Monday, 24 January 2011

వెక్కిరింపు మాటలు




కొంతమంది తమ చుట్టూ ఒక లోకం సృష్టించుకుంటారు. వాళ్లు కరెక్ట్ ఆనుకున్న విషయాలే ఆ లోకంలో ఉంటాయి. మిగతావి అసలు పనికొచ్చేవే కావు. ఆ పనులు చేసేవాళ్లు కూడా పనికిరానివాళ్లే అనుకుంటారు. పైగా ఆ వ్యక్తుల ప్రతిభను గుర్తించరు సరికదా వెక్కిరించడం, ఎత్తి పొడుపు మాటలతో నిరుత్సాహపరిచి కొండొకచో అవమానకరపు మాటలతో బాధపెడతారు. గురజాడవారి కన్యాశుల్కంలో మహేశం మాటలు చదువుతుంటే ఇలాటివారు గుర్తొచ్చారు.

ఆర్నెళ్లకోమాటు పొస్తకం పట్టుకుంటే కొత్త శ్లోకాలు, పాత శ్లోకాలు ఒక్కలాగనబడతాయి. యిప్పుడు కొత్త శ్లోకం కన్నుకోవంటే నా శక్యవా? సిద్ధాంతి నెవణ్ణయినా ప్రశ్నడిగి కనుక్కోవాలి. లేకుంటే చటుక్కున పుస్తకం విప్పి యే శ్లోకం కనబడితే ఆ శ్లోకం చదువుతాను.

"మృగాః ప్రియాళద్రుమ మంజరీణాం "

యిదేదో చదివిన జ్ఞాపకం లీలగా వుంది. లేళ్లు పరుగెత్తుతాయని కదూ? యేం గొప్పమాట చెప్పాడోయ్ కవి. లేళ్లు పరిగెత్తితే యెవడిక్కావాలి, పరిగెత్తకపోతే యవడిక్కావాలి? కుక్కలు పరిగెత్తుతున్నాయి కావా? నక్కలు పరిగెత్తుతున్నాయి కావా? పిల్లులు పరిగెత్తుతున్నాయి కావా? పనికొచ్చే ముక్క ఒక్కటీ యీ పుస్తకంలో లేదు. నాలుగంకెలు బేరీజు వేయడం, వొడ్డీ, వాళీ కట్టడం కాళిదాసుకేం తెలుసు? తెల్లవాడిదా మహిమ. ఏ పట్నం యెక్కడుందో, యే కొండ లెక్కడున్నాయో అడగవయ్యా గిరీశంగార్ని, నిల్చున్నపాట్న చెబుతాడు.

"మృగాః ప్రియాళద్రుమ మంజరీణాం "
ముద్దెట్టుకున్నాడటోయి ముండాకొడుకు, ముక్కట్టు కొన్నాడు కాడూ?

"వర్ణప్రకర్షే సతి కర్ణికారం
దునోతి నిర్గంధతయా స్మ చేతః "

యిది కూడా చదివినట్టే వుందోయి. ఆ పువ్వేదో కవికిష్టం లేదట. యిష్టం లేకపోతే ములిగిపోయింది కాబోలు? మా గురువుగారికి దొండకాయ కూర యిష్టం లేదు. గురువుగారి పెళ్లాం పెరట్లో దొండపాదుందని రోజూ ఆ కూరే వొండుతుంది. బతికున్నవాళ్ల యిష్టమే యిలా యేడుస్తుంటే, చచ్చినవాడి యిష్టాయిష్టాల్తో యేం పని?"

3 వ్యాఖ్యలు:

Anonymous

హ..హ్హ....బావుంది

voleti

నాటకంలో ఈ పాత్ర ను నేను కూడా వేశాను (ఒకప్పుడు), దానికి డైరెక్టరు ఇప్పుడు మంచి బిజీ హాస్య నటుడైన కొండవలస లక్ష్మణరావు గారు. అయితే విషయానికొస్తే, తన ఈడు వాడే అయిన "వెంకటేషం" ఇంగ్లీషు జ్నానానికి (?) అసూయ చెందిన వాడై మహేశం ఇలా వాపోతాడు. గిరీశం పాత్ర (సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి, దురలవాట్లకు లోనై (వేశ్యాలోలుడు, చైన్ స్మోకర్) మరియు ఒకరి మీద పారసైట్ లా బతికే వాడు ఇందులో హీరో / విలన్ (ప్రధాన పాత్ర) ను చూసి ఇంప్రెస్ అయిపోయి ఆ రోజుల్లో చాలా మంది బ్రాహ్మణ యువకులు తమ బ్రాహ్మణ విధులను మానివేసి, ఆధునిక వేష ధారణే కాక వేద విద్యని కూడా మాని వేసి, ఆఖరుకి జంధ్యాన్ని కూడ త్యజించారు. తన కులంలోని ఆచార వ్యవహారలను విమర్శాత్మకంగా రాసుకన్న వారు బ్రాహ్మణులు మాత్రమే. మిగిలిన రచయితలు అలా చెయ్యలేదు సరికదా ఎవరైనా వారి కులాలకి వ్యతిరేకంగా రాసినా వూరుకోరు. మే మా కొమ్మను మేమే నరుక్కున వాళ్ళం.

Admin

Bagundi.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008