Sunday, April 25, 2010

మస్తు మస్తు సైన్మ ...

హీరో బైక్ మీద హీరోయిన్ కోసం వచ్చాడు. కాని అక్కడి వాచ్‌మెన్ తను శ్రీశైలం యాత్రా స్పెషల్ బస్సులో వెళ్లింది అని చెప్తాడు.
శ్రీశైలం యాత్రా స్పెషల్ బస్సు వెళుతూ ఉంది.
హీరోయిన్ తల కిటికీకి ఆనించి దిగాలుగా ఉంటుంది.
హీరో బైక్ మీద ఆ బస్సును వెంబడిస్తుంటాడు.
అలా వెళుతూ ఉండగా ఒకచోట బస్సు తిరగబడుతుంది.
ఆ చుట్టుపక్కల హీరో తప్ప ఎవరూ లేరు కాబట్టి అతను వెంటనే బైక్ ని పడేసి తిరగబడి మంటలు చెలరేగుతున్న బస్సునుంది ప్రయాణీకులను కాపాడతాడు. శబాష్. హీరో కదా మరి..
చివర్లో హీరోయిన్ సీట్ల మధ్య కనిపిస్తుంది. తనను ఎత్తుకుని బయటకు తీసుకొచ్చిన మరుక్షణం బస్సు పేలిపోతుంది. ముందే పేలితే ఎలా??
సీన్ కట్ చేస్తే....

గాయపడినవారిని హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ లో చేర్పిస్తారు.
డాక్టర్లు హీరోని పక్కకు పిలిచి " తనకు (అంటే హీరోయిన్ కి అన్నమాట) బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఐంది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. సుమారు ఏడెనిమిది లక్షలు ఖర్చవుతుంది. తొందరగా ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి (షాపు కెళ్లి బఠానీలు కొనుక్కురండి అన్నంత తేలికగా) లోపలికి వెళ్లిపోతాడు.

డబ్బు దొరక్కుంటే మేనమామ కూతురిని చేసుకుంటానని పదిలక్షలు(మందులు, టిప్పులు గట్రా కలిపి మరి కాస్త ఎక్కువ ఖర్చవుతుందని రెండు లక్షలు ఎక్కువ అన్నమాట) కట్నం సొమ్ము తీసుకుని హీరోయిన్ కి ఆపరేషన్ చేయిస్తాడు. మంచిదే...

ఆపరేషన్ సక్సెస్. హీరోయిన్ ఓకే. అంతవరకు హీరో ప్రేమని ఒప్పుకోని ఆమె ఇంకో అమ్మాయి చెప్పిన లేదా వినిపించిన ఫోన్ మెసేజ్ ని వినేసి , చటుక్కున మనసు మార్చుకుని అతనికోసం స్టేషన్ (పోలీసు కాదు రైల్వే స్టేషన్) కి వెళుతుంది. కొద్ది సేపు డ్రామా అయ్యాక హీరో, హీరోయిన్లు కలుస్తారు.

కహాని ఖతం.

నేను చూసింది ఈ జరంత సిన్మానే .. నాకు తెల్వక అడుగుతా.. ఈరోయిన్ను ఈరో కాపాడాడు. బస్సులో ఉన్నోళ్లందరినీ కూడా.. ఆపరేషన్ ఐనంక నాకో సంగతి అస్సలు సమజ్ కాలే.. దిమాక్ ల రక్తం గడ్డ కట్టిందని డాక్టర్ చెప్పిండు కదా. మరి ఆపరేషన్ ఐనంక చూస్తే తలమీద ఒక్క ఎంటిక కదల్లేదు. ఇంక రంగు కూడా ఏసిండ్రు. ముఖానికి రంగు కూడా మస్తుగుంది.. ఎనిమిది లచ్చలు పెట్టి ఏం చేసిండ్రబ్బా అని సోచాయించిన. తెల్లారో, రెండ్రోజులకో ఈరోయిన్ మాట్లాడుతుంటే మెడకాయ మీద పట్టి ఉంది. ఓహో ఆపరేషన్ ఇక్కడ చేసిండ్రా అనుకున్నా. మరి ముందుగల్ల డాక్టర్ గట్ల చెప్పిండేంది.. ఈరో చాలా మంచోడన్న సంగతి తెల్సుకున్న ఈరోయిన్ను ఒకటే ఉరుక్కుంటూ స్కూటీ బండి తాళాలు తీసుకుని , దవాఖాన బైట ఉన్న బండిని నడుపుకుంటూ ఎల్లిపోతుంది. అంత పెద్ద ఆపరేషన్ ఐనంక పేషంటు అలా పోతుంటే ఒక్కడంటే ఒక్కడూ ఆపడు, పట్టుకోడు. గిదేందబ్బా???

ఇగ హైద్రబాదుల ట్రాఫిక్ సంగతి తెలిసిందేగదా. అంత పెద్ద ఆపరేషన్ ( దవాఖాన కూడా పెద్దదే గందుకేగదా లక్షల్లో వసూలు చేసిండ్రు.. ) ఐన పోరి బండి నడుపుకుంట పోతుంది. నిజంగా ఐతే... జరంత జరమొస్తెనే చాతగాదు . రైల్ స్టేషన్ కొంచం దగ్గర్ల ఉండగనే బండి పడిపోతుంది.. మరి ఈరోయిను ఏడ్సుకుంట ఉరకాలిగా.. గట్లనే ఉరికింది. జరసేపు అటు ఇటు సూసింది. ఈరో కనపడ్లే. రైలే ఎల్లిపోయింది. ఆగుండ్రి. కథ ఐపోలే. జరంత ఏడ్సి తలెత్తి సూస్తే ఈరో కన్పిస్తడు. మధ్యన రైలొచ్చి పోయినంక కనపడడు. మల్ల అక్కడిక్కడ సూస్తుంటే పక్కన నిలబడ్తడు. ఐది నిమిషాలు సూస్కొని సూస్కొని కలిసిపోతరన్నమాట..

ఏం కథనో ఏమొ. సూసేటోల్లు హౌలాగాల్లనుకుంటరు ఈ సిన్మాలు తీసోటోల్లు.
అసలే సిన్మాలూ సూసుడు బంద్ జేసిన. టైం పాస్ కి టీవీల జర సేపు చూస్తే దిమాగ్ ఖరాబైంది.
ఈ సైన్మ ఏందో యాదికొచ్చిందా??

11 వ్యాఖ్యలు:

కొత్త పాళీ

ఇదేదో చూసినట్టుందే .. బుర్ర గోకింగ్స్

sivaprasad

madhumasam film kada

నేస్తం

:) ఈ సినిమా ఏమో తెలియదు కాని ..మాకామద్య టివిలో ఖైదీ సినిమా వేసాడు.. అప్పట్లో అది ఎంత పెద్ద హిట్టో మీకు తెలియంది కాదు.. మొన్న చూస్తే నవ్వు నవ్వు వచ్హ్చింది నా కైతే..

భావన

ఇదేమి సినిమా తల్లి.. వెకేషన్ లో చూసేవా? :-|

జ్యోతి

అవును ఇది మధుమాసం సినిమానే...

భావన.. అవును వెకేషన్ లో ఆఖరి అరగంట చూసా. నా టైమ్ బాలేదు ఏం చేస్తాం... ఆ సినిమా తీసినోడు దొరికితే దులిపేసేటంత కోపం వచ్చింది.

ఆ.సౌమ్య

ఈ మధుమాసం సినిమాలో డవిలాగులు అవీ కొన్ని బాగుంటాయి. రెండు పాటలు బాగుంటాయి. మీరు సినిమా మొత్తం చూడాల్సింది. ఇది గొప్ప సినిమా కాకపోయినా కాస్త భిన్నంగా ఉండే సినిమా. మీరు చివరి భాగం మాత్రమే చూసారు కాబట్టి మీకు తలా తోక లేనట్టు అనిపించింది. వెలైతే ఇంకోసారి మొత్తం చూడండి. నచ్చకపోతే నన్ను తిట్టుకోకండి బాబోయ్ :)

కమల్

ఈ సైన్మాకి కథ, ముచ్చట్లు రాసింది ఫేమస్ ఫెమినిస్ట్ రైటర్ బలభద్రుని పాత్రరమణి పేరేదో సరిగ్గ రాదు నాకు ఆవిడే ఈ సైన్మాకి రైటరు..:-p

Kalpana Rentala

జ్యోతి,
అదృష్టవశాత్తూ ఈ సినిమా నేను చూసినట్లు లేను. పైగా తమరు రాసింది చదివాక ఇక ఆ సాహసం కూడా చేయను. బాగున్న సినిమాల కన్నా ఇలా చూడక్కరలేని సినిమాల గురించి పోస్టులు రాయండి. అప్పుడు ఏవేవీ చూడక్కరలేదో తెలిసిపోతో, ఏవీ చూడాలో ఈజీ గా వుంటుంది డిసైడ్ చేసుకోవటానికి.
పని లో పని గా ఇక్కడే కామెంటుతున్నాను. స్మోకింగ్ మీద పోస్ట్ అదుర్స్.
కల్పన

Vinay Datta

Meeru gamaninchindi konchame. Bathikipoyindru. nenu theatre la mottham choosina. Katha emanna unte ottu.ticketu konte thalanoppi free.

కొత్త పాళీ

ఓ మధుమాసం సినిమా అన్నమాట .. అందుకే ఎక్కడో చూసినట్టుందే అనుకున్నా. చాలా కొత్త తెలుగు సినిమాల్తో పోలిస్తే ఈ సినిమా పర్లేదు, చూడొచ్చు. కొన్ని వింత వింత భావాలుంటాయి. ఈ దర్శకుడు (పేరు చంద్ర సిద్ధార్ధ అనుకుంటా) కొంచెం పట్టించుకోవలసిన మనిషే.
పైనెవరో బలభద్రపాత్రుని రమణి గారు ఫేమస్ ఫెమినిస్టు రచయిత్రి అన్నారు. ఆవిడ ఫేమస్ అయితే కావచ్చు (అయే వుంటారు ఎందుకంటే ఆవిడ పేరు నాక్కూడా తెల్సు), కానీ ఫెమినిస్టు మాత్రం కాదు.

మధురవాణి

సినిమా అంత బాగోదు కానీ.. ఈ సినిమాకి ఆధారమైన నవల నేను చదివాను. బాగుంటుంది. అంటే.. నాకు నచ్చింది :-)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008