Monday 20 April 2009

మరీ ఇంత నాజూకైతే ఎలాగా ???



అదేంటో గాని ఈమధ్య జనాలకి నాజూకులు, స్టైళ్ళు ఎక్కువయ్యాయేమో అనిపిస్తుంది .. బంతి బోజనాలు అంటే అదో వింతలా మారిపోతుంది. నిలబడే తినడం సర్వసాధారణం ఐంది. పెళ్ళిళ్ళు, ఫంక్షన్ హాళ్ళు అంటే సరే అనుకోవచ్చు. కాని ఇళ్ళలో చేసే చిన్న చిన్న పార్టీలకు కూడా కేటరింగ్, బఫే .. ఆ గృహస్తుకే ఓపిక, అతిథులకు కడుపారా కూర్చోబెట్టి వడ్డించాలనే కోరిక లేదు. డబ్బులున్నాయి. ఎవరు వడ్డిస్తారులే . అని వివిధరకాలు ఆర్డర్ ఇచ్చేసి అదే గొప్ప అనుకుంటారు. వచ్చినవాడు కట్నం ఇవ్వకపోతాడా. వాళ్ల ధోరణి చూస్తే అనిపిస్తుంది నాకైతే చచ్చినట్టు పెట్టింది తినక పోతాడా అని.కనీసం పాతిక మందికి కూడా స్వయంగా భోజనం తయారు చేయలేనప్పుడు అలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయాలి. ఈ రోజుల్లో సత్యనారాయణ వ్రతం, తద్దినాలకు కూడా క్యాటరింగ్ భోజనమే. అలా పిలిచి పెట్టకపోతే ఎవడన్నా తంతాడా. లేదే... పూజ చేసుకుని ఊరుకుంటే పోలా. కనీసం ఇలాంటి వాటికైనా కూర్చోబెట్టి వడ్డించే దిక్కు ఉండదు. అన్ని రకాలు చేయించాం, ఇన్ని రకాలు చేయించాం, అంత బిల్లు ఐంది , ఇంత బిల్లు ఐంది అని పైగా గొప్పలు..ఆ వచ్చినవాడు ఎన్ని తిట్టుకున్నాడో వీళ్ళకు తెలియదు. తెలిసినా.. ఆ ఈ రోజుల్లో ఎవరికీ వండి వడ్డించే ఓపిక ఉంది అంటారు మననే.. ఇలా ఎందుకు జరుగుతుంది. అంత వాళ్ళు వంగట్లేదా?? చేసేవాళ్ళు లేరు అంటారు.మనం వెళ్లి వేరేవాళ్ళకు సహాయపడితేనే కదా వాళ్ళు మనింటికొచ్చి చేసేది. హై క్లాస్ క్యాటరింగ్ నుండి రకరకాల వంటకాలు చేయించి , (ఆ సంస్థ వల్లే అతిథులకు వడ్డించి) అదే గృహస్తు ప్రేస్తీజ్ ఇష్యూ ఐంది. ఇదా అతిథి మర్యాద . మనకు గతిలేకా వాళ్ల ఇంటికి చచ్చి చెడి వెళ్ళేది..

ఇక తినేవాళ్ళు కొందరు మరీ సుతారం.. హాయిగా ఆంధ్రా భోజనం కూడా, అదీ తెలుగు దేశం (పార్టీ కాదండోయ్) లో ఉంది ఇంచక్కా చేతులతో తినక స్పూన్లతో నాజూగా తింటారు. చేతులు మనవే, తినేది మనమే, మన చేతులు శుభ్రంగా ఉన్నాయో లేదో మనకు తెలుసు ( వంటకాల సంగతి ఎలాగూ తెలియుడు), మరి స్పూనుతో తినడమేంటి? ఏదో ఇడ్లీ, వడ అంటే ఒకే. స్వీట్లు, అన్నం, పప్పు,కూరగాయలు, అన్నీ స్పూనుతో కష్టపడి తింటారు. మరి వాళ్ల ఇంట్లో ఎలా తింటారో రోజూ.. మరి పూరీలు ఎలా తింటారో అని నా అనుమానం. ఇక హోటళ్ళలో కూడా స్పూన్ల గోల. చేత్తో తింటే అవమానం. హై క్లాస్ ,బిజినెస్ పార్టీ అంటే ఒకే. మామూలుగా వెళ్ళినా అంతేనా. చికెన్ ముక్కను ఎంత కష్టపడి చాకు, ముళ్ళ చెంచాతో ముక్కలు చేసి తింటారో చూస్తుంటే నవ్వాగదు. కాస్త గట్టిగా అంటే పక్క టేబిల్ వాడి మీద పడొచ్చు. ఆ జాగ్రత్త మరోటి. భారత దేశంలో ఉన్నవాళ్ళందరికీ తెలుసు చేతులతోనే తింటారు అని. మరి ఈ తిప్పలేంటి జనాలకు. ఏమో బాబు నాకైతే ఎంచక్కా చిన్న చిన్న పార్తీలకైతే వండి వడ్డించడం లోనే తృప్తి. ఎవరు తిన్నారు, ఎవరు తినలేదు అన్నది తెలుస్తూంది.హాయిగా మాట్లాడుకుంటూ కూర్చుని తినొచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలంటే బఫే అంటేనే చిరాకేస్తుంది.కళ్ళముందు ఎన్నో వంటకాలు, తినాలని మనసౌతుంది. ప్లేట్లో ఎన్నని పెట్టుకుంటాము. ప్లేటును బ్యాలన్సు చేసుకుంటూ నిలబడాలి. కాళ్ళు పీక్కుపోతాయి.ఎవరితోనన్నా మాట్లాడుతూ చేయి తగిలితే , ఆ వంటకాల రుచి మన బట్టలకు కూడా చూపించాల్సి వస్తూంది. ( ఎపుడు ఇంటికెళ్ళి కడిగేద్దామా అనే టెన్షన్ మరోటి) . ఆ కార్యక్రమం పూర్తీ చేసి ఇంటికొచ్చాక ఏదో పెద్ద బరువు దింపుకున్నట్టే. తెల్లారి బావుంటే సరే. లేదా గోవిందం , భజగోవిందం..


ఎంతో ఈ చాదస్తం.. (ఎవరిదీ??)

12 వ్యాఖ్యలు:

AumPrakash

మీరు చెప్పినట్టు సిటీ లో వున్నాయి. కాని ఇంకా మన పల్లెల్లో , చిన్న చిన్న పట్టణాల్లో ఇప్పటికి పంక్తి భోజనాలేనండీ. ఎపుడైనా కుదిరితే పల్లె లో ,పెళ్ళికి వెళ్ళిరండి..... పంక్తి భోజనాలు కాకపోయినా కూర్చుని తినే సౌలభ్యానికి నేను గ్యారెంటీ. అక్కడ పూజలు, వ్రతాలు కూడా ఇంటి వారే వండి వడ్డిస్తారు......

శేఖర్ పెద్దగోపు

అసలు నిలబడి తినే వెర్రి ఏంటో నాకు అర్ధం కాదు...పోనీ అందరూ ఆ పద్దతిని ఇష్టపడుతున్నారా అంటే అదీ లేదు...సగం మంది ప్లేట్ ని పట్టుకుని దొరికిన కుర్చీలో సెటిల్ అయిపోతారు....ఒకరిని చూసి మరొకరు ఇది చాలా పోష్ కల్చర్ అని వంటబట్టించుకున్నట్టున్నారు...మీకు తెలుసా....ఇది ఒక్క సిటీలకే పరిమితం అని అనుకుంటే మనం పొరబడినట్టే... పల్లెలు ఎలా ఉన్నాయో తెలీదు గాని టౌన్ లలో ఇప్పటికే ఈ చెత్త అలవాటు వ్యాపించేసింది. క్రితం సారి ఇంటికి వెళ్ళినప్పుడు మా పనావిడ వాళ్ళ మనవరాలి ఫంక్షన్ గురించి చెబుతూ "అమ్మగోరు...బెఫే సిట్టం పెట్టీసి నామమ్మ.." అని పోష్ గా చెబుతుంటే నాకు నవ్వాగలేదు.

Bhãskar Rãmarãju

మొన్నీమధ్య, నేను మధ్యాహ్న భోజనం లాగిద్దాం అని, డబ్బా తీసా. పప్పు పచ్చడి పెట్టింది మావిడ. ఇక చెయ్యి పెట్టి లాగిస్తున్నా. మా మేనేజరు, తెల్లోడు, వచ్చి ఏంజేస్తున్నావ్ అంటే లాగిస్తున్నా అన్నా, అదేంటి ఫోర్కులేదా అన్నాడు, బాసు! పప్పు పచ్చడి కలుపుకుతినాలీ అంటే చేత్తోనే తినాలి ఆట్టే డిస్ట్రబ్బు చెయ్యమాకా అని తిరిగి నాపనిలో నిమగ్నమయ్యా.

krishna rao jallipalli

పంక్తి బోజనాలు, బఫేలు ఇప్పటివరకు నయమే, ఫర్వాలేదు. ముందు ముందు... వచ్చిన అతిదులకు టోకెన్లు ఇచ్చి ఆ ఫలాన హోటల్లో తిని అట్నుండి అటే పొండి అని అంటారేమో.. ఎవరు చూడొచ్చారు.

రాధిక(నాని )

a

Vinay Chakravarthi.Gogineni

jaapalli gari comment keka

Anonymous

జ్యొతిగారూ,

మీరు వ్రాసినది చదువుతుంటే నాకు ఒక సంగతి గుర్తుకు వచ్చింది. మేము ఒకసారి ఢిల్లీ లో" తాజ్ ఇంటర్నేషనల్"కి ఒక కన్వెన్షన్ కి వెళ్ళాము. మిగిలిన ఫాక్టరీలనుండి చాలా మంది వర్కర్స్ కూడా వచ్చేరు. అక్కడ తెలుసు కదా అంతా బఫే సిస్టం--అదీ ఒక లాన్ లో పెట్టారు. మన సో కాల్డ్ సాఫిస్టికేటెడ్ జనం అంతా ప్లేట్లు తీసికొని వగలు పోతూ తిసికొని తింటున్నారు. మిగిలిన ఫాక్టరీ ల నుండి వచ్చిన వర్కర్స్ ఎలా తింటారా అని అందరూ ఎదురు చూస్తున్నారు, వాళ్ళలో ఒకడు

శుభ్రం గా తన ప్లేట్ తిసికొని హాయిగా ఒక మూలకి వెళ్ళి, లాన్ లో కింద శుభ్రంగా తినడం మొదలెట్టాడు. అది చూసి మిగిలినవాళ్ళంతా కూడా ( పెద్ద పెద్ద వాళ్ళతో సహా ) ఎటువంటి హిపొక్రసీ లేకుండా చేత్తో కలుపుకొని తిన్నారు. దానివలన తెలుసుకొన్నదేమంటే, మనం ఏమీ మొహమ్మాట పడకుండా మన పద్దతిలోనే ఏ పనైనా చేయాలి, ఎవడో ఏదో అనుకొంటాడనుకోవడం బుద్ధి తక్కువ. నేను ఎప్పుడూ చేత్తోటే తింటాను. మా మనవరాలికి కూడా అదే నేర్పాను. తను అన్నం ఐటమ్స్ అన్నీ చేత్తోనే కలుపుకు తింటుంది. పచ్చడి అన్నం తింటూంటే కంచం అంచుకు రాసి ఆ గుజ్జు తింటే ఉండే ఆనందం దేనిలో ఉంది? నా ఉద్దేశ్యం మనం పిల్లలికి ఏది నేర్పుతామో అది చేస్తారు.

రాజ మల్లేశ్వర్ కొల్లి

భాస్కర్ రామరాజు గారు..,
వాళ్ళక్కూడా నేర్పెయ్యటమే..! నేను నా కొలీగ్స్ తో ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళినపుడు, చేత్తో కలుపుకుని తింటం నేర్పించా..., వాళ్ళు చూపుడు వ్రేలు బ్రొటన వ్రేలు తోకలుపుతుంటే భలే ఫన్నీ గా ఉంది..., తర్వాత చేత్తో తినే ప్రాశస్త్యాన్ని సోదాహరణం గా వివరించి.... :-) అన్ని వ్రేళ్ళ ఎలా కలపాలో నేర్పా..!
ఒకడికి బాగానే వచ్చింది..., ఇంకొకడు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాడు...:-)

కొత్త పాళీ

@jallipalli .. catering outsourcing .. హ హ హ. చాలా వింతలే జరిగినాయి, ఇదీ జరిగినా జరగొచ్చు!!
@Jyothi .. బంతిలో కూచోబెట్టి వరసైన వాళ్ళు ఎకసెక్కాలు చేస్తుంటే, కొసరు వడ్డనలు సాగుతుంటే భోజనం చేసే ఆ తృప్తే వేరు. ఇప్పుడింకేవుంది, అమరావతి కథలు, శ్రీపాద వారి కథలు వంటి వాటిల్లో చదువుకునీ, అందాలరాముడు వంటి సినిమాల్లో చూసుకుని లొట్టలేసుకుంటూ తృప్తి పడటమే.

కొత్త పాళీ

చెప్పడం మరిచా .. మీ బ్లాగు లోడవడానికి పూర్తిగా ఒక నిమిషం తీసుకుంది!

జ్యోతి

AumPrakash, శేఖర్ పెద్దగోపు,రాజ మల్లేశ్వర్ కొల్లి, ఫణిగారు, అదే కదా నేను చెప్పేది. ఇంచక్కా నిలబడ్డా, చేత్తో తినొచ్చుగా అని.
భాస్కర్ గారు, నేను చెప్పేది అదే... పప్పన్నం చేత్తో తింటూ మధ్యలో కొంచెం కొంచెం పచ్చడి టచ్ ఇస్తుంటే ఆ మజాయే వేరుగా. మధ్యలో ఈ స్పూన్లెందుకో??
కృష్ణారావుగారు, భలే చెప్పారండి. నాకూ ఈ ఢౌట్ వచ్చిందండి. ఏమో ఇది నిజమవ్వనూ వచ్చు ..
కొత్తపాళీగారు,
ఈ చిన్ని చిన్ని ఆనందాలను మనమే దూరం చేసుకుంటున్నామేమో. నేనైతే బంతి భోజనమే. ఇక ఆడాళ్లు చివర్లో కూర్చుంటే. భోజనాల టైమ్ కి మొదలెడితే , అందరూ తినేసి లేచేసరికి టీ టైమ్ అవుతుంది. .. :)
కొత్తగా వచ్చాయని కొన్ని ఈకలు, తోకలు పెట్టాలెండి. వాటివల్ల బరువు పెరిగి బ్లాగు మెల్లిగా కదులుతుందేమో. అవి తీసేసాను..

Vijay

very good arcticle. and also good comments. very nice

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008