Friday, 6 August 2010

సృష్టిధర్మంలో పావులం! ఆగస్ట్ 2010 కంప్యూటర్ ఎరా సంపాదకీయం

ఏదైనా ఒక పని జరిగినా, ఇద్దరు మనుషులు కలిసినా, మరో సంఘటన ఏదైనా తటస్థించినా ఈ సృష్టిలో ప్రతీ దానికీ ఓ లక్ష్యం, గమ్యం నిర్దేశించబడి ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల స్థాయి నుండి యావత్‌ ప్రపంచపు స్థాయి వరకూ ప్రతీదీ మన అంచనాకంటూ అందని ఓ లయబద్ధమైన అమరికలో నడిచిపోతూ ఉంటుంది. మన వరకూ మనం ఈ క్షణం మనకు ఎదురైన అనుభవాన్ని విశ్లేషించి కుంగిపోవడమో, పొంగిపోవడంతోనో సరిపెట్టుకుంటూ ఉంటాం తప్ప.. ఈ సంఘటన ఓ గొలుసుకట్టు చర్యల క్రమంలో ఒక భాగమని గ్రహించం! అన్నింటికన్నా ముఖ్యంగా మన జీవితంలో ఎదురైన ఓ సంఘటన పూర్తిగా మనల్ని ఒక్కరినే ప్రభావితం చేస్తోందని గుడ్డిగా భ్రమిస్తుంటాం. అలాంటి సంఘటనలు పునరావృతం అవకుండా వాటి దశా, దిశలను మార్చడానికి ప్రయత్నిస్తాం.. అందులో ఒక్కోసారి కొంతవరకూ కృతకృత్యులమవుతాం. ఇలాంటి మానవ ప్రయత్నాల ఫలితాలే ‘‘అన్నీ మన చేతిలోనే ఉన్నాయనే అహంభావం!’’, ‘‘అస్సలు మనమేమీ చెయ్యలేమనే నిస్సహాయతా!’’.


ఇలా ప్రతీ సంఘటననూ మన ఒక్కరికే ఆపాదించుకోవడం వల్ల తలెత్తే భావావేశాలు ఇవి. ఈ రెండిరటిలోనూ వాస్తవం లేదు. అలాగని మునీశ్వరుల్లా ఏ ప్రయత్నమూ చెయ్యకుండా కూర్చోవడానికీ వీలవదే! మన నుండి మనం విడిపడి దూరంగా ప్రేక్షకుల్లా మన జీవితంలో చోటుచేసుకునే పరిణామాలూ, వాటి పర్యవసానాలూ, అవి ఇతరుల పై చూపించే ప్రభావాలూ, ఆ ఇతరులు మన ద్వారా సంక్రమించిన భావనాస్రవంతి ఆధారంగా మరికొందరిపై, పరోక్షంగా యావత్‌ సమాజంపై ప్రదర్శించే ప్రవర్తనలు.. వీటన్నింటినీ అంచనాకు అందినంత వరకూ విశ్లేషించడానికి పూనుకుంటే మనదని మనం విర్రవీగుతున్న ‘మనదైన ప్రపంచం’ ఎంత ఇరుకైనదో.. మన ఆలోచనలు ఎంత విస్తృతం అవాలో అర్థమవుతుంది. చిన్నతనంలో జీవించడం నేర్చుకుంటాం, ఆ తర్వాత జీవితంతో పోరాడతాం.. ఆ పోరాటంలో గెలుస్తాం. ఆ గెలుపు అన్నీ మన చేతిలోనే ఉన్నాయనే భ్రాంతిని కలిగిస్తుంది. ‘ఏదీ నీ చేతిలో లేదు’ అని నిరూపించడానికి వెంటనే ఏదో వైఫల్యం ఎదురవుతుంది. దాన్ని అర్థం చేసుకుని మన ఆలోచనల్లో పరివర్తన సాధిస్తే జీవితాంతం ఒద్దికగా ఉంటాం. ఆ వైఫల్యాన్ని జీర్ణించుకోలేక కుంగిపోతే, సృష్టి ధర్మానికి ఎదురీదాలని విశ్వప్రయత్నం చేస్తే అలసిపోతాం. ఇది ఆశావాదమన్పించినా, నిరాశావాదమన్పించినా ఈ ప్రపంచంలో మన ఉనికి పరమాణువంతే! మన ఉనికిని బ్రహ్మాంఢమంత పెంచుకోవడానికి మనం చేసే ప్రయత్నాలన్నీ మన జీవితంపై మనకు ఆశని కాపాడేటందుకే. మన ఉనికి ద్విగుణీకృతం అవుతున్నట్లు పరిస్థితులు గోచరించినా అదీ సృష్టి కార్యంలోని భాగమే తప్ప మన విజయం కాదు. మన విజయం కాకపోయినా మన విజయంగా భ్రమించేలా చేయాలి.. లేకపోతే మనం తదుపరి కర్మలను కొనసాగిస్తూ ముందుకు సాగిపోం! అందుకే సృష్టి మనకు ఉత్తేజాన్నిచ్చే ఎన్నో ఆనందాలనూ, పూడ్చుకోవలసిన ఎన్నో విచారాలనూ మన ముందుంచుతుంది. బుద్ధిమంతుల్లా వాటిని చక్కదిద్దుకునే పనిలో తలమునకలై జీవితాన్ని అర్థవంతంగా గడుపుతున్నామన్న భ్రమలో ముందుకు సాగిపోవడమే మనం చేయవలసిన, చేస్తున్న పనులు!


మీ
నల్లమోతు శ్రీధర్

5 వ్యాఖ్యలు:

సి.ఉమాదేవి

సృష్టికి అనుసృష్టి చేయగలననుకున్న మానవుని పరిణామదశ శాస్త్రపరంగా ఎన్నో విజయాలను అందించినప్పటికీ మానవతప్పిదమో లేదా సృష్టి నిర్దేశమో విజయపుటంచులు తాకినా అపజయపు నీడకూడా మనిషిని కమ్మివేస్తోంది.నేను,నాకు అనే పదాలు చక్కెర పూసిన చేదు మాత్రలు.అయినా చప్పరిద్దాం అని పుక్కిటపెట్టుకుంటే క్రమంగా చేదు బయటపడి వెక్కిరిస్తుంది.మన అహాన్ని వీడకపోతే గర్వం,స్వార్థం చక్కెరలా తాత్కాలిక ప్రయోజనాన్ని సిద్ధింపచేసినా పరమోత్కృష్టమైన మానవతముందు మోకరిల్లక తప్పదు.సుఖం-కష్టం,విజయం-అపజయం,సాఫల్యం-వైఫల్యం బొమ్మ బొరుసులై సృష్టి ఆడిస్తున్న బొమ్మలాట మన జీవితం.ఇదే మనం పదేపదే ప్రవచించే సృష్టిధర్మం.

Anonymous

నల్లమోతు శ్రీధర్,
మీరు వ్రాసింది అక్షరాల నిజం. మీ లోతైనా ఆలోచనలకు , ఆ ఆలోచనలకు అక్షరరూపం కలిపించినందుకు ధన్యవాదాలు. Great Work !

నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఏమిటంటే
మన బాద్యత ఏమిటో తెలుసుకొని, దానిని సక్రమంగా నిర్వర్తిస్తే చాలు. ఈ ప్రయాణంలో అహంభావానికి తావు వుండకూడదు.

Unknown

@ ఉమాదేవి గారు, మీరు మరింత బాగా విశ్లేషించారు. ధన్యవాదాలు.

@ a2zdreams గారు, మీరన్నట్లు నిజంగా మనం తెలుసుకోవలసిందీ, విస్మరించకుండా చేయవలసిందీ మన బాధ్యత మాత్రమే. ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో మీరన్నట్లు అహంభావాలూ, ఇతర మానసిక వికారాలూ చేరితే మనకే ఇబ్బంది. మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు.

సి.ఉమాదేవి

శ్రీధర్ గారు నా విశ్లేషణ మీకు నచ్చినందుకు జ్యోతిగారి బ్లాగుద్వారా అభివందనములు.

భావన

ఆ అమరిక వీలు ను తీరును కనిపెట్టగలం అంటారా శ్రీధర్. ఆ అమరిక కార్బన్ స్ట్రక్చర్ లా అర్ధం చేసుకోను వీలుంటే బాగు..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008