Sunday, August 3, 2008

వ్యక్తిత్వమా ?… సమాజమా ?...

సమాజాన్ని చూస్తే చాలామందికి భయం. ఏ పని చేసినా అది సమాజం హర్షిస్తుందా.. లేదా అని క్రిందా మీదా పడి బుర్రబద్ధలుకొట్టుకుని విశ్లేషించిన మీదట ఇప్పటికన్నా మరింత ఉన్నతమైన సామాజిక హోదాని, సాఫ్ట్ కార్నర్‌ని కట్టబెట్టే పనులను మాత్రమే చెయ్యడానికి సుముఖత చూపుతాం. ఒక మంచి పని చెయ్యాలన్నా అది మనం అనుకున్న పదిమందితో కూడిన పరిమిత సమాజం దృష్టిలో ఆమోదయోగ్యమైతేనే ఆచరణకు నోచుకుంటుంది. ఇలా మన దృష్టిని మర్చిపోయి సమాజం దృష్టిలో భూతద్ధం వేసుకుని చూడడం వల్ల మన వ్యక్తిత్వాన్ని, మనకు మనమే ప్రత్యేకమైన శైలిని, నిర్ణయాత్మక అసక్తిని కోల్పోతున్నాం. సమాజాన్ని సంతృప్తి పరిచేలా నడుచుకోవడం ఎన్ని జన్మలెత్తినా సాధ్యపడని పని. కొన్ని విషయాల్లో సమాజాన్ని సంతృప్తిపరచడం కోసం వ్యక్తిత్వాన్ని చంపుకుని నిర్ణయాలు తీసుకోవడం కన్నా సమాజాన్ని ఎదిరించైనా మన మనసుకి మనం మనతోనే ఉన్నామన్న భరోసాని మిగల్చకపోతే.. సిరివెన్నెల అన్నట్లు "జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది" అని పాడుకోక తప్పదు.


ప్రపంచం కోసం మనకుమనం ఏకాకులమవడం ఎంత దురదృష్టం? ప్రతీ మనిషిలోనూ జన్మతః ఎన్నో అద్భుతమైన పార్ఘ్యాలు ఇమిడి ఉంటాయి. ఇరుకు ప్రపంచాన్ని ఈదడమే జీవితం అన్నట్లు.. ఆ ఇరుకు మనుషుల్లో, మనసుల్తో పోరాడుతూ అలసిపోతూ... జీవితంపై కురిపించగలిగేలా సృష్టికర్త మనలో ఇమిడ్చిన అద్భుతమైన వర్ణాలను మనలోనే సమాధి చేసుకుంటూ నిస్సారమైన జీవితాన్ని సాగించడంలో మనం సిద్ధహస్తులమయ్యాం. మన లక్ష్యం సమాజాన్ని గెలవడమే, సమాజంలోనిలదొక్కుకోవడమే అయినపుడు పోరాటం తప్ప ఏం మిగులుతుంది? ఉన్నత స్థానం కోసం పోరాడాలన్న కసితో డబ్బు, పలుకుబడిని సాధించడానికి కష్టపడి పోరాటం సాగించడానికి.. మన సహజసిద్ధ ప్రతిభతో మనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని సృష్టించుకుంటూ..మన శైలినే ప్రపంచం ముందు మోడల్‌గా పెట్టడానికి ఎంత వృత్యాసముంటుందో ఒక్కసారి ఆలోచించండి...? కాని పదిమంది నడిచే మూసదారిని విడిచి ఒక్కడుగు విభిన్నంగా వేయడానికి మనకు ధైర్యం చాలదు. కారణం మనల్ని మనం కూడా నమ్మనంతగా ప్రపంచాన్ని నమ్ముతున్నాం. ప్రపంచంలో పదిమంది పది రకాలుగా మాట్లాడినా ఆ పదిమందినీ ఒప్పించడానికి శ్రమిస్తాం తప్ప.. మనకు మాత్రం మనం తోడు ఉండడానికి ఇష్టపడం ! దీనికి కారణం మనమనుకుంటున్న ప్రపంచంలో సూటిపోటి మాటలతో , పనికిరాని ఆరాలతో ఇతరులను బాధిస్తున్నదీ మనమే కాబట్టి! రేపు ఏమైనా తేడాలు వస్తే ఆ బాధలు మనల్ని చుట్టుకుంటాయన్న అభద్రతాభావం. అందుకే గిరిగీసుకు బ్రతుకుతున్నాం. వ్యక్తిత్వానికి లక్ష్మణరేఖని అడ్డుపెట్టి మరీ! మనం ప్రపంచాన్ని ఎప్పుడైతే నొప్పించడం మానేస్తామో అప్పుడే ఈ భయపు జాఢ్యం మనల్ని వదులుతుంది. మన స్వంత వ్యక్తిత్వంతో బ్రతకగలుగుతాం.


మీ
నల్లమోతు శ్రీధర్

20 వ్యాఖ్యలు:

కత్తి మహేష్ కుమార్

వ్యక్తి ఆశలకూ, సమాజ ఆంక్షలకూ మధ్య ఈ నిరంతరపోరాటం సాగాల్సిందే!

వ్యక్తిత్వమున్న మనుషులు, ఎదిరించైనా తన ఉనికిని నిలబెట్టుకుని ప్రత్యేకంగా నిలబడతారు.మిగతావారు,హాయిగా బోనుల్లో గడిపేసి ఇదే జీవితమని సరిపెట్టుకుంటారు.

మెజారిటీ రెండోరకమే కాబట్టి, "A country of billion people seem to have only million ideas" అన్నారు.

రాదిక బుజ్జి

sridhar garu,,
100% correct

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

వ్యక్తి సమాజానికి మీనియేచర్. అతని సొంతం బహుస్వల్పం.

కాని వ్యక్తిని పట్టించుకోని సమాజాన్ని వ్యక్తి కూడా పట్టించుకోవడం మానేయాలి. వ్యక్తి చేసే ప్రతి పనికీ సామాజిక ప్రయోజనం ఉండాలట. (ఇవి సమాజం నేర్పిన డైలాగులే - చాలామంది చిలకల్లా వల్లిస్తూంటారు) అలా ఉంటేనే అతడు మానవుడూ, మహానుభావుడు, మట్టీ, మశానం ! ఎంతసేపూ తన గొప్పా, తన పచ్చా, తన పైరూ తప్ప ఈ సమాజం ఎప్పుడైనా వ్యక్తి అవసరాల్నిదృష్టిలో పెట్టుకుని ఆలోచించిందా ?

Society is here only for spying, judging commenting, fearing or rubbishing you. It never loves you.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి

చబ్బాష్ రాజేంద్ర బాగా కనిపెట్టావ్,శ్రీధర్ గారు మొదటి పంక్తిలోనే మీ శైలిని పట్టేశాను....:)

Raj

You are correct sir

నల్లమోతు శ్రీధర్

కత్తి మహేష్ కుమార్ గారు, తాడేపల్లి గారు నేను రాసిన ఎడిటోరియల్ కన్నా మీ విశ్లేషణ, అందులోని పదునూ చాలా బాగున్నాయి. మీ స్పందనకు ధన్యవాదాలు. రాజేంద్ర గారు మీరు నాడి పట్టడంలో ఉద్ధండులు సర్. రాధిక గారు, రాజ్ గారు thank you for your kind words.

- నల్లమోతు శ్రీధర్

సుజాత

ఒక్కరు ఒక్క అడుగు నలుగురికీ భిన్నంగా వేసినా సంప్రదాయం తగలడిపొతోందని శోకించే వాళ్లు ఒకరికి వందమంది ఉంటారు.
వ్యక్తిత్వాన్ని చంపుకుని బోనుల్లో బతకడం అన్నింటి కంటె ఈజీ కాబట్టి మెజారిటీ వాళ్లదే!

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

ఎవరు ఏ సుజాతగారై ఉంటారో అర్థంకాక మహా ఇబ్బంది పడుతున్నాం. కనీసం వారి User-names లో ఇంటిపేర్ల పొడి అక్షరాలు చేర్చుకుంటే మనందఱికీ హ్యాపీసు.

నల్లమోతు శ్రీధర్

సుజాత గారు అవును.. ఇనుప ఛట్రంలో బ్రతుకీడుస్తూ ఇదే ప్రపంచం, ఇదే జీవితం అని విభిన్నతకు దూరంగా గడపడం అలవాటైపోయింది. మీ స్పందనకు ధన్యవాదాలు.

నాగన్న

వ్యక్తిత్వమే! సమాజం అని నిర్వచింపబడేది కూడా నిజానికి మన మనస్సు నుండి పుట్టి మన వ్యక్తిత్వంతో ఆమోదింపబడినదే.

జాన్‌హైడ్ కనుమూరి

ఇది నాజీవితంలోనూ అనుభవమే అయినా హటాత్తుగా మీ టపా చదివి ఏమీ రాయలేకపోతున్నా.

అనుభవాన్ని నెమరువేసే తీరికదొరికితే మళ్ళీ వచ్చి రాస్తా.

జ్యోతి

తాడేపల్లిగారు,
sujata అని రాసేది గడ్దిపూలు సుజాతగారు

సుజాత అని తెలుగులో రాసేది మనసులోమాట సుజాతగారు.

ఇదే వాళ్ళిద్దరిని గుర్తుపట్టడానికి బండగుర్తు..

ప్రతాప్

నాకో చిన్న సందేహం, అస్సలు మనకు వ్యక్తిత్వం అనేది ఎక్కడి నుంచి, ఎప్పటి నుంచి, ఎలా వస్తుంది?
సమాజపు పరిశీలనలోనే కదా? మరి మనకు గమనింపు నేర్పిన సమాజంలోని లోపాలను ఎత్తి చూపుదాం. పొరబాట్లను సరిదిద్దుదాం. నేను, నా కుటుంబం అంటూ సరిహద్దు గీసుకొని బ్రతికితేనే మన వ్యక్తిత్వానికి విలువ? లేదా నాకీ సమాజం అక్కర్లేదు అని విప్లవగీతం ఆలపిస్తేనేనా మన వ్యక్తిత్వానికి విలువ? ఏమో నాకిన్ని సందేహాలు కలుగుతున్నాయి. బాబ్బాబు ఎవరైనా తీర్చి పుణ్యం మూటగట్టుకోరూ?

రాధిక

సమాజ0వల్ల వ్యక్తిత్వ0 మారిపోతు0దన్న విషయ0లో మీతో చాలా వరకు ఏకీభవస్తాను.మ0చి వ్యక్తిత్వాన్ని సమాజ0 చాలావరకూ హర్షిస్తు0ది.నిజానికి మనకొక వ్యక్తిత్వాన్ని ఇచ్చేది,నేర్పేది కూడా సమాజమే.సమాజ0 ఏదో కీడు చేసేస్తు0దని దాన్ని తన్ని తగలేద్దామనుకోవడమ్ చాలా తప్పు.మన0 మన హద్దుల్లో వు0డడానికి,చాలాసార్లు మ0చిగా ప్రవర్తి0చడానికి కారణమ్ ఈ సమాజమే అని మర్చిపోకూడదు.చాలాసార్లి ఈ బ్లాగుల్లోనే చాలామ0ది చెప్పుకున్నామపు...జనాలు మ0చివాడని అనేయడ0 వల్ల బుద్దిగాప్రవర్తి0చాల్సి వస్తు0ది అని.తెలిసినవాల్లు ఎవరూ లేని చోట మనప్రవర్తనకి,తెలిసిన వాళ్ళు వున్న చొట మన ప్రవర్తనకి ఎ0త తేడా వు0టు0దో మనకి మనమే చూసుకు0టే తెలిసిపోతు0ది.నరక0లో శిక్షలు అనుభవి0చాల్సివస్తు0దేమో అని మ0చి గాబ్రతకడ0 ఎలా0టిదో,సమాజమ్ ఏమనుకు0టు0దో అని మన ప్రవర్తనని సరిచేసుకోవడ0 కూడా అలా0టిదే.

నల్లమోతు శ్రీధర్

నేను వ్యక్తపరచదలుచుకున్న భావానికి వ్యక్తిత్వమా సమాజమా అన్న టైటిల్ కరెక్ట్ కాదేమో అన్పిస్తోంది అందరి మిత్రుల అభిప్రాయాలు చదువుతుంటే! మనలో ఉన్న అనేక టాలెంట్స్ సమాజం దృష్టిలో పడడానికి, సమాజం చేత హర్షింపజేసుకోవడానికి మూస జీవనవిధానంలో గడపడం ద్వారా మరుగున పడిపోతున్నాయన్నది ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న విషయం. ఎంతవరకూ మన ఆలోచనా విధానం సమాజం చుట్టూనే పరిభ్రమించడం వల్ల మరికొంత విభిన్నంగా (అంటే సమాజాన్ని ఎదిరించడం కాదు, మూస లక్ష్యాలకు భిన్నంగా) ఆలోచించలేకపోతున్నాం అన్నది బాధ కలిగించే అంశం. ఒక గొప్ప సామాజిక జీవితాన్ని గడపడం కోసం తమలోని గొప్ప నైపుణ్యతలను అణగదొక్కి వ్యక్తిత్వాన్ని చంపుకుని మెటీరియలిస్టిక్ గా బ్రతుకుని గడిపేవారు ఎంతోమంది కన్పిస్తుంటారు. వారందరి ఒరిజినల్ టాలెంట్స్ సామాజిక హోదా అన్న పరిధిని దాటి ఆవల విస్తరిస్తే అద్భుతాలు జరుగుతాయి కదా!

సుజాత గారు, జాన్ హైడ్ కనుమూరి గారు, నాగన్న గారు, రాధిక గారు మీ అమూల్యమైన అభిప్రాయాలను పంచుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

- నల్లమోతు శ్రీధర్

- నల్లమోతు శ్రీధర్

కొత్త పాళీ

మీ సంపాదకీయాల్ని తప్పకుండా చదువుతాను నేను, అందరూ ఆలోచించి ఆచరణలో పెట్టదగిన విషయాలు రాస్తుంటారు. అభినందనలు. పని గట్టుకుని వాటిల్ని తన బ్లాగుద్వారా మా అందరికీ అందుబాటూలోకి తెస్తున్న జ్యోతిగారికి కూడా అభినందనలు. ఈ సంపాదకీయం మరీ బావుంది.
సాధారణంగా సమాజంలో ఉండే ఎన్నో స్టీరియోటైప్ భావాలకి ఎదురీదే నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టిన అనుభవంతో చెబుతున్నా. మన చేసే పని చిత్త శుద్ధితో చేస్తే సమాజం కూడా రాజీ పడుతుంది.

నల్లమోతు శ్రీధర్

కొత్త పాళీ గారు ధన్యవాదాలు. "మన చేసే పని చిత్త శుద్ధితో చేస్తే సమాజం కూడా రాజీ పడుతుంది" అద్భుతమైన సత్యమిది. ఏ వినూత్నమైన పనైనా ప్రారంభించడానికి ముందే మనలో సంశయం మొదలవుతుంది, ఆ దశ నుండే "సమాజం హర్షిస్తుందా లేదా" అన్నది ఆలోచించడం మొదలుపెట్టేవారే ఎక్కువమంది. సో చిత్తశుద్ధితో పనిచేసుకుపోయి చివర్లో సమాజం ముందు "నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకో లేదంటే లేదు" అని సవాల్ విసరగలిగిన ధైర్యం చాలా తక్కువమందికే ఉంటుంది.

జ్యోతి

నేను కూడా కొత్తపాళీగారు చెప్పినట్టే చేస్తాను. మనకు కష్టం వచ్చినప్పుడు తోడుండదు, సుఖం వచ్చినప్పుడు ఓర్వలేదు.అలాంటప్పుడు మనమెందుకు సమాజం గురించి ఆలోచించాలి. మనము చేయాలనుకున్న పని సరియైనది అనుకున్నప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు. ఎవ్వడేం పీకుతాడు అన్న ఆలోచనతోనే చేస్తాను. చేస్తున్నాను. అదే నాకు జీవిత పయనంలో నిలకడగా సాగిపోయే ధైర్యాన్ని ఇస్తుంది.సమాజం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఒక కాలు ముందుకు , ఒక కాలు వెనక్కి ఉంటుంది.

శరత్

సమాజం ఏమనుకుంటుందో అని అస్సలు పట్టించుకోని వారిలో నేనూ ఒకడిని. మనం సరి అనుకున్నది చేస్తూ పోవడమే. ఇతరులకూ అది నచ్చితే తోడూగా వస్తారు లేకపోతే లేదు - హు కేర్స్?

Aruna

ee rOjullO inkA samajam gurunchi paTTinchukunTunnArA?? alAnTi vAllu inkA vunnArA.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008