Tuesday, September 23, 2008

చాంగురే బంగారు రాజా!!చాంగురే...చాంగురే బంగారు రాజా

చాంగు చాంగురే బంగారు రాజా
మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే....
అయ్యారే....నీకే మనసియ్యలని వుందిరా
చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా

ముచ్చటైన మొలక మీసముంది
భళా అచ్చమైన సింగపు నడుముంది
జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముంది
మేటి దొరవు అమ్మక చెల్లనీ సాటి ఎవ్వరునుండుట కల్ల
చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా

కైపున్న మచ్చకంటి చూపు
అది చూపు కాదు పచ్చల పిడిబాకు
పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో
గుచ్చుకుంటే తెలుస్తుందిరా..
మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా...
చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా

గుబులుకొనే కోడెవయసు
లెస్స దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
పడుచు దనపు గిలిగింత గడుసు గడుసు పులకింత
ఉండనీయవేమి సేతురాకై దండలేక నిలువలేనురా
చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా

చిత్రం : శ్రీకృష్ణపాండవీయం
గానం : జిక్కి
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం: పెండ్యాల

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>.........

తెలుగు 'వాడి'ని గారు చెప్పిన పాట చూసి నేను ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నాను.
ఈ శ్రీ కృష్ణ పాండవీయం చిత్రంలో జిక్కి పాడింది. రాసింది సినారే . ఇందులో పాట వింటుంటే ఆ పాటలో హీరోయిన్ కాని, హీరో కాని కనిపించరు. ఒక పడుచు పిల్ల తన చెలికాడిలో ఎటువంటి లక్షణాలు ఉండాలో . అటువంటి వీరుడిని చూసిన తర్వాత ఆ కన్నియలో కలిగే వింత వింత కలవరింతలు పులకరింతలు స్పష్టంగా కనిపిస్తాయి.(వినిపిస్తాయి) అలాగే పదాల విరుపులు కూడా భలే ఉన్నాయి. అదే సినారె మాహత్యం ఏమో.మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే....
అయ్యారే....నీకే మనసియ్యలని వుందిరా


తను కలలు కన్న వీరుడు కళ్లెదురుగా కనిపిస్తే ఏ యువతికి మనసియ్యాలని ఉండదు చెప్పండి?? పైగా ఆ వీరుడిని రూప లావణ్యాలు ఎలా వర్ణిస్తుందో చూడండి..


ముచ్చటైన మొలక మీసముంది
భళా అచ్చమైన సింగపు నడుముంది
జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముంది
మేటి దొరవు అమ్మక చెల్లనీ సాటి ఎవ్వరునుండుట కల్ల


ముచ్చటైన మీసముతో, సింహములాంటి ధృఢమైన నడుము కలిగి, బలిష్టమైన శరీరముతో, అందమైన మోముతో అందరిలో దొరలా కనిపించే ఆ పాండవ వీరుడికి సాటి ఎవ్వరు లేరని మురిసిపోతుంది ఆ హిడింబి.. అంతేకాక ...


కైపున్న మచ్చకంటి చూపు
అది చూపు కాదు పచ్చల పిడిబాకు
పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో
గుచ్చుకుంటే తెలుస్తుందిరా..
మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా...


అతని చూపు మత్తెక్కిస్తూ, పచ్చల పిడిబాకులా వాడిగా ఉందంట. అది విచ్చుకున్న పువ్వురేకో లేక పచ్చల పిడిబాకో గుచ్చుకుంటే కాని తెలీదంట. చూసేవాళ్లకు తన బాధ అర్ధం కాదు. ఆ చూపుల బాకు గుచ్చుకున్న తనకే ఆ బాధ అని చెప్పుకుంటుంది ఆ రాక్షస సుందరి. అంత చురుగ్గా, తీక్షణంగా చూస్తున్నాడు భీముడు మరి.

గుబులుకొనే కోడెవయసు
లెస్స దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
పడుచు దనపు గిలిగింత గడుసు గడుసు పులకింత
ఉండనీయవేమి సేతురాకై దండలేక నిలువలేనురా

ఇక్కడ కూడా ఆ హిడింబి ప్రేమ , భీముని చిరాకు , కోపం కంటే పాటలోని పదాల గిలిగింతలు, జిక్కిగారి మెలికలు, విరుపులు ఆ స్వరంలో మత్తు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ పాటలో నర్తించిన నటి కనపడదు. పదాల అల్లిక, విరుపులు, జిక్కి స్వరంలోని గిలిగింతలు తప్ప . పాట చూసిన విన్నా ఒకే అనుభూతి కలుగుతుంది. నటీనటుల అంద చందాలు హావభావాల కంటే పాట అందమే కనిపిస్తుంది. దానికి తోడు పెండ్యాల గారి మధురమైన సంగీతం . అడవిపిల్ల హిడింబి పాడే అచ్చమైన జానపద గీతం ఇది. ప్రతి ఆడపిల్ల ఇలాంటి జతకాడిని కోరుకుంటుందేమో కదా ?

14 వ్యాఖ్యలు:

రమణి

ఏంటి ఈరోజు అందరూ పాటల వాళ్ళు అయిపోతున్నారు?? :) అదీ పాత పాటల తళుకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంచి పాట , జిక్కి పాడే విధానం చాలా బాగుంటుంది.

Purnima

వావ్! ఈ పాట అంటే నాకెంత ఇష్టమో చెప్పద్దూ. అసలిందులో అన్నీ అంతే బాగుంటాయి. నేను సాధారణంగా పాటలు వినడానికే ఇష్టపడతాను కానీ, ఈ పాట మాత్రం కళ్ళార్పకుండా చూస్తాను. ఆ అమ్మాయి నాట్యం వాహ్, వాహ్ ఉంటుంది. తెలుగులోనున్న వయ్యారం ఆమెలోకి అలా దాక్కుందా అనిపిస్తుంది.

మంచి పరిచయం. నెనర్లు!

నిషిగంధ

సూపర్ సాంగ్.. మీరన్నట్లు ఈ పాటలో హీరో హీరోయిన్లు కనబడరు!! పాటలో జిక్కి విరుపులు చాలా బావుంటాయి :-)

సత్యప్రసాద్ అరిపిరాల

ఒక రాక్షసి కన్యకి ఆమె వలచిన రాకుమారుడికి అదీ భీముడికి పాట పెట్టటం ఒక విశేషమైతే, జిక్కిగారి గొంతు, పలుకు, విరుపు సరేసరి. ఇక సినారే సంగతి చెప్పేదేముంది - మజ్జారే, అయ్యారే, మగరేడు, సింగపు నడుము ఇలాంటిమాటలువింటే అది ఖచ్చితంగా అడవిపిల్లే పాడినట్లే లేవూ..? అన్నట్టు చివరి వాక్యంలో 'కైదండలైక వుండలేనురా' అని వుండాలనుకుంటా... కై అంటే చెయ్యి.. చేతులతో దండచేసి మెడలో వెయ్యలేక వుండలేదట హిడింబి. మంచి పాట గుర్తుచేసినందుకు మీకు ఒక వీరతాడు.

సిరిసిరిమువ్వ

మంచి పాట. జిక్కీ గారు పాడిన మత్తైన పాటలలో ఇది ఒకటి. పదాల అల్లికకు తగ్గ విరుపులు.

sujji

Wow.. chakkani pata ni malli gurthu chesaru. chinnappudu tega choosedanni ee patani. ee pata lo, అది చూపు కాదు taravaata, పచ్చల పిడిబాకు ane word koosam chaala rojulu aalochincharata reddy garu. mottaniki , ee pata andariki nachindi aa rojullo... eppatiki kooda..

సుజాత

తెలుగు వాడి ని గారు, మీ కలం మరీ వాడి గా తయారైందండి! మీ వ్యాఖ్యానం చదువుతుంటేనే ఆ పాట ఆ కోయ పిల్ల ఆట కళ్ళముందు కదులుతున్నాయి. సత్య ప్రసాద్ గారు చెప్పినట్టు ఆ మాటల అల్లిక అడవి పిల్ల పాడుతోంది అనే విషయాన్ని గుర్తు చేస్తాయి.

"పచ్చల పిడి బాకో, విచ్చిన పువురేకో...." .ఇది పాటంతటికీ తలమానికమైన లైను. పచ్చల పిడిబాకు గుచ్చుకున్న బాధ మనసుచ్చుకుంటే కానీ తెలియదట! ప్రేమలో పడ్డప్పుడు ఇంతేగా ఎవరి పరిస్థితి అయినా!

తెలుగు వాడిని గారు మీరు ఇలాంటి మంచి పాటలకు వ్యాఖ్యానం రాసి మదర్పిత అభినందనలు స్వీకరించ ప్రార్థన.

సుజాత

జ్యోతి గారు,
ఇప్పుడే మరో సారి తెలుగు వాడిని గారి బ్లాగు చూసి, ఆ పాట ఇంకా మనసులో ఉండగానే మీ బ్లాగు చూసి, పొర పడ్డాను. నిజంగా మీ వ్యాఖ్యానం అదిరి పోయే లెవెల్లో ఉంది. పైన నేను రాసిన అభినందలన్నీ మీరే తీసేసుకోండి మరి! మరిన్ని మంచి కత్తి లాంటి పాటలు అందించాలని డిమాండ్ చేస్తున్నా!

కత్తి మహేష్ కుమార్

బాగుందోచ్! నాకు నచ్చిన సినిమా..మెచ్చ్చిన పాటలు.

బొల్లోజు బాబా

"పచ్చల పిడి బాకో, విచ్చిన పువురేకో
అనే వాక్యం చాలా హాంటింగా ఉంటుంది. అటు సాహిత్య పరంగా, ఇటు జిక్కి గారి విరుపులతోనూ.

మంచి పోస్టు.

బొల్లోజు బాబా

వేణూ శ్రీకాంత్

చాలా మంచి పాటని గుర్తు చేసారు జ్యోతి గారు.

krishna rao jallipalli

జిక్కి గారు పాడ బట్టే ఆ పాటకి అంత అందం.. అలాగే జమునా రాణి గారు పాడిన పాట ' మావా మావా...'... ఇవన్ని చిరకాలం గుర్తుండే పాటలు.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి

ఈ సందడి చూస్తుంటే జిక్కి పాటల క్యాసెట్ల కోసం వైజాగులో నేను పడ్డపాట్లు ఒక్క టపా రాయాలనిపిస్తుంది :)

యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ

తెలుగులో నాకు నచ్చిన అత్యుత్తమ శృంగారభరిత గీతాలు..వరుసక్రమంలో..
1. ఛాంగురే బంగారు రాజా...
2. ఛాంగురే బంగారు రాజా...
3. ఛాంగురే బంగారు రాజా...
4. ఛాంగురే బంగారు రాజా...
5. ఛాంగురే బంగారు రాజా...
6. ఛాంగురే బంగారు రాజా...
7. ఛాంగురే బంగారు రాజా...
8. ఛాంగురే బంగారు రాజా...
9. ఛాంగురే బంగారు రాజా...
10.ఛాంగురే బంగారు రాజా...

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008