ఈ ప్రకృతి మన కోసమే
ఉదయాన్నే లేలేత భానుడి కిరణాల స్పర్శ తనువంతా ఎంత ఉత్తేజం నింపుతుందో కదా! అలసిన శరీరాన్ని, మనసుని నిన్నటి రేయి తన మాయాజాలంతో మటుమాయం చేస్తే.. కొంగొత్త ఉత్సాహం నరనరానా నిండేలా సూర్యోదయం అందించే అనుభూతిని వర్ణించడానికి మాటలు తమ వల్ల కాదంటూ చేతులెత్తేయవూ..? వెన్నెల రాత్రులూ స్పందించే హృదయాలను ఎంత మైమరిపింపజేస్తాయో కదా! కలత చెందిన మనసూ, అలా వెన్నెల వైపు చూస్తే క్షణాల్లో స్వాంతన లభించడం కొందరికి అనుభవైకవేద్యమే. అంతెందుకు పూలకుండీలో విచ్చుకున్న గులాబీ కూడా మనకోసమే ఎదురు చూస్తున్నట్లు చిరునవ్వుతో పలకరిస్తుంటే అదేమీ పట్టనట్లు సాగిపోతే ఆ బాధతో అది ముడుచుకుపోదూ..? గుబురుగా పెరిగిన పిచ్చి మొక్కల్ని చూడండి... అవి ఏ రకంగానూ మనకు ఉపయోగపడకపోయినా తమ పచ్చదనంతో మనలో ఆశల్ని చిగురిస్తాయి. ప్రకృతి ఎప్పుడూ మనల్ని వెన్నంటే ఉంటోంది... కానీ దాన్ని ఆస్వాదించగలిగే రసహృదయమే మనిషిలో కొరవడుతోంది. జీవితంతో పోరాడడానికి మనసుని రాయిచేసుకుని సహజస్పందనలను నిర్ధాక్షిణ్యంగా తొక్కిపెట్టే మనకు ప్రకృతి గురించి ఆలోచించే తీరికెక్కడిది. మన బాధలను, బడలికలను ఉపశమింపజేయడానికి అది స్నేహహస్తం దాచినా అందుకునే మనసెక్కడుంది మనలో! ఇరుకు గదుల్లో, ఏసి చల్లదనానికి అలవాటు పడిన ప్రాణం శీతాకాలపు సహజసిద్ధమైన చల్లదనంలో ఉన్న స్వచ్ఛతని ఎక్కడ గుర్తించగలుగుతుంది? జీవించడానికి, జీవితంలో మన ఉనికిని నిలబెట్టుకోవడానికి పరిగెడుతున్నాం మనం! ఆ హడావుడిలో ప్రకృతిని ఆస్వాదించగలిగే తీరుబడి కూడానా! అలా కుండీ నుండి పరిమళాలను వెదజల్లే మల్లె వాసనల్ని ఆఘ్రాణించవచ్చునన్న ఆలోచనే మనకెప్పుడూ కలగదు. పచ్చదనాన్ని నింపుతూ అల్లుకున్న మనీప్లాంట్ ని చూడమంటే .. "ఇంకేం పనిలేదా" అని మొహం చిట్లించుకుని మన పనిలో పడిపోయే బాపతు మనం! ఇంకెక్కడి రసాస్వాదన? ఈ ప్రకృతి మన కోసమే, మనతో మమేకమై ఉంది. ఈ బిజీ జీవితాల్లో దాని విలువని మనం గుర్తించలేకపోతున్నాం. ఇంటి ముందు చిన్నపాటి గార్డెన్ ఉన్నా దాన్ని పెకలించి మరో గది వేసి ధనార్జన చేద్దామన్న స్వార్ధం మనల్ని కమ్ముకుంటోంది. మనకు ఆహ్లాదం పంచడానికే పచ్చదనాన్ని కప్పుకుని సింగారించుకునే మొక్కలే కాదు సూర్యోదయపు కిరణాల స్పర్శా, చంద్రుడి వెన్నెలా.. చల్లదనంతో గమ్మత్తైన అనుభూతిని కలిగించే మంచుబిందువులు, వర్షపు చినుకులూ.. కిలకిలమంటూ పలకరించే పిట్టలూ, ఏవీ మనల్ని కదిలించలేకపోతున్నాయి. మన చుట్టూ అదో ప్రపంచం ఉందన్న విషయమే ఎప్పుడో బాల్యంలోనే మర్చిపోయాం. మన పలకరింపు కోసం ఆర్తితో చూసే ప్రకృతిని ఆస్వాదిస్తే బాగుంటుంది కదా!!
మీ
నల్లమోతు శ్రీధర్.
3 వ్యాఖ్యలు:
బావుంది ప్రకృతి తన సందేసాన్ని మీ ద్వారా పంపినట్టుంది
మనం నిర్లక్ష్యంగా వదిలేసిన చిన్న చిన్న ఆనందాలనే ఒక కవి లేదా ఒకచిత్రకారుడు తనఫ్రేం లో బంధించి అమ్మకానికి పెడితే కొనుక్కోడానికి క్యూ కడతాం . సూర్యోదయం ,సూర్యాస్తమయం ఆ భగవంతుడు మనకు ప్రేమతో చెప్పే శుభోదయం ,శుభరాత్రి సందేసాలు . వాటిని అందుకోడానికి మనకు టైం కుదరడంలేదే . మనం మన శరీరాన్ని మనసుని ప్రకృతి సందేసాల్ని అందుకునేందుకు సిద్ధం చేయాలేగాని మనల్ని రీచార్జ్ చేసిమనలో కొత్త వుత్సహాన్ని నింపటానికి మనచుట్టూ అణువణువునా తన సౌందర్యాన్ని నింపి మన ప్రతిస్పందనకోసం ఆత్రంగా ఎదుచూస్తుంది ప్రకృతి . దానిని నిర్లక్ష్యం చేయడమంటే దేవుడు మనకు పంపిన బహుమతిని వద్దు పొమ్మనటమే
ఏంటో వుదయాన్నే ప్రకృతి ని చూడగానే ఆగలేక వాగేసాను . ఎక్కువైతే క్షమించండి
లలిత గారు, "చిత్రకారుడు ఫ్రేంలో బంధించి అమ్మకానికి పెడితే" అన్నది బాగా చెప్పారు. మనం ప్రకృతిలో ఆనందం చూడడం మానేసి కృత్రిమతలో దాన్ని వెదుక్కుంటున్నాం. మీ కామెంట్ చాలా బాగుంది. నేనూ ఓ చక్కటి ఉదయాన్ని చూసి ఉత్తేజం పొంది రాసినదే ఈ ఎడిటోరియల్. ప్రకృతి గురించి ఎంత రాసినా తక్కువే.. ఇంకా క్షమించండి అంటున్నారు. :)
పచ్చదనం, పరిశుభ్రం గురించి చినంప్పుడు చదువుకున్నాము,. మీకు వీలయితే ఒక చిన్న మొక్కని నాటి చూడండి అంటూనో, లేక ఉన్న మొక్కలని మన సొంత పిల్లలా చూసుకోమనో.. కాల క్రమేణా పచ్చదనం పోయి కాంక్ర్రిటుతనం వచ్చేసింది. ప్రకృతి ని ప్రత్యక్షంగా ఆస్వాదించలేక, ఇరుకుగదుల్లో కృత్రిమత్వానికి అలావాటు పడిపోయి, ఆస్పత్రి పాలై ప్రకృతి చికిత్స చేయించుకొంటున్నవాళ్ళెందరో.
ఉదయాన్నే లేచి పచ్చని చెట్లని చూద్దామని తలుపు తీస్తే పక్కింటి వాళ్ళ మూసిన తలుపులు కనపడే అపార్ట్మెంట్ సంస్కారం మనది. ఇక ప్రకృతి గురించి, పచ్చదనం గురించి మనమెవరికి చెప్పగలము? ఇంటి ముందు తులసి మొక్కని చూసి "ఇదేమి మొక్క ఆంటీ?" అని అడిగిన వాళ్ళని చూసి ఆశ్చర్యంగా అవాక్కవడం తప్పితే.
Post a Comment