దాదాపు పదిరోజుల క్రింద కథా జగత్ లో వంద కథలు ప్రకటించబడిన సందర్భంగా బ్లాగర్ల కోసం పోటీ నిర్వహిస్తున్న సంగతి తెలుసు కదా. ఇంతవరకు ఒక్కరూ తమ వేళ్ళను ఈ దిశలో కదిలించనట్టుంది.. ముందుగా అటువైపో లుక్కేసి రండి. ఈ పోటీ కోసం నేను రెండు కథలు ఎంచుకున్నాను. అవి నాకు బాగా నచ్చాయి. వాస్తవిక జీవితంలో నాకు ఎదురైన సంఘటనలే అవి. ఈ కథలు రాసినవారు నాకంటే పెద్దవారు అయినా బ్లాగ్లోకంలో నేను వారికి గురువునే. సో శిష్యుల కథల గురించే రాస్తే పోలా అని డిసైడ్ అయిపోయానన్నమాట.
ఒఖ్ఖ రెండు రూపాయలు.. రచన. జి.ఎస్.లక్ష్మి .
పిల్లలు , వృద్ధులు ఒకే విధమైన మనస్తత్వం కలవారు. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటారు. పిల్లలను చిన్నప్పటినుండి గారాబంగా పెంచి పెద్ద చేయడం, చదువులు ఇలా ఇవే తమ లక్ష్యంగా తల్లితండ్రులు ఉంటారు. తమ కోరికలకంటే పిల్లల కోరికలు ముందు తీర్చాలని అనుకుంటారు. ఆ క్రమంలో తమ ఆశయాలు , ఆశలను కూడా వదులుకుంటారు. అలాగే తమ తల్లితండ్రులను కూడా ఒక బాధ్యతగా తీసుకుంటారు. ఇది ఒకప్పటి తరం మాట అనుకోండి. కాని ఈనాడు ఉమ్మడి కుటుంబం సంగతి పక్కన పెడితే అసలు తల్లితండ్రులు కూడా భారమైపోతున్నారు కొందరు పుత్ర రత్నాలకు. తమపిల్లలతోనే సతమతమవుతూ తల్లితండ్రుల గురించి శ్రద్ధ తీసుకునే, ఆలోచించే సమయం, ఓపిక వారికి ఉండడం లేదు. ఒకోసారి తల్లితండ్రులు ఇంటిలోని వారికి అడ్డంకిగా కూడా కనిపిస్తారు. వాళ్ళ మాటలు రుచించవు. చాదస్తం అని కొట్టి పడేస్తారు. ఆ వీళ్ళ మాటలేంటి వినేది? మాకు తెలీదా ? అని హుంకరిస్తారు.
ఉద్యోగాలు చేసినంత కాలమ్ ఒకరికి లొంగకుండా తమ పిల్లలను దర్జాగా పెంచిన తల్లితండ్రులు రిటైరయ్యాక అదే కొడుకుల దగ్గర నిస్సహాయంగా ఉండవలసి వస్తుంది. పెత్తనం ఉండదు. వాళ్లకు భోజనం మాత్రమే అవసరం . అప్పుడప్పుడు మందులు .. అది తప్ప ఈ ముసలివాళ్ళకు ఇంకేం కావాలి అనుకుంటారు కొడుకు,కోడలు.. రిటైరైనంత మాత్రాన, సంపాదించనంత మాత్రాన వాళ్లకు ఆశలు,కోరికలు ఉండకూడదా. శారీరకంగా శక్తి ఉన్నంతవరకు కష్టపడుతూనే ఉంటారు. అపుడు తమకు కోరినవి కొనుక్కుంటారు. తింటారు. పిల్లలు సెటిల్ అయ్యి, రిటైరయ్యాక తీరిగ్గా ఉండడం మూలాన పెద్దవాళ్ళకు ఏవో కోరికలు ఉంటాయి. అవి ఎక్కువగా తిండి వస్తువులు, పుస్తకాలు, సినిమాలు, పూజలు గట్రా అయ్యుండొచ్చు. కాని వాటికి డబ్బులు కావాలిగా. ఉన్నదంతా కొడుకులకు ఊడ్చిపెడితే , చివరకు ఆ కొడుకు కోడలు దయాదాక్షిణ్యాల మీద బ్రతకాల్సి వస్తుంది. ముందే జాగ్రత్త పడి డబ్బు దాచుకుంటే వారి అవసరాలకు పనికొస్తుంది. ఒక్కోసారి ఇలా చేసిన చిక్కే . ఈ ముసలోళ్ళు ఎంత సొమ్ము దాచిపెట్టుకున్నారో ఏమో? కొడుకులకు, మనవళ్ళు , మనవరాళ్లకు ఇవ్వకుంటే ఎలా అని గొడవ మొదలవుతుంది. దాచుకుని పోయేటప్పుడు కట్టుకుపోతారా? అని పీక్కుతినేవాళ్ళు ఉన్నారు. అలాగే ఈ సొమ్ము కోసం కాట్ల కుక్కల్లా కొట్టుకునే సోదరీ , సోదరులు ఉన్నారు.
వాళ్ళ సొమ్ముకు ఆశపడ్డమే కాని అయ్యో వాళ్లకు ఏదైనా తినాలనిపిస్తుంది. వాళ్లకు ఇష్టమైనవి కొనుక్కోవాలనుకుంటారు.లేదా ఖర్చు పెట్టాలనుకుంటారు అని కొంత సొమ్ము ఇద్దాము అని అనుకునే వాళ్ళు ఎందరు? పెన్షన్ గట్రా వస్తుంటే ఇంట్లోకే అవసరమోస్తుంది అని లాక్కోవడం తప్ప. పెళ్ళాం మాటలు విని తల్లిని గెంటేసి ఒంటరిని చేసిన కొడుకు , అదే తల్లి కాయకష్టం చేసి సంపాదిస్తుంటే తన భార్యతో కలిసి ఆమె సంపాదించిన డబ్బులు కూడా ప్రతి నెల తీసుకుంటాడు. బ్రతకడానికి తల్లికి ఇంత తిండి ఉంటే చాలు అని అనుకుంటారు. ఏమో! తామూ తల్లితండ్రులమవుతాము. ముసలివాళ్ళమూ అవుతాము. అపుడు తమకు ఆ పరిస్థితి రాదా? అన్న ఆలోచన రాదు. ఒకవేళ వచ్చినా భవిష్యత్తు ఎవరు చూడొచ్చారు? మా పిల్లలు బంగారం. అలా చేయరు అని అనుకుంటారు.
అందుకే పిల్లల్లారా!!! వృద్ధులైన తల్లితండ్రులను ఒక నిరుపయోగ వస్తువులా భావించకండి. వాళ్ళకూ ఎన్నో కోరికలు, ఖర్చులూ ఉంటాయి. అందుకు సొమ్ము అవసరమవుతుంది. ఆ లోటు రాకుండా చేయండి. ఎందుకు చేయాలని అన్న ఆలోచన వస్తే మిమ్మల్ని పెంచడానికి పెట్టడానికి పెట్టిన సొమ్ము తిరిగి ఇస్తున్నాం అను కొండి. మీకు మీరు కన్నవాళ్ళు అంటే ఎంత ప్రేమ , ఆప్యాయతో, మిమ్మల్ని కన్నవాళ్ళు కూడా అలాగే అని అపురూపంగా చూసుకోండి.
లక్ష్మిగారి కథను చదివిన తర్వాత నా అనుభవాలను , అభిప్రాయాన్ని చెప్తున్నాను. ఈ కథలో చెప్పిన పరిస్థితులన్నీ కళ్ళారా చూసినవే .. ఒకసారి కాదు ఎన్నోసార్లు. పిల్లలను మార్చలేకున్నా తల్లితండ్రులను జాగ్రత్తగా ఉండమని చెప్తుంటాను. ఆస్ధిపాస్తులన్నీ పిల్లలకోసం ధారాదత్తం చేయకండి. మీ భవిష్యత్తు గురించి మీరే జాగ్రత్త పడండి. వయసు మీరినంత మాత్రాన ఒకరి మీద ఆధారపడవలసిన పని లేదు అని. మా పిల్లలకు కూడా చెప్తాను. మా గురించి మీరేమి బెంగ పడొద్దు. మీ జీవితం, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు మా మీద ఆధారపడొద్దు. మేము మీ మీద ఆధారపడొద్దు అని..