Sunday, April 11, 2010

Cigarette Smoking is Injurious to Health…

ఓరోజు చిరకాల మిత్రునితో మాట్లాడుతుండగా ధూమ పానం అదేనండి పొగ తాగడం లేదా దమ్ముకొట్టడం మీద చర్చ జరిగింది. అతను నిత్యాగ్నిహోత్రుడు కాకపోయినా సిగరెట్ తాగడం అలవాటే. అది దుర్వ్యసనం, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని తెలిసిన విద్యావంతుడే... అన్నీ తెలిసి ఎందుకు తాగుతావ్. వదిలేయొచ్చుగా అంటే.. నీకేం తెలుసు జ్యోతి! .. పొగతాగడంలో ఉన్న మజాయే వేరు..పొగతాగనివాడు దున్నపోతై పుట్టునని ఓ మహాకవి ఏనాడో చెప్పాడు. పైగా ఈ సిగరెట్ తాగడం వల్ల లభించే అనుభూతి, ఆనందం అనిర్వచనీయమైనది. మీ ఆడాళ్లకేంటి నీతులు బానే చెప్తారు? మీరూ అలవాటు చేసుకోండి అప్పుడు అర్ధమవుతుంది. లేదంటే జరుక్ శాస్త్రిగారి రచనలు చూడు. సిగరెట్టు వల్ల కలిగే లాభాలు నీకు తెలుస్తాయి అని ఎదురు నన్నే వెక్కిరించాడు ఆ మిత్రుడు. అలా ఉందా సంగతి. సిగరెట్ సంగతేంటో (తాగడం కాదండోయ్.. దానివలన కలిగే లాభాలు) చూద్దామని మనందరికీ జరుక్ శాస్త్రిగా తెలిసిన పేరడీ సూరీడు జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రిగారి పేరడీల పుస్తకం తెచ్చాను. అందులోని ఓ మచ్చు(సిగరెట్టు) తునక ... ఇది చదివితే ఈ సిగరెట్ ప్రెమికులకు మరింత ఉషారొచ్చేస్తుందేమో..

ఒక్క కానీ ఒకే కానీ
రెండు కానులు అర్ధణా!
మూడు కానులు ముక్కానీ..
నాల్గు కాను లణాగదా!
అయిదు కాను లణాకానీ..
ఆరు కాను లణన్నరా...
కానీకి ఒక్కటి యియ్యర్
రెండు కాన్లకు ఒక్కటే
మూడు కాన్లకు రెండిస్తార్
నాలుగు కాన్లకు మూడుగా!! (అదేనండి సిగరెట్టు)

సిగరెట్టు పొగలలో చిత్రమున్నాదీ..
పొగల మలుపులతోటి పైకి పోయెదను
బ్రహ్మాండ భాండమ్ము బంధించు పొగలూ
పొగల మలుపులతోటి మేళవిస్తావా??
పొగ వూది పొంచుండి పాట పాడెదనూ
ఆ పాటకై విశ్వవిశ్వాలు మ్రొక్కు
పొగలోన పొలములూ వరిమళ్లు కలవు.
నా ధన్యలక్ష్మిపై తలలు వొంచెను .. (ఆహా)

సాంధ్యమాధురులలో సారమంతా చిదిపి
సిగరెట్టులో బ్రహ్మ పారబోశాడు
సిగరెట్టు పొగతాగి బ్రహ్మర్షులంతా
దివ్య రూపంతోటి వెలుగుతున్నారు
సిగరెట్టు పొగలతో గూడుకట్టుకు తాను
మధ్య పడుకున్నాడు చంద్రుడల్లదిగో! (ఓహో. సిగరెట్టుకు , దేవతలకూ లింకు ఉందన్నమాట)


సిజరు సిగరెట్టు
నెఱుగరేం మీరు!
దానిపేరు వినేసరికి
ఏవో
భావస్థిరములైన
జననాంతర సౌహృదయములు
గుర్తుకొస్తవి ... (కవిత్వం కూడా వస్తుందా??)


మా పసితనంలో
మేము

దొంగతనంగా..
సిగరెట్టు త్రాగుదామన్న కోర్కెతో
పరాయిపేట పోయి
మా నీ డకే మేం బెదిరి
ఎవరో చూస్తారన్న దిగుల్తో...
గోడల్లో వొదిగి వొదిగి,
సిజరు సిగరెట్లు కాలుస్తుంటే..
మా చిన్న హృదయాలకు
రవ్వలడ్డూలు తిని
సేమ్యా పాయసం తాగి
కమ్మగా వేచిన జీడిపప్పు
కరకరా నమిలినట్టుండేది.. (పట్టుబడితే మాత్రం వీపుమీద చింతబరికెతో సప్తస్వరాలు పలికించేవారు కదా! .. ఆకాలంలో పిల్లలకు ఆ మాత్రం భయముండేది. ఇప్పుడైతే ధైర్యంగా పెద్దవాళ్ల ముందే సిగరెట్ కాలుస్తున్నారు.

కొంత స్వతంత్రం వచ్చి
కొంత యౌవనం వచ్చి
ఊహలు రేగే కాలంలో
సిజరు సిగరెట్టు ముట్టిస్తుంటే
దరి చేరకుండా..
లాలింపబడుతూ
వులుకు వులుకున చూస్తే..
ప్రియురాలు.. ప్రౌడాంగన..
నవోపగూహనమ్ములాగు
వాయూత్పాతానికి..
బెదిరి దరిచేరవచ్చిన
కులపాలిక కరస్పర్శలాగు.. ( అంతే మరి తావలచింది రంభ..తామునిగింది గంగ అన్నట్టు)


నేడు

సిజరు సిగరెట్టు
దహిస్తూంటే.
స్వచ్చరూపిణి ఐన
"ఫీనిక్సు" పక్షిలాగు
అర్ధంకాని భావకవి ఖండగీతమ్ములాగు
ప్రౌఢ విమర్శకుని బెదిరింపులాగు..
వివిధ సారస్వతములలోని
ఏకాంక నాటికల వోలె..
శంకరుని అద్వైతబోధ వోల్కి
నా - పాప - క్షయమ్ములాగు
నా నాసోద్గతములైన
ధూమంపు కొనలు
ఈ దేశమాతకు వేయి
సాంబ్రాణి ధూపమ్ములాగు...! (ఐపోయింది.. ఇక ఇలాంటివారిని మార్చడం అస్సలు సాధ్యం కాదు. ..))

ఈ కృతిని.. నన్నూ కలిపి తిట్టేవాళ్లకు కలిపి ఈ ఖండకావ్యాన్ని అంకితమిస్తున్నాను. అని రచయిత తనదైన ప్రత్యేకతని చూపెట్టారు. ఎవరూ నోరెత్తకుండా..:))

3 వ్యాఖ్యలు:

Unknown

మా చిన్నప్పుడుండేవి సిజర్స్ సిగరెట్లు. కాని ఇప్పుడెక్కడా అవి కనిపించటం లేదు. కంపెనీ మూతపడిందో యేమో తెలియదు.

నాగప్రసాద్

నరసింహ గారు, నాకు తెలిసి ఇప్పటికీ ఉన్నాయి సిజర్స్ సిగరెట్లు. కాకపోతే, వాటికి ఫిల్టర్ లేకపోవడం ఒక కారణం అనుకుంటా, అందరూ ఎక్కువగా విల్స్,బర్క్‌లీ, గోల్డ్ ఫ్లేక్,లైటర్స్ వగైరా ఎక్కువగా వాడుతున్నారు. సిజర్స్ వాడకం చాలా వరకు తగ్గిపోయింది.

కత పవన్

ప్రోగ తాగ రాదు :)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008