Friday, 12 June 2009

కలిసుందామా ??? వద్దా ???

అక్కడ ఒక షష్టిపూర్తి ఫంక్షన్ జరుగుతుంది. అన్నదమ్ములు, కొడుకులు , కూతుళ్ళు, మనవాళ్ళు,మనవరాళ్ళు, అక్కా చెల్లెళ్ళు, ఇలా ఎంతో మంది వచ్చారు ఎక్కడ చూసిన పండగ వాతావరణం. ఛలోక్తులు, నవ్వులు, ఆటలు , పలకరింపులతో ఆ ఇల్లు కళకళలాడుతుంది. సాయంత్రం కాగానే అందరూ వెళ్లిపోయారు. మళ్ళీ అలా కలవడం ఎప్పుడో??. ఈ ఆనందాన్ని ఒక మధురస్మృతిగా మనస్సులో దాచుకోవాల్సిందే. తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ బిజీ.


ఇది ఈనాటి చిత్రం. ఓ యాభై, వందేళ్ళ క్రింద ఇలా ఉండేది కాదేమో. అన్నీ ఉమ్మడి కుటుంబాలే. అన్నదమ్ములు, కొడుకులు , కోడళ్ళు. పిల్లలు అందరు కలిసి ఉండేవారు. ఇంటి పెద్ద మాట అందరూ వినేవారు. గౌరవంతో ఆచరించేవారు కూడా. ఇంట్లో పెళ్లి చేస్తే అది వ్యక్తుల మధ్య కాక కుటుంబాల మధ్య అనుబంధం ఏర్పడేది. అప్పట్లో ఐదు రోజుల పెళ్ళిళ్ళు చేసేవారు. పెళ్ళికొడుకు వాళ్లు బళ్ళు కట్టుకుని తీరిగ్గా అమ్మాయి ఊరికి వచ్చేవారు. వారి ఆలనాపాలనా ఆంతా అమ్మయివారిదే. అదో ముచ్చట.. కాని ఇపుడు అన్నీ ఒక్కరోజు పెళ్ళిళ్ళు . దానికి కూడా తీరదు కొందరికి. ఎందుకిలా జరుగుతుంది. మనుష్యుల మధ్య అనుబంధం , ఆప్యాయత ఎందుకు కొరవడుతుంది. ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు. బయటివాళ్ళు అంటే అనుకోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్యే దూరాలు. తల్లితండ్రులు చెప్పింది పిల్లలకు నచ్చాడు. వాళ్లకు ఏమీ తెలిదు అంటారు. తమ ఆలోచనలు , అభిప్రాయాలు పెద్దలు అర్ధం చేసుకోవడం లేదు అంటారు. నిజమేనా???

తల్లితండ్రులు, పిల్లల అనుబంధం ఎంతవరకు?? వాళ్ల చదువులు, ఉద్యోగాలు, పెళ్లి వరకేనా. ఆ తర్వాత ??? పిల్లలను మీ బ్రతుకు మీరు బ్రతకండి అని వదిలేయాలా? లేదా ఇంకా మన అవసరం ఉందా?? ఉమ్మడికుటుంబాలలో తప్పనిసరై ఉన్నవారికి ఎప్పుడు కీచులాటలే. భోజనం, పిల్లలు. ఖర్చులు ఇలా ఎక్కడ సర్దుకునే ఉద్ధేశ్యం ఉండదు ఆడాళ్ళకి. ఆ వారికి ఉండదుమగాళ్ళకి. తల్లి ఏమో వంట దగ్గర పని చేయడానికి, భోజనం వగైరా గురించి చూడడమే సరిపోతుంది. తండ్రి ఆ ఇంటికి వాచ్ మెన్. అంతే తప్ప పెద్దల మాట మాత్రం ఎవరికీ నచ్చాడు. వినడానికి కూడా సిద్ధంగా ఉండరు. ఇక కొందరు బుద్ధిమంతులైతే తల్లితండ్రులు తమకు అడ్డమని ఇంటినుండే గెంటేస్తారు. లేదా ఆశ్రమంలో చేరుస్తారు.

ముందు ముందు తల్లితండ్రులే పిల్లలను వేరుగా ఉండమని అనాల్సి వస్తుందేమో. అదే మంచిదనుకుంటా. ఒకరి జీవితంలో ఒకరి జోక్యం ఉండదు. ఏ గొడవా ఉండదు. దూరంగా ఉండి అప్పుడప్పుడు కలుసుకుంటే ఆ ఆత్మీయతలు నిలిచి ఉంటాయి. ఒకదగ్గర ఉండి రోజూ గొడవ పడేకంటే ఇదే మేలు కదా.

ఈ మధ్య తరచుగా చూస్తున్న ఎన్నో కుటుంబాలలో జరిగే గొడవలు, అలాగే ఒక వ్యాసంలో ఒకే కుటుంబంలో వందమందికి పైగా కలిసి ఉంటున్నారు అనే విషయం చదివి నాలో చెలరేగిన ఆలోచనలు ఇవి.

3 వ్యాఖ్యలు:

asha

It depends. ఇందులో ఏదో ఒక్కటే మంచిదని చెప్పలేము. నా ఫ్రెండు వాళ్ళ మామ్మ ఉండేవారు. ఆవిడ పుస్తకాలు తెప్పించుకునేవారు. అవి చదువుకోటానికి తీసుకోటానికి వేళ్ళేవాళ్ళం. ఆవిడ ఎంతో మంచిగా మాట్లాడేవారు. ఆవిడా, వాళ్ళ కోడలూ పోటీపడి మరీ ఒకరినొకరు పొగిడేసుకుంటారు. అసలంత ఆప్యాయంగా ఉండే అత్తాకోడళ్ళనే నేనింతవరకూ చూడలేదు. మా ఫ్రెండే అనేది. మన అమ్మమ్మలకింత సీను లేదు కనుక వాళ్ళ కోడళ్ళకు కూడా ఉండదు అని. అసలు మనసులో ప్రేమ లేనప్పుడు వేరుగా ఉండటమే మంచిదిలెండి. కానీ హాయిగా ఉమ్మడి కుటుంబం ఉంటే బావుంటుంది. అయితే పనిని ఒకరి మీదే తోసెయ్యకుండా అందరూ కలిసి బాధ్యతగా పంచుకుంటే బావుంటుంది.

జాహ్నవి

నిజంగా కలిసి ఉండి కొట్టుకునే కన్నా విడిపోయి పండగలకి కలవడమే మేలు. తల్లితండ్రులను విడిచిపెట్టే పిల్లల గురించి మీరు చెప్పారు. అది వాస్తవమే కాదనను. కానీ తల్లి మాట విని భార్యని బాధ పెట్టే వారు కూడా వున్నారు. నా స్నేహితురాలి విషయంలో ఇదే జరిగింది. కాని నా స్నేహితురాలు తన అత్తగారి మాటను జవదాటదు. ఐనా తనకి సూటిపోటి మాటలు తప్పవు. అత్తగారు ఏమంటారో అని రెండవసారి గర్బందాల్చడానికి నా స్నేహితురాలు 6 సంవత్సరాలు వేచివుండవలసి వచ్చింది. పెద్దవారు కూడా చిన్నవారిని అర్దం చేసుకుంటే మంచిది. ఇది అరుదో కాదో నాకు తెలియదు.ఇలాంటి సందర్బాలలో కలిసి ఉండటం కన్నా విడిపోవడమే మంచిది కదా...

నా స్పందన ఉంచినా ఉంచకున్నా పరవాలేదు.
కాని ఈ విషయమై మీరు ఒక టపా వ్రాయండి. మీరు వ్రాసే విధానం అందర్నీ ఆలోచింపచేసేదిలా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా మీ అభిమానిని కాబట్టి అడుగుతున్నాను.

మాలా కుమార్

కలిసి వుందామా వద్దా అంటే నెనైతె కలసివుంటే కలదు సుఖం అంటాను.
ఎవరికి వారు వుండగలరు, అందులో అనుమానం లేదు,కాని కలసి వుండి భాధ్యతలను పంచుకొని,సదురుకు పొవటములో వున్న ఆనందము దేనిలో లెదు.పిల్లలకి పెద్దల ప్రేమ ,పెద్దలకి పిల్లల ముచ్చట్లు లేని సంసారం అసంపూర్తి చిత్రం లాంటిది.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008