మనసును చదివే స్నేహితుడు
నేటి ఆధునిక లేదా అభివృద్ధి చెందిన సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం ఆర్ధిక సంబంధాలను మెరుగు పరిచింది. కాని మానవ సంబంధాలను దూరం చేసింది. దీనివలన రక్తసంబంధీకులు కూడా దూరమై పరిచయస్తుల్లా మారుతున్నారు. కాదంటారా?? ఈ బిజి బిజీ జీవితంలో ఎన్నో సందేహాలు, సమస్యలు, సందిగ్ధాలు. ఒక్కోసారి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు తల్లడిల్లి వాటికి కారణాలు తెలుసుకోకుండా పరిష్కారం వెతకకుండా మనమే పెద్దవిగా చేసుకుంటున్నాము. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలీక అయోమయంలొ పడిపోతాం. అటువంటప్పుడు మన బాధను, ఆవేదనను, సందేహాలను మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక తోడు కావాలనుకుంటాం. మన సమస్యను చర్చించుకోవడానికి లేదా దాని కారణం తెలుసుకోవడానికి ఆ స్నేహితుడు సాయపడతాడు. అటువంటి తోడు ఒక మంచి పుస్తకమైతే ఎలా ఉంటుంది. అలాంటి పుస్తకమే కొమ్మూరి రవికిరణ్ రచించిన " సౌందర్యం"
డా.కొమ్మూరి వేణుగోపాలరావుగారి కుమారుడు కొమ్మూరి రవికిరణ్ రాసిన ఈ నవల మన మనసును చదివే స్నేహితుడు అని అనవచ్చు. ఇది ఒక వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పే పుస్తకం కాదు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సంఘటనలు, సమస్యలకు మనకే తెలియని ఎన్నో సలహాలు, విశ్లేషణలు ఉన్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబం, వారి చుట్టుపక్కల ఉండే మనుష్యుల మధ్య అల్లిన అందమైన కథ ఈ నవల . ఎవరికి వారు "నా" అనే స్వార్ధంతో బ్రతుకుతున్నారు. కుటుంబం అంటే తన భార్య,పిల్లలు మాత్రమే కాదు స్నేహితులు, బంధువులు కూడా మనవారే అని చాలా హృద్యంగా వివరించారు రచయిత. మనం ఎదుటివారినుంది ప్రేమాభిమానాలను ఆశీంచడంకంటే మనమే నిస్వార్ధంగా వాటిని అందించడంలో ఉన్న లాభం లెక్కకట్టలేనిది. ప్రతీ వ్యక్తికి అంతో ఇంతో సమస్యలు ఉంటాయి. అలా అని ప్రతీ దానికి కృంగిపోకుండా వాటికి పరిష్కారం కనుక్కుని అందరిని కలుపుకుంటూ సాగిపోవడమే జీవిత పరమార్ధం.
ఈ నవలలోని నాయకుడు మురళి. అతని ద్వారా మనకు ఎన్నో పాఠాలు చెప్పారు రచయిత. ఉద్యోగంలో తప్పని పోటీ, జీవితంలో ఇంక సాధించగలిగేది ఏముందని నిరాశపడ్డ స్నేహితుడికి కర్తవ్యం బోధిస్తాడు తనకోసం కాకుండా ఇతరులకోసం జీవించడంలో ఉన్న ఆనందం ఎలాంటిదో చెప్తాడు , నాకు ఎవరూ లేరు నేను ఒంటరివాడిని అన్న మేనమామకు "చుట్టూ అద్భుతమైన విశాలమైన జగత్తులో మనకంటూ ఎందరో ఉన్నారు.ఐనా ఎవరితో కలవక ఒంటరిగా ఉండేవాడు అత్యంత జాలిగొలిపే వ్యక్తి అని చురక పెడతాడు.. బంధువులు, స్నేహితులు , ఆప్యాయతలు, అనురాగాలు కనపడడంలేదు అని చెప్పే బదులు అవి మనమే అందరికి పంచిపెడితే నష్టమేమున్నది. ఇలా అందరినీ తన బంధువులుగా చేసుకుంటూ ప్రేమ,ఆప్యాయతలను పంచుతాడు మురళి. ఒక్క వ్యక్తిలొ ఇన్ని గొప్ప గుణాలా అని అనిపించవచ్చు. కాని ఆలోచిస్తే ఇవి గొప్ప లక్షణాలు కావు. అందరూ మరచిపోయిన, తెలుసుకోవలసిన జీవిత సత్యాలు. ఇవి తెలియకే ఈ నిరాశ, నిస్పృహలు, ద్వేషాలు. వీటి మూలంగా చాలా మంది ఎదుర్కునే ప్రధాన సమస్య "డిప్రెషన్" ఈ పదం తరచూ వినపడుతుంది. ఆ డిప్రెషన్ పోగొట్టుకోవడం మన చేతిలోనే ఉంది అని తెలియచెప్పే మంచి స్నేహితుడిని ఇంటికి తెచ్చుకోండి. ఇది తప్పకుండా మన వెంటే ఉండవలసిన పుస్తకం.
ఈ పుస్తకం కొని నాలుగు నెలలైనా దానిని ఇప్పటికి పది సార్లు చదివి ఉంటాను. నాకు కలిగే సందేహాలు, అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవాలని ఇంతకు ముందు వ్యక్తిత్వ వికాసం, మానసిక శాస్త్రం అని ఎన్నో పుస్తకాలు కొన్నాను. కాని ఈ పుస్తకం చదువుతుంటే ఒక నవల , ఒక కుటుంబ గాధ చదువుతున్నట్టుగా లేదు. ఒక సైకియాట్రిస్ట్ మన ఎదురుగా కూర్చుని మన మనసును చదివినట్టుగానే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తన మాటలతో వివరిస్తున్నట్టు ఉంటుంది.
6 వ్యాఖ్యలు:
ఐతే చదవాల్సిందే :)
రవికిరణ్ గారు నాకు ఒక రేకీ మాష్టర్ గా పరిచయమయ్యారు. ఆయన రాస్తారని నాకు తెలియదు.
మంచి పుస్తకం పరిచయం చేసారు. చదవాలి. వేణుగోపాలరావుగారు తన చివరి దశలో ఆలోచన ఒక మధనం అందులోంచి అద్భుత జీవితం అనే ఒక పుస్తకం రాసారు. అది ఆంధ్రప్రభలో సీరియల్ గా వచ్చింది. వ్యక్తిత్వవికాసపుస్తకం అని చెప్పలేని అద్భుత రచన. చదివి పరిచయం చేయండి.
నేను ఈ మధ్యనే సాహిత్యమెందుకు చదవాలి అని పోస్టు రాసాను.పఠనాసక్తిని పెంచేవిధంగా మీరు చదివిన చక్కటి పుస్తకాన్ని పరిచయం చేయడం, ప్రయోజనాన్ని వివరించడం,మాకు వెంటనే చదవాలి అనిపించడం సాహిత్యం జీవితంలో అంతర్భాగమని తెలుపుతాయి.
రమ్యగారు చాలా రోజులకు కనిపించారు.బావున్నారా?
సత్యసాయిగారు, తప్పకుండా మీరు చెప్పిన పుస్తకం కొంటాను.
ఉమాదేవిగారు, నిజమే ఇప్పుడనిపిస్తుంది నాకు సాహిత్యం మన జీవితం మీద ప్రభావం చూపిస్తుంది అని..
ఒక మంచి విషయన్ని అందించారు.
సాహిత్యం మనకు jeevitam emito నేర్పిస్తుంది.. మనకు మనం అన్ని తెలుసు అనుకున్నా,, inka chaala తెలుసుకోవాల్సింది వుంది ani తెలియజేస్తుంది. అందుకే ఎన్నిపుస్తకాలుచదివినా ఇంకా,ఇంకా nerchukovaalsindi మిగులుతూనే వుంటుంది.. మనం అన్వేషిస్తూనే వుంటాము.. అదో aananda సాగరం..జ్యోతి గారు,,U HAVE DONE A VERY GOOD JOB..
Post a Comment