అంతర్గత శక్తులు కేంద్రీకరిద్దాం!
భౌతిక ప్రపంచాన్ని పక్కకునెట్టి కాసేపు అంతర్ముఖులమై మనసులోతులను ఆవిష్కరిస్తే నిశ్చల తటాకంలో విహరిస్తున్నామా అన్న అనుభూతిలో మునిగిపోతాం. ఆ స్థితిలో జనించే ప్రతీ ఆలోచనా ఓ తరంగమే. ఆ తరంగం ఏ తీరాలకో తీసుకెళ్లడానికి శతవిధాలా ప్రయత్నించి నిశ్చలత్వాన్ని వదిలిపెట్టబుద్ధి కాని మన బుద్ధికి దాసోహమై ఆనవాలు లేకుండా కనుమరుగైపోతుంది. ఎన్నో ఆలోచనలు అలల్లా బలంగా విరుచుకుపడుతూ అస్థిరపరచడానికి ప్రయత్నించి మన చిత్తం ముందు చిత్తైపోయి మాయమవుతాయి. మనసు ఏకాగ్రం అయ్యే కొద్దీ లౌకిక ప్రపంచపు చిక్కుముడులు దూదిపింజల్లా ఆవిరైపోయి ఏ ఆలోచనా కదిలించనంత బలంగా నిర్మలత్వం వద్ద మనసు లంగరు వేయబడి ఆ అలౌకిక స్థితి నుండి బయటకు రావడానికి మనస్కరించదు. చేతలు, మాటలు, మంచితనాలు, అహాలు.. అన్నీ మనసు ప్రమేయం లేకుండా సందర్భాలను బట్టి పైపైన అద్దబడే కృత్రిమ అలంకారాలన్న విషయం బోధపడిన తక్షణం మనసుతో మమేకమై పోతాం. ఏదీ శాశ్వతం కాదని తెలిసినా లౌకిక ప్రపంచంలో ఏదో శాశ్వతం చేసుకోవాలని ఆరాటపడిపోతాం.
నిరంతరం ఎక్కడికో ఎదిగిపోవాలని జ్వలించే వాంఛలు ఏదీ శాశ్వతం కాదన్న సత్యాన్ని జీర్ణించుకోలేవు. అందుకే లౌకిక ప్రపంచంలో క్షణక్షణమూ సంఘర్షణే! ఆ సంఘర్షణ మోతాదుకి మించి మన ఉనికికే హాని చేకూరుస్తుంటే అంతర్ముఖులమై మనస్సుని తడిమిచూసి ఏది సత్యమో, ఏది శాశ్వతమో గ్రహింపుకి తెచ్చుకుంటే తప్ప నిశ్చింత ఉండదు. మనఃశక్తి ముందు ఏదీ సరితూగదు. ఆ కారణం చేతే మనస్సు ఎంత స్థిరత్వం వైపు మళ్లించబడితే అంతకంతా స్థితప్రజ్ఞత సాధించగలుగుతాం. ఎంత అస్థిరం అయితే అంతకంతా ఛిన్నాభిన్నం అవుతాం. భౌతిక పరిస్థితుల వల్ల విఛిన్నం అయ్యే మానసిక శక్తులను ఒడుపుగా చేరదీసి బలంగా ఇచ్ఛపై కేంద్రీకరించడంపైనే మన విజ్ఞత ఆధారపడి ఉంది. మనకు సంబంధం ఉన్నదీ, లేనిదీ ప్రతీదీ కలవరపరిచేదే, కల్లోలం సృష్టించేదే అయినప్పుడు ఆ కల్లోలం నుండి ప్రశాంతమవడానికి మన బలవంతపు ప్రమేయం తప్పనిసరిగా అవసరం. మనం జోక్యం చేసుకోనిదే, మన శక్తులను.. హరించే దిశ నుండి చిగురించే దిశవైపు మనం బలవంతంగా మళ్లించనిదే మనసు ఏకాగ్రం కాదు. మనల్ని కదిలించే ప్రతీ సంఘటనా ఓ 'ఘటన' మాత్రమే అని దులపరించుకుని అడుగులు వేయనంత కాలం సరికొత్త చిక్కుముడుల్లో మనల్ని మనం ఇరికించుకుంటూ ఆ ఒరుపులను పళ్లకంటా భరిస్తూ భారంగా, జీవితాన్ని పూర్తిచెయ్యడమే 'జీవితం'గా నెట్టుకొస్తుంటాం. అందుకే అల్లకల్లోలం నుండి లిప్తపాటులో ప్రశాంతతలోకి జారుకోవడం సాధనతో సాధ్యం చేసుకోవాలి. అదే సాధ్యమైతే ఏదీ మనల్ని కదిలించలేదు. అందరు మనుషులు, అన్ని సంఘటనలు మన ముందు తమకు నిర్దేశించిన పాత్రలను పోషించి వెళ్తుంటే మనం ప్రశాంతంగా ప్రేక్షకుల్లా ఆనందంగా వినోదిస్తుంటాం. -
మీ నల్లమోతు శ్రీధర్
కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక ఆగస్ట్ 2009 సంచికలో ప్రచురించబడిన ఎడిటోరియల్
7 వ్యాఖ్యలు:
అద్భుతంగా వ్రాశారండీ ! నాలో కూడా చెలరేగే ఆలోచనలకు ఒక పొందికైన అక్షర రూపం ఇక్కడ చూస్తున్నాను.
చాలా బాగా వ్రాసారు. అభినందనలు.
శ్రీధర్ గారు చాలా చాలా బాగా వ్రాసారు.
శ్రీధర్ సార్, చాల చాల బాగ వ్రాశారు ఎప్పటిలాగనె. అందించినందుకు ధన్యవాధములు
well said.
అనుభవపూర్వకంఘా వ్రాసేదేదైనా ఇలా మనసుకు హత్తుకుపోతుంది. ధన్యవాదములు శ్రీధరగారు
అనుభవపూర్వకంఘా వ్రాసేదేదైనా ఇలా మనసుకు హత్తుకుపోతుంది. ధన్యవాదములు శ్రీధరగారు
Post a Comment