Monday 3 October 2011

నవరాత్రులు - నవదుర్గలు

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు తొమ్మిదిరోజులు శరన్నవరాత్రులుగా వైభవంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులలోని అమ్మవారిని మొదటి మూడు రాత్రులు దుర్గగా, తర్వాతి మూడురాత్రులు లక్ష్మిగా, చివరి మూడు రాత్రులు సరస్వతిగా పూజిస్తారు. శుభ, నిశుంభ, మహిషాసురుడు మొదలైన రాక్షసులను సంహరించడానికి అవతరించిన దుర్గాదేవి తొమ్మిదిరోజులు వేర్వేరు రూపాలు ధరించింది. అందుకే ఈ నవరాత్రులలో ఆలయాలలో అమ్మవారికి ప్రతీరోజు ఒక్కో అలంకారం చేస్తారు. అలాగే రోజుకో రకం నైవేద్యం సమర్పిస్తారు. దేవీ భాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనేవి నవదుర్గా రూపాలు. ప్రతి అవతారానికి ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక, ఉపాసనా రహస్యాలు ఉన్నాయి.




వందేవాంచితలాభాయ చంద్రార్ధకృత శేఖరమ్


వృషారూఢాం శూలధరం శైలపుత్రీం యశస్వినీమ్


1. శైలపుత్రి: నవరాత్రులలో మొదటిరోజు పాడ్యమినాడు అమ్మవారిది శైలపుత్రి అవతారం. పర్వతరాజు పుత్రిక పార్వతిగా జన్మించిన సతీదేవి శంకరుడిని సేవించి వరిస్తుంది. శైలపుత్రి కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం ధరించి ఎద్దుపై స్వారీ చేస్తూ ఉంటుంది. పాడ్యమినాడు పెసరపప్పు, జీలకర్ర, మిరియాలతో చేసే పులగం లేదా కట్టు పొంగలి నైవేద్యంగా సమర్పిస్తాతారు.



దధనా కరపద్మాభ్యం అక్షమాలా కమండలా


దేవీ ప్రేదతు మయీ బ్రహ్మే చారిణ్యనుత్తమా


2. బ్రహ్మచారిణీ: రెండవరోజు విదియనాడు అమ్మవారిది బ్రహ్మచారిణిగా అవతారం. బ్రహ్మచారిణి అంటే తపమాచరించినదని అర్ధం. కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలాన్ని ధరించిన ఈ తల్లి ఉమ, తపచారిణిగా కూడా పిలువబడుతుంది. విదియనాడు పెరుగుతో చేసిన దద్ధ్యోజనం నైవేద్యం చేస్తారు.


పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా


ప్రసాదం తమతేహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా


3. చంద్రఘంట: దుర్గాదేవి మూడో అవతారం చంద్రఘంట.. తన నుదుటిపై అర్ధచంద్రుడిని ఘంటాకారంగా కలిగి ఉంటుంది కాబట్టి చంద్రఘంటగా పిలువబడుతుంది. పది చేతులతో, మూడు కన్నులతో పులిని అధిష్టించిన అమ్మవారు ఎనిమిది చేతులలో జపమాల, బాణం, ఖడ్గం, శ్వేతపద్మం, కమండలం, త్రిశూలం, ధనుస్సు, గద ధరిస్తే, మిగిలిన రెండు చేతులు వరాలిచ్చే, చెడును ఆపే ముద్రలతో ఉంటాయి. ఈ రోజు బెల్లంతో చేసిన గుడాన్నం నైవేద్యంగా పెడతారు.

'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ


దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '

4. కూష్మాంఢ : నాలుగవ రోజైన చవితినాడు అమ్మవారిని కూష్మాండగా అలంకరిస్తారు. అష్టభుజాలతో అలరారే ఈ తల్లి కమలం, ధనుస్సు, బాణం, కమండలం, కలశం, జపమాల, గద, చక్రం మొదలైనవి ధరించి సింహవాహినిగా ఉంటుంది. అంధకారంలో మునిగిపోయిన విశ్వాన్ని తన వెలుగుతో సూర్యకిరణాలవలే ఎల్లెడలా కాంతిని నింపింది కూష్మాండ దేవి. ఈ రోజు అమ్మవారికి చేసే అన్నం ప్రసాదాన్ని నూనెతో కాక నేతితో పోపు పెట్టి నేతి అన్నం నైవేద్యం పెడతారు.



సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా


శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ '

5. స్కంద : ఐదవ రోజైన పంచమినాడు అమ్మవారు స్కందాదేవిగా సాక్షాత్కరిస్తుంది. దేవతల సైన్యాధిపతియైన స్కందుడు లేదా సుబ్రహ్మణ్యాన్ని పిల్లవాడిగా తన ఒడిలో ఉంచుకుంటుంది. సింహాన్ని స్వారీ చేస్తూ, నాలుగు చేతులు, మూడు కళ్లు కలిగిన తల్లి రెండు చేతులలో కమలాలను , మరో రెండు చేతులు అభయం, రక్షణ ఇస్తున్నట్టుగా ఉంటాయి. స్కందమాతను పూజిస్తే ఎంతటి మూర్ఖుడైనా మహా పండితుడు అవుతాడంట. మహా కవి కాళిదాసు స్కందమాత ఆశీస్సులతోనే రఘువంశ మహా కావ్యం, మేఘదూతం రచించాడు. పంచమినాడు పాలు, బియ్యం కలిపి చేసిన పాయసాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు.


'చందరహాసోజ్వలకరం శార్దూలవరవాహనా


కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ '

6. కాత్యాయిని : ఆరవరోజైన షష్టినాడు అమ్మవారు కాత్యాయినిగా కొలువై ఉంటుంది. కాత్యాయన మహారుషి జగన్మాతను తన కూతురిగా పొందాలని తపస్సు ఆచరించాడు . అతని భక్తికి మెచ్చిన దుర్గామాత యమునా నదీ తీరాన అతని కుమార్తె కాత్యాయినిగా జన్మిస్తుంది. నాలుగు చేతులు, మూడు కళ్లతో ఉండే కాత్యాయిని ఒక చేత ఖడ్గం, ఒకచేత కమలం, రెండు చేతులతో అభయముద్ర కలిగి సింహాన్ని అధిష్టించి ఉంటుంది. షష్టినాడు పులిహార నైవేద్యంగా సమర్పిస్తారు.


'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా


లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ


వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా


వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ '


7. ఏడవరోజు దుర్గామాత కాళరాత్రిగా రూపం దాల్చి ఉంటుంది. కాళరాత్రివలె నల్లగా ఉండి, అస్తవ్యస్తమైన కురులతో, మెరుపుతీగను హారంగా ధరించి భయంకరంగా ఉంటుంది . నాలుగు చేతులు, మూడు కళ్ళు కలిగి రెండు చేతులలో ఆయుధాలు, మిగిలిన రెండు చేతులతో అభయం, రక్షణ ఇస్తూ నాసికాలనుండి అగ్నిజ్వాలలను వెదజల్లుతూ ఉంటుంది. గాడిదను వాహనంగా కలిగిన ఈ తల్లి తనను శరణువేడినవారికి అభయాన్నిస్తూ శుభంకరి అని కూడా పిలువబడుతుంది. సప్తమినాడు పులిహోర, పాయసం నైవేద్యంగా సమరిపిస్తారు.




'శ్వేతే వృషే సమారూఢా శ్వేతంబరధరా శుచిః


మహాగౌరి శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా!'


8. ఎనిమిదవ రోజైన అష్టమినాడు దుర్గాదేవి మహాగౌరీగా పూజింపబడుతుంది. అనితర సాధ్యమైన తపస్సు ద్వారా నల్లని తన మేని ఛాయను మార్చుకుని ధవళ కాంతులతో ప్రకాశించిన దుర్గాదేవి స్వరూపం మహాగౌరి. తెల్లని చంద్రకాంతితో విరాజిల్లే ఈ తల్లి నాలుగు చేతులు కలిగి ఉంటుంది. ఒక చేత త్రిశూలం, ఒక చేత కమండలం, ఒక చేత అభయం, ఒకచేత రక్షణ ఇచ్చే ముద్రలు కలిగి ఎద్దుపై స్వారీ చేస్తుంది. సప్తమినాడు పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు.




'సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి


సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ


9. తొమ్మిదవ రోజైన నవమి నాడు అమ్మవారిని సిద్ధిధాత్రిగా అలంకరిస్తారు.. అష్ట సిద్ధులతోపాటు మోక్షసిద్ధిని కలిగించే అమ్మరూపం సిద్ధిధాత్రి’. పరమశివుడు మహాశక్తిని పూజించి అష్టసిద్ధులను పొందాడని దేవీ పురాణం చెబుతుంది. ఆ శక్తి అతని శరీరంలో సగభాగమై అర్ధనారీశ్వరుడిని చేసింది. చతుర్భుజాలతో భక్తుల పూజలందుకుంటుంది. ఈమె కమలాసనయై. మరొక చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది. రుషులు, మునులు, సిద్ధులు, దేవతలు కూడా సిద్ధిధాత్రిని పూజిస్తారు. నవమి నాడు బెల్లంతో చేసిన పరమాన్నం, దధ్యోదనం, పాయసం, పులిహోర చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

11 వ్యాఖ్యలు:

రసజ్ఞ

చాలా చక్కగా వివరించారు. మీకు చెప్పే అంతటి దానిని కాదు కాని చిన్న సవరణ చక్రపొంగలి అనకూడదు శర్కరపొంగలి అనాలి.

జ్యోతి

రసజ్ఞ,,

నేను బెల్లంతో చేసిన చక్రపొంగలి అన్నాను కదా. అది తప్పే. చక్కెర లేదా శర్కర లేనిది చక్కెర/శర్కర పొంగలి కాదు. అందుకే బెల్లంతో చేసింది కాబట్టి గుడాన్నం అని సవరించాను..

కొత్త పాళీ

చక్రపొంగలి అని శిష్టవ్యావహారికమే

శశి కళ

ఓక్క సారి అన్ని చదివించి మా చెత అమ్మవారికి
పూజ జరిపించారు.థాంక్యు

Hima

Very nicely described. oka chinna correction andi. Eight day is Ashtami, not Saptami. I guess that is repeated from 7th day. I was waiting if some one is going to say this, I am so little to say this though.

- Hima

Hima

Hello Jyothi Garu,

Very nicely described. I follow your blog whenever I get time.

One small correction andi. I was waiting if some one will say this, as I am very little to correct you.

8th day is Ashtami andi, not Saptami. I think this was repeated from 7th day description.

Thanks
Hima

జ్యోతి

Hima,

ధన్యవాదాలు. కరెక్ట్ చేసాను.

బాబు

జ్యోతి గారికి,

ఈవాళే మీ బ్లాగ్ చూసాను. దుర్గ అమ్మవారి రంగుల చిత్రాలు చాలా బాగున్నాయి. మంచి సేకరణ.

Ennela

very very nice post

Unknown

Thank You for information you provided in the net.

Unknown

chala bagundi amma subhamsthu

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008