Thursday, September 22, 2011

పూవై విరిసిన పున్నమివేళమానవుడు రోదసిలోకి నిరంతర ప్రయాణం సాగించినా, అందాల చందమామను చేరి పరిశోధనలు జరిపినా ఇంకా ఎన్నో సృష్టిరహస్యాలు అర్ధం కాకుండా మిగిలిపోతున్నాయి. ప్రకృతిలోని కొన్ని వింతలు ఆశ్చర్యంలో పడేస్తే, కొన్ని ప్రశ్నార్ధకాలుగానే మిగిలిపోతున్నాయి. అలాటి ఒక అద్భుతం బ్రహ్మకమలం. కేదారేశ్వరుడికి ప్రీతికరమైన ఈ పుష్పాలు హిమాలయాల్లోనే ఎక్కువగ పూస్తాయని అంటారు కాని ఇపుడు దేశవ్యాప్తంగా కొందరి ఇళ్లల్లో విరబూస్తున్నాయి బ్రహ్మకమలాలు. ఇవి అసలైన బ్రహ్మకమలాలు అవునో కాదో కాని అరుదైన జాతికి చెందిన అద్భుతమైన పుష్పం అని చెప్పవచ్చు. ఈ పువ్వు సంవత్సరానికి ఒకేసారి పూస్తుంది. అది కూడా రాత్రి ఎనిమిది తర్వాత విచ్చుకోవడం మొదలై పన్నెండు వరకు పూర్తిగా విచ్చుకుని అందాలతో బాటు సుగంధాలు వెదజల్లుతుంది. కాని సూర్యోదయానికి ముందే అస్తమిస్తుంది. మామూలుగా ఇది ఒకే పువ్వు పూస్తుంది కాని కొందరి ఇళ్లల్లో మాత్రం 6 - 10 పూలు కూడా విరబూస్తాయి. ఆ రోజు వాళ్ల ఇంట్లో పండగ వాతావరణం.. చూసినవారికి అద్భుతమే..


ఈ మొక్కలోని చిన్న ఆకును తెచ్చి మట్టిలో పాతితే దానినుండి మరో మొక్క మొదలవుతుంది. క్రమంగా ఆకులు దళసరిగా మారి అందులోనుండే మరిన్ని ఆకులు పుట్టుకొస్తాయి. ఇంకా ఈ మొక్క నాటిన రెండేళ్ల తర్వాతే పూత మొదలవుతుంది. బలిష్టమైన అకుల మీదనుండే బ్రహ్మకమలం మొగ్గ వేస్తుంది. వారం రోజుల్లో పెరిగి పెద్దదై విరబూస్తుంది. సుమారు ఎనిమిది గంటలనుండి పువ్వు విచ్చుకోవడం మొదలవుతుంది. అర్ధరాత్రి పన్నెండు వరకు పూర్తిగా విచ్చుకుని అద్భుతమైన సువాసనను వ్యాపింపచేస్తుంది. తెల్లవారేసరికి పూర్తిగా ముడుచుకుపోతుంది. ఈ పువ్వు జీవితకాలం చాలా తక్కువ.. ఈ బ్రహ్మకమలం పువ్వులు ఎక్కువగా జూన్ నుండి ఆగస్ట్ వరకు విరబూస్తాయి. లేదా మరో నెల వరకు..

ఎడారిమొక్కగా పిలవబడే బ్రహ్మకమలం మొక్కను వృక్షశాస్త్రంలో కాక్టస్ జాతికి చెందినదని గుర్తించారు. ఈ పువ్వును తెలుగు, సంస్కృత బాషలో బ్రహ్మకమలమని, హిందీలో నిషాగంధి అని, ఇంగ్లీషులో క్వీన్ ఆఫ్ నైట్స్ అని వ్యవహరిస్తారు. బ్రహ్మకమలం పుష్పాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పంగా గుర్తించింది. 1982లో భారతీయ తపాలా శాఖ హిమాలయ పుష్పాల మీద విడుదల చేసిన స్టాంపులలో బ్రహ్మకమలాన్ని కూడా చేర్చింది. బ్రహ్మకమలం దేవతాపుష్పంగానే కాకుండా ఓషధీ మొక్కగా కూడా ఉపయోగిస్తున్నారు. దీని వేరును గాయాలు మానడానికి వాడతారు అలాగే పక్షవాతానికి కూడా ఇది మంచి మందు అంటారు వైద్యులు.

ఇంత అరుదైన, అద్భుతమైన పువ్వు మొన్న పున్నమి నాడు మా ఇంట్లో కూడా విరబూసింది. అసలు పువ్వులంటే మక్కువలేనివారు ఎవ్వరు ?? బజారులో కొన్న కిలోల పువ్వుల కన్నా మన ఇంట్లో పూసిన రెండు మూడు పువ్వులు మనకు అపూర్వమే కదా. అవి మొగ్గలా మొదలై పువ్వుగా మారడం చూస్తుంటే కలిగే ఆనందం అంతులేనిది. అలాంటిది ఒక అద్భుతమైన పువ్వు విరబూయబోతుంది అంటే ఎంత ఆత్రుత.. మూడేళ్ల క్రింద సత్యవతిగారిని అడిగితే ఈ మొక్క ఇచ్చారు. ఇక అప్పటినుండి ఎప్పుడు బ్రహ్మకమలాన్ని చూస్తానో అనుకుంటూ ఉండేదాన్ని. బ్లాగుల్లో , టీవీలో ఈ పువ్వులను చూస్తుంటే ఇంకా అత్రుత ఎక్కువైపోయేది. ఇన్నేళ్ళైనా ఇంకా పువ్వు రావడం లేదని నిరాశపడడం, మళ్లీ ఎదురుచూడం అలవాటైపోయింది. కాని మొన్న పున్నమికి వారంరోజుల ముందు మొగ్గ కనిపించగానే ఎంత ఆనందమో.
రోజూ పొద్దున్నే ఆ మొగ్గని చూడడం. ఎంత పెరిగిందా? ఎప్పుడు విచ్చుకుంటుందా? అని అనుకుంటూ ఫోటోలు తీసుకుని భద్రపరుచుకోవడం. ఇలా చివరికి పున్నమి రోజు విరబూస్తుంది అనుకునేంతగా ఎదిగింది ఆ మొగ్గ. ఆకుమీద పెరిగిన ఆ పువ్వు అడుగు పొడవున్న కాడతో ఉంది. ఎక్కడ బరువుకు పడిపోతుందో అని ఆ కాడను ఒక రాడ్ పెట్టి దారంతో కట్టాను. ఆరోజు విరబూస్తుందో మరునాడో అని రాత్రి ఏడుగంటలవరకు సందిగ్ధంగానే ఉండింది. మొదటిసారి కదా.. ఇక ఎనిమిది నుండి మెల్లిగా విచ్చుకుంటున్న పువ్వును చూస్తుంటే మాత్రం అద్భుతం అనిపించింది. పది నిమిషాలకోసారి ఇంటి వెనకాల కెళ్లి పువ్వును చూడడం. ఫోటో తీసుకోవడం. అప్పుడు ఎటువంటి వాసనలు రాలేదు. ఇదేంట్రా మంచి సువాసన వస్తుందని చెపారు కదా అనుకుంటుండగా. రాత్రి పదకొండు నుండి మెల్లిగా సువాసనలు మొదలయ్యాయి. ఆకాశాన నిండుగా వెలుగుతున్న ఆ పున్నమి చంద్రుడికి ధీటుగా స్వచ్చమైన తెలుపులో , ముట్టుకుంటే మాసిపోతాయేమో అన్నంత మృదువైన రెక్కలతో బ్రహ్మకమలం పూర్తిగా విరబూసింది. అరచేయి వెడల్పులో ఆ పువ్వును చూస్తుంటే చెప్పలేని ఆనందం. ఉద్వేగం.ఆ భావన మాటలలో చెప్పలేను. కవి హృదయం కావాల్సిందే ఆ అందాలు వర్ణించడానికి .. ఆ పువ్వు తెల్లవారేవరకు ఉండదని తెలుసు అందుకే దాన్ని ఫోటోలలో బంధించి ఉంచాను. రాత్రి పన్నెండున్నరకు పువ్వును కోసి దేవుడి దగ్గర పెట్టి పడుకున్నాం. పొద్దున్న చూస్తే ముదుచుకుపోయి వాలిపోయింది..

మళ్లీ వచ్చే ఏడాదే విరబూస్తుందని తెలిసినా ఇంకా ఆశతో రోజూ చూస్తున్నా ఇంకో మొగ్గ కనిపిస్తుందేమో అని...

18 వ్యాఖ్యలు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी

మీ మాటలవనంలో ఆనందపుష్పం కూడా విరబూసింది.

కొత్త పాళీ

very nice.
I think it is a kind of an orchid, not cactus.

జ్యోతి

కొత్తపాళీగారు ఈ విషయం కనుక్కుంటాను..

తార

Selenicereus grandiflorus, It is Cactus spices.

సుజాతగారు నాకు ఇచ్చిన మొక్క రైల్లో పోయిందీ :( వాఆ
మళ్ళీ ఇంకో మొక్క ఎప్పుడో, ఆ తరువాత మళ్ళీ పూలు ఎప్పుడో ..

జ్యోతి

కొత్తపాళీగారు ఇక్కడ చూడండి..

Satyam

Please look at this vedio clip.
http://www.youtube.com/watch?v=CXxFdpT7CZA&feature=related

జ్యోతి

Fantastic.. Thanks for the video link Satyamgaru,,

రసజ్ఞ

మీ వర్ణనకి ఆ వీడియో మంచి అందాన్నిచ్చింది. అన్నీ పూలు ఒకే సారి అలా విచ్చుకుంటుంటే దేనిని చూడాలో కూడా తెలియడం లేదు.

Bhupatiraju vihang

dear frnd,


నిజంగా
ఇది అద్భుతమైన అనుభూతి,
మా అందరితో పంచుకున్నందుకు,
మనస్పూర్తిగా ధన్యవాదాలు....

నాగేస్రావ్

ఓహో, గులేబకావళి అంటే ఇదేనా!
"Epiphyllum oxypetalum (Dutchman's Pipe, kardable, Night Queen or निशागंधी Nishagandhi or Gul-e-Bakawali) is a species of cactus.."

యమ్వీ అప్పారావు (సురేఖ)

మీ ఇంట్లో విరిసిన బ్రహ్మ కమలం మొగ్గనుంచి పూవు వరకు వరుస ఫొటోలలో చూపించినందుకు ధన్యవాదాలు. ఈ మొక్క మా రాజమండ్రి
దగ్గర వున్న కడియం నర్సరీలలో దొరుకుతుందేమో చూడాలి.

భాస్కర రామిరెడ్డి

మాయింటికొక పార్సిల్ మర్చిపోకండి. :-)

Manga Mani

మీరు పొందిన ఆనందాన్ని మాకు పంచియిచ్చినందుకు మీకు ధన్యవాదాలు. సత్యం గారు ఇచ్చిన వీడియో లింకులొ విరిసినపుడు కలిగిన అనుభూతి మీ వర్ణనలొ మాకు కలిగింది, కాని అవి మరలా ముడుచుకొనేటపుడు మాత్రం చాల బాధగా అనిపించింది. ప్ర్యత్యక్షంగా వీక్షించిన మిమ్మల్ని చూసి కొంచెం అసూయగా కూడా ఉంది ఏమైన మీకు మరొక్కసారి ధన్యవాదాలు విడియో లింక్ ఎంబెడ్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం

శశి కళ

నాకు కూడ మీరు వ్రాసింది చదువుతుంటె చాలా
బాగా నచ్చిన్ది.పొటొలు కూదా చాలా బాగున్నాయి.
మంచి పొస్టింగ్.

శశి కళ

జ్యొతి గారు మీది యె ఊరొ తెలుసుకొవచ్చా?
మాది నెల్లూరు.

Ennela

జ్యోతి గారు,,
ఆకు పెడితే మొక్కవుతుందా..వావ్!!!
యీ ముక్క చెప్పి ఉంటే, మీ ఇంటికి వెతుక్కుంటూ వచ్చేదాన్నిగా...వా.....
ఒక ముక్క/మొక్క కెనడాకి పార్సెల్ ప్లీస్!!

anveshi

Mee varnana adbutham ,maaku kuda meeru pondina anubhitini panchinanduku dhanyavadalu

anveshi

Mee varnana adbutham ,maaku kuda meeru pondina anubhitini panchinanduku dhanyavadalu

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008