Saturday, July 9, 2011

వికీపీడియాలో 50,000 వ్యాసాలు.. మీరు ఓ చేయి వేయండి...
చిన్నప్పుడు మీరు వామన గుంటలు, కోతి కొమ్మచ్చి, ఏడుపెంకులాట ఆడుకున్నారా? అయితే అదృష్టవంతులే! మరి మీ పిల్లలు? వాళ్ళకసలు వాటి పేర్లు కూడా తెలీదేమో! మరి మనం ఆడుకున్న ఆ ఆటలు మనతో అంతరించిపోవాల్సిందేనా? మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వాటి గురించి చెప్పాలంటే ఎలా? ఎక్కడో ఒకచోట వాటి గురించి రాసి పెడితే, ముందు తరాల వాళ్ళు వాటి గురించి తెలిసికోగలుగుతారు. ఇలా లోకంలోని ప్రతీ విషయం గురించీ ఒక పుస్తకంగా రాస్తే.. అదే విజ్ఞాన సర్వస్వం!


తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు చాలా అరుదు. అందునా ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లాంటి బృహత్తర విజ్ఞాన సర్వస్వం అసలు లేనేలేదు. సాహిత్య అకాడమీ ప్రచురించిన విజ్ఞాన సర్వస్వం ఉన్నా, అది సాహిత్య విషయాలకే పరిమితమైంది. ఆవకాయ నుండి అంతరిక్షం దాకా, అటుకుల దగ్గర నుండి అణుబాంబు దాకా ప్రతీ విషయాన్ని వివరిస్తూ సాగే విశాల, విశిష్ట విజ్ఞాన సర్వస్వాన్ని తయారుచెయ్యడమంటే మామూలు విషయం కాదు. అపార ధనవ్యయం, అశేషమైన పనిగంటలు, అనంతమైన పరిశోధన కావాలి. సకల వనరులూ ఉన్న ప్రభుత్వమో, డబ్బును గుమ్మరించగల పోషకులో పూనుకుంటే తప్ప, ఇలాంటి మహత్కార్యాలు సాధ్యం కావు. అటువంటి బృహత్కార్యాన్ని సాధించేందుకు నడుం కట్టారు, తెలుగువారు. ఐతే ఈ పనికి పూనుకున్నది ప్రభుత్వము, లక్ష్మీ పుత్రులూ కాదు.., కేవలం మనలాంటి సామాన్యులే భుజం భుజం కలిపి ఈ పని చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. వందల మంది ఇందులో భాగస్తులు. పదిహేను వందల పైచిలుకు ఉత్సాహవంతులు నిరంతరం శ్రమిస్తూ కోట్ల మందికి ఉపయోగపడగల ఒక విజ్ఞాన కోశాన్ని తయారు చేస్తున్నారు. ఇంతకీ ఏమిటీ విజ్ఞాన కోశం? ఎక్కడ రాస్తున్నారు, ఎవరు రాస్తున్నారు?

వికీపీడియా - ఎన్సైక్లోపీడియా పేరును అనుసరిస్తూ పెట్టిన పేరిది. 2001 లో జిమ్మీ వేల్స్ అనే అమెరికనుకు వచ్చిందీ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ఆలోచన. ఎవరైనా రాయగలిగేదీ, దిద్దుబాట్లు చెయ్యగలిగేదీ, చదువుకునేందుకు ఇంటర్నెట్లో అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేదే స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. కార్య సాధకుడవడం చేత ఆలోచన వచ్చాక ఇక ఊరుకోలేదు, జిమ్మీ. తన ఆలోచనకు ఆకారమిస్తూ వికీపీడియాకు శ్రీకారం చుట్టాడు. అప్పటికే తాను రూపొందిస్తూ ఉన్న నుపీడియా అనే విజ్ఞాన సర్వస్వాన్ని పేరు మార్చి వికీపీడియాను మొదటగా ఇంగ్లీషు భాషలో మొదలుపెట్టాడు. వికీపీడియా చాలా త్వరగా ప్రజల మన్నలను పొందింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగి విశ్వవ్యాప్తమైంది. జర్మను, జపనీసు, స్పానిషు, ఫ్రెంచి, ఇటాలియను, రష్యను, చైనీసు ఇలా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతర భాషల్లోనూ వికీపీడియాలు మొదలయ్యాయి. గొప్ప గొప్ప వ్యాసాలెన్నో తయారయ్యాయి, అవుతూ ఉన్నాయి. ఇంటర్నెట్లో వివిధ భాషలకు ప్రత్యేకించిన వెబ్ సైట్లలో ఈ విజ్ఞాన సర్వస్వాన్ని రాస్తున్నారు.

తెలుగు వికీపీడియా వెబ్ అడ్రసు: http://te.wikipedia.org. చరిత్ర, సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు.. ఇలా ఎన్నో విషయాలపై రాస్తున్నారు. 13 వేలకు పైగా సభ్యులు 44 వేలకు పైగా వ్యాసాల మీద ప్రస్తుతం పని చేస్తున్నారు. ప్రఖ్యాత రచయితలు, సంఘసేవకులూ కూడా వికీపీడియాలో రాస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని గ్రామాల గురించీ రాయాలనే సంకల్పంతో సభ్యులు రేయింబవళ్ళు పని చేస్తున్నారు. రేయింబవళ్ళు అనే మాట వాక్యంలో తూకం కోసం వాడింది కాదు.., భారత్, అమెరికా, కెనడా, బ్రిటను, ఫ్రాన్సు, కొరియా, ఆస్ట్రేలియా ఇలా ప్రపంచం నలుమూలలలోనూ ఉన్న తెలుగువారు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. అంచేతే ఎల్లవేళలా వికీపీడియాలో ఎవరో ఒకరు రాస్తూ కనిపిస్తారు.

ఇదంతా మాకు తెలిసిందే మళ్లీ ఎందుకు చెప్తున్నా అంటారా?? మనం తెలుగువారి ఖ్యాతి చాటేందుకు ఒక సదవకాశం వచ్చింది. తెలుగు వికీపీడియా యాభై వేల వ్యాసాల సంఖ్య గల రెండవ భారతీయ భాషగా ఆవిర్భవించడానికి మీ అందరి సహకారము కావాలి. ఇంకా దాదాపు మరో పద్దెనిమిదివందలయాభై వ్యాసాలు చేరితే ఆ మైలు రాయి దాటవచ్చు, ఇది ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ లోపు జరగాలన్నది సంకల్పం. ఇందుకు అందరూ తలో చేయీ వెయ్యాలి. వికీపీడియా లో ఉన్న వ్యాసాల నాణ్యతను పెంచాలి. అందులో లేని విషయాలను చేర్చాలి. ఉదాహరణకు మీకు నచ్చిన తెలుగు సినిమా విశేషాలు రాయవచ్చు, లేదా పుస్తకం లేదా సినిమా, ఐతే బ్లాగుల్లో లేక బజ్జులో లా మీ ఆలోచనలు పెట్టకుండా, అందరికీ సమాచారాన్నందించే విషయాలు రాయాలి. తద్వారా రాబోయే తరాలకు అమూల్యమైన సమాచారాన్ని అందించినవారవుతారు.

వికీలో రాయడానికి ఉపక్రమించనప్పుడు కొన్ని సందేహాలు, సమస్యలు రావొచ్చు. వికీ విధానాలు, పద్ధతులు తెలిసే సరికి కొంత కాలం పడుతుంది. తెలియని వాటి గురించి అడగడంలో తప్పులేదు. పిర్యాదులా కాకుండా, నేను ఈ పేజీలో బొమ్మ చేర్చాలి ఎలా, లేదా ఈ పేరా క్రింది హెడ్డింగ్ పెట్టాలి ఎలా అని స్పెసిఫిగ్గా అడిగితే సహాయం అందించేవారు తప్పకుండా ముందుకొస్తారు. అలాగే వికీలో మన అభిప్రాయాల్లా కాకుండా, వాస్తవాలను చెప్తున్నట్టుగా వ్రాయాలి. అలానే, తగిన వనరులను కూడా ఉదహరించాలి. మార్గదర్శకాలు..

ఈ క్రింది విడ్జెట్ ని మీ బ్లాగులో పెట్టుకోండి. ఈ సమాచారాన్ని మరికొందరికి చేరవేయండి..

మీ సైట్లలోనూ, బ్లాగుల్లోనూ విడ్జెట్టు కోసం కోడ్:

<iframe src="http://wiki50k.etelugu.org/widget" width="200" height="150"
style='border:none;'><p>Your browser does not support <code>iframe</
code>s.</p></iframe>

3 వ్యాఖ్యలు:

. నల్ల కొండలో తెల్ల చుక్క

Chaalaa Manchi Vishayam Cheppaaru. Krutajnatalu.Nenu Kuudaa Prayatnistaanu

Unknown

please send me a essay writing on "Thermo/Thermal power plant advantages and disadvantages " in "Telugu"

kommuru

send me road accident essay in telugu plssssssssssssss important

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008