Tuesday, December 29, 2009

తర్కమా.. సత్యమా? (కంప్యూటర్ ఎరా జనవరి 2010 ఎడిటోరియల్)

ప్రతీ ఆలోచనకూ, సూచనకూ, నమ్మకానికీ, భావోద్వేగానికీ ఒక కారణం కావాలి. అప్పుడే అది చెల్లుబాటవుతుంది. తర్కానికి నిలవనిదే, ఓ బలమైన కారణం లేనిదే దేన్నీ అంగీకరించనంత జఠిలమైపోతున్నాం. ప్రతీదీ నిరూపితం, ప్రదర్శితం అయితే తప్ప మన బుర్రకు ఎక్కదు. అయితే జీవితంలో ఎన్నో సత్యాలు ఛాయామాత్రాలుగానే మనకు తారసపడతాయి తప్ప మనల్ని నమ్మించి ఒప్పించగలిగినంత బలమైన ఆధారాలతో ప్రతీదీ చోటుచేసుకోవాలంటే కష్టం. సత్యాల్లోని అస్పష్టతని గ్రహించలేకా, ఒకవేళ గ్రహించినా జీర్ణించుకోలేకా తర్కంతో తోసిపారేస్తుంటాం. తర్కాన్ని ఎంతగా వంటపట్టించుకున్నామంటే.. తిమ్మిని బమ్మి చేసైనా మన వాదనని నెగ్గించుకుని గర్వించేటంత! లాజిక్‌ మనుషుల్ని ఇట్టే ఒప్పిస్తుంది.. కానీ ఆ ఒప్పుకోలులో సంతృప్తి ఉండదు. మనసులో ఏ మూలనో ఆ వాదన సమంజసమైనది కాదని పురుగు తొలుస్తూనే ఉంటుంది. కానీ ఆ అస్పష్టతకు ఒక రూపం ఇచ్చి లాజిక్‌ని నిర్మించినంత బలంగా ఎదురు నిలపగల ఆలంబన దొరకదు. అందుకే ఎదుటి వ్యక్తుల లాజిక్‌తో కూడిన వాదనల ముందు అసంతృప్తిగానే మౌనంగా తలదించుకుంటాం..!వాదనల్లో ఓడిపోయినంత మాత్రాన సత్యాలు అసత్యాలైపోవు. బుద్ధి చేసే తార్కిక విశ్లేషణల జల్లెడకు దొరకని అంశాలెన్నో మనసుని తాకుతూనే ఉంటాయి. అందుకే ఎంత ప్రాక్టికల్‌గా ఆలోచించే వారైనా కొన్ని క్షణాలు ఆలోచనలో పడతారు. ఆ ఆలోచన బుద్ధి నుండి కలిగే విశ్లేషణ కాదు. బుర్రని శూన్యంగా చేసి మనసు చప్పుడులను వినే ప్రక్రియ. ఇంత తతంగం ఏదీ చోటుచేసుకోలేని పై పై స్థాయిల్లోనే మన ఆలోచనా స్రవంతి సాగుతుంటే లోపం మనలోనే ఉన్నట్లు! ప్రమాదం ఏమిటంటే మితిమీరిన తర్కం అహాన్ని పెంచుతుంది. ప్రతీదీ తెలుసునన్న మిడిసిపాటుతనానికి గురిచేస్తుంది. ఆ ధోరణి అందరి బుర్రల్ని ఆలోచింప చెయ్యగలుగుతుంది తప్ప మనసుల్ని స్పృశించలేదు. కారణం అసలు సత్యమేమిటన్నది అందరి మనసుల్లో అస్పష్టంగానైనా కదలాడుతూనే ఉంటుంది. దేన్నయినా మూర్ఖంగా వాదించే తత్వం వదిలేయాలి. లేదంటే అందరూ మనల్ని అంగీకరిస్తున్నట్లు భ్రమింపజేస్తూనే మనల్ని తమ పరిధి నుండి బహిష్కరిస్తుంటారు. తర్కం వల్ల మరో ప్రమాదమూ పొంచి ఉంటుంది. తర్కం ప్రతీ మనిషికీ ఉండే సౌకుమార్యపు మనసుని పట్టించుకోదు. మొండిగా వాదించడమే దాని గమ్యం. ఆ వాదనలో నోటి నుండి ఎన్నో అపశ్రుతులు జాలువారుతుంటాయి. అవి నేరుగా ఎదుటి వ్యక్తి మనసుని గాయపరుస్తుంటాయి. గాయపడిన మనసు జీవితాంతం మనల్ని విశ్వసించదు. అందుకే తర్కాన్ని నమ్ముకుని మాటని నెగ్గించుకుని అందరిలో గొప్పగా చెలామణి కావడం కోసం మనసుల్ని, మనుషుల్ని దూరం చేసుకోవడం తగదు. వ్యక్తుల మధ్య నమ్మకం, బంధాలకు బలాన్ని చేకూర్చేది ఒకవేళ అసత్యమైనా ఫర్వాలేదు గానీ.. ఒకరినొకరు ఒప్పించుకునే క్రమంలో మనసుల్ని గాయపరుచుకోవడం మాత్రం అభిలషణీయం కాదు. మనం ముఖ్యం.. వాదన కాదు!!మీ
నల్లమోతు శ్రీధర్

8 వ్యాఖ్యలు:

వీరుభొట్ల వెంకట గణేష్

Excellent.

M.Srinivas Gupta

గురువు గారు, మీరు మంచి తత్త్వవెత్త, మనసుల్ని చదువుతారు.

Ravi

ఇన్నాళ్ళకు వాదనల గురించి సరైన విషయం చదివానండీ!
నేను ఎన్నో సార్లు వాదించి ఓడిపోయాను. కానీ ఓడిపోయిన ప్రతీ సారి మళ్ళీ ఏదో ఒక ఆలోచన దానికి వ్యతిరేకంగా వస్తూనే ఉంటుంది. కాబట్టి వాదనలన్నవి ఎడతెగనివి. వాటిలో పడితే మనకి చివరికి మిగిలేది అశాంతే....

కనకాంబరం

చాల గొప్ప సమస్య పై చర్చకు పునాది వేశారు.సత్యాసత్యాలు,తర్కవితార్కాలు,వాస్తవ విశ్లేషణలు.
వాస్తవ విశ్లేషణ కై వివరణ యిచ్చే ప్రయత్నం తర్కమైతే,దాన్ని కేవలం వాదన కొరకు తన మనసును మభ్యపెట్టుకుంటూ చేసేది వితర్కం .కేవలం మంచి చెడుల విశ్లేషణా అవగాహన, వుపన్యాస సామర్ధ్యాలు పెంపొందించుకొనేందుకు, నూత్న విషయ పరిగ్నాన సేకరణకూ తర్కవితర్కాలు పనికి వస్తాయి కాని,మితిమీరితే విక్రుతంగా మారి కుతర్కంగా మారి, దానినే వాస్తవమని నమ్మించాలనే యత్నంలో ,వ్యక్తిత్వాల్లో తీవ్ర మార్పులు సంభవించే ప్రమాదం వుంది. అభినందనలలో...నూతక్కి

పరిమళం

"వ్యక్తుల మధ్య నమ్మకం, బంధాలకు బలాన్ని చేకూర్చేది ఒకవేళ అసత్యమైనా ఫర్వాలేదు గానీ.. ఒకరినొకరు ఒప్పించుకునే క్రమంలో మనసుల్ని గాయపరుచుకోవడం మాత్రం అభిలషణీయం కాదు"
అద్భుతమైన ఎడిటోరియల్ శ్రీధర్ గారూ!
@ జ్యోతిగారు , ధన్యవాదాలు

శ్రీలలిత

వాదన అనేది రెండువైపులా పదునున్న కత్తి లాంటిది. వాదించే సామర్ధ్యం ఉన్నప్పుడు ఎటువైపునుంచైనా వాదించి గెలవవచ్చు. కాని ఆ గెలుపు మన చుట్టూ ఉన్న వారిని సంతోషింప చేసేదయితే మనకీ, సమాజానికి కూడా పురోభివృధ్ధి ఉంటుంది. కాని దయితే సమాజం జనారణ్య మవుతుంది.

Anonymous

వాదన వల్ల మిగిలేది వేదన . బాగా చెప్పరు.
శ్రీధర్ గారూ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Unknown

@ వెంకట గణేష్ గారు, ధన్యవాదాలు.

@ శ్రీనివాసగుప్త గారు, మీ కాంప్లిమెంట్ నా పరిపక్వ స్థాయికి మించినది. ధన్యవాదాలు.

@రవిచంద్ర గారు, మీరన్నది నిజం, చాలా సందర్భాల్లో మూర్ఖపు వాదనల వల్ల అశాంతి కలుగుతుంది. ధన్యవాదాలు.

@ రాఘవేంద్రరావు గారు, "వాస్తవ విశ్లేషణ కై వివరణ యిచ్చే ప్రయత్నం తర్కమైతే,దాన్ని కేవలం వాదన కొరకు తన మనసును మభ్యపెట్టుకుంటూ చేసేది వితర్కం" అంటూ చాలా బాగా చెప్పారు. స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు.

@ పరిమళం గారు, మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలండీ.

@ శ్రీలలిత గారు, వాదన అనేది రెండు వైపులా పదునున్న కత్తి అన్నది నిజం. ధన్యవాదాలు.

@ లలిత గారు, నాలుగు పదాల్లో భలే చెప్పారు. ధన్యవాదాలండీ.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008