Saturday 7 February 2009

మాతృహృదయం

ఓ తల్లి బిడ్డల పట్ల చూపించే మమకారం చవిచూసినప్పుడు ఈ ప్రపంచంలో నిర్వచనాలకు దొరకని అత్యుత్తమమైన బంధం తల్లీబిడ్డలదేననిపిస్తుంది. బిడ్డలను లాలిస్తూ, చిన్న విషయాలకే కలతపడే పసి హృదయాలను ఊరడిస్తూ, కధలు చెబుతూ, వారి బుల్లి మనసులోకి తాదాత్మ్యం చెంది సర్వస్వం వారే తానై బ్రతికే మాతృమూర్తిని చూస్తే.. సృష్టిలోని కరుణంతా తల్లి మనసులో ఒలకబోశాడా భగవంతుడు అన్న మధురమైన భావన కలుగుతుంది. బిడ్డలను తన మీద తన కన్నా ఎక్కువ మక్కువతో అక్కున చేర్చుకుని సాకే తల్లి అనుక్షణం వారి బాగోగులకు పడే ఆరాటం అనిర్వచనీయమైన అనుభూతికి లోను చేస్తుంది. సందేహమే లేదు. సాధారణ మనుషుల్లో దైవత్వం అంటూ ఎక్కడైనా ప్రతిష్టించబడి ఉందీ అంటే అది మాతృహృదయన్లోనే ! సామాజికంగానూ , కుటుంబపరంగానూ ఎన్నో వత్తిడులను పంటి బిగువునా భరిస్తూ కూడా మాతృమూర్తులు బిడ్డను ఉన్నతంగా పెంచాలని పడే కష్టంలోనూ, పసిబిడ్డల బోసినవ్వుల్ని మనసారా ఆస్వాదిస్తూ తమ వ్యధల్ని మైమరిచే సందర్భాలనూ చూస్తే ఆ మాతృమూర్తుల ఔన్నత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.. కానీ తల్లుల ఆరాటం గమనించేటంత తీరుబడి మనకెక్కడ ఉంది? అందరూ బిడ్డలను కనట్లేదా?.. ఇందులో ప్రత్యేకత ఏముంది.. అనుకుంటూ తల్లీబిడ్డల అనుబంధాన్ని చాలా తేలికగా తీసుకోవడం పరిపాటైపోయింది. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. తన అనుకున్న బిడ్డ కోసం తల్లి మనసు పడే తపనని పరిశీలించి, దాన్ని మన మనసులోకి స్వీకరిస్తే ఇతర సామాజిక బంధాల్లో అదే స్థాయి మానవత్వం ఎంతో కొంత చూపించగల సున్నితత్వం, ఆత్మీయభావన మళ్లీ మనం పొందగలుగుతాము. మనిషిగా పుట్టిన తర్వాత ఆర్ధికంగా, సామాజికంగా ఎదగడమే ముఖ్యం కాదు. అన్నింటికన్నా... మనిషిగా మన వంతు ముద్రని నిలుపుకోవడం అత్యంత ప్రధానమైనది. ఇలాంటి అద్భుతమైన గుణాలు నేర్చుకోవడానికి మాతృహృదయాల్ని మించిన బంధం ఏదీ లేదు.. "బాబూ.. బాగున్నావా..." అంటూ ముసలవ్వ ఆర్తితో అడిగే ప్రశ్నలోనూ జీవితకాలంపాటు గుర్తుంచుకోదగ్గ ఆత్మీయత దాగి ఉంటుంది. 'ఇవన్నీ చిన్న చిన్న విషయాలు.. ఏమున్నాయి వీటి ప్రత్యేకతలు' అనుకుంటూ నిబ్బళంగా సాగిపోయామంటే మనలో స్పందించే హృదయం ముడుచుకుపోయినట్లే! మాతృమూర్తి గురించి పాటలు, కథలు, కవితలు చదివినప్పుడు మనసు పులకరించిపోతుంది. చివరకు అదే మాతృమూర్తి 'బువ్వ తిన్నావా బిడ్డా' అని మన క్షేమం కోరితే కసురుకుని 'నీకెందుకే' అని సాగిపోయేలా తయారైపోయాం. మనం ఎంత గాయపరిచినా 'పిచ్చి వెదవ... ఎలా బ్రతుకుతాడో; అని మనసులో దిగులు పెంచుకుని కుంగిపోయే పాటి విశాల హృదయం తల్లికే ఉంది. మన అమ్మ మాత్రమే కాదు. మహిళల్లో సహజసిద్ధంగా కన్పించే ఆ మమకారాన్ని చవి చూస్తే మహిళామణులకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. నా చిన్నతనంలో గతించిన జ్ఞాపకమైన నా తల్లిని తలుచుకుంటూ అనుక్షణం కన్పించే మాతృహృదయాల ఔన్నత్యాన్ని మనసులో నింపుకుని...

మీ
నల్లమోతు శ్రీధర్

8 వ్యాఖ్యలు:

శ్రీనివాస్ పప్పు

"శిఖామణీ"నీ రాతకు నా జోహార్లు..

durgeswara

yaadEvee sarava bhootEShu maatru roopEna samsthitaa

namastasyai namastasyai namstasyai namo namah

కొత్త పాళీ

Beautiful Sridhar.

Unknown

శ్రీనివాస్ పప్పు గారు, దుర్గేశ్వరరావు గారు, కొత్త పాళీ గారు ధన్యవాదాలు.

రాజ మల్లేశ్వర్ కొల్లి

Awesome..!!

సుభద్ర

super.

కెక్యూబ్ వర్మ

maathru hrudayaanni aavishkarinchaaru. dhanyavaadaalu

రమణ

ఈ అనుభూతి ని మాటల్లో వర్ణించలేను శ్రీధర్ గారు. ధన్యవాదాలు.
'అమ్మ ' గురించి ఎవరు ఎంతగా చెప్పినా తక్కువే

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008