Saturday, October 10, 2009

ఆటలు -పాటలు

ఆడేవి ఆటలు పాడేవి పాటలు కాని ఆటపాటలేంటి?? ఆటలు శారీరక వ్యాయాయం ఐతే పాటలు మానసిక వ్యాయాయం. వీటివల్ల మనసు, శరీరం రెండూ సేదతీరుతాయి, ఉత్తేజితమౌతాయి అని అందరికి తెలుసు .కాని ఈనాడు పిల్లలకు చదువు తప్ప ఆటపాటలంటే ఆసక్తి లేదు, సమయం కూడా దొరకడం లేదు.వాళ్లకు తెలిసిన ఆటలు టీవీలో వచ్చే క్రికెట్, లేదా వీడియో ,కంప్యూటర్ గేమ్స్. వాటివల్ల ఇంట్లోనే కదలకుండా ఆటలు ఆడుతున్నారు. అవి ఏమన్నా వాళ్లకు ఉపయోగకరమా అంటే అదీ లేదు.

కాని ఆనాటి అంటే నా చిన్నప్పటి బాల్యం ఎంత అందమైనది. ఎన్నెన్ని ఆటలు. వాటితో పాటు పాటలు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అని ఒక సినీకవి అన్నట్టు పాటలు పాడుతూ ఆటలాడితే అలుపెమున్నది కదా.. ఈ ఆటలు ఆడాలంటే ప్రత్యేకమైన స్థలం అంటూ అవసరం లేదు. ప్రఎకమైన పరికరాలు లేవు. ఇంటి పెరట్లో ,డాబా మీద, పార్కులలో, స్కూలు గ్రౌండులో. ఎక్కడైనా కాసింత స్థలం దొరికితే చాలుఆటలు మొదలెట్టడమే. అపుడప్పుడు క్లాసులో టీచర్ రాకుంటే కూడా ఆటలే. స్కూలు పాఠాలతో అలసిన వేళ ఈ ఆటలు ఉల్లాసాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు.వేసవి వచ్చిందంటే చాలు పిల్లలు ఒకదగ్గర చేరి ఆటలే ఆటలు. చుట్టుపక్కల ఎవరైనా ఇల్లు కడుతున్నారంటే వాళ్లకు తెలీకుండా, చూడకుండా కొంచం ఇసుక ఎత్తుకోచ్చేసి కుప్పలా పోసి అందులో అగ్గిపుల్ల పెట్టి వెతుక్కోవడం. పిల్లలందరూ గుండ్రంగా కూర్చుని ఒకరి పిడికిలిపై మరొకరి పిడికిలి కొండలా పెట్టి గుడు గుడు గుంచం గుండె రాగం అంటూ పాడడం గుర్తుందా..

ఇక అమ్మాయిలందరికీ ఇష్తమైన ఆట..పాట.. ఒప్పులకుప్ప ఒయ్యారి భామా.. అంటూ చేతులు పట్టుకుని గిర్రున బొమ్మల్లా తిరుగుతూ ఎన్నో విన్యాసాలు చేసె అమ్మాయిల ఆనందం అలవికానిది. ఆడే వాళ్ళకంటే చూసేవాళ్ళకు భయమేస్తుంది.పడిపోతారేమో అని.
అమ్మాయిలకే పరిమితమైన మరో ఆట చెమ్మచెక్క చారెడేసి మొగ్గ ,, అట్లు పోయంగా ఆరగించంగా ముత్యాల చెమ్మచెక్క ముగ్గులేయంగా రత్నాల చెమ్మచెక్క రంగులేయంగా ... ఇలా లయబద్ధంగా సాగిపోతుంది. పాటతో పాటు పిల్లల చేతులు కూడా కదులుతాయి.

వాన చినుకులు పడుతున్నాయి. పిల్లలకు ఉషారు వచ్చింది. ఇంట్లో కాళ్ళు నిలవనంటున్నాయి. అమ్మ చూడకుండా బయటకు పరిగెత్తి , చేతులు బార్లా చాచి ఆకాశాన్ని చూస్తూ చినుకులలో తడుస్తూ పాడే వానా వానా వల్లప్పా ,, వాకిలి తిరుగు చెల్లప్పా అని హాయిగా పాడుకునే బంగారు రోజులు కదా.

ఒకరి వెనకాల ఒకరు చేరి షర్టు,గౌను అంచుపట్టుకుని మొదట్లో ఉన్నవారు కూత పెడుతూ పాడే చుక్ చుక్ రైలు వస్తుంది, పక్కకు పక్కకు జరగండి ... ఇక చెట్టు లేదా దిమ్మె కనిపిస్తే చాలు చీర లేదా దుప్పటి తీసి ఉయ్యాల కట్టేయడమే. ఇష్టమొచ్చినా పాటలు పాడుకుంటూ సమయమనేది తెలీకుండా ఊగుతుంటే మనసు అలా అలా తేలిపోయేది. అయినా అప్పట్లో ఈ టీవీలు , వీడియోలు ఎక్కడివి. అమ్మమ్మ,నానమ్మ చెప్పే పాటల పాఠాలు ఎన్నో .. మామా,మామా ,,మామిడి పండు, తారంగంతారంగం... చిట్టి చిట్టి మిరియాలు ,, బుర్రు పిట్ట బుర్రు పిట్ట,, చందమామ రావే,, చిట్టి చిలకమ్మా అమ్మా కొట్టిందా...


మీకు గుర్తుందా.. స్కూలులో ఇంటర్వెల్ లో దొరికే కొద్దిసమయం, లంచ్ టైంలో తొందరగా తినేసి ఆటలాడుకోవడం. బెల కొత్తగానే క్లాసులోకి పరిగెట్టడం.. చిన్నప్పుడు నేను ఆడిన ఆటలు, పాటలు ,అందమైన అనుభూతులు ఇప్పటికీ మరిచిపోలేనివి. ఈ కంప్యూటర్, వీడియో గేమ్స్ కూడా వాటిని తలదన్నేవి లేవు . మీరేమంటారు??

9 వ్యాఖ్యలు:

Suresh

జ్యోతి గారు,
ఈ కాలం పిల్లలకు టి.వి, కంప్యూటర్ తప్ప వేరే ప్రపంచం లేకపోవటంతో ఇలాంటి చక్కనైన ఆటలను మర్చిపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఇంత మంచి ఆటలను వీడియోలుగా అందించడమంటే నిజం గా చాలా గ్రేట్ అండి.

sunita

అందరూ మర్చిపోయి ఇహలేవేమో అనుకున్న ఆటలు పాటలతో సహా చూపెట్టారు. థాంక్స్.

నీహారిక

ఎక్కడ సంపాదించారండీ ఈ విడియో లను?

Anonymous

ఏంటో , మళ్ళీ ఆ ఆటలన్నీ మనపిల్లలు ఆడుకొనే రోజొస్తుందంటారా? ఇలా వీడియోలు చుసుకు సంబరపడాల్సిందేనా.

సుజాత వేల్పూరి

అమ్మో, ఎక్కడ సంపాదించారు వీటిని? మా పాపకు చూపెట్టాల్సిందే!

శ్రీలలిత

మళ్ళీ చిన్నప్పటి పాటలు గుర్తు చేసారు. ధన్యవాదాలు.

జ్యోతి

గీతలహరిలో పెట్టడానికి రవివైజాసత్య ఈ వీడియోలు చూపించారు. కొన్ని మాత్రమే అందులో పెట్టాను.సరే ఎలాగు రాస్తున్నాను కదా అని యూట్యూబ్ లో పిల్లల వీడియోలు వెతికి పెట్టాను. చిన్నపిల్లలకు కనీసం సెలవురోజుల్లోనైనా ఇవి చూపించి ఆ ఆటలు నేర్పించండి.

పరిమళం

గుర్తుకొస్తున్నాయీ ......గుర్తుకొస్తున్నాయీ ......

తెలుగుకళ

మాడమ్.. హాట్సాఫ్... మీరు డైనమిక్క ని అందరూ అనేది ఇందుకేమరి... :)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008