మనల్ని మనం ప్రేమించుకుందాం..
తల్లిదండ్రులన్నా, బిడ్డలన్నా, తోబుట్టువులన్నా, మనకు ఎనలేని ప్రేమ, అభిమానం! రక్తసంబంధాలే కాదు స్నేహితుల్లో, బంధువుల్లో ఏ ఒక్క కోణం నచ్చినా కల్లాకపటం లేకుండా మానసికంగా దగ్గరైపోతాం. మనిషి జన్మతఃనైజం ప్రేమించడం! ప్రేమతో ఆత్మీయుల మనసుల్లోకి ఒదిగిపోయి నప్పుడు మనల్ని మనం మైమరిచిపోతాం. కేవలం మనుషుల్నే కాదు మనలోని సున్నితత్వాన్ని తట్టిలేపే మొక్కల్నీ, ప్రేమతో పంచనచేరే జంతువుల్నీ అన్నింటినీ ప్రేమిస్తాం. అవును నిజ్జంగా మనకు విశ్వజనీయమైన ప్రేమను అందించే, ప్రేమని ఆస్వాదించే గొప్ప మనసు ఉంది. అంత గొప్ప మనసు ఉండీ ఆ మనసు ఎప్పుడూ ఒంటరిదే! అందర్నీ అక్కున చేర్చుకుంటాం కానీ మనకి మనం ఎప్పుడూ మిగలం. ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారూ అంటే తమనితాము ప్రేమించుకునేవారే! నిరంతరం ఇతరుల సంతోషంలో మనం ఆనందాన్ని వెదుక్కుంటాం. వారి మొహంలో ఆశించిన భావం ప్రతిఫలించకపోయినా, వారి మాటల్లో మనం కోరుకున్న భావోద్వేగం ఉట్టిపడకపోయినా మన మనసు నీరుకారిపోతుంది. తల్లి, బిడ్డ, భార్యా, భర్తా, సహోదరులు.. ఇలా మనం ఎవరైతే మన వాళ్లు అనుకుంటామో వారి ప్రతీ కదలికలోనూ అంతరార్థాన్ని ఒడిసిపట్టి విశ్లేషించి మనం అనుకున్న ఫలితం వస్తే సంతృప్తితో కడుపు నింపుకుంటాం. ఇలా ఆత్మీయుల కళ్లల్లో మెరుపుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసి చివరకు మనం సాధించేది ఏమిటీ అంటే నిస్పృహ. ఇంతగా ప్రపంచాన్ని ప్రేమించే మనం, ఇంతగా ఎదుటి వ్యక్తి శ్రేయస్కుని కోరుకునే మనం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మన కోసం మన ఆనందం కోసం ఒంటరిగా గడుపుతామా? చుట్టూ మనుషులు లేకపోతే జీవితాన్ని కోల్పోయిన భావన కలుగుతుంది.
ఎంత కావలసిన వారైనా మాట పట్టింపు వచ్చి అరక్షణం పలక్కపోతే ఆ మౌనం భరించరానిదౌతుంది. మనవాళ్లనుకుని ప్రేమని పంచిన వారి నుండి మన ప్రేమకు కనీస గుర్తింపు అయినా దక్కకపోతే మనసు చివుక్కుమంటుంది. ఈ ప్రపంచంలోకి ఒంటరిగానే వచ్చాం. ఒంటరిగానే పోతాం. మధ్యలో ఏర్పడే ఈ అనుబంధాల చిక్కుముళ్లపై అపేక్ష పెంచుకుని మనసుని మనల్ని మనం గాయపరుచుకుంటూ మనకంటూ మనం మిగల్లేక జీవశ్చవాల్లా ఒంటరి తనం అనుభవించడం ఎంత వరకూ సబబు? మనం ప్రేమిస్తున్నాం అనుకుంటున్న వారందరూ మనల్నీ అంతే అభిమానిస్తున్నారు అని భ్రమపడతాం. డబ్బు, హోదా, ధైర్యం, ఆరోగ్యం వంటివి ఉన్నంత వరకే మనకి దక్కే గౌరవాలు, ప్రేమలు అన్నీ! ఏ క్షణమైతే ఏ కారణం చేతైనా మనం భౌతిక బలాలను కోల్పోతాయో ఆ క్షణం మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించేవారు ఎవరూ ఉండరు. అందుకే మనల్ని మనం ప్రేమించడం అలవర్చుకోవాలి. మనకు మనమే ఉన్నాం. ఎవరూ లేకపోయినా ఈ ప్రపంచంలోకి మనం ఏం చెయ్యడానికి వచ్చామో మన ధర్మాన్ని మనం నిర్వర్తించి వెళ్లగలిగేలా ఒంటరి పోరాటాన్ని సాగించే ధీర్వతం చాలా ముఖ్యమైనది. ప్రపంచాన్ని ప్రేమిద్దాం అంతకన్నా ఎక్కువగా మనల్ని మనం ప్రేమించుకుందాం.
మీ
నల్లమోతు శ్రీధర్
"కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక సెప్టెంబర్ 2009 సంచిక సంపాదకీయం ఇది.
10 వ్యాఖ్యలు:
Chala Bagundhi.. Nice..
నిజమే.....మనల్ని మనం ప్రేమిస్తేనే ఎదుటివారిని కూడా ప్రేమించగలుగుతాము!
ఎవరికోసం వారే బ్రతుకుతారు, ఎవరి ఆనందం వారే కోరుకుంటారు.
అంతేకాని ఒకరి కోసం ఏదో త్యాగం చేస్తారన్న మీ పోస్ట్ లో నిజం లేదు. అది భ్రమ మాత్రమే.
చాలా బాగా చెప్పేరు. రాసిన శ్రీధర్ గారి కి, ఇక్కడ అందించిన మీకు ధన్యవాదాలు.
మీరు చెప్పింది చాలా నిజం !
@ఒక్క నిముషం గారు, థాంక్యూ
@ పద్మార్పిత గారు బాగా చెప్పారు.
@ a2zdreams గారు :)
@ భావన గారు, ధన్యవాదాలు.
@ మాలా కుమార్ గారు ధన్యవాదాలండీ.
ఆశకి అ౦తులేదు.ఆశి౦చడ౦ వలన చాలా నిరాశ కల్గుతు౦దని నేను అనుకు౦టాను.
చాలాచాలా బాగా రాశారు.
"ఎంత కావలసిన వారైనా మాట పట్టింపు వచ్చి అరక్షణం పలక్కపోతే ఆ మౌనం భరించరానిదౌతుంది."
నిజమండీ ...మనకంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తే ...అది ఎవరైనా భాగస్వామినైనా ,పిల్లలనైనా ,వేరెవర్నైనా సరే ...మనకు మీరన్న ధీరత్వం దూరమౌతుంది .బలహీనత ఆవహిస్తుంది .
శ్రీధర్ గారు ,మీ విశ్లేషణ చాలా బావుందండీ ...
జ్యోతిగారు థాంక్స్ !
@ సుభద్ర గారు, అవును మీరన్నది అక్షరాలా నిజం.
@ పరిమళం గారు.. నిజం! మన బలమల్లా మనుషులే మన బలహీనత అల్లా ఆ మనుషులే. సమూహంలో ఉండడంతోపాటు వ్యక్తిగానూ ఉండగలగడం మిస్ అవుతున్నాం. ధన్యవాదాలండీ.
Well said Sridhar,
ఇందులోని ప్రతిపదం నా మనసునుండి వచ్చినట్టుగా అనిపిస్తుంది.. థాంక్ యూ
Post a Comment