Saturday 3 January 2009

కత్తితో ... జ్యోతి - 2


మొదటి భాగం చదివారుగా..

జ్యోతి : రోజుల్లో సర్వసాధారణమైన ఈవ్ టీజింగ్ కి కారణాలు,వాటికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయంటారా? మీరు ఎక్కడైనా మహిళలను వేదించే సన్నివేశం చూస్తే ఎం చేస్తారు?

మహేశ్ : ఈవ్ టీజింగ్ గురించి చాలా విశదంగా నేను రెండు భాగాల్లో ఒక టపా రాసాను. అందుకో నాకు తెలిసిన కొన్ని కారణాలను ఆధారాలతో సహా తెలిపాను నేను ఎక్కడైనా ఈవ్ టీజింగ్ చూస్తే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాను.


జ్యోతి: ప్రేమ వివాహం , పెద్దలు కుదిర్చిన వివాహం.. ఏది మంచిది అంటారు? పిల్లలకు మంచి కుటుంబం నుండి సంబంధాలు చూసి పెళ్లి చేయాలనుకోవడం తల్లితండ్రులు ఆశించడం తప్పా?

మహేశ్ : ప్రేమ వివాహంలోనైనా కుదిర్చిన వివాహంలోనైనా, ప్రేముండేంతవరకూ రెండూ మంచివే రెండూ సఫలమే. తల్లిదండ్రులు family suitability కన్నా అబ్బాయీ-అమ్మాయిల compatibility పై శ్రద్ద పెట్టినంతవరకూ ఖచ్చితంగా అధికారముంది. పిల్లల అంగీకారంతో పెళ్ళిజరిపేంతవరకూ హక్కుకూడా ఉంది. బలవంతపు పెళ్ళిల్లూ, బ్లాక్ మెయిలింగ్ పెళ్ళిళ్ళూ జరపనంతవరకూ పిల్లల పెళ్ళిళ్ళపై సర్వహక్కులూ ఉన్నాయి, ఉంటాయి. కానీ, దాన్ని మీరితే తల్లిదండ్రులకన్నా పిల్లలు వ్యక్తులుగా తమకుతాము ముఖ్యులమన్న సత్యానికే నా ప్రాధాన్యత.



జ్యోతి : మీకు సినిమాలు అంటే చాలా ఇష్టం కదా. మరి మీకు నచ్చిన సినిమా ???

మహేశ్ : ఒక సినిమా అని లేదు. నచ్చిన సినిమాలున్నాయి కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. తెలుగు,తమిళ్,మళయాళం,కన్నడ,హిందీ,బెంగాలీ,ఇంగ్లీష్, జపనీస్,చైనీస్,కొరియన్,ఇరానియన్ ఇలా నాకు ఇష్టమైన సినిమాలు భాషాప్రాంతీయభేధం లేకుండా ఉన్నాయి. లిస్టు చెప్పడం మొదలయితే మొత్తం టపా స్పేస్ ఆక్రమించేస్తాయి. దాంతోపాటూ అవి నాకెందుకు నచ్చాయో చెప్పకుండా వొదలనుకాబట్టి, ప్రస్తుతానికి ఇంతటితో వదిలెయ్యండి.



జ్యోతి : మన దేశరాజకీయాల మీద మీ అభిప్రాయం? మనకు ఇంతకంటే మంచి నాయకులు దొరికే అవకాశం లేదా? నిజాయితీగా మనను పాలించే ప్రభుత్వ ప్రతినిధులను మనం ఎన్నుకోగలమా?? అలాంటి వ్యక్తులు ఉన్నారా?

మహేశ్ : నా ఉద్దేశంలో రాజకీయం ఇలా తయారవ్వడానికి కారణాలు రెండు. ఒకటి ఎన్నికల విధానం. రెండవది, స్వల్పకాలిక లాభాలుతప్ప దీర్ఘకాలిక ప్రయోజనాల్ని అర్థం చేసుకోలేని ప్రజలు. ఒకవైపు పరిణితిలేని వ్యవస్థ మరోవైపు పరిపక్వత లేని ప్రజలు. రెండువైపులా సమస్యాత్మకంగా ఉండటంవలనే మన రాజకీయం ఇలా తగలడింది. అందుకే నాయకత్వంకన్నా విధానం ముఖ్యమైన రాజకీయాలు కావాలి. ఈ విధంగా చూస్తే లోక్ సత్తా మీద నాకు మంచి నమ్మకం. గెలుస్తుందన్న విశ్వాసం లేకపోయినా గెలిస్తే రాజకీయాల్ని సమూలంగా మార్చగల సత్తా లోక్ సత్తా విధానాలకుంది.


జ్యోతి : కొన్నేళ్ల క్రిందటి మహిళలు, ఆధునిక మహిళల మీద మీ అభిప్రాయం. అప్పటికి , ఇప్పటికి వాళ్లు మారారా? మారుతున్నారా? వైవాహిక జీవితంలో ఒడిదుడుకులకు ఎవరు బాధ్యులు? స్త్రీయా పురుషుడా? నేటి మహిళపై మీ అభిప్రాయం? ఎలా ఉండాలి అనుకుంటారు?

మహేశ్ : పాతతరమైనా కొత్తతరమైనా మహిళల్లో మార్పొచ్చినా మహిళల సామాజిక స్థితిలో రావాల్సినంత మార్పు రావటం లేదని నాకు అనిపిస్తుంది. ఇక్కడ సమస్య కాలానుగుణంగా (మహిళల విషయంలో) మారని సమాజానిదేతప్ప స్త్రీలది కాదని గుర్తించాలి. ముఖ్యంగా మగాడు ఈ మార్పుని హృదయపూర్వకంగా అంగీకరించేలా తయారవనంతకాలం ఒకడుగు ముందుకైతే రెండడుగులు వెనక్కు ఛందంగా పరిస్థితి కొనసాగుతుంది.

పెళ్ళి శాంతీయుతంగా విజయవంతంగా కొనసాగాలంటే ఆడామగా ఇద్దరి బాధ్యతా ఉంది. ఎవరిబాధ్యత ఎక్కువ అంటే ఎవరెక్కువ తీసుకుంటే వారిదని చెప్పాలేగానీ ఇటు ఆడవారిదో లేక అటు మగవారిదో అనిచెప్పే సమాధానం కాదిది.
ఆధునిక మహిళ "ఆధునికంగా" ఉండాలి. అలా మానసికంగా ఆధునికత సంతరించుకోకుండా, పైపై మెరుగులు దిద్దుకుంన్నంత మాత్రానా ఎవరూ ఆధునిక మహిళ కాలేరని గుర్తించాలి.



జ్యోతి : ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకునే సందర్భాలలో ఎవరిది తప్పు? ఇటువంటి సమస్య ఉన్నవాళ్లు మనకు తెలిసినవాళ్లు అయితే మనమే విధంగా పరిష్కరించగలం?

మహేశ్ : ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకున్నోళ్ళదే. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రేమ జీవితంలో ఒక భాగమేగానీ జీవితం కాదు. మరిన్ని ప్రేమలకు ఆస్కారమున్న జీవితాన్ని ఒక్క ప్రేమ కోసం వదిలేసుకోవడం మూర్ఖత్వంకాక మరేమిటి? ఆత్మహత్య ఒక క్షణికమైన ఆవేశంలో జరిగే ఘటన. ఆ క్షణాన మనం ఆ వ్యక్తుల్ని ఆపగలిగి కొంత విషయాన్ని practical గా చర్చించగలిగితే వారు ఆ ఆలోచనను మానుకుంటారనుకుంటాను.


జ్యోతి : మీ బ్లాగులో మీకు ఎక్కువగా నచ్చిన టపాలు. నచ్చిన బ్లాగులు, టపాలు ఏవి??కాస్త చెప్తారా?

మహేశ్ : నా టపాలన్నీ నాకు ఇష్టమైనవే. లేకుంటే అసలు రాయనుకదా! ఇక నచ్చిన ఇతర బ్లాగు టపాలంటారా...ఘాటైన వ్యాఖ్యలు చేసేవీ అభినందనలతో ఆస్వాదించేవీ అన్నీ నాకు నచ్చినవే ఉంటాయి..అటోఇటో. నచ్చిన బ్లాగులు కూడా చాలానే ఉన్నాయి వాటిల్లో కొన్ని మనసులోమాట, కలగూరగంప, అబ్రకదబ్ర గారి తెలుగోడు, స్నేహమా , బాబాగారి కవితల సాహితీ-యానం , రెండురెళ్ళ ఆరు ఇంకా చాలా ఉన్నాయి.



జ్యోతి : టెర్రరిస్ట్ అంటే ఎవరు? నక్సలైట్ల సమస్య ఎప్పటికైనా తీరుతుందా??

మహేశ్ : టెర్రర్ ని స్టృష్టించే ప్రతి వాడూ టెర్రరిస్టే. అందులో ఏమీ తేడా లేదు. అది మతం పేరుతో జరిగినా, కులం పేరుతో జరిగినా,ఆర్థిక-సామాజిక-రాజకీయ కారణాలతో జరిగినా జనసామాన్యాన్ని భయభ్రాంతుల్ని చేసే ప్రతిచర్యా టెర్రరిజమే. నక్సలిజం తన సైద్ధాంతిక మూలాల్ని మరిచి చాలా దూరానికి వెళ్ళిపోయింది. నక్సలిజం సమాధానాలు చూపడానికి బయల్దేరిన సమస్యల్లో ఇప్పుడు అదొకటిగా మారింది.కాబట్టి అది తీరదు..ఆ సమస్యని మనమే తీర్చాలి.



జ్యోతి : మీరు చెప్పే విషయాలు నిజజీవితంలో పాటిస్తారా? నిజాయితీగా ఉంటారా? లంచం గట్రా ఇచ్చి పని చేయించుకుంటారా?

మహేశ్ : జీవితంలో వీలైనంత నిజాయితీగానే ఉంటాను. డైరెక్టుగా లంచం ఇవ్వలేదుగానీ, influence ఉపయోగించిన సందర్భాలున్నాయి. ఇక నేను చెప్పే విషయాల్లో కొన్ని ఆలోచనలుంటాయి, కొన్ని అభిప్రాయాలుంటాయి, చాలావరకూ నా జీవితంలో పాటించాకే చెబుతాను.ఇతరుల సమ్మతికోసం నేను జీవించడం లేదు. నాకిష్టమొచ్చినట్లు నేను బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను. నా జీవితానికి సంబంధించినవారికి అవి అర్థమయ్యేలా చెప్పవలసిన బాధ్యత నాకుంది. ఆ పని మాత్రం ఖచ్చితంగా చేస్తాను.


జ్యోతి : మీ టపాలు , వ్యాఖ్యలు చూస్తుంటే ఎప్పుడు రఫ్ అండ్ టఫ్ గా ఉంటారనిపిస్తుంది. సెంటిమెంట్స్ అంటూ ఉండవా? ఇతరుల మనసు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారా? ముఖ్యంగా మీ అమ్మ, మీ ఆవిడ గురించి.

మహేశ్ : నేను కరుగ్గా వుండను. ఖచ్చితంగా ఉంటాను. ఇలా వుండటానికీ అనుభూతులు లేకుండా ఉండటానికీ అసలు లంకే లేదు. నాకంటూ కొన్ని ఆలోచనలున్నాయి కాబట్టే అదే రీతిలో నా అనుభూతులుంటాయే తప్ప అవేవీ లేని మోడుని కాను. మనసుల్ని అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒక్కోసారి మనుషులు కూడా అర్థం కారు. అదే జీవితం.


జ్యోతి : మహేష్ గారు మీ వృత్తిలో బిజీగా ఉన్నా మాకోసం సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు.

మహేశ్ : మీకు కూడా ధన్యవాదాలు..


నా ఈ ప్రయత్నం సఫలం అయ్యిందనుకుంటున్నాను. కాని ఇది చర్చలా కాకుండా ప్రశ్నలు, జవాబులు శీర్షికల కూడా అనిపిస్తుంది కదా. మొదటిసారి కదా. నేను ఎన్నిసార్లు మహేష్ తో వాదించాలని చూసినా అలా చేయలేకపోయాను. ఎందుకంటే అతను చెప్పిన ఎన్నో విషయాలు నేను అంగీరిస్తాను కాబట్టి. అసలు సంగతి ఏంటంటే మహేష్ టపాలు అన్నింటిని నేను చదవలేదు. ఈ చర్చాకార్యక్రమం కోసం కొన్ని టపాలు తిరగేశాను. ఆ ఆధారం మీద నా ప్రశ్నలు తయారు చేసుకున్నాను.

ఈ పిచ్చాపాT ని ప్రతినెల నిర్వహించాలని కోరిక. శాయశక్తులా ప్రయత్నిస్తాను. అందుకే ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక రోజు కాకుండా, ప్రతినెల మొదటి ఆదివారం తప్పకుండా ప్రచురిస్తాను. వచ్చే నెల మొదటి ఆదివారం కోసం ఎదురు చూస్తారుగా.

వచ్చే నెల అతిథి .. ఒక గృహిణి..

14 వ్యాఖ్యలు:

ఓ బ్రమ్మీ

హతోస్మీ.. మరోనెల ఆగాలా? ఎందుకలా? పక్షానికి ఒకొక్కళ్ళను ఇలా రెండు తడవలుగా తుంటర్వూ చేస్తే ఎలా ఉంటుంది?

మధురవాణి

జ్యోతి గారూ..
మీ చర్చా కార్యక్రమం నిజంగా కత్తి లాంటి ఐడియా అండీ..
మొదలెట్టడం కూడా కత్తి గారితోనే.. :)
చాలా మంది కొత్త వారు చదువుతూ ఉంటారు కదా.. అందరికీ అందరు బ్లాగరుల గురించీ పూర్తిగా తెలిదుకదా..! మీరు చేస్తున్న ఇలాంటి పరిచయాలు, చర్చల వల్ల ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉంది.
ఇంత చక్కటి ఆలోచనతో ముందుకొచ్చినందుకు మీకు అభినందనలు.
కానీ.. ఒకటే బాలేదు :( నెల రోజుల దాకా ఎదురు చూడాలా అయితే మేము :(

Bolloju Baba

ఇది మన మహేషూ, మన జ్యోతీ చేసిన ఇంటర్వ్యూ లా లేదు. ఎక్కడో నేషనల్ లేదా ఇంటర్నేషనల్ పత్రికలో చదువుతున్నట్లుగా ఉంది.

ఉదాహరణకు ఈ వాఖ్య చూడండి. సరళంగా కనిపిస్తూ ఎంత లోతుగా ఉందో.....

మనసుల్ని అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒక్కోసారి మనుషులు కూడా అర్థం కారు. అదే జీవితం.

అభినందనలతో

Purnima

నిజమే! చాలా బాగుంది. ప్రశ్నలకు తగ్గ జవాబులు!

అభినందనలు!

Icanoclast

మరిన్ని ప్రేమలకు ఆస్కారమున్న జీవితాన్ని ఒక్క ప్రేమ కోసం వదిలేసుకోవడం మూర్ఖత్వంకాక మరేమిటి?

Excellent. Thinking over the same.

వేణూశ్రీకాంత్

చాలా బాగుంది జ్యోతి గారు.

రాధిక

Excellent."ఒక్క ప్రేమ కోసం జీవితాన్ని వదిలేసుకోవడం మూర్ఖత్వంకాక మరేమిటి?" agree with u sir.

సుజాత వేల్పూరి

జ్యోతి గారు,
బాబా గారు చెప్పినట్టు ఇది జ్యోతి గారు చేసిన ఇంటర్వ్యూ లాగా లేదు. అనుభవజ్ఞుడైన ఒక సీనియర్ రిపోర్టరు చేసినట్లుంది. మంచి ప్రశ్నలు వేసి ఆసక్తి కరమైన సమాధానాలు రాబట్టారు.

సిరిసిరిమువ్వ

జ్యోతి గారు, మహేష్ గారు, మీ ఇద్దరికి అభినందనలు. ప్రశ్నలు ఎంత బాగున్నాయో సమాధానాలూ అంత చక్కగా హుందాగా ఉన్నాయి.

మహేష్ గారు, మీ ఆలోచనల మీద మీ నమ్మకాల మీద మీకున్న నమ్మకానికి అభినందనలు.

"నేను కరుగ్గా వుండను. ఖచ్చితంగా ఉంటాను. ఇలా వుండటానికీ అనుభూతులు లేకుండా ఉండటానికీ అసలు లంకే లేదు"

"మనసుల్ని అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒక్కోసారి మనుషులు కూడా అర్థం కారు. అదే జీవితం."

భలే చెప్పారు!

జ్యోతి

hmmm.. ఈ ప్రయత్నం విజయవంతమైనందుకు సంతోషంగా ఉంది. అసలే మహేష్ బ్లాగులోని అన్ని టపాలు చదవే అలవాటు లేదు.ఎలా చేసానో అని బెరుకుగా ఉండింది..

చక్రవర్తిగారు,
ఇది టపా రాసినంత సులువు కాదు. నెలకొక్కటి చేస్తేనే చాలా గొప్ప. నేను అడిగే ప్రశ్నలకు నిక్కచ్చిగా సమాధానం చెప్పాలి. ముందు ఒకమాట. నా వెనుక ఒక మాట చెప్పేవాళ్లంటే నాకసహ్యం. అందుకే అలాంటివాళ్లతోనే నా తదుపరి చర్చలు ఉంటాయి.

Kathi Mahesh Kumar

నేను ఇంటర్వ్యూ చేయించుకునే స్థాయికితగ్గ పనులు చేసానని ఎప్పుడూ అనుకోలేదు. జ్యోతిగారు అడిగేసరికీ "అవసరమా?" అనిపించింది.జ్యోతిగారే "నీ బ్లాగు గురించీ,నీ వ్యాఖ్యల గురించీ అడుగుతాను" అనే సరికీ, "అంతేకదా!" అనుకుని ఇలా కానిచ్చేసాను.కాబట్టి ఈ 'పిచ్చాపాT'క్రెడిట్ జ్యోతిగారిది.నేను వారడిగిందానికి కేవలం సమాధానాలే ఇచ్చాను.

పరిమళం

జ్యోతి గారూ!చాలా చాలా బాగుంది మీకు,మహేష్ గారికీ అభినందనలు.తదుపరి ఇంటర్వ్యూ కోసం ఇంకా నెల రోజుల దాకా ఎదురు చూడాలా ?hmmm....అదే జీవితం :)

మేధ

బావుంది... ఏంటో అస్సలు 'పిచ్చాపాT' లా లేదు! ఏదో కాశ్మీర్ సమస్య పై భారత్-పాకిస్తాన్ చర్చించుకున్నంత ఘాటుగా ఉంది..!!
Just kidding.. :))

Ramani Rao

నిజమే! చాలా బాగుంది. ప్రశ్నలకు తగ్గ జవాబులు!

అభినందనలు!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008