Monday, October 26, 2009

మనుషుల్ని జడ్జ్ చెయ్యగలమా.. (కంప్యూటర్ ఎరా నవంబర్ 2009 ఎడిటోరియల్)

మనం ఒకలా ఉండాలనుకుంటాము.. కానీ ప్రపంచం మనల్ని మరోలా స్వీకరిస్తుంది. మనం ఉండాలనుకునే దానికీ, మనం చేసే పనులకీ, ప్రపంచం మనల్ని అంచనా వేసేదానికీ పొంతనే చిక్కదు. మన గుణగణాలను ఉన్నవి ఉన్నట్లు గ్రహించడం లేదని సమాజంపై అసహనానికి లోనవుతాం. ఆ గుణాలను మరింత ప్రొజెక్ట్‌ చెయ్యాలని ఆరాటపడతాం. అయినా జనాల్లో చలనం ఉండదు. ఒకసారి మనల్ని తమ మనసులో ఒకలా స్థిరపరుచుకున్న తర్వాత ఆ బలీయమైన అభిప్రాయాన్ని వారి మనసు నుండి పెకిలించడానికి బ్రహ్మ దిగిరావలసిందే. ''వారు మనపై కలిగించుకున్న అభిప్రాయాలే నిజమా, వారు అనుకున్నదే మన నిజమైన వ్యక్తిత్వమా?'' అని ప్రశ్నించుకుంటే ''అస్సలు వారెవరు.. మనల్ని జడ్జ్‌ చెయ్యడానికీ?'' అంటూ ఎదురు తిరుగుతుంది మనసు. వాస్తవానికి అదే కరెక్ట్‌!! ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక బలహీనతనో, బలాన్నో మనలో చూసి ''ఈ మనిషింతే'' అని ముద్ర గుద్దేసుకోవడం అవివేకమే కదా. సో మనల్ని తప్పుగా అంచనా వేయడం ఎదుటి వారి తప్పు అని తెలిసినా, అవతలి వారి కన్నా మనమేమిటో మనకే పర్‌ఫెక్ట్‌గా తెలుసునని ఓ క్షణం భరోసా వచ్చినా అంతలోనే జారిపోతాం. మనకు మనపై కన్నా సమాజం మీద గమనింపు ఎక్కువ. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకున్నా ఫర్వాలేదు గానీ ఎదుటి వారు మాత్రం మనల్ని తక్కువ చూడకూడదు. మరొకరికి ప్రదర్శింపబడని అస్థిత్వాన్నే మనం జీర్ణించుకోలేం. నిద్రలేవడం ఆలస్యం అప్పటివరకూ నిశ్చలంగా ఉన్న మనసు నిండా ఒకటొకటిగా ఆలోచనలు ముప్పిరిగొంటూ ప్రపంచ రంగస్థలంపై నటింపజె య్యడానికి మనసుని సన్నద్ధం చేస్తుంటాయి.అదేంటో ప్రతీ వ్యక్తికీ తాను తప్ప చుట్టూ ఉన్న ప్రపంచంలోని సమస్త మానవాళీ అసమర్థులే! అలాంటి సమాజంలో ప్రక్క వ్యక్తి చేత మెప్పుదలని పొందడం కోసం మనం పడే ఆరాటం, ప్రక్క వ్యక్తి మనల్ని ఉన్నతులుగా ఒప్పుకోలేక పైపైన ప్రదర్శించే నాటకీయ మెచ్చుకోళ్లు, అవి మనసులోతుల నుండి వచ్చిన ప్రశంసలు కావని తెలిసినా, 'వాడంతే ఒట్టి అసూయాపరుడు' అని మనల్ని మనం సముదాయించుకుని మరోచోట అహాన్ని సంతృప్తిపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలు... ఛ ఎంత దుస్థితిలో కూరుకుపోయాం. ఓ చిన్న సంఘటన ఆధారంగా మనుషులు మనపై ఏర్పరుచుకున్న అభిప్రాయాలు జీవితాంతం వారి చేష్టల్లో కొట్టొచ్చినట్లు కన్పించినప్పుడల్లా 'అయ్యో నేను అలా కాదు.. ఇలా కదా! ఎందుకు వారు అలా అనుకుంటున్నారు' అని మనసు మూలుగుతుంది. అంత అవసరం ఏమొచ్చింది? మనకు మనం అర్థమవడానికే ఈ జీవితం సరిపోదు. అలాంటిది మనల్ని ఎదుటివారు అర్థం చేసుకున్నామనుకోవడమూ, ఓ ముద్ర తగిలించేయడమూ, దాన్ని మనం ఒప్పుకోలేక మూలగడమూ అవసరమా? అవతలి వ్యక్తికి మనల్ని చూసి ఏదో ఒక ముద్ర అది మంచిదో, చెడ్డదో త్వరగా వేసుకోకపోతే వాళ్ల గురించి వాళ్లు ఆలోచించుకోవడానికి, వారి పాత్రలను పోషించడానికీ సమయం సరిపోవద్దూ! జీవితపు ఏ దశలో అయితే సామాజికగౌరవాలపై వ్యామోహం తగ్గుతుందో అప్పుడే ఈ నాటకానికీ, నటనలకూ తెరపడుతుంది.

మీ
నల్లమోతు శ్రీధర్

7 వ్యాఖ్యలు:

తృష్ణ

చాలా బాగుందండీ ఆర్టికల్...

"మనకు మనం అర్థమవడానికే ఈ జీవితం సరిపోదు. అలాంటిది మనల్ని ఎదుటివారు అర్థం చేసుకున్నామనుకోవడమూ, ఓ ముద్ర తగిలించేయడమూ, దాన్ని మనం ఒప్పుకోలేక మూలగడమూ అవసరమా?"


ఈ ప్రశ్న నేనూ చాలా సార్లు ఈ మధ్యన వేసుకుంటున్నాను..jyothi gaaru thankyou for publishing a fantastic article...and Thanks to Sridhar gaaru for penning such good thoughts..!!

pracher

నేను కూడా ఇదే విషయం గురించి గత ౩ నెలలుగా తెగ ఆలోచిస్తున్నాను ....
సరిగ్గా నా మనసులో ఏమనుకున్టున్నానో అదే రాసారు ...
నేను అవతలి వారికి సరిగ్గా అర్థం కాలేదు నన్ను నేను సరిగ్గా ప్రాజెక్ట్ చేస్కోలేదు అనే భావన...
హమ్మయా నేను ఒంటరిని కాను .... ఇది చాలు నాకు

చిలమకూరు విజయమోహన్

ఒక జాతి పక్షులు ఒక గూడు చేరతాయన్నట్లు మనందరి భావన ఒకేలా ఉన్నట్లుంది.

Unknown

తృష్ణ గారు, రాజ్ గారు, విజయమోహన్ గారు మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలండీ.

జ్యోతి

"అస్సలు వాళ్లెవరు??మనను జడ్జ్ చేయడానికి.. Well said Sridhar..

కొత్త పాళీ

"అదేంటో ప్రతీ వ్యక్తికీ తాను తప్ప చుట్టూ ఉన్న ప్రపంచంలోని సమస్త మానవాళీ అసమర్థులే!"

కదా! నా మనసులో ఆలోచన భలే పట్టుకున్నారు. :)

భావన

హ్మ్మ్.. ఎంతో క్లిష్టమైన జీవితానికి సరి పడ ప్రశ్న కు సమాధానాన్ని ఒక రెండు పేరా లలో చాలా బాగా చెప్పేరు శ్రీధర్. బాగుంది.
మరొకరికి ప్రదర్శింప బడని అస్తిత్వం ప్రతి ఒక్కరిలో లోపల కోకొల్ల లు గా పుష్కలం గా వుంటుంది.. నువ్వంటే ఏమిటో నీకు అర్ధం ఐన రోజు... నా నేను, మీ నేను... ఒకటే ఐనప్పుడు ఇంక సంక్లిష్టత లు తగ్గుతాయి. సంపూర్ణ అస్తిత్వం ఏర్పడుతుంది.. నా నేను... నేను గా వున్నా, అది నీకు ఎలా అర్ధం ఐతే అలానే తీసుకో అనే స్తిరత్వం వస్తుంది అదే విశ్రాంతి నిస్తుంది.. మానసిక శాంతి నిస్తుంది. నాటకానికి తెర పడుతుంది.. అవునా.. :-)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008