Friday, April 17, 2009

వ్యాపార ప్రకటనల వింత గోల...

" రాజుగారు !! బావున్నారా??"
"ఓ! పేరయ్యగారా ! రండి రండి!!. ఎలా ఉన్నారు? మీ వృత్తి ఎలా ఉంది ?సీజన్ కదా ఫుల్ బిజీ అనుకుంటా?"
" ఏం బిజీ అండి ! అదేంటొ! ఈ మధ్య ఎవరూ నన్ను పిలవడం లేదు. నేనే వెళ్లి అడిగినా మొహం చిరాగ్గా పెట్టి తర్వాత రండి అంటున్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. ఏమైందో అర్ధం కావట్లేదు. శని నా నెత్తిన కూర్చున్నట్టుంది "
" పేరయ్యగారు! మీ సమస్య నాకు అర్ధమైందండి. సమాధానం చెప్పమంటారా??
" చెప్పండి బాబు. పుణ్యముంటుంది."
" అదేం లేదండి. ఒక్కసారి మీ మొహాన్ని అద్దంలో చూసుకోండీ. ఆ మాసిన గడ్డం అది.. అలా ఉంటే చూసేవాల్లకు చికాకు , నీరసం కలగదా?? మీరు ఈ బ్లేడ్ తీసుకుని షేవ్ చేసుకుని మీ పనులు చేసుకోండి. తేడా మీకే తెలుస్తుంది."
"నిజమేనండి. ధన్యవాదాలు."
ఇలా ఒక మగాడి అందానికి, అతని వృత్తికి, పెళ్లి కాకపోవడానికి, గర్ల్ ఫ్రెండ్స్ లేకపోవడానికి, బిజినెస్ అభివృద్ధి కాకపోవడానికి ఆ వ్యక్తి గడ్డం చేసుకోకపోవడమే కారణం. ఆ కంపెనీ బ్లేడ్ వాడి గడ్డం గీసుకుంటేనే అందంగా ఉంటారంట. ఈ ప్రకటన రోజూ రేడియోలో వింటూ ఉంటే నాకు చిరాకేస్తుంది. మరీ ఇంత పిచ్చి ఐడియాలా.. అసలు ఈ వ్యాపార ప్రకటనలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయనిపిస్తుంది. టీవీలో కూడా కార్యక్రమాల మధ్య వ్యాపార ప్రకటనలు అనే బదులు, ప్రకటనల మధ్య కార్యక్రమాలు అనవచ్చు. నూటికో కోటికో ఒక్కటి చాలా అర్ధవంతంగా మరిచిపోలేనిదిగా ఉంటుంది. ఒక షర్ట్ కొంటే రెండు ఫ్రీ. రెండు కొంటే ఐదు తీసికెళ్లండి అనే ప్రకటనలు ఎక్కువయ్యాయి. అది చూసి చదువుకున్నవారు కూడ పరిగెత్తుతున్నారు. వాటి ధరలు, నాణ్యత పరీక్షిస్తున్నారా అంటే తక్కువే అనిపిస్తుంది. కొన్ని ప్రకటనలు చూస్తే అబ్బా!! ఎంతా బాగా చేసారు కదా అనిపిస్తుంది. కొన్ని చూస్తే కోపం, అసహనం ఒక్కోసారి ఏమనాలో కూడా తెలీదు. ప్రతి దుకాణం వాడు ఎప్పుడూ ఏదో ఒక సేల్. ఆ పండగ , ఈ పండగ అని సంవత్సరమంతా సేల్ పెడుతుంటారు.చాలా ఏళ్ల క్రింద ప్రకటనలు తక్కువగా ఉండేవి. రేడియో , పత్రికలు తప్ప వేరే ప్రచార సాధనం లేదు. ఐనా కొన్ని కంపెనీలు, వస్తువుల ప్రకటనలు జనాల మనసునుండి చెరిగిపోకుండా ఉంటాయి.

"ఏమయింది ?"
" పాప ఏడ్చింది"
"ఐతే వుడ్‌వర్డ్స్ పట్టమని వాళ్ల అమ్మతో చెప్పు.నీకు నేను అదే పట్టేదాన్ని"

ఈ ప్రకటన గుర్తుంది. అమ్మమ్మ, తల్లి, కూతురు , మనవరాలు . నాలుగు తరాలను ప్రతిభింభిస్తూ ఉండే గ్రైప్ వాటర్ ప్రకటన. పసిపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఆ గ్రైప్ వాటర్ ఉండేది .. బుగ్గన వేలేసుకున్న బొద్దుగా ఉండే బాబు గుర్తున్నాడా. ఆ బాబుకు ఒక కంపెనీకి అవినాభావ సంబంధముంది. అదే మర్ఫీ. అప్పట్లో రేడియోలు కంప్యూటర్ మానిటర్ అంత, ట్రాన్సిస్టర్లు లాప్ టాప్ అంత సైజులో ఉండేవి. రేడియో అంటే మర్ఫీనే అన్నట్టుగా ఉండేది. ఇక హెచ్ఎంవి కంపెనీ. అప్పుడు సిడిలు గట్రా లేవుగా. ఎల్.పి రికార్డులే. కుక్కపిల్ల ముందు ఆ రికార్డ్ ప్లేయర్ తిరుగుతూ ఉంటుంది. అలా కొన్ని ప్రకటనల చిహ్నాలు ఇప్పటికీ గుర్తున్నాయి.. ఇక లక్స్ అంటే సినిమా తారలు మాత్రమే వాడే సబ్బు అని ఒక ముద్ర పడిపోయింది. అది వాడితే అందంగా ఐపోతారనే ఆశ పెడతారు ఆ కంపెనీ వాళ్లు. ప్రతి తల్లి తన బిడ్డ అముల్ బేబీలా ఉండాలని అనుకుంటుంది కదా.. పైన ఇచ్చినవి సుమారు నలభై ఏళ్ల క్రిందటి వ్యాపార ప్రకటనలు..

మీకు నచ్చిన , నచ్చని ప్రకటనలు ఉన్నాయా ??? నాటివి , నేటివి.. ఏవైనా???

10 వ్యాఖ్యలు:

Anonymous

నాకు అస్సలు నచ్చని ప్రకటన ఫైర్ అండ్ లవ్లీ ప్రకటన. క్రీం రాసుకోటానికీ వాళ్ళు విజయం సాధించడానికీ సంబంధం వుందంటే నాకు చిర్రెత్తుకొస్తుంది. ఆత్మవిస్వాసం పెరిగేది కేవలం క్రీం రాసుకోటం మూలంగానే అని చూపెడతారు. క్రీం రాసుకుని ఇంటర్వూ కెళ్ళటం, పెళ్ళిచూపుల్లో నచ్చెయ్యటం ఇదంతా ఎంత అర్ధం లేని విషయం . ఈ మధ్య కిరణ్ బేడీ ని ఒక ఫేర్నెస్స్ క్రీం ఏడ్ లో చూసి బాధపడ్డానులెండి .ఈమె ఇవాల్సిన మెసేజ్ ఇదా అని.
నచ్చే ప్రకటనలు చాలా వున్నాయి. కొన్ని ప్రకటనలు చూస్తే అవి రూపొందించినవారి ఆలోచనకి ,క్రియేటివిటీకి ఆశ్చర్యం వేస్తుంది. హచ్ ప్రకటన నాకు చాలా నచ్చేది.

నేస్తం

భలే ప్రశ్న అడిగారు , ఇక మా తాతలు ముగ్గురు అని మొదలు పెట్టాల్సిందే నేను... చిన్నపుడు నాకు బాగా నచ్చినవి రస్నా ఇంకా వాషింగ్ పౌడర్ నిర్మా ,ఇంకా మేగీ ,ఇంకా ఆరోగ్యానికి రక్షా ఇస్తుంది లైఫ్ బోయ్ అబ్బో తెగ వుండేవి.. ఎండాకాలం లో రస్నా యాడ్ చూడగానే దేవుడిని ఒకటే కోరుకునేదాన్ని స్వామి నేను టి.వి లో చేయి పెట్టి ఆ ఏడ్స్ లో చూపే ప్రతిదాన్ని బయటకు తీసుకుని వచ్చే వరం ఇవ్వు స్వామి అని, ఇంకా మేగీ అయితే ఆ బాబు, పాప ల అమ్మా ఆకలి అనగానే దో మినిట్ అంటూ టక టక కలర్ఫుల్ మేగీ చేస్తే హూం ఒకటే గుటకలు వేసేదాన్ని, కాని అమ్మను వండమని ఎందుకు అడగలేకపోయేదాన్నో ?? ఆఖరికి మా పిన్ని ఒకసారి మేగీ చేసి ఎంతో ప్రేమగా నాకు ఇచ్చింది ఆ తరువాత మళ్ళి జీవితం లో మేగీ తినాలనిపించలేదు ... అప్పుడు తెలిసింది టీ.వి లో కనబడేవన్నీ నిజ్జంగా బాగోవన్న మాట అని..
ఈ క్రొత్త గ్లైకోడిని యాడ్ చూడండి ...
http://www.youtube.com/watch?v=VHlkJ1RIZuo&feature=related
ఇధి భలే ఉంటుంది
http://www.youtube.com/watch?v=osuAI4Kj3lo&feature=PlayList&p=2F4145C3AC041E84&index=1

krishna rao jallipalli

'నన్ను విడిచి మా శ్రీ వారు ఒక్క క్షణం కూడా స్వర్గంలో కూడా ఉండలేనంటారు.... కారణం ... అశోకా శాండల్ పౌడర్..'
'టినోపాల్...టినోపాల్... మీ బట్టలు... ' (తరువాత అది రానిపాల్ గా మారింది. ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యింది.)
'చెనుకు చేవ.. రైతుకి రొక్కం.. నాగార్జున వారి యురియానే వాడండి . (దానికి మా ఫ్రండు ఒకడ ఇలా మార్చి పాడే వాడు. ' చేనుకు చీడ ... రైతుకి బొక్క' )
'మీ బట్టలు తెల్లగా.. తెల తెల్లగా.. sunlight సబ్బునే వాడండి.(ఇప్పుడు అది లేదు)
SV RANGA RAO, CHANDRA MOHAN, JAGGAYYA..వీరందరూ బర్కలి సిగరెట్లకి మోడల్ గా పని చేసేవారు అప్పట్లో. ఇలా చాలా, చాలా.....
జ్యోతి గారు... భలే గుర్తు చేసారు అప్పటి ప్రకటనలని.

krishna rao jallipalli

అది నాగార్జున వారి ప్రకటన కాదు. గ్రోమోర్ వారిది.

చైతన్య

ఈమధ్య ఒక వాటర్ ఫిల్టరు ad వస్తుంది....
బాబు ఫిల్టరులో వాటర్ తాగుతుంటే తల్లి కంగారుగా ఇలా అంటుంది అక్కడ ఉన్న డాక్టర్ తో
"అవి కాచిన నీళ్ళు కాదు కదా... అవి తాగితే హెల్త్ పాడయి స్కూల్ పోతుంది" (అనే అర్థంలో)
--------- అంటే ఆమె బాధ స్కూల్ పోతుందనే కానీ... వాడికేం అవుతుందో అని కాదు...
hmm కొంచమైనా ఆలోచించరేమో వీళ్ళు అలాంటి ప్రకటనలు చేసే ముందు!

ఇంకొక ad చూసాను 'iodex' గురించి... ఇది చాలా బాగుంటుంది... ad లో ఒక్క మాట కూడా ఉండదు...
ఒక మధ్యవయస్కుడు అలా నడుస్తూ వెళ్తుంటే రోడ్ పైన ఒక 500 నోట్ కనిపిస్తుంది ... ఆటను అటు ఇటు చూసి ఆ నోట్ తీసుకోకుండా ముందుకి వెళ్ళిపోతాడు...
"నడుం నొప్పా" అని ప్రింట్ అవుతుంది స్క్రీన్ పైన....
ఇది ఎంత సింపుల్ గా ... ఎంత బాగుంటుందో!

Praveen Mandangi

చిన్నప్పుడు నేను "గంగా" సబ్బు ప్రకటన చూసి ఆ సబ్బుతో స్నానం చేశాను. "గంగా జలం" ఉపయోగించి చేసిన సబ్బు అన్నారు కదా, ఆ సబ్బు వాడితే ఎలా ఉంటుందోనని టెస్ట్ చేశాను. ఇటుక బెడ్డ లాగ గట్టిగా ఉందని వాడడం మానేశాను. ఇంకో షాంపూ ప్రకటన చూసి చుండ్రు పోతుందనుకున్నాను. చుండ్రు పోలేదు సరి కదా, సెలూన్ కెళ్ళి జుట్టు పూర్తిగా తియ్యించుకోవలసి వచ్చింది. బుర్ర షేవింగ్ చేస్తున్నప్పుడు తలకి రెండు గాట్లు కూడా పడ్డాయి.

గీతాచార్య

@Praveen's talks,

అందులో వాళ్ళ తప్పేముంది? ముందే అంతపెద్ద హిన్ట్ ఇచ్చాక. హహహ.

Praveen Mandangi

కుంకుడు కాయ వాడితే కళ్ళు మండుతాయ్. షాంపూ వాడితే చుండ్రు అసలు పోదు.

సుజాత వేల్పూరి

@చైతన్య,
మీరు చెప్పిన నడుం నొప్పి యాడ్ నాకు కూడా నచ్చుతుంది. ఈ మధ్య వస్తున్న వాటిలో మరీ అతిశయోక్తిగా ఉన్నా నవ్వు తెప్పించేది "హాపీ డెంట్" వాళ్ల యాడ్!

Anonymous

నాకు మాత్రం హ్యాపిడెంట్ అడ్వర్డైస్మెంట్ భలే గా నచ్చింది. ఒక రాజ్యం లో రాజు తినడానికి బయలు దేరే సమయం లోపే తన సేవకుడు వచ్చి ఆ హ్యాపిడెంట్ ని నోటిలో వేసుకొని నోరు తెరవగానే తెల్లని లైట్ గా రావటం నాకు భలే నచ్చింది

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008