వంట ఎవరి సొత్తు???
ఒక పెద్ద వివాహ వేడుకలకు వెళ్లి . సుష్టిగా భోంచేసి వచ్చాక " ఆహా! వంటలన్నీ సూపర్ గా ఉన్నాయి. నలభీమ పాకాలే" అనడం సర్వసాధారణం కదా. కానీ.. అసలు వంట ఎవరి సొత్తు. పూర్వకాలం నుండి రాజాస్థానంలో , ఇప్పటి హోటళ్లలో, రోడ్ సైడులో వెలసిన టిఫిన్ బండ్లు, ఉపాహారాశాలలు... పెళ్లిల్లు, కేటరింగ్ .. ఇలా అన్ని చోట్లా వంట విషయానికొస్తే మగవారిదే పెత్తనం. చేతికింద ఆడవాళ్లు ఉంటారు. అది వేరే సంగతి.. అందుకేనేమో ఎప్పుడు చూసినా నలభీమ పాకాలే అంటారు కాని దమయంతి,ద్రౌపది పాకాలు అనరే??? అంతే వంట పని మగవారి సొత్తు అని అర్ధమా??
ఏ పెళ్లిలో ఐనా వంటల కాంట్రాక్ట్ తీసుకునేది మగవారే. ఏ హోటల్ కెళ్లినా వంటిల్లు మగవారి ఆధీనంలోనే ఉంటుంది. ఇక దాదాపు అన్ని టీవీ చానెల్స్ లో మగవారే ఎన్నో రకాల వంటకాలు చేసి చూపిస్తున్నారు. అలనాడు నలుడైనా, భీముడైనా రాజ్యాధికారం ఉన్నప్పుడు వంట చేసిన దాఖలాలు లేవనుకుంటా. అజ్ఞాతవాసం చేసినప్పుడు తప్పనిసరై వంటలు చేయాల్సి వచ్చి . అందులో ప్రావీణ్యం సంపాదించుకున్నారేమో?? అంటే ఏతావాతా తేలిందేంటంటే వంట పనికి మగవారే ఎక్కువ అర్హులని, ఎక్కువ పేరు తెచ్చుకున్నారని. వేరీ గుడ్.
కాని.. కాని...
కాని మన ఇళ్లలో ఇలా జరగదే? వంటిల్లు ఆడవాళ్ల సామ్రాజ్యం చేసేసారు? అందులో మగవారు కాలు పెట్టడం పాపం అనుకునేవారెందరో? ఆడపిల్లలకు పెళ్లి కాకముందే ట్రెయినింగు. వంట నేర్చుకో లేకపోతే కష్టాలు పడతావ్. అత్త ఉంటే ఆరణాలు పెడుతుంది. లేకున్నా అది నీ కర్తవ్యం అని బ్రెయిన్ వాష్ చెస్తారు. పెళ్లి ముందు వంట రాకున్నా తర్వాత నేర్చుకోక తప్పదు. బి.ఏ చదివినా బియ్యంలో రాళ్లేరక తప్పదు అని వాపోవడం సామాన్యమైన విషయం. అది సరే.. వంట బాగుంటే " ఇవాళ కూర బావుంది. రుచిగా ఉంది " అంటే నోటి ముత్యాలు రాలిపోతాయేమో మొగుళ్లకి. ఎప్పుడైనా కొంచం ఉప్పు , కారం ఎక్కువతక్కువ ఐతే సింహాల్లా గర్జిస్తారు " ఇన్నేళ్లైంది నీకు వంట రాదు. మీ అమ్మ ఏం నేర్పించింది. నీ ధ్యాస ఎక్కడ ఉంటుంది." అని. భారీ డైలాగులు. ఏది ఏమైనా తరతరాలుగా ఇంట్లో వంటలు స్త్రీలే చేస్తున్నారు. కాని వంట పనిలో ఉద్యోగాలు, గుర్తింపులు మగవారికే.
అందరు మగవాళ్లు వంట చేయరు అని కాదు. కొందరిళ్లలో ఇంట్లోకి రాని మూడు రోజులు మాత్రం భార్యను తిట్టుకుంటూ , సణుక్కుంటూ ఆవిడ చెబుతుంటే ఎలాగో నానా తిప్పలు పడి వంట కానిచ్చేస్తారు. ఎన్నాళ్లని బయట తింటారు. జేబుకు, ఆరోగ్యానికి చిల్లు పడుతుందిగా :)... మరి అలాంటప్పుదు ఆవిడని కాస్త మెచ్చుకుంటె సొమ్మేం పోయిందంట. ఉహూ .. ఏక్కడో ఏ మూలో ఒక్కరో , ఇద్దరో తల్లికి తర్వాత ఆలికి వంటలో సహాయపడేవాళ్లు ఉన్నారులెండి.
పెళ్లికాకముందు డబ్బులుంటే రోజుకో పూటకుళ్లు అదేనండి హోటళ్లు. డబ్బులు తక్కువుంటే, ఒకవేళ ఆరోగ్యం హర్తాల్ చేస్తే, రోజూ అదే తిండి తిని విసుగేస్తే తప్పనిసరై వంట చేసుకుంటారు అబ్బాయిలు. అలాగే భార్యకు దూరంగా తప్పనిసరై ఉండాల్సి వచ్చినప్పుడు , విదేశాళ్లో ఉండేవాళ్లు తప్పనిసరై వంటింట్లోకి దూరుతున్నారు. కాని పూర్తి ఇష్టంగా ఎంతమంది చేస్తున్నారన్నది డౌట్. ఇలా పెళ్లికిముందు బాగా వంట వచ్చిన మగాడిని కట్టుకున్న అమ్మాయికి మరో రకమైన కష్టాలు. ఆమె చేసే ప్రతీ వంటకు వంకలు పెట్టడం. నేనే చేస్తా అనకుండా, నీకేమీ రాదు , ఉండు నేను నేర్పిస్తా .. నేర్చుకో అని లుంగీ బిగించి వంటింట్లో రంగప్రవేశం చేస్తారు. ఇంకా ఆ అమ్మాయి తిప్పలు చెప్పనలవి కాదు.
కొందరు.. ఉహూ చాలా మంది భర్తలు వంట వచ్చినా కూడా అది భార్యల జన్మహక్కు .. తామెందుకు చేయాలి అని అనుకుంటారు. అలా కాక ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ సగం సమయంలోనే వంట పూర్తిచేసుకోవచ్చన్న నిజాన్ని ఎంతమంది తెలుసుకుంటారో? వంట పని మాది కాదు ఆడాళ్లదే అని నొక్కి వక్కానిస్తారు... కాని స్త్రీలు ఈ వంట పని నాది కాదు అంటారా? లేదు... ఇంతకుముందంటే భర్త ఉద్యోగం చేస్తే , భార్య ఇల్లు, వంట , పిల్లలు చూసుకునేది. వంట తప్ప అన్ని వ్యవహారాలు భర్త కూడా పంచుకుంటే, వంట మాత్రం నాకు చెప్పకు అంటారు. ఇప్పుడు భార్యా, భర్త ఇద్దరూ సమాన స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఐనా ఇంట్లో వంట భాద్యత స్త్రీదే కదా. ఏ మొగుడైనా అయ్యో తొందరగా ఇంటికెళ్లాలి . ఇంట్లో వంట చేయాలి అని అనుకుంటాడా? లేదు. కాని ప్రతి ఉగ్యోగిని అనుకుంటుంది. అదేంటో మరి??? ఇప్పుడు ఎవరు మారాలి? వంట నా ఒక్కరి బాధ్యత కాదు అని స్త్రీ అనాలా? పర్లేదు .. నేను ఈ పూట వంట చేస్తాను అని భర్త అనాలా??(ఒక్కరోజు కాదు. ప్రతి రోజూ)
ఇలాంటి కష్టాలు తీర్చడానికేనేమో కర్రీ పాయింట్స్ వెలిసాయి. డబ్బులుంటే కొనుక్కుని ఏదో గడ్డి తింటారు. కొండరు చిన్న వ్యాపకంగా, వ్యాపారంగా భోజనం తయారు చేసి ఇస్తున్నారు. అలాగే పదిరోజులైనా పాడుకాకుండా ఉండే వంటకాలు కూడా దొరుకుతున్నాయి. ఇద్దరూ సంపాదనలో ఉండి, వంట జంఝాటం వద్దనుకునేవాళ్లు బతకాలి తప్పదు కనుక రోజుకోరకం తెచ్చుకుని తింటారు . అప్పుడు వంట పని ఆడవాళ్ళదా, మగవాళ్ళదా , భర్తదా, భార్యదా అనే ప్రశ్న రాదు. అది కూడా ఎన్నాళ్లు. రోజూ వంట చేసే ఆడవాళ్లకు మెప్పు లేదు కాని ఎప్పుడైనా మగవాళ్లు వంట .. కనీసం ఒక్క కూర చేస్తే పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతారు. భుజాలు తడుముకోవద్దు.. :)
ఒక్క విషయం చెప్పండి. మగవాళ్లు ఏదైనా ఉపవాసం చేస్తే భార్య అతనికి పాలు, పళ్లు, లేదా టిఫినో ఏదో టైం కి చేసి పెడుతుందిగా. అదే భార్య ఉపవాసం ఉంటే భర్త ఏం చేస్తాడు?? ఇవన్నీ ఎందుకు . హాయిగా తిని పని చేసుకోక అని తన దారిన తాను ఆఫీసుకు వెళ్లిపోతాడు. ఆ ఇల్లాలే తనకు కావలసినవి చేసుకోక తప్పదుగా..>>>
కాని ఎన్ని చెప్పినా, రాసినా .. స్త్రీ చదువుకున్నా, చదువుకోకున్నా రోజూ వంట చేయక తప్పదుకదా?? ప్చ్..
12 వ్యాఖ్యలు:
నాకు పెళ్ళి కాలేదు కానీ నేను కూడా వంట కొద్ది కొద్దిగా నేర్చుకున్నాను. నేను రోజుకి పన్నెండు గంటలు షాప్ లోనే ఉంటాను కాబట్టి వంట చేసుకోవడానికి నాకు టైమ్ దొరకదు. మా ఇంటిలో వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం నేనే వంట చేసుకుంటాను.
ilantivi raasi endukandi inka okarante okariki kopam puttetatlu chestaaru........daya chesi apeya mani manavi............
వంట ఎవ్వరి సొత్తు కాదు అండి, కాని దానిని మన పరం చేసేరు అంతే. చాలా టైం పడుతుంది అనుకుంటా ఈ క్రమం పోయి అన్ని పనులు అందరివి అని అనుకోవటానికి.
మిగిలిన వాళ్ళా సంగతి నాకు తెలీదు, మా ఇంట్లో మాత్రం నేనే ఎక్కువగా వండుతా. వారానికి ఒక 4-5 రోజులు నేనే చేస్తా. నాకు ఇష్టం, సరదా, ఓపిక - ఎమనుకున్న పర్లేదు. అంతెందుకు పెళ్ళైనప్పుడు మా అమ్మ నాకు చెప్పింది - ఒరెయ్, దివ్య కి వంట చేసి అలవాటు లేదు ర నువ్వు చేసి పెట్టు తను ఏమడిగినా అని. ఇంకా దివ్య అదే మాట గుర్తుచేస్తూ ఉంటది. మా స్నేహితుల్లో చాలా మంది వంట చేస్తారు రెగులర్ గా. వంట బాలేకపోతే గిన్నెలు బయట పడేయాలు, మే అమ్మ నీకు ఏం నేర్పింది అనడలు మాత్రం నేను నా జివితం లో వినలేదు. సినిమాల్లో తప్ప. అలనే వంటింట్లో అడుగేస్తే కాళ్ళు నరుకున్నే మగవాళ్ళాని చూసాను. :) కాని చాలా తక్కువ అంటున్నా అంతే.
తొలిసారి ఈ బ్లాగు చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో సెగలూ .. ఎన్నెన్నో సెగలు
ఓ లక్ష్మీవారం,కార్యాలయంలో మొదటి నిశివర్ణోష్ణొదక సేవన సమయాన
కాకతాళీయంగా పరికించిన మీ బ్లాగు నాలో కలిగించిన భావ సంచలన సారాంశమే నా ఈ జవాబు.
నాకంటూ సొంత బ్లాగు ఏర్పాటు చేసుకొని కొన్ని సంవత్సరాలయినా కూడా
ఏమి రాయాలో,ఎలా రాయాలో తెలియని నేను,ఇవాళ ఈ జవాబు రూపంగా
ఇలా మొదలు పెట్టాను.
మీ పాత టపాలు కొన్ని చదివాను.
చిన్న చిన్న పదాలు,చిన్న చిన్న కధలు,మనసుకి సూటిగా హత్తుకొనేలా చాలా నిజాలు.
ఇలా నాకు మీ బ్లాగు లో నచ్చినవంటూ చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదేమో అని నా భయం.
ఏది ఏమైనప్పటికీ,మీ బ్లాగు నన్ను సంభ్రమాశ్చర్యాలకి గురిచేసిందని,ఇది ఎంతమాత్రం అతిశయోక్తి కాని,ముఖస్తుతి కాని కాదని నొక్కి వక్కాణిస్తూ,హామీ ఇస్తూ,నా ఈ ప్రతిస్పందన పర్వాన్ని ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఇది అంతర్జాలంలో నా మొదటి ప్రతిస్పందన కనుక పొరపాట్లకు క్షంతవ్యుడిని.
జ్యోతిగారు చాల మంచిగా రాశారు...అందుకే ఇంట్లో చిన్నప్పటి నుంచి మగపిల్లలను వంటింట్లోకి రానివ్వాలి. వంట ఎలాచేయాలో నేర్పియ్యాలి.
MEE BLOG MODATISARI CHADIVANU.MEERU RASTHUNNA VISHAYALU CHALA BAGUNNAYI.VANTALA GURINCHI MEERU RASINDI NIJAME.YEDO ALA ROJULU GADICHIPOTHUNNAYI PEDDAGA ALOCHINCHAKUNDAA.APPUDAPPUDU ILANTI ALOCHANALU KONDARITHO CHARCHISTHE BAGUNTUNDI.MAGAVALLAKI INTI PANULU ANNI NERPALANI NAKU KUDA ANIPISTHUNDI.
మీరు ఇలాంటి " కాంట్రవర్షియల్" విషయాలలోకి వెళ్ళి, లేనిపోని గొడవలు ఎందుకు తీసికొస్తున్నారు తల్లీ ? ఎదో గుట్టుగా కాపరాలు చేసికుంటున్నాము కదా!!మీరు వ్రాసేవి అన్నీ చదివి, మాఇంటావిడ ఇప్పుడు నామీద ధ్వజం ఎత్తుతోంది !!
మేడం జీ ! ! ! !
ఇలాంటి విషయాలు మా వారి తో గాని, మా అత్తయ్య గారితో గాని చర్చిస్తే , అన్ని వితండవాదాలు చేస్తావు నువ్వు, ప్రపంచం లో ఏ ఆడవాళ్ళకి రాని ఆలోచనలు నీకు వొస్తై, అందరు ఇంటిపని బైటి పని చేసుకోవట్లేదా? అని దీర్గాలు తీస్తుంటే . . . ., నేనే విపరీతం గా ఆలోచిస్తున్నానేమో అని . . . . silent అయిపోయా, ఏది ఏమైనా ఈ విషయం లో మార్పు రావాలంటే ముందు ఆడవాళ్లే (అంటే అమ్మలు) మారలండి, ఇంట్లో పిల్లలందరికీ అన్ని పనులు నేర్పించి . . . . .
మేడం, ఇలాంటిదే ఇంకో విషయం కూడా, పూజలు, వ్రతాలు, నోములు, ఇవన్ని ఆడవాళ్ళూ మగవాళ్ళ కోసం చేసినట్టు ఉన్నాయ్, కాని ఎక్కడ మగవాళ్ళు ఆడవాళ్లే కోసం చేసిన దాఖలాలు లేవు, ఎందుకంటారు?
మేఘన,
ఇంతవరకు ఆడవాళ్లే తమ భర్తలకోసం ఎన్నో వ్రతాలు,నోములు చేస్తున్నారు.నిజమే.కాని భర్తలు అలా ఒక్క వ్రతం చేయట్లేదంటారా? వాళ్లు చేయవలసింది, చేయాల్సింది ఒకే ఒక వ్రతం ఉందండి. అదే ఏకపత్నీవ్రతం. :)
Excellent piece. Thank you, Jyothi garu.
Post a Comment