Monday, 21 September 2009

దేవుడిని చూడడానికి డబ్బులా???




దేవా అన్నా.. అల్లా అన్నా... జీసస్ అన్నా... ఏ మతస్థులైనా ఆ సర్వేశ్వరుడు తమ గోడు వింటాడు, తమని ఆదుకునేవాడు అని మనస్పూర్తిగా నమ్ముతారు. కాని ...

ఆ దేవుడిని చూడడానికి డబ్బులు ఎందుకివ్వాలి. ఈ నియమం పురాణాలనుండి లేదు కదా. మసీదుల్లో కాని, చర్చిల్లో కాని ఇలా దేవుని దర్శనం చేసుకోవడానికి డబ్బులు , టికెట్లు ఉంటాయా?? మరి మన గుళ్ళలోనే ఈ విధానం ఎందుకు? గుడిని అభివృద్ది చేయడానికా. ప్రసాదాల కోసమా. దేవుని పేరు చెప్పి మధ్యవర్తులు (ఇందులో చాలా మంది మహానుభావులు ఉన్నారు) తినడానికా.. ఆ టికెట్లు లేకుంటే ఆ దేవదేవుని దర్శించలేమా. అర్హత లేదా. కాస్త ప్రసిద్ధి చెందిన ప్రముఖ దేవాలయాలన్నింటిలో ఇలా తప్పనిసరి టిక్కెట్లు పెడుతున్నారు. మామూలు దేవాలయాలు ఎన్నో ఆదరణ లేక , దీపం కూడా పెట్టె దిక్కులేకుండా ఉన్నాయి.

తిరుపతి లో శ్రీనివాసుడికి డబ్బులకు కొదవా?? మరి ఆ దేవుని దర్శనంలో వేరు వేరు రూపాలలో టిక్కెట్లు ఎందుకు? సెల్లార్, అర్చనానంతర ఇలా.. ఒక్కో టిక్కెటు ఒక్కో ధర. ఆ దేవుని ఎలాగైనా చూడాలనే కోరికతో జనాలు కూడా విపరీతంగా టిక్కెట్లు కొంటున్నారు. ఇపుడు సెల్లార్ టికెట్ వంద రూపాయలు, అర్చనాంతర దర్సనం రెండు వందలు టిక్కెట్లు తీసేసి ఒకే టిక్కెట్ మూడు వందలు చేసారు. అది కూడా కొంటారు. భక్తులను ఇలా దోచుకోవడం ఎందుకు? తిరుమలకు నిధుల కొరతా?? పంతులు , దేవస్థానం వారి చేతిలో యాభై , వంద పెడితే మరి కొంచం సేపు గర్భగుడిలో నిలబడనిస్తారు. ఐదు వందలు మనవి కాదనుకుంటే ప్రసాదాలు మన రూముకే తెచ్చి ఇస్తారు. తిరుమల అంటేనే దోపిడీ అనేట్టుగా తయారైంది. అలా నోట్లు వెదజల్లలేని వాళ్ల సంగతి ఏంటి??


అందుకే నాకనిపిస్తుంది. కొన్నేళ్ళు దాటితే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నట్టు తిరుమల వెళ్లి చూడు అన్నట్టు అవుతుందేమో. ధర్మదర్శనం ఉంది కదా అంటారా?? ప్చ్..

శ్రీనివాసా !! నీ దగ్గరకు రాలేని పేదవాళ్ళం. నువ్వే రావయ్యా!!!

13 వ్యాఖ్యలు:

తెలుగు వెబ్ మీడియా

భక్తి అనేది వ్యాపారం అని మీకు ఇప్పటి వరకు తెలియదా? Tirumala Temple is richest temple in the world.

జయ

ఇంక తిరుపతికి పోగలమనేనా మీ ఉద్దేశం! నాకైతే చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామే తిరుమల మొక్కుల స్వామి. నా మొక్కులన్నీ ఇక్కడి దేవుడికే. మీరు కూడా ఇలాగే మీకు దగ్గిరలోని వెంకటేశ్వర స్వామి తో సద్దేసుకోండి. ఇంక అంతే కద మరి.

జ్యోతి

ఐదేళ్ల క్రిందవరకు మేము ప్రతిసంవత్సరం తిరుపతి వెళ్లవాళ్లం. ఇప్పుడు అసలు ఆ ఆలోచనే రావట్లేదు. మరీ ఇంత దారుణమా?? మా ఇంటికి దగ్గరలో ఉన్న టిటిడి వారి ఆలయం ఆ తిరుమలలోని దేవుడికి తీసిపోదులెండి. సద్దేసుకున్నాం. కనీసం పదినిమిషాలు కూర్చుని దేవుడిని చూడగలుగుతున్నాం ఇక్కడ..

చిలమకూరు విజయమోహన్

మనది లౌకికరాజ్యం కదండీ! హిందూ దేవాలయాల్లో ఇలా వసూలు చేసి మసీదులకు,చర్చీలకు ఖర్చుపెట్టాలికదా!

Chandamama

దేముడు సర్వాంత్ర్యామి అంటారు కదా!
గుడికి వెళితేనే పుణ్యం వస్తుంది అనుకోవడం అమాయకత్వం!
ఇంట్లో కూర్చునే శ్రద్దగా పూజిస్తే ఆ దేముడు పలకడా?
నిజంగా మనం తిరుపతిలో ఆ దేవదేవునిమీద మనసు లగ్నం చేయగలమా?
ఆదాయమొచ్చే మన గుడులు రాజకీయ అడ్డాలు కాదా?
టిక్కెట్లు లేకుండా చేస్తే ( ఆదాయం లేకుంటే ) నాయకులెవరైనా అటువైపు చూస్తారా?

శేఖర్ పెద్దగోపు

జ్యోతిగారు,
నాకు తెలిసి మిగతా ప్రాంతాల నుండి తిరుపతి వెళ్ళేవాళ్ళందరూ తిరుపతి దేవుని పట్ల చాలా గొప్పగా భయ, భక్తులతో ఉంటారు. కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే తిరుపతి దేవుని దగ్గర పని చేసే వాళ్ళ దగ్గర నుండి చుట్టూ వ్యాపారుల వరకు అసలు అలాంటి ఫీలింగ్సే ఉండవు. పూర్తి అవినీతి స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళకు దేవుని భయం వీసమెత్తు కూడా ఉండదు. నాకైతే మన కాలనీల్లో ఉండే గుడిలో చక్కగా దర్శనం చేసుకుంటే వచ్చే తృప్తి తిరుపతి వెళితే అస్సలు కలగదు.

నాగప్రసాద్

మీరు పొరబడుతున్నారేమో. గడచిన మూడు నెలల్లో, ఇప్పటికి మూడు సార్లు వెళ్ళాను తిరుమలకి. అంటే, దాదాపు నెలకొక్కసారి వెళ్ళాను. నేను ఎప్పుడు వెళ్ళినా ఉచిత దర్శనానికే వెళతాను. అయినప్పటికీ, నాకు ఏరోజూ కూడా దర్శనానికి రెండు గంటల సమయం మించి పట్టలేదు.

విచిత్రమేమిటంటే, శ్రీనివాసంలో ఉచిత దర్శనం టికెట్లు ఇచ్చే కౌంటరు వద్ద క్యూలైనులో 100 మంది ఉంటే, ప్రక్కనే ఉన్న, 50 రూపాయల టికెట్టు కౌంటరు వద్ద 1000 మంది ఉంటారు. :)

నిజానికి, ఎంతో దూరం నుంచి దాదాపు ఒకటి, రెండు రోజులు ప్రయాణం చేసి తిరుమలకు వచ్చిన వాళ్ళు కూడా, దర్శనం దగ్గరికి వచ్చేటప్పటికి, వెంటనే దేవుని దర్శనం జరగాలనుకుంటారు. ఆ క్రమంలో, వాళ్ళ ప్రయాణ ఖర్చులతో పోలిస్తే, 50 రూపాయలు తక్కువ మొత్తం కాబట్టి, ఆ డబ్బులు చెల్లించేసి, త్వరగా దర్శనం చేసుకోవాలనుకుంటారు. 100 రూపాయలు కేవలం వి.ఐ.పీ లకే కాబట్టి వదిలేశారు. లేకపోతే త్వరగా దర్శనం అవుతుందంటే, వంద రూపాయలు పెట్టడానికి కూడా ప్రజలు సిద్ధమే.

ఏం చేద్దాం. అంతా ఏడుకొండలవానికే ఎరుక. గోవిందా...గోవింద.

శ్రీలలిత

భగవంతుడు నమస్కారప్రియుడు. భక్తితో మనం పెట్టే నమస్కారమే ఆ దేవునికి ఎంతో ఆనందం కలిగిస్తుందని పెద్దలు చెపుతారు. ఆ విషయము నిరూపించడానికే చిలుకూరి బాలాజీ దేవాలయంలో హుండీ కూడా పెట్టనివ్వలేదు అక్కడి అర్చకులు. హుండీ ఉండదు. పోలీసులు ఉండరు. ఎవరికి వారే క్రమశిక్షణ పాటిస్తూ దర్శనం చేసుకుంటూంటారు. ఈ ఆర్భాటాలన్నీ మధ్యవాళ్ళకే.

కత పవన్

నిజమేనండి ..ఏ మతం లో లేని అచారం మనకు మత్రమే ఏందుకు.

భావన

మీరు ఇంకా ఏదో లోకం లో వున్నరు జ్యోతి, పొద్దుటే సెల్లర్ దర్శనాలకు, స్పెషల్ దర్షనాలు 500, 1000 rs ఐపోయాయి. డబ్బు కంటే కూడా రికమండేషన్ వుంటే పనులు బాగా అవుతాయి తిరుపతి లో, ఆ లైన్ లో ఒక కానిస్టేబుల్ కు తెలిసిన వాళ్ళం ఐనా చాలు. :-) అది తప్పో ఒప్పో కాని ఎంత బాధ పడ్డా ఒక్క సారి లోపలకు వెళ్ళి గోవిందా గోవిందా అంటు ఎదురు గా వున్న ఆ కల్యాణ మూర్తి ని చూస్తే అబ్బ ఒక్క సారి తలుచుకుంటేనే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి ఆనందం తో. మన ఈ బలహీనత ను ఆధారం గా తీసుకునే వాళ్ళు డబ్బు చేసుకుంటున్నారేమో.. ఇంక దేవుడు గుడిలోనేనా ఇంట్లో లేడా అంటే సర్వాంతర్యామి ఎక్కడ లేడు, మనలోనే వున్నవాడు మన ఇంటి లో వుండడా, కాని ఆ గుడి లో శ్రీ చక్ర ప్రతిష్టాపన జరగటం వలన స్వామి కి కళే కాదు మన మీద కూడా ఆ ప్రభావం వుంటుంది అంటారు, అంతే కాదు సాముహీకం గా చేసే ఏ పూజ ఐనా మంచి ఫలితాన్ని ఇస్తుంది కదా.. ఇంక చర్చ్ లు అంటారా లోపలకు వుచితం గా నే వెళ్ళవచ్చు కాని లోపలకు వెళ్ళేక ఒక్క సారి వాళ్ళు కూడా ఏమి వదలరు, :-) లిటరల్ గా హింస పెడతారు ఆ హింస తట్టు కోలేక చర్చ్ కు వెళ్ళటం మానేసిన స్నేహితులు వున్నారు నాకు ఇక్కడ. మసీదు తెలియదు మరి.

తెలుగు వెబ్ మీడియా

మసీద్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి లేదా మీటింగ్ పెట్టి చందాలు (జకత్) వసూలు చేస్తారు. చందా ఇవ్వకపోతే ఏమీ అనరు కానీ స్వర్గ సుఖాల మీద ఆశతోనో, నరకాగ్నిలో దహించబడతామన్న భయంతోనో చందాలు ఇస్తారు. అవిశ్వాసులు నరకాగ్నిలో దహించి వెయ్యబడతారని ఖురాన్ లో అనేక చోట్ల వ్రాసి ఉంది. హిందూ దేవాలయాలలో డైరెక్ట్ గా బెదిరించి వ్యాపారం చేస్తే మసీదుల వాళ్ళు ఇండైరెక్ట్ గా బెదిరించి వ్యాపారం చేస్తారు.

జ్యోతి

మీరందరు చెప్పింది నిజమే. మన భక్తిని వాళ్లు వ్యాపారం చేస్తున్నారు. వెళ్లకుండా ఉండలేము. దేవుడిని త్వరగా చూడాలనే ఆశతో ఈ లంచగొండితనం అలవాటు చేసింది మనమే. మన ఇంట్లో, మన వీధిలోని శ్రీనివాసుడు , తిరుమలలో కొలువైనవాడు అందరూ ఒక్కటే అనుకుంటే మేలనిపిస్తుంది.

కార్తీక్

the number one business in the world...........
anduke nenu gudukelladame maanesaa......
naa madilone nirantharam bagavanthuduntaadu........
seva chesi nappudu naa kallalone eduti vaariki bagavanthudu kanpisthadu.
verokari aakalilo devuduntaadu....
anni chotla unnappudu kevalam gudilo maathrame choodatam endukanDi.
wwww.tholiadugu.blogspot.com

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008