Thursday, July 16, 2009

వంట నేర్చిన విధంబెట్టిదనిన..

ఇపుడు వంటల వెబ్ సైట్ నిర్వహిస్తున్నానని, షడ్రుచులు బ్లాగు ద్వారా ఎన్నో వంటకాల గురించి అందరికీ ఉపయోగపడేలా చెప్తున్నానని నాకు మొదటినుండి వంటలు చాలా బాగా వచ్చు అనే భ్రమలో ఉండకండి . పెళ్లి జరిగినపుడు కప్పు టీ మాత్రమే సరిగ్గా చేయడం వచ్చు నాకు. హాస్చర్య పోతున్నారా??అదేనండిమరి .. పాపం మావారు కదా.ఎలా వేగుతూ వచ్చారో ఇన్నేళ్ళు ..

ఫ్లాష్ బాక్ లో కి వెళితే....

అమ్మా నాన్నకు ఒక్కదాన్నే గారాల కూతురిని. హాయిగా అమ్మ చేసి పెట్టింది తిని తయారై స్కూలుకు, కాలేజీకి వెళ్లి రావడం తప్ప వేరే లోకం తెలిదు. అవసరం కూడా పడలేదు మరి. చెప్పొద్దూ మా అమ్మే అన్నీ చేసుకునేది. ఒకటికి పదిసార్లు తిడితే ఏదో చిన్న చిన్న పనులు చేసి బయటపడేదాన్ని. కాస్త పెద్దయ్యాక అమ్మ తిట్టేది.. ఇలాగైతే ఎలాగే .. రేపు పెళ్ళి అత్తారింటికి వెళ్ళాక పని చేయకపోతే వాళ్లు నన్నే అంటారు. నేర్చుకో అనేది. హు.. పెళ్ళయ్యాక ఎలాగూ తప్పదు. నేను చెప్తాలే. అమ్మ చెప్పినా కూడా నేను నేర్చుకోలేదని అని నా పని చేసుకునేదాన్ని. నాకు మా నాన్న సపోర్ట్. పోనీలే అని. ఇక వంట ఎలా వస్తుంది. ఇంకా నయం .. పెళ్లి చూపుల్లో అమ్మాయికి వంట వార్పూ వచ్చా అని అడగలేదు ఎవరూ... బ్రతికిపోయా.. అత్తారింట్లో కూరగాయలు తరిగివ్వడం, బియ్యం కడగడం, టేబుల్ సర్దడం లాంటి నాజూకు పనులే చేసేదాన్ని.మిగతావి రావుగా. సరే రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. ఒకరోజు నా నెత్తిన బండ పడింది. ఇద్దరు చుట్టాలొచ్చారు. మా తోటికోడలు ఉప్మా చేయి అంది. అంతే .. మొహం బ్లాంక్ అయ్యింది. ఉప్మా ఎలా ఉంటుందో తెలుసు, తినడం తెలుసు. ఎలా చేయాలో అస్సలు తెలీదే.. అదే చెప్పాను ఆవిడతో. ఒకటే నవ్వు. నవ్వితే ఉప్మా రెడీ కాదుగా. అపుడు వంటింట్లోకి తీసికెళ్ళి ఉప్మా రవ్వ ఎలా ఉంటుంది. దాన్ని ఎలా బాగు చేయాలి. వేయించాలి, ఉప్మాకి కావలసిన దినుసులు అన్నీ చూపిస్తూ ఉప్మా తయారు చేస్డింది.. ఓహో .. దీనికి ఇంత ప్రాసెస్ ఉంటుందా అనుకున్నా.. మరో ఘనకార్యం వినండి.. ఒకరోజు సాయంత్రం మా తోటికోడలు పిల్లలు వచ్చి ఏదైనా టిఫిన్ చేయమన్నారు. సరే కాస్త అనుభవం వచ్చింది కదా అని సెనగ పిండితో బజ్జీలు చేద్దామని డిసైడ్ అయ్యా. ఇదే ఎందుకంటే చాలా ఈజీ కాబట్టి (అమ్మ చేస్తుండగా చూసానుగా ) సరే అన్నే కలిపా,, బజ్జీలు బాగా పొంగాలని కాస్త వంట సోడా కూడా వేసాను. బజ్జీలు రెడీ అయ్యాయి. ప్లేట్లలో పెట్టి ఇచ్చాను. ఆహా అనుకుంటూ బజ్జీ తిందామని నోట్లో పెట్టుకున్నారు. ఏముంది.. బజ్జీ లోపల చూస్తె ఎర్రగా రక్తం లా ఉంది.ఇదేంటబ్బా ఇలా ఎలా ఐంది. కారం అంత ఎర్రగా ఉండదే. అమ్మ చేస్తే బానే వస్తుందిగా అని నా బుర్రలో ప్రశ్నలు. అందరూ నవ్వుతున్నారు. నేను నవ్వాలా, ఏడవాలా తెలీదు. ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఉన్నా .. అప్పుడే వచ్చిన మా ఆడపడుచు అసలు రహస్యం చెప్పింది. ఏంటంటే.. పసుపు వేసినప్పుడు వంట సోడా వేయొద్దు అని.. అలా వేస్తె రెండుకలిసి ఎరుపు వస్తాయి అన్నమాట. పెళ్ళిళ్ళలో పారాణి అలాగే పసుపు , సున్నం కలిపి చేస్తారని కూడా చెప్పిందావిడ. ఆ సంగతి నాకు అంతవరకు తెలీదు నిజంగా. మరి కొత్త పెళ్లి కూతుర్లు అందరూ అమాయకులే.. నేస్తం చెప్పినట్టు... భర్తా, అత్తగారేమో ఉద్యోగానికి అన్నీ నేర్చుకుని వచ్చినట్టు , వాళ్ళు అడిగింది చేయాలంటారు. అర్ధం చేసుకోరూ... :(

తర్వాత వేరు కాపురం.. వంటింట్లోకి ఏయే మసాలాలు కావాలి.ఏయే పొడులు అవసరం అవుతాయి మనకు తెలిసి చస్తేగా. మన టాలెంట్ అమ్మకు తెలుసు. అందుకే వంటింట్లో సరుకులన్నీ , గరంమసాల, పొడులతో అన్నీ డబ్బాలలో నింపి వెళ్ళింది. (నేను నా కూతురుకు ఇలా చేస్తానా? ఏమో ?? ) .. గిన్నెలు, చెంచాలు, మసాలాలు, అన్నీ ఉన్నాయి. మరి వంట చేసేది ఎలా. మావారు పెళ్లి కాకముందు, అపుడెప్పుడో స్కూలులో ఉన్నపుడు రూంలో అద్దెకుంటూ వంట చేసేవాన్ని అని చెప్పారు. (ఇప్పటికీ చెప్తుంటారానుకోండి) నాకు వంట పాఠాలు చెప్పలేదు. ఉహూ అన్నారు. కావాలంటే పుస్తకాలు కొనిస్తా చూసి చేయి. బాగుంటే సరి . లేకుంటే మళ్ళీ చేయి అదే వస్తుంది అని ఓ ఉచిత సలహా పడేసారు. ఇలా లాభం లేదని.. మా అమ్మ దగ్గరకు వెళ్లి (అపుడు ఫోన్లు లేవు లెండి..లేకుంటే బిల్లు పేలిపోయేది ) రోజు తినే పప్పు, చారు, కూరా ఎలా చేయాలి, దానికి కావలసిన స్టాండర్డ్ దినుసులు, కొలతలు రాసుకుని వచ్చా. పప్పు, చింతపండు, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, పసుపు .. ఇలా అన్నీ .. ఆ పుస్తకం ఈ మధ్యే దొరికింది. చదువుతుంటే భలే నవ్వొచ్చింది.. అలా రోజొక ప్రయోగం చేస్తూ మావారిని, మావగారిని బలి చేస్తూ వచ్చా. పాపం కొత్త పెళ్లి కూతురు కదా అని బాగా లేకున్నా మెల్లిగా చెప్పేవారు ..

ఇలాగే ఒకరోజు ఒక తమాషా జరిగింది. ఒకరోజు పొద్దున్నే వంట చేస్తుంటే మావారు టీ అడిగారు.సరే అని పప్పు పక్కనే స్టవ్ మీద టీ పెట్టాను.ఆఫీసు టైం అవుతుంది. గాభరా.. గందరగోళం.. ఏముంది.. టీలో వేయాల్సిన టీపొడి పక్కనే కుక్కర్లో ఉన్నా పప్పులో వేసా .. దోసకాయ పప్పు అనుకుంటా. ఇంకేముంది. వెంటనే పప్పు రంగు మారిపోయింది. తీసేయడానికి లేదు. మావారికి టీ ఇచ్చేసి ఎం చేయాలా అని కంగారు పడ్డాను. మళ్ళీ పప్పు చేసేంత టైం లేదు. పక్కనే ఉన్న అమ్మ దగ్గరకు వెళ్లి చిన్న గిన్నెడు పప్పు తెచ్చి మావారికి అన్నం పెట్టేసి ఆఫీసుకు పంపేసాక మళ్ళీ వంట చేశాను. కాని ఆ నల్లటి పప్పు పనిమనిషి కూడా తీసుకోదే . రంగు రుచి రెండూ మారాయి మరి. పారేయక తప్పలేదు. ఈ సంగతి మావారికి ఇంతవరకు తెలీదు. మీరు చెప్పకండే.. అసలు వంట అంటే చాలా ఇష్టమని కాదు. చేయక తప్పదు కదా అని ఒక్కోటి నేర్చుకోవడమే.. ఇప్పటికీ రోజొక రకంగా ఎవరైనా చేసి పెడితే తిందామని కోరిక. అది తీరదు గాని. వదిలేద్దాం..

ఈ మధ్యే మరో తమాషా జరిగింది. తలుచుకుంటే నా టాలెంట్ మీద నాకే గర్వం పెరిగిపోతుంది. అలా కూడా చేస్తానన్నమాట.. ఒకరోజు మావారికి టిఫిన్ గా పుల్కాలు చేస్తున్నా. అప్పుడే మా అబ్బాయి వచ్చి తినడానికి పెట్టు అన్నాడు. సరే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయనా అంటే సరే అని వాడు వెళ్లి టీవీ చూస్తూ కూర్చున్నాడు. మావారికి టిఫిన్ పెట్టి నాకు , మా అబ్బాయికి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇద్దరం తిన్నాం. బాగుంది. ఐతే మరి ఇందులో వింతేంటి అంటారా?? అదే మరి.. ఎగ్ లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసానన్నమాట. అది మా ఇద్దరికీ తినేటప్పుడు, తినడం ఐపోయాక కూడా తెలీలేదు. అలా తయారైంది జీవితం అనిపించింది. మరి ఎలా తెలిసింది అంటే. తిన్న తర్వాత ప్లేట్ తీసికెళ్ళి కిచెన్ లో సింక్ లో వేసి ,, మధ్యాహ్నం వంటకోసం కూరగాయలు చూస్తుంటే గ్యాస్ స్టవ్ ముందే గుడ్లు నన్ను చూస్తూ కనిపించాయి. హి.. హి ... హి.. అని. అంటే గుడ్లు తప్ప అన్ని వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని తిన్నాము తల్లి కొడుకులం అనుకుని వెళ్లి మావాడిని అడిగా ఏరా! నువ్వు తిన్నదేంటి అని. వాడు టీవీలో WWF చూస్తూ ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నాడు. అందులో ఎగ్ ఉందా అంటే ఏమో తెలీలేదు అంటాడు తెల్ల మొహమేసి. అంటే ఎగ్ లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి అసలు అది లేదు అనేది కూడా తెలీలేదు అని అర్ధమైంది. ప్చ్..

ఎప్పుడూ ఇలా జరగదనుకోండి.. యాభై మందికి ఒక్కదాన్నే వంట చేయగలను అనే ధీమా ఉంది ఇపుడు. తాతలు సంపాదించిన ఆస్థి అనుభవించడం కాదు గొప్ప. సొంతంగా కష్టపడి సంపాదించు అన్న పెద్దల మాట చద్ది మూటగా భావించి కష్టపడి చెమటోడ్చి( హైటెక్ కిచెన్ అయినా, గ్యాస్ పొయ్యి మీద వంట అయినా చెమట పట్టదేంటి. ఇదేమన్నా టీవీ ప్రోగ్రామా .. అందంగా కనపట్టానికి ) నేర్చుకుని ఏదో ఏమీ రాని అంతదాన్ని ఇంతదాన్ని అయ్యాను. ( సంసారంలో పదనిసలు లాగా అప్పుడప్పుడు వంటింట్లో ఇలాంటి గందరగోళాలు ప్రతి ఒక్కరికి అనుభవమవుతాయి.. ఇలాంటి వంటింటి రిపేర్లు ప్రతి గృహిణి చేయడం పరిపాటే కదా.

మీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా. మీకు కలిగిన లేదా చూసిన సరదా సంఘటనలు మీ బ్లాగులోనూ టపాయించండి మరి.. ఆలస్యమెందుకు ???

21 వ్యాఖ్యలు:

Vinay Chakravarthi.Gogineni

baagunnayi ............really chaala baagundi post

naaku telisi pelli ayye time ki ammyilakante boys ekkuva vunntaru vanta vachhina vaallu at present.
naaku B.Tech nunchi choostunte 3 tagilaaru vanta vachhina vaallu(girls)........ento
vanta naaku raadu ani cheppadam fashion ayyindi............

Sujata M

నాకు మా హీరో చేసే పప్పు / దాల్ తఢ్కా / దాల్మా - ఏదయినా ఇష్టం. పొయ్యి మీద ఫినిషింగ్ లో ఉండగానే గిన్నెలో తీసుకుని లాగిస్తా. :D మీ అమ్మాయికి సంబంధాలు చూసేటపుడు వంటొచ్చిన అల్లుణ్ణి ప్రిఫర్ చెయ్యండి. ఈ రోజుల్లో వంటొచ్చిన అబ్బాయిలు ఎక్కువయ్యారు.


ఇంతకీ మీ కోడలు సుఖపడుతుంది. ఎంచకుండా తినిపెట్టే మీ అబ్బాయి లాంటి భర్త దొరకడం కూడా గ్రేటే ! మీ అబ్బాయి కి కూడా కాస్త వంట నేర్పించండి. మీ కోడలు వంట తిన్లేకపోయినపుడు తనే కాస్త వండుకుని తింటాడు. జోక్ చేసాను. ఏమనుకోవద్దు.

జ్యోతి

Sujata,

మా అమ్మాయి కనీస అవసరమైన పప్పు , చారు చేస్తుంది. ఇక పెళ్లయ్యాక అది తన తిప్పలు.. అబ్బాయి అంటారా... ఆరోజు టీవీ ప్రోగ్రామ్ మూడ్ లో ప్లేట్ లో చూడకుండా తినేసాడు.
ఐనా మనం నేర్పించాలా.. అవసరం అన్నీ నేర్పిస్తుంది. నేనే ఉదాహరణ... నా వంట చెడగొడితే మావారు కిచెన్ లోకి అడుగెడతారు. అదన్నమాట సంగతి... :)

Srujana Ramanujan

మీరు చాలా అమాయకులండీ జ్యోతి గారూ.ఇలా బ్లాగులో పెట్టెసి చెప్పొద్దు అంటే ఎవరూ చెప్పకపోయినా తెలియకుండా ఉంటుందేంటి? :-)

భలే ఉన్నాయి మీ అనుభవాలు. కాస్త అసూయ పుట్టిస్తూ. ఎందుకంటే నాకు ఎవరి మీదా ప్రయోగాలు చేసే అవకాశం రాలేదు. నా మీద చేసుకోలేను కనుక... అదన్నమాట సంగతి.

aswinisri

ha ha ha! vanta vachchinaa raakapoeyinaa, tineavaadi danta siri miida aa roeju vanta aadhaarapadivuntundi kadandii! mareami anukoekandii swaanubhavamuna chaatu samdesam idi:)

జ్యోతి

అశ్వనిగారు పర్లేదండి. మావారి రెగ్యులర్ డైలాగ్ అది. నాకు నిజమే అనిపిస్తుందిలెండి. తినేవాడి అదృష్టం. ఏరోజు వంటా బాగుంటుందో అని.నేను సరే అని ఒప్పుకుంటాను.

మురళి

మీ టపా చదువుతుంటే చాలా రోజుల క్రితం చదివిన మల్లిక్ కథ ఒకటి గుర్తొచ్చింది.. కథలో హీరో పప్పు మాడగొడతాడు.. అది తినలేక వీధిలోకి వచ్చిన బిచ్చగాడికి ఆల్రెడీ అతని గిన్నెలో ఉన్న అన్నం మీద వేస్తాడు. కాసేపటి తర్వాత ఆ బిచ్చగాడు కాలింగ్ బెల్ కొట్టి "ఇస్మంటి నల్ల పప్పేసి అన్నం పాడుజేసినావ్" అని గొడవ పెట్టుకుని, హోటల్ లో భోజనానికి డబ్బులు తీసుకుని మరీ వెళ్తాడు. ఇంతకీ టపాకి దీనికి సంబంధం ఏమిటంటారా? మీ 'టీ పప్పు' ని అలా ఎవరికీ ఇవ్వకుండా మంచి పని చేశారు కదా మరి..

జ్యోతి

మురళిగారు ,,
కదా... నాకు చూడడానికే బాగాలేకుంటే పనిమనిషికి ఎలా ఇవ్వను.. అడగడానికి కూడా మనసు రాలేదు అప్పుడు.

సుభద్ర

jyothi gaaru,
meelanti vantala websites rasevaale prayogaalu chestunte naalanti vaallu yenta ...sea lo drop antaa by the way nenu post vesesanu vanta midaa akalivesina appudute koncham tini chepandi .
http://vaalukobbarichettu9.blogspot.com

నేస్తం

హ హ జ్యోతిగారు మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్ ..భలే నవ్వించారు ..అబ్బో నేనూ పడ్డానండి బాబు బోలెడు కష్టాలు ఈ వంట మీద ..మళ్ళీ అవన్నీ గుర్తు చేసారు

జ్యోతి

నేస్తం

ఆలస్యమెందుకు.రాసేయండి మరి. ప్రతివారికి ఉంటాయి ఈ వంటల ప్రహసనాలు..

Sujata M

జ్యోతి గారు - ఎలా అయితేనేం - మీరు చాలా ఇంప్రూవ్ అయ్యి, ఒక బ్లాగు కూడా (వంటల మీద) నడిపేస్తున్నారు. పండగలప్పుడు మీ బ్లాగు లో, పిండివంటల ఫోటోలు చూడ్డానికి ఇటు తప్పకుండా తొంగి చూసే వాళ్ళలో నేనూ ఒకర్ని.

రవి

జ్యోతక్కా, వంటలతో పాటు చిట్కాలు కూడా మొదలెట్టి, తెలుగు ఆడపడుచుల, లేదా కనీసం తెలుగు బ్రహ్మచారుల వంటిళ్ళలో జ్యోతులు వెలిగించండి.

మీ ఫ్లాష్ బ్యాకు నలుపు తెలుపులో కాక, బాగా కలర్ ఫుల్ గా ఉంది. :-)

భార్యతో మంచి వంటలు చేయించటం ఎలా అన్న సాహసోపేతమైన టపాలు ఎవరైనా అనుభవజ్ఞులు రాస్తే బావుంటుంది. అంతటి సాహసికులు ఎవరూ లేరా బ్లాగ్లోకంలో??

Shashank

జ్యోతి గారు కొంచం పెద్ద వ్యాఖ్య ఏమి అనుకోకండి (టప కంటే చిన్నది మామూలు వ్యాఖ్య కంటే పెద్దది).

ముందుగా ఐ అబ్జెక్ట్. మిమ్మల్ని కాదండి.. మా అమ్మ ని. నేను ఒక్కడినే.. అయినా నా చేత నా నా పనులు చేయించారు. ఇల్లు చిమ్మి ముగ్గు పెట్టడం నుండి బయట అన్ని పనులవరకు నేనే చేసేవాడ్ని. :( వంట అంటే పాపాం అమ్మ ఒక్కర్తే ఏం కష్ట పడుతుంది అని సహాయం చేసేవాడ్ని అప్పుడప్పుడు. మా ఇంట్లో వాళ్ళందరికి దోసలు పోయాలంటే కనిష్టం ఒక గంట పైనే పడుతుంది. అలా దోసలు పోయడం నేర్చుకున్నా.. మెళ్ళగా మిగితావి కూడాను. ఇంటర్ కి వచ్చేసరికి ప్రతి ఆదివారం టిఫిన్ సెక్షన్ నాదే!! అమ్మ పుట్టినరోజుకో, అమ్మ కి విసుగొచ్చినప్పుడో full fledged నా ప్రయోగాలు చేసేవాడ్ని. ఈ దేశానికి వచ్చాక అది ఎంత ఉపయోగపడిందో చెప్పడం కష్టం. మొదట్లో రోజుకి ఇద్దరు చొప్పున వాటాలు ఉండేవి మాకు... వళ్ళ వంట తినలేక నాకు వంట రావడం ములంగా రోజు నేనే చేసేవాడ్ని .. దాదాపుగ 15 మందికి. డేక్సాల్లోనే.. (అప్పుడే నా పేరు "బ్రహ్మం" గా మారింది..) పెళ్ళైయాక మా ఆవిడకి పెద్దగ వంట రాదు. తర్వాత తర్వాతే నేర్చుకుంది.. అలవాటైన ప్రాణం కద నాది.. అందుకే ఎక్కువగా నేనే చేస్తూ ఉంటా. మీలాగే ఎగ్గు లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ నీళ్ళు లేకుండ పప్పు.. అబ్బో.. ఇలాంటివి బోలేడు ఆ రోజుల్లో...

మాలా కుమార్

మరి దేశ సేవతోటే సరి పొతుండే .ఏదో చేసేసి, టి.వి ముందు కూలేసి పెడుతుంటే పాపం చిన్ని నాగన్న ఎన్ని కష్టాలు పడుతున్నాడో !

మాలా కుమార్

మరి నా పొస్ట్ కూడా చూడండి.
http://sahiti-mala.blogspot.com/2009/07/blog-post_17.html

జ్యోతి

సుభద్ర,, నేను ప్రయోగాలు చేసింది పెళ్లైన కొత్తలో,,
శశాంక్ గారు, మీ అనుభవాలు టపాయించండి మరి.. ఆలస్యమెందుకు??

రవి,
తప్పకుండా చిట్కాలు ఇస్తాను..
భార్యతో మంచి వంటలు .. ఇలాటి సాహసం నువ్వు చేసి విఫలమై, ఆవిడ చేసింది మహాభాగ్యంలా తినేస్తున్నట్టుగా ఉందే.. మరి నువ్వు మీ ఆవిడ సామ్రాజ్యంలోకి ఎప్పుడైనా వెళ్లావా??

భార్యతో కాకున్నా తామే మంచి వంటలు చేయగల సాహసికులు, అనుభవజ్ఞులు ఉన్నారు. చూద్దాం. ఈ టపా చూసి ఏమైనా చెప్తారేమో??

వైష్ణవి హరివల్లభ

భలే ఉన్నాయి మీ అనుభవాలు. అం దుకే వంట వచ్చిన అబ్బాయిని చేసుకుంటే సరి.

http://priyamainamaatalu.blogspot.com/2009/07/blog-post.html

Unknown

మీ లాగే నేను టమాటో పప్పు లో టమాటో లేకుండా చేసేసా.కాకపోతే తినకముందే తెలిసింది అందులో టమాటో వేయలేదని

కొత్త పాళీ

good one

పరిమళం

జ్యోతిగారూ బావున్నాయి మీ ప్రయోగాలు :) :)
టైటిల్ మాత్రం ఇప్పుడు కరెక్ట్ గా ఉంటుంది .

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008