ప్రశంసిద్దాం.. మే నెల 2010 కంప్యూటర్ ఎరా ఎడిటోరియల్
మనం కష్టపడి ఎన్నో పనులు చేస్తుంటాం. కొన్ని మన కోసమూ,మరికొన్ని మన వారి కోసమూ, ఇంకొన్ని సమాజం కోసమూ!! ప్రతీ మనసూ ఎంతటి కష్టానికైనా ఓర్వగలుగుతుంది. ఆ కష్టాన్నిగుర్తించే సాటి మనసు తోడు ఉన్నంత వరకూ!! మనం చేసే కర్మలు భౌతికమైనవైనా, మానసికమైనవైనా అవి కోరుకునేది కొద్దిపాటి స్పందనను. ఓ మంచి పనికి ఓ చిరునవ్వుతో సత్కారం లభిస్తే పొంగిపోని అల్పసంతోషులు ఉండరేమో. శ్రమించి సాధించిన విజయానికి నాలుగు ప్రోత్సాహకరమైన మాటలు ఆయుష్ష్యుని పోస్తాయి. కానీ ఈ మెచ్చుకోళ్లు, ప్రోత్సాహాలు, చిరునవ్వుతో పలకరింపులు ఎదుటి వ్యక్తి నుండి ఆశిస్తాం తప్ప మనమెప్పుడూ ఇతరులకు అందించాలన్న స్పృహను నిలుపుకోం. మనౌషులకు మధ్య సంబంధాలు బలపడాలంటే తాళం వేసిన మనసుని కొద్దిగా తెరిచి నిజాయితీతో అవతలి మనసుకి గాలం వేయడం ఒక్కటే మార్గం. ఓ మంచి పని చేస్తే చిన్న కితాబు అవతలి వారిలో నూతనోత్సాహాన్నినింపుతుంది. మనం నింపిన ఆ పాజిటివ్ ఎనర్జీ ఎన్నాళ్లకైనా మనల్ని చూస్తే వారికి గౌరవం ఏర్పడేలా ఓ స్థిరమైన ముద్రని కలిగిస్తుంది. అందుకే మన విజయాల్ని డప్పులు కొట్టుకోవడమే కాదు మనసు పెట్టి అవతలి వారి విజయాల్నీ, సంతోషాల్నీ, మంచి పనుల్నీ గమనిస్తూ భేషజాలకు పోకుండా ప్రశంసించగలిగితే ప్రపంచం మొత్తం మన ముందు దాసోహం అవుతుది. కారణాలేమైనా మన మనసుల్లో కుంచితత్వం మేటవేసుకుపోతుంది.
ప్రతీ పనిలోనూ లోపాలను భూతద్ధం వేసుకుని చూసి పుల్లవిరుపుగా విమర్శించడానికి అలవాటు పడిపోయాం. ఎదుటి వ్యక్తి శ్రమలో చిత్తశుద్ధిని గ్రహించడం మానేసి లోపాలను మాత్రమే చూపించడం ద్వారా వారి శ్రమకు మనం ఇస్తున్న విలువ ఎంత? ఒక మనసుని మన కుంచిత స్వభావంతో గాయపరచడం వల్ల జరిగే నష్టానికి మనం బాధ్యత వహించగలమా? మనిషిని ప్రశంసించడం చేతకాకపోతే ఫర్వాలేదు గాని ఎక్కడ ఎవరిలో ఏ లోపాలు కనిపిస్తాయా అని డేగకళ్ళతో అన్వేషించే నీచమైన స్వభావాన్ని వీడకపోతే ఏ అనుబంధమూ మనతో రాదు. ' శ్రేయస్సు కోరి లోపాలు చెప్తున్నాం' అంటూ లోపలి ఉద్ధేశం కుత్సితమైనదైనా కొందరు నివురుగప్పిన నిప్పులా వ్యవహరిస్తుంటారు. నిజాయితీతో ఆత్మీయుల ఉన్నతిని కాంక్షిస్తూ లోపాలను సున్నితంగా ఎత్తిచూపితే నష్టం లేదు గానీ ఎలాగైనా ఎదుటి మనిషి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కాంక్షతో వేలెత్తి చూపితేనే మనలోని పైశాచికత్వం మనకే వెగటు పుట్టించేది!! ఈ ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులు కారు.. పుట్టింది మొదలు పోయేవరకు అందరూ పరిపూర్ణత కోసం విభిన్న మార్గాలలో ప్రయత్నాలు చేస్తూ జీవనం సాగించే వారే.. ఆ ప్రయాణంలో చేతనైనంత మానసికంగ, నైతికంగా మనుషులకు మనం బాసటగా నిలువగలిగితే మనమూ మోక్షం వైపు నడవగలుగుతాం. మన దృష్టి ఎప్పుడూ మనల్ని విడిచి ఎదుటి వారి లోపాల వైపే సారించబడి ఉంటే మనిషిగా పతనం అవుతాం. అందుకే విమర్శించడం మానేసి మనలాంటి ప్రతీ మనిషినీ ప్రశంసించడం మొదలుపెడదాం.
మీ నల్లమోతు శ్రీధర్...
3 వ్యాఖ్యలు:
2nd parent excellent....
enu fallow avvadaaniki try chestaanu.
నల్లమోతు శ్రీధర్, మరోసారి ఆలోచింపజేసే పోస్ట్ వ్రాసారు .. GREAT
వినయ్ చక్రవర్తి గోగినేని గారూ, a2zdreams గారూ, ధన్యవాదాలు.
Post a Comment