ప్రేమ.. పెళ్ళి.... కట్నం..
ఇటీవల మన బ్లాగులలో కట్నం, పెళ్ళిల్లు గురించి తరచూ చర్చలు జరుగుతున్నాయి . ఎప్పటినుండో ఈ విషయంపై రాయాలనుకుంటున్నాను. పైగా నాకు అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ఉన్నారు. సో .నేను రెండు వైపులా ఆలోచించాలి.నేను చెప్పేవి ఎవ్వరికి మద్ధతుగా ,స్వార్ధంగా ఉండకూడదు. అంటే అమ్మాయికి కట్నం ఇవ్వను, అబ్బాయికి మాత్రం తీసుకుంటాను అని. బుద్ధి చెప్పి గడ్డి తిన్నట్టు అవుతుంది. అసలు ఈ కట్నం అంటేనే చిరాకు నాకు. నేను అనుకునేదాన్ని అసలు కట్నం ఎందుకివ్వాలి. నా కాబోయే భర్త కట్నం తీసుకోనివాడై ఉండాలి అని. కాని అప్పుడు పెద్దలతో పోరాడే ధైర్యం ఎక్కడిది? కట్నం ఇవ్వడం తీసుకోవడం అనేది పెళ్ళికార్యక్రమాలలో ఒక భాగమైపోయింది. కాని మావారు నాకు ఏమీ వద్దు అన్నారు. అప్పుడు మా అత్తగారి వైపు వాళ్ళు మొత్తుకున్నారు. పిల్లాడు కట్నం వద్దన్నాడు మరి పెళ్ళి ఖర్చులన్నీ ఎలా. పిల్ల తండ్రికి ఆస్థిపాస్థులు బానే ఉన్నాయి.ఒక్కతే కూతురు . ఎందుకివ్వడు. అని ఇంట్లో చర్చలు జరిగాయంట.(నాకు తర్వాత తెలిసింది). ఇప్పుడు నా కూతురు ,కొడుకు పెరుగుతున్నకొద్దీ నేను అనుకునేదాన్ని ఈ కట్నం విషయంలో నేను ఏమి చేయగలను? అమ్మాయికి తప్పనిసరి ఇవ్వాల్సి వస్తే, అబ్బాయికి కట్నం తీసుకోకుండా పెళ్ళి చేయలేనా? ఎందుకంటే సినిమాలలోలాగా డవిలాగులు కొట్టి అందరిని ఎదిరించలేను కదా. ఈ విషయంలో మా పిల్లలతో ఎప్పటినుండో చర్చిస్తున్నాను. మా అమ్మాయి అడీగేది కట్నం ఎందుకివ్వాలి అని. అబ్బాయి అనేవాడు కట్నం ఎందుకు తీసుకోకూడదు. వాళ్ళకు చెప్పేముందు నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేను ఏమి చేయాలనుకుంటున్నాను. ఆ మాట మీద నేను నిలబడగలనా? నేను చెప్పే మాట లేదా తీసుకునే నిర్ణయం ఇద్దరు పిల్లలకు వర్తించాలి. అమ్మాయికి కట్నం ఇవ్వడం తప్పకుంటే ఇవ్వాల్సిందే. మంచి సంబంధం వదులుకోలేము కదా. అమ్మాయి సుఖంగా ఉంటే చాలు అనుకుంటారు ఏ తల్లితండ్రులైనా. కాని మా అమ్మాయికి చెప్పాను నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకో ముందు. అప్పుడు అబ్బాయిలే మన ఇంటికి వస్తారు. కట్నం సమస్యలు ఉండవు. ఇవ్వాల్సిన పనిలేదు. అది తను పాటించింది . మా అబ్బాయికి చెప్పాను నువ్వు కట్నం తీసుకుంటాను అంటే పెళ్ళి తర్వాత నాతో ఉండటానికి వీలులేదు. కట్నం తీసుకుంటే నిన్ను అమ్మేసినట్టే ( సంతలో పశువులను, కార్లను అమ్మేసినట్టుగా) , నీ పెళ్ళాంతో కలిసి మీ అత్తారింటికి పంపిస్తా.
అంతే కాకుండ మా పిల్లలకు చెప్పింది ఒకేమాట. ప్రేమలు , దోమలు అని మీ కెరీర్ ని పాడు చేసుకోవద్దు. ముందు చదువు, ఉద్యోగం లో బాగా సెటిల్ అయ్యాక అప్పుడు ఆ సంగతి ఆలోచించండి. కాని అమ్మాయి మంచి జాబ్‌లో సెటిల్ అయ్యాక నేను నిర్ణయం తీసుకున్నాను. తనకు కట్నం ఇచ్చేది లేదు. అలా కాదు కట్నం ఇవ్వాల్సిందే అంటే సరే మార్కెట్ రేట్ ఎలా ఉంటే అలా ఇస్తాను అప్పు చేసి. కాని మా అమ్మాయి జీతం లో నుండి ఒక్క పైసా తీసుకోకూడదు. అదంతా నేనే తీసుకుంటాను అని. ఈ మాట మా అమ్మాయికి, మావారికి కూడా చెప్పాను. ఇక మావాడిదో గోల . నా డబ్బుతోనే నా పెళ్ళి చేసుకోవాలా? అందరూ తీసుకుంటున్నారు కట్నం. నేను తీసుకుంటే ఏమైంది అంటాడు. అందరు గడ్డితింటే నువ్వు తింటావా. అసలు నీకు కట్నం ఎందుకివ్వాలి ? నిన్ను నువ్వు అమ్ముకుంటావా. ఇడియట్ అన్నా. అది కాదు మమ్మీ. పెళ్ళిలో పెట్టే బ్యాండ్ సౌండ్ వింటుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. వీడు నా కష్టార్జితంతో డ్రమ్స్ వాయిస్తున్నాడు. అది నా గుండెల్లో కొడుతున్నట్టుగా ఉంటుంది అంటాడు. మరి కట్నం తీసుకుంటే ఆ అమ్మాయి తండ్రి కూడా అలాగే అనుకోడా? సరెలే! నీ పెళ్ళికి క్యాసెట్ ప్లేయర్ పెడతా. నీ పెళ్ళికి కావలసిన ఖర్చు అంతా నువ్వే సంపాదించుకో. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా పెళ్ళి చేయొచ్చు. అని గట్టిగా చెప్పేసాను. అదీ వాడి ప్రాబ్లం.
ఇక సీరియస్ గా చెప్పుకుంటే. ఈ విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు , అలాగే తల్లితండ్రులు ముగ్గురూ మారాలి. కట్నం ఎందుకివ్వాలి? ఎందుకు తీసుకోవాలి అని ఆలోచించాలి. తల్లితండ్రులలో మార్పు రావడానికి టైం పడుతుంది అందుకే చదువుకున్న యువతీయువకులు కట్నం వద్దు అనే మాటపై గట్టిగా నిలబడాలి. అలా ఎంతమంది ఉంటున్నారు. నాకు పిల్ల నచ్చితె చాలు. డబ్బు సంగతి మా అమ్మానాన్న చూసుకుంటారు. అనే మగమహారాజులు ఎందరో! వాళ్ళని మార్చాలి. ప్రేమపెళ్ళిలైనా కట్నం ఇవ్వాల్సిందే అన్న కుటుంబాలు ఎన్నో. కట్నం వద్దు అన్న అబ్బాయిలు కూడా ఉన్నారు. అలా అన్నప్పుడు అతని తల్లితండ్రులు విసుక్కుంటారు. మరి పెళ్ళిఖర్చులు ఎవరు భరిస్తారు అని.
అసలు కట్నం ఎందుకివ్వాలి. అమ్మాయికైనా, అబ్బాయికైనా అంతే ఖర్చు అవుతుంది. వాళ్ళ చదువులు గట్రా అన్నింటికి . మరి అమ్మాయి ఎందుకు కట్నం ఇచ్చి మొగుడిని కొనుక్కోవాలి. మరి కొనుక్కున వస్తువు తన దగ్గరకు తెచ్చుకోవాలి కదా. అలాకాకుండా తనే అత్తవారింటికి వెళ్తుంది. ఆ కట్నం పెళ్ళిఖర్చులకు వాడుకుంటారు. అంటే రెండువైపులా అమ్మాయి తల్లితండ్రులు ఖర్చు పెట్టాలి. పైగా అబ్బాయిలకు రేట్లు. డిగ్రీ, ఇంజనీర్, డాక్టర్, బిజినెస్, ఇలా ఒక్కోరికి ఒక్కో రేట్ ఫిక్స్ ఐపోయి ఉంటుంది. పెళ్ళిసంబంధం రాగానే , ఎంతవరకు ఉన్నారు అంటారు ముందు. కాని ఈ విషయంలో అబ్బాయిలే తెగించాలి. నాకు కట్నం వద్దు.నేను అమ్ముడుపోను. అనే ఆలోచన వాళ్ళకు కలిగితేనే కాని మార్పు రాదు. అబ్బాయి వద్దన్నా తల్లితండ్రులు తీసుకుంటామంటే అతనే వద్దని గట్టిగా వదించాలి. ఎదిరించాలి. ఆ తెగువ లేకపోతే ఏమీ చేయలేము. అలాగే అమ్మాయిలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా బాగా చదువుకుని , మంచి ఉద్యోగం చేస్తూ,మేము కట్నం ఇవ్వము. కట్నం కావాలంటే మా చుట్టుపక్కల కనపడొద్దు అని చెప్పే ధైర్యం, ఆత్మవిశ్వాసం తెచ్చుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది అబ్బాయిలు, వాళ్ళ తల్లితండ్రులలో మార్పు వస్తుంది. అమ్మాయి కాస్త అందంగా ఉండి, చదువుకున్నదైతే కట్నం వద్దు అంటున్నారు. ఇక ప్రేమించి కూడా కట్నం కావాలనుకునే అబ్బాయిలకు దేహశుద్ధి చేసి వదిలించుకోవాలి తప్ప వాళ్ళ కాళ్ళా వేళ్ళా పడకూడదు అమ్మాయిలు.. అక్కడే వాళ్ళను దెబ్బకొట్టేది, బ్లాక్ మెయిల్ చేసేది ఈ కట్న పిశాచులు.. పైగా ఎవరు ఎక్కువ కట్నం తీసుకుంటే వాళ్ళకు విలువ ఎక్కువ చాలా కుటుంబాలలో. కట్నం తీసుకోకుంటే నామర్దా. అబ్బాయి కట్నం వద్దన్నాడంటే డౌట్లు. కాని ఇవన్నింటికి ఎదురు నిలబడే ధైర్యం అబ్బాయిలలో ముందు రావాలి.
చీ! నన్ను నేను ఎందుకు అమ్ముకోవాలి అని.
26 వ్యాఖ్యలు:
మొత్తానికి ఇప్పట్లో ఈ సమస్య తీరదన్నమాట! కానీ భవిష్యత్తులోకూడా తీరేలా అనిపించడంకూడా లేదు. చాలా మారాలి, చాలా మంది మారాలి..అవి ప్రస్తుతనికి జరిగేవి కావు.హేమిటో..మనమింతే !
:-) Wud be back on this, very soon
నేనూ మీ టైపే ఒక అమ్మాయి ఒక అబ్బాయి
చూడాలి ఈ సమస్యను మా ఆవిడ ఎలా పరిష్కరిస్తుందో :-))
బొల్లోజు బాబా
good thoughts
ప్రతి తల్లీ మీ లాగ ఆలోచిస్తే ఎంత బాగుండో!
ఏమిటో, ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో!
అందరూ మీలానే వాళ్ళ పిల్లలతో ఇలా చర్చిస్తే ఎంత బావుంటుందో జ్యోతిగారూ!! అసలు పేరెంట్సే తమ వెనక ఉంటే అమ్మాయిలు, అబ్బాయిలకు కూడా ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండటం కష్టం కానే కాదు! Very nice to know a dynamic person you!
chala manchi niryam jyothi garu, meela andaru parent katnam vaddu anedaniki kattubadi vunte ee samajam entha bavuntundo kada
aruna
chala manchi nirnayam jyothi garu abinandaneeyulu, prathi parents ila alochisthe samajam thappaka maruthundi, keep it up ...aruna
కట్నం సాంబార్ లాంటిది, అడగక్కర్లేదు. ఇడ్లీ లాంటి అమ్మాయిని ఆర్డర్ చేస్తే,(అదే ఇష్టపడితే) సాంబార్ దానంతటదే వస్తుంది అని. మీరేమో ఉత్త ఇడ్లీనే పెడతానన్నారనుకోండి, నిజంగా ఉత్త ఇడ్లీ తెప్పించుకుని అందరి ముందు తింటూ ఉంటే, వాడి మానసిక లేదా శారీరక స్థితి మీద అనుమానపడతారు. విషయం కాస్త ప్రాక్టికల్గా ఆలోచిస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్త ఇడ్లీనే ఇస్తా అనటం కన్నా, సాంబారు కాకపోయినా ఇడ్లీతో పాటు కాస్త తక్కువ ఖర్చుతో తేలే ఏదో ఒక కందిపొడో, సున్నిపొడో కలిపి ఇవ్వటం ఉత్తమం. మెల్లమెల్లగా పొడి కూడా మాన్పించొచ్చు, ఉన్నపళంగా ఇప్పుడే అంటే, పెళ్ళికొడుకులకి ఇడ్లీ గొంతు దిగదేమో. మార్పుని కాస్త నెమ్మదిగా రానిస్తేనే మంచిది అని నా అభిప్రాయం. :-)
అలాగే, ఆడవాళ్ళకు తండ్రి ఆస్తిలో సమాన హక్కు గురించి మీ అభిప్రాయం ఏమిటి?
చాలా బాగా చెప్పారు జ్యోతి గారు
జ్యోతి గారు చాలా బాగా చెప్పారు.
వికటకవి :) :) nijamea
అమ్మో, ఘోరం జరిగింది. ముఖ్యమయిన రెండు పదాలు మొదట్లో ఎగిరిపోయాయి. జనాలు దండెత్తో లోపు ఇదిగో ఇలా మొదలెట్టి చదువుకోండి, మొదటి వాక్యం.
ఎక్కడో చదివాను.....కట్నం సాంబార్ లాంటిది, అడగక్కర్లేదు....
నమస్తే, చూద్దాం... కాలమే తీర్పు చెప్పుతుందంటారు కదా. అందరకి కొంతలో కొంత firm commitments ఉంటాయి కాని.. కొన్ని పరిస్థితులకు అందరూ ఎదురీద లేరు. నలుగురుతో పాటు నడుచుకోవాలి అంటారు. ఇంతకీ ఆ నలుగురు ఎవరు అనేది.. పెద్ద సమస్య.. ఆ నలుగురు ఎక్కడనుండి వచ్చారు.. మన గుంపు లోనించే కదా.. కాని ఒక్కటి మాత్రం అందరు ఆమోదించాలి.. అది ఏమిటంటే... ప్రేమ పెళ్లి చేసుకొని కట్నం demand చేసే నా కొడుకులను అడ్డంగా నరికేయాలి. ఇక నవ్వొచ్చే విషయం ఏమిటంటే... ఎంతో మంది వేదికల మీద కట్నానికి వ్యతిరేకంగా తెగ ఉపన్యాసాలు ఇచ్చేస్తుంటారు... ఇదొక పెద్ద comedy. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ గుంటూరు లో ఒక సంఘటన... అతనో పెద్ద OFFICER. అమ్మాయిది గుంటూరు. వాడిది విశాఖపట్నం అనుకొంటాను. అనుకొన్న సమయానికి కట్నం వాడి చేతికి అందలేదని.. 8.30 PM కి జరగాల్సిన ఆ పెళ్లి.. తెల్లవారు ఝామున 4.50 కి జరిగింది. కట్నం తీసుకొనే వారి పైన కేసు పెట్టాల్సిన.. ఆ ప్రబుద్దుడే అలా చేస్తే... ఇక సామాన్య మనుషులును ఏరకంగా తప్పుపట్ట గలము?? ఏరకంగా విమర్శించ గలము?? రోజూ TV, NEWS PAPERS ఇప్పటకీ వరకట్న కేసులు, చావులు, దహనాలు... చూడడం... నిజ్జంగా సిగ్గు చేటే.
చర్చ చలా బాగుంది. కాని నా అభిప్రాయం కొంత వెరుగా ఉంది. నాకు ఒక చెల్లి ఉంది. కట్నం ఇవటానికి నెను సిద్దం . అలాగె తిసుకొవటానికి కుడా.
నా తలిదండ్రులు సంపాదించినది మొతం నెను ఒకడినె అనుభవించలి అనుకొను. మా చెల్లికి కుడా బాగం పంచలి. అల అని 50 50 అని చెపను. మాకు తొచిందెదొ ఇచి పంపిస్తాం .
నాకు తెలిసినంతవరకు కట్నం అమాయికి కొంత ఆర్దిక స్వాతంత్రం ఇస్తుందనుకుంటాను.
కాని కట్నం కొసం వెదించటం వెదవలు చెసె పని
నేను కట్నం తీసుకోలేదు. కానీ తీసుకునేవారి పట్ల నాకు ఏ వ్యతిరేక భావమూ లేదు. బలవంతం (పెళ్ళికి ముందు గానీ, పెళ్ళికి తరువాత గానీ) లేకపోతే, కట్నాల వల్ల అమ్మాయికీ, అల్లుడికీ కూడా మంచే జరుగుతుందని నా అభిప్రాయం. నాకు తెలిసిన ఒక ప్రేమ కేసులో "మా నాన్నని వదిలిపెట్టొద్దు. ఇంత అడుగు" అని అమ్మాయి అబ్బాయిని ముందే సిద్ధం చేసిన సంఘటన నాకు బాగా గుర్తుంది.
అందరికి ధన్యవాదములు. నేను మా పిల్లల విషయం చెప్పింది నన్ను మెచ్చుకోవాలని కాదు. మార్పు అనేది ముందు తల్లితండ్రులలో రావాలి. మార్పు అనేది ముందు మన నుండి మొదలుపెట్టి ఇతరులకు చెప్పాలి. ఈ రోజుల్లో పిల్లలతో అన్ని విషయాలు చర్చించాలి. లేకుంటే వాళ్ళకెలా తెలుస్తుంది - ఏది తప్పు ఏది ఒప్పు అని?
వికటకవిగారు, చాలా తొందరగా సర్దుకున్నారు. లేకుంటే మీ మీద దాడి జరిగేది. కాని మార్పుని కాస్త నెమ్మదిగా రానిస్తే మంచిది అంటే ఇంకా ఎంత మెల్లిగా? మరో రెండు తరాలు మారేవరకా. ఐనా ఎందుకు ఎదురుచూడాలి. మనమే ఎందుకు మొదలుపెట్టకూడదు.
నవీన్,
ఆ చట్టం ఉంది కాని ఎంత మందికి ఆస్థిలో సమాన హక్కులు ఇస్తున్నారో మాత్రం నాకు తెలీదు. పెళ్ళి చేసి వదిలించుకున్నాము అనుకుంటారు చాలామంది.
కృష్ణారావుగారు,
నిజమే మీరు చెప్పింది. నాకు తెలిసిన ఒకబ్బాయి 35 ఏళ్ళు. ఐదేళ్ళ నుండి సంబంధాలు చూస్తున్నారు. కట్నం 40-60 లక్షల దగ్గర కూర్చున్నారు అతని తల్లితండ్రులు. అబ్బాయి నెలకు డెబ్బై వేలు సంపాదిస్తున్నాడు. ఐనా ఆశ తగ్గలేదు. తక్కువ తీసుకుంటే లేదా తీసుకోకుంటే బంధువర్గంలో నామోషీ అంట. నేను ఆ అబ్బాయిని బాగా తిట్టా. "సిగ్గులేదా! ఇంత సంపాదిస్తున్నావ్. వయసు మీరిపోతుంది. తల మీద సగం మైదానం ఖాళీ ఐంది. కట్నం కోసం ఎదురుచూస్తున్నావ్. ఇచ్చింది తీసుకోవచ్చుగా. పైగా అమ్మా నాన్న అంటావ్?" అన్నా.
రాజేశ్ గారు,
తాడేపల్లిగారు,
నేను కట్నం తీసుకోవద్దు. అనడంలేదు. అబ్బాయిలకు రేట్లు పెట్టి అమ్ముకోవద్దు అంటున్నాను. అమ్మాయి వాళ్ళు ఇష్టపడి ఇస్తే తీసుకోవాలి. పీడించొద్దు. డబ్బు రూపేనా కాకుండా అమ్మాయి పేరు మీదే ఆ కట్నం డబ్బులు ఉంచితే వాళ్ళకే అవసరమొస్తుంది. అమ్మాయికి కూడా ఆర్ధిక స్వాతంత్ర్యం ఉంటుంది. కొన్ని కులాలలో కోటి రూపాయలు కట్నం, కిలో బంగారం, ఐదు కిలోల వెండి చాలా కామన్. ఇలా అబ్బాయిలకు ధర కట్టడం మంచిదా.
ఇప్పటికే చాలా మంది అమ్మాయిలు తమకు అమెరికా పెళ్ళీకొడుకులు వద్దు అంటున్నారు. అలాగే మాకు కట్నం తీసుకునే అబ్బాయిలొద్దు. మేము పెళ్ళి లేకున్నా ఉండగలం. కావాలంటే పిల్లలను పెంచుకుంటాము అనే రోజు రాకపోదు..
అప్పుడు???
Really good decision Madam. I must appreciate you.
జ్యోతి గారు మీరు చెప్పిన విధానం బావుంది..కానీ నాదొక చిన్న ప్రశ్న వారి సుఖం చూసుకోకుండా తమ సొమ్మునంతా వారి చదువులకు ఖర్చు చేసి కొడుకు అప్పటి వరకు సొంత గూడు లేకపోయినా అగ్గిపెట్టే లాంటి ఇళ్ళళ్ళో కాలం గడిపిన వారు ఆ తరువాత కొడుకు పెళ్ళిలో అన్నా సుఖపడదాము అనుకోవటం తప్పా..అయినా ఎంత మంది అమ్మలు మంచి అత్తలుగా ఉంటున్నారు..వారు ఒకింటి కోడలే అని గుర్తిస్తే కిరోసిన్ చావులు ,గ్యాస్ పేలుళ్ళు ఉండవేమో..
ఇక అమ్మాయిల విషయానికి వస్తే అమెరికా వెళ్ళిన వారే కావాలి ఇప్పుడంటే ఏదో దుస్సంఘటన జరిగింది కాబట్టి వద్దంటున్నారు కానీ లేకపోతే అమెరికా అల్లుడు కావాలని తెగ తిరిగే వారు ..డిమాండ్ ఉన్నప్పుడే పిండుకోవాలి అన్నట్లు వారు ఏంత అడిగితే అంతా ఇచ్చేవారు
అయినా ఇప్పుడు కట్నాలు ఇచ్చే వాళ్ళు తెలివి మీరారు మా అమ్మాయి జాబ్ చేస్తొంది..అని ఏదో పెళ్ళి జరిపించి వారి అమ్మాయికే పెట్టుకుంటున్నారు..
సో ప్రస్తుత రోజుల్లొ కట్నం తీసుకోవటం అమ్ముడు పోవటం కాదు
ఇట్లు
ఓ కట్న అభిమాని
కట్నాల్ని కోరుకునే పురుషులకు ఒక మంచి మాట చెప్పాలనిపిస్తుంది, వారికి నచ్చినా నచ్చకపోయినా !
కట్నం కంటే అమ్మాయి ప్రవర్తన ముఖ్యమైనది. ఒక చెడ్డ ఆడది మూడు తరాల వఱకు నాశనం చెయ్యగలదు. అప్పుడు కట్నం మిమ్మల్నీ, మీ వంశాన్ని రక్షించదు. ఒక మంచి అమ్మాయి సాహచర్యం ఇచ్చే సంతృప్తి పదికోట్ల రూపాయల కట్నం కూడా ఇవ్వదు.
నా అల్పజీవితంలో ఎన్నో చూశాను. అర్థమైనవాడికి అర్థమైనంత మహదేవా !
my understanding of current scenario is different.
With all the education and empowerment of girl child, the parents of telugu grooms are at the receiving end. Grooms are finding it difficult to adjust to the demanding brides
i composed some observations on my blog at http://indyhandy.blogspot.com/
--Cine Valley
me blog chala bagundhe nenu blog create cheale anukuntunna me help naku ela dhorukuthundhi
http://groups.google.com/group/telugublog?pli=1
వెంకట్‍కృష్ణగారు
మీరు తెలుగు బ్లాగు గుంపులో చేరండి. ఎవరైనా మీకు సాయం చేస్తారు..
జ్యోతి గారూ
ఎంతో క్లిష్టమైన సమస్యను చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరు అలొచించాల్సిన తీరు చేసి చూపించారు. ధన్యవాదాలు.
నా బ్లగ్ చూసి, నాకు మీ సూచనలు ఇవ్వగలరా?
http://manaanubhoothulu.blogspot.com
super madam
boledantha dabbu posi mogudni konikkoni vaditho thittinchukovadam, thanninchukovadam, petrol posi thagelenchikovadam avasarama?
Post a Comment