Tuesday, 10 November 2009

వలువలు -విలువలు

మనిషికి వేషభాషలు రెండూ ముఖ్యమే. వేషం బాహ్య జీవితానికి అద్దం పడితే , భాష ఆతని ఆంతరంగికం. మాట్లాడే భాష ఒకటి, రెండు లేదా మూడు ఉండొచ్చు.కాని వేషం పలురకాలు. వ్యక్తి చదువు, సంస్కారం, పాండిత్యం కంటే ఈ వేషధారణే ప్రముఖ పాత్ర వహిస్తుంది అని చెప్పవచ్చు. అపరిశుభ్రంగా ఉన్న పండితుడికి ఎటువంటి గుర్తింపు ఉండదు. కాని డాబుసరి వేషధారణతొ పామరుడైనా ఎంతోమందిని ఆకట్టుకుంటాడు. కొద్దో గొప్పో ఆదరణ పొందుతాడు. ఒక వ్యక్తిని చూడగానే ముందుగా మనకు కనిపించేది అతని వేషధారణ. అందుకే ఎంతటి గొప్పవాడైనా అతను కట్టినబట్ట కూడా ఖరీదైనదిగా ఉండక తప్పదు. అందుకేనేమో ఉండేల మాలకొండారెడ్డిగారు తమ "మడివేలు" కవితలో ఇలా అన్నారు.

పీతాంబరుని బిల్చి పిల్లనిచ్చిన మామ
గజ చర్మ ధారికి గరళ మిచ్చే
దొర వేషమునకు విందులనొసంగు గేస్తు
చింపిగుడ్డల వాని సీత్కరించె
అద్దె గుడ్డల వాని కర్ధాసనం బిచ్చె
కౌపీన ధారిని కసరి కొట్టె
జలతారు ముసుగున్న శిలను దైవమ్మనె
త్రొవ కడ్డంబైన తొలగదన్నె
వలువలను బట్టి లోకాన విలువ హెచ్చు

కట్టిన బట్టను బట్టి వ్యక్తి విలువ, గౌరవం ఉంటాయని అనుభవైకవేద్యం కానిది ఎంతమందికి?

అవునూ మనుషులకు పట్టు, నూలు వగైరా ఎన్నో రకాల వస్త్రాలు ఉండగా. దేవతలకు పీతాంభరం, శుక్లాంభరం .. ఈ రెండే బట్టలా? వాళ్లు నూలు బట్టలు కట్టరా? దొరకవా? అసలు సంగతేంటి??

దానికి కూడా సమాధానమిచ్చాడు ఉండేలకవి..
చాకివాని తోడ జగడాలు పడలేక
సిరిగలాడు పట్టు చీర గట్టె
శివుడు తోలు గట్టె"సీ"యని మదిరోసి
భైరవుండు చీర పారవేసె !!

ఇది మరీ బావుంది. చాకలివాడితో గొడవపడి విష్ణువు పట్టువస్త్రాలు కడితే, శివుడు తోలు కట్టాడంట..

కాని అదే రజకుడు ఎంత గొప్పవాడో ఉండేలవారే ఇలా చెప్పారు.

నీరదావృతమైన నీలాంబరమ్మును
కౌముదీ జలముతో కడుగు నెవడు
చంద్రికా సరసిలో శరదభ్ర శకలములే
పిండి, గాలికి ఆరవేయునెవడు
దెసమొలతోనున్న తీవపూబోండ్లకు
చిగురు చీరలనందజేయునెవడు
భూదేవి పదముల పొరలాడు కడలేని
కడలి కుచ్చెళ్లను మడచునెవడు
యుగ యుగమ్మున నొక మారుదయమంది
కలుష హృదయాల నమృతాన కడుగు నెవడు
విశ్వకర్త అతండు నీ వృత్తివాడు
ఇంత గౌరవ భాగ్యమింకెవరి కబ్బు.

మురికిని ఉతికి,పిండి ఆరవేసేవాడు చాకలివాడు. మాలిన్య ప్రక్షాళన చేసెడి రజకుడికి విశ్వకర్మ అని కీర్తించడం సబబేమో..

గత వారం ఒక పెళ్ళికి వెళ్తే చాలా మంది ముందు కట్టుకున్న బట్టలు, నగలు చూస్తున్నారు.చూస్తూనే ఉన్నారు. అది చూసి చిరాకేసి రాసిన టపా ఇది..

4 వ్యాఖ్యలు:

విశ్వ ప్రేమికుడు

బాగా రాశారు. వేషాన్ని బట్టి అతని వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు. వృత్తిని బట్టి ఆ వేషము నిర్ణయింప బడి ఉంటుంది. ఆఫీసుకు లుంగీ కట్టుకు వెళ్లలేం కదా!?
అలాగే చీర కట్టిన స్త్రికి ఇచ్చే గౌరవంలోనూ, జీన్స్ వేసిన అమ్మాయిని చూసే విధానంలోనూ తేడాను నాకనులారా చాలా సార్లు చూశాను. ఈ విషయమై నా బ్లాగులో కాస్త చర్చ కూడా జరిగింది.

వీలైతే చదవండి.

http://premikudu1.blogspot.com/2009/08/blog-post_19.html

జ్యోతి

విశ్వప్రేమికుడుగారు,

మీరు చెప్పింది పిల్లల ప్రేమ గురించి.కాని ఇక్కడ నేను చెప్పాలనుకున్నది మనిషి దరించిన దుస్తులు,ఆభరణాలను బట్టి వారికి తగు మర్యాద ఇవ్వబడుతుంది. ఇది నాకు నాలుగు రోజుల క్రింద జరిగిన స్వానుభవం. ఆపీసులు,కాలేజీలకు వేసుకునే దుస్తుల గురించి కాదండి.. ఆవసరార్ధం అవి తప్పవు కదా.

శ్రీలలిత

Dress makes man అని ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది. నువ్వు కట్టుకున్న బట్ట, కట్టిన విధానాన్ని బట్టి నీ గురించి చెప్పవచ్చు అనేవారు. ఎటువంటి బట్ట కట్టేవో చూసి దానికి తగిన గౌరవం ఇస్తున్నారు. కొల్లాయి కట్టినా కూడా ప్రపంచ ప్రఖ్యాత కీర్తి పొందగలగడం ఒక్క మహాత్మునికి మాత్రమే చెల్లింది. అందరూ మహాత్ములు అవలేరు కదా.. సగటు మనిషి ఆలోచన ఎదురుకుండ కనపడే దానిమీదే ఉంటుంది కాని లోపలి మనిషిని చూడగలగడం అందరికీ తెలీదు కదా.. పాపం ..అర్భకులు.. వాళ్ళని క్షమించెయ్యండి..

Anil Dasari

వస్త్రాలని చూసి మనుషుల్ని అంచనా వేసే విధానం .. కాలానికి తగ్గట్లు మారిపోతుందనుకుంటాను. జీన్స్ వేసుకుంటే జులాయి అన్న అర్ధం ఉండేది ఒకప్పుడు. అదే జీన్స్ ఇప్పుడు నవతరానికి, నూతన పోకడలకి చిహ్నం. పంచె కట్టు ఒకప్పుడు పెద్దరికానికి గుర్తయితే, ఇప్పుడు మరుగైపోతున్న పాత తరానికి గుర్తు. తెలుగునాట మహిళలకి పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం చీర నిత్యాహార్యం, చుడీదార్ పార్టీల్లో ప్రత్యేక ఆకర్షణ కోసం. ఇప్పుడు పరిస్థితి దానికి పూర్తి భిన్నం. మనుషుల్ని అంచనా వేసే పద్ధతులూ దానికి తగ్గట్లే మారాయి. కాకపోతే, వస్త్రధారణ ఏదైనా .. సదరు వలువ ఖరీదు ఆయా వ్యక్తుల దర్పాన్ని ప్రతిబింబించటం అనేదుందే .. అది మాత్రం ఎప్పటికీ మారని విలువ.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008