక్ ఇచ్చి ," పిల్లలు చూడు ఏం చేసారో!" అని చిన్న పిల్లాడిలా సంతోషంగా చెప్పారు. మావారు అన్నారు మరి ఎన్ని రోజులనుండి వీళ్ళందరు ప్లానింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత మూడేళ్ళకు మా నాన్నగారు చాలా ఖర్చు పెట్టి షష్టి పూర్తి పండగ జరిపినా అప్పటి అందం కనపడలేదు. నేను చేసిన సర్‌ప్రైజ్ చూసి మరి కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులకు చేసారు. మంచిదే కదా. .
ఈ జ్ఞాపకం నా జీవితాంతం మరిచిపోలేనిది. మధురమైనది అని అనుకుంటాను. ఎందుకంటే అది మా అమ్మానాన్నలకు ప్రేమతో, ఆప్యాయతతో ఇచ్చిన అద్భుత కానుక . వెల కట్టలేని ఆనందం ...
17 వ్యాఖ్యలు:
well done.
Seeing parents becoming children again.. Priceless!!
Money can't buy somethings.. for everything else there is master card!!
అది ఏదో బాంక్ వాళ్ళ కార్డ్ ఆడ్ వస్తుంది చూశారా?? నాకు మీ టపా చవదగానే అదే గుర్తువచ్చింది.
Beautiful memory............
గంగి గోవు పాలు గరిటడైనను చాలు అన్నట్లు, ప్రేమతో పిడికెడు పెట్టినా మనసులో కొండంత సంతృప్తి నిండిపోతుంది. బాగుంది మీ మధుర ఙ్ఞాపకం.
అందమైన జ్ఞాపకం...బావుందండీ.
చిన్నచిన్న ఆనందాలే జీవితాన్ని కొలవడానికి ఉన్న కొలబద్దలు. అవి జ్ఞాపకాలలో నిక్షిప్తమై, మనసులో మనకే తెలియని ఒక మూల దాగుంటాయి. వాటిని వెలికితీసి, మెరుగుపెట్టి, అక్షరరూపమిస్తే! కళ్ళలో నీళ్ళూ, గొంతులో ఆద్రత,గుండేలో తడినీ సృష్టిస్తాయి...రాసిన వారికైనా...చదివి ఆస్వాదించినవారికైనా. అనుభవించినవారికైనా...అనుభవాన్ని పంచుకున్నవారికైనా.
ఈ అనుభవాన్ని పంచినందుకు నెనర్లు.
పిడికెడంత గుండె మానవశరీరానికి కీలకమైనట్లే ఇలాంటి చిన్నిచిన్ని ఆనందాలు బతుకంతా వెలుగుదారులు పరుస్తాయి.
తల్లిదండ్రులిద్దరూ ఆరోగ్యంగ ఉండగానే ఇలాంటి ముచ్చట జరుపుగోగలిగే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది!మంచి పని చేశారు.
meeku thallidamdrula patlagala premabhimaanaalu manushulu amdaru aalochimchavalasina vidhamgaa vunnadi thallidmdrulanu vruddhaasramaalalo cherustunnavaaru tallidamdrulu pillalanumchi emi korukumtaarO telusukovaali.
Supero super. Manchi pani chesaaru.
కంటికి కునుకు లేదు..
వొంటికి స్పర్శ లేదు..
నా దరిన నా మనస్సులేదు..
అని ఎవరో కవి అన్నట్లు.. మీ టపా చదవగానే నాకు అలానే అనిపించింది..
కృతజ్ఞత అనేది చాలా చిన్న పదం.. మనం అనుభవించే ప్రతి సంతోషానికి వారే కారణం అన్న విషయం మరచిపోకూడదు.
@జ్యోతి గారూ..
నాన్న తిడతారేమో అంటే, నేను చెప్తా కదా.. అనే ధైర్యం ఆడపిల్లలకే సొంతమేమొనండీ..:-)
చాలా బాగుంది.
నా అనుభవం:
అమ్మా, నాన్న ల పెళ్ళీరోజుకు ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ తయారు చెశి ఇవ్వటం నాకు చిన్నప్పుడు అలవాటు. చదువులు, ఉద్యోగాలు వచ్చాక, దూరంగా ఉండటం చేత ఆ సరదళు కాస్తా ఫొన్ లోనే ఇముడుతున్నాయి.
మొన్న ఫిబ్రవరి లో మా అమ్మా నాన్నల 25వ పేళ్ళీరోజు అయ్యింది. దానికి నేను నా చేత్తో ఒక బొమ్మ గీసి, చాలా రోజులు ఆలోచించి వారి కోసం ప్రత్యేకంగా ఒక వ్రాత రాసి వారికి అందించాను. ఎంతో సంబరపడిపోయారు. దూరం గా ఉన్న తమ్ముడి పేరును కూడా అందులో జత చేసినందుకు వారి ఆనందం చూడాలి.
బాగుంది. మనకి అన్ని చేసిన తల్లిదండ్రులకి ఇలాంటి చిన్న చిన్న కానుకలు ఇవ్వడం ఎంతో సంతోషాన్నిస్తుంది.
చాలా అందమైన జ్ఞాపకం జ్యోతి గారూ.. పూర్ణిమ చెప్పినట్లు మనముందు వాళ్ళు చిన్నపిల్లలైపోవటం మాత్రం వర్ణించలేని ఆనందం!
అవును, అందమైన జ్ఞాపకం. ఇలాంటి జ్ఞాపకాలే మిమ్మల్ని, మీ తల్లి దండ్రుల్ని కూడా ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తాయి. ఎందుకంటే సంతోషం సగం బలం కదా మరి!
60 లో 20 వచ్చింది, మా అమ్మా నాన్న కి మళ్ళీ ఒక వసంతమొచ్చింది అను అనుకొనే అదృష్టం ఎంతమందికి వస్తుందండీ. చాలా అపురూపమైన కానుక ఇచ్చారు, అంతకన్నా మంచి అనుభూతి ని ప్రోది చేసుకొన్నారు మీ మదిలో, ఓ తీపి జ్ఞాపకంలా.
మీకు తల్లి తండ్రుల పట్ల గల ప్రేమాభిమానాలు మనుషులందరు ఆలోచించ వలసిన విధంగా ఉన్నది. తల్లితండ్రులను వృధ్ధాశ్రమములలో చేరుస్తున్నవారు వారియయొక్క తల్లితండ్రులు వారినుండి ఏమికోరుకుంటున్నారో తెలుసుకోవాలి.అలాంటివారికి కనువిప్పు కలిగించే విధంగా ఉన్నది.
Post a Comment