మహిళాబ్లాగర్లు - ఈనాడు తెలుగు వెలుగు
ఈనాడు సంస్ధనుండి వెలువడుతున్న తెలుగు వెలుగు మాస పత్రిక మార్చినెల సంచికలో తెలుగు మహిళా బ్లాగర్ల మీద రాసిన వ్యాసం...
అమ్మలూ బ్లాగు బ్లాగు.....
డాక్టర్ చందు శైలజ : వృత్తిరీత్యా గైనకాలజిస్ట్ ఐన శైలజ తన హాస్యరసపూరితమైన బ్లాగు రచనలతో చాలా త్వరగా ఎంతో మంది అభిమానులను కూడగట్టుకున్నారు. మనసు బాగోలేకపోతే హాస్యానికి పెట్టింది పేరైన శైలజ బ్లాగు చదివితే చాలు అనుకుంటారు పాఠకులు. ఆవిడ ఎంత హాస్యం రాస్తారో, సీరియస్ విషయాల్లో అంత సీరియస్ గానూ ఆలోచిస్తారు. కాని శైలజ రాసే టపాలన్నీ పాఠకులను నవ్వించి, నవ్వించి చంపేస్తాయి. ప్రతీ వాక్యం ఓ హాస్య విస్పోటనం.. ఆవిడ రాసే టపాలు చదవాలంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఉద్యోగస్ధులు. ఆఫీసులో కాని చదువుతూ ఎడతెరిపి లేకుండా నవ్వుతుంటే మిగతావాళ్లు పిచ్చెక్కిందేమనని చూస్తారంట. ఇంట్లో కూడా ఎవరూలేకుండా చూసి చదువుకుని నవ్వుకుంటామని చెప్పుకుంటారు. అంత సరదాగా రాస్తారు డా.శైలజ.. అసలిది
అమ్మలూ బ్లాగు బ్లాగు.....
కంప్యూటర్ - అంతర్జాలం -
మొబైల్ ఫోన్
ఈనాడు ఈ మూడింటికి
అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా అంతర్జాలం చాలా జీవితాల్లో అనూహ్యమైన మార్పు తీసుకొచ్చింది అని అందరూ
అంగీకరిస్తున్నారు. దాని అవసరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అందుకే ఈ రోజుల్లో
కంప్యూటర్ లేని ఇళ్లు చాలా తక్కువగా ఉంటాయేమో. ఫ్రిజ్, టీవీ
లాగే ఇది కూడా ఒక నిత్యావసర వస్తువుగా మారింది. పిల్లలు, శ్రీవారు
తమ చదువులు ఉద్యోగావసరాలకు కంప్యూటర్ ఉపయోగించుకుంటారు. తర్వాత అది ఖాళీగా
ఉంటుంది. ఇంకెవరికీ ఉపయోగపడదు. ఐనా అంతర్జాలం,కంప్యూటర్లో
చేసేదేముంటుంది. ఆఫీసు లెక్కలు, కాలేజీలు, కోర్సుల వివరాలు, ఆటలు, పనికిమాలీన
చాటింగ్ తప్ప..... ఇలా అనుకుంటే పొరపాటే. ఉద్యోగాలు చేసేవారికి, చదువుకునేవారికే కాకుండా ఇంట్లో ఉండే, ఉద్యోగాలు చేసే మహిళలలకు కూడా ఈ
అంతర్జాలం, కంప్యూటర్ చాలా ఉపయోగపడుతుంది. దానికి ప్రత్యక్ష
నిదర్శనమే ఈనాడు అంతర్జాలంలో ఒక చిన్న ప్రపంచంగా మారిన తెలుగు బ్లాగులు. అందులో
మహిళల పాత్ర గురించి చెప్పుకుంటే ఒక కొత్త లోకం సాక్షాత్కరిస్తుంది. రాసిలో
తక్కువైనా వాసిలో మిన్న అని అంతర్జాలంలో తెలుగు వాడకందారులు తెలుగు మహిళా బ్లాగర్ల
గురించి నమ్మే, చెప్పుకునే మాట . ఇది ఎంతవరకు నిజమో
తెలుసుకోవాలంటే తెలుగు మహిళా బ్లాగర్ల
చరిత్రను తిరగేయాల్సిందే. పదండి మరి..
అసలు ఆడవాళ్లకు కంప్యూటర్లు, అంతర్జాలం ఇదంతా ఎందుకు? చేసుకుంటే
ఉద్యోగాలు, లేకుంటే ఇల్లు, పిల్లలు,
వంట లేకుంటే కుట్లు
అల్లికలు, పచ్చళ్ళు ఉండనే ఉన్నాయి. ఇలా అనుకునే రోజులు
పోయాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి
ఎప్పుడూ ఉత్సాహం చూపించే మహిళలు పెద్ద పెద్ద చదువులు లేకున్నా ఎంతో ఉత్సాహంతో ఈ ఆధునిక సాంకేతిక విప్లవంలో తాము కూడా
భాగస్వాములే అని నిరూపించారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈనాడు అంతర్జాలంలో
వెలిగిపోతున్న తెలుగు బ్లాగులే...ఎక్కడికీ వెళ్లకుండా, ఇంట్లో కూర్చునే ఈ అంతర్జాలం సాయంతో ప్రపంచమంతా
చుట్టి రావొచ్చు. అర్ధం కాని, తెలియని విషయం ఎదైనా నిముషాల్లో అంతర్జాల సాయంతో సవివరంగా తెలుసుకునే వీలుంది అని అర్ధమైన తర్వాత ఊరుకుంటారా ఎవరైనా.?
ఇక అంతర్జాలం అంటే ఇంగ్లీషు తప్పనిసరిగా
రావాలి. ఇంగ్లీషులోనే రాయాలి, చదవాలి అనే అపోహ కూడా ఉంది.
కాని ఈనాడు ఎటువంటి ఖర్చు లేకుండా తెలుగు రాయగలిగే సులభమైన పద్ధతులు ఎన్నో అందుబాటులో
ఉన్నాయి.
మనసులోని భావాలను, ఆలోచనలను, సందేహాలను పంచుకుని, చర్చించుకోవడానికి ఒక విశేషమైన వేదిక ఈ బ్లాగు. బ్లాగులు మన ఆలోచనా
స్రవంతికి అక్షరరూపం ఇచ్చుకునే అద్వితీయ రూపాలు….అన్ని
రంగాలలో పురుషులతో పాటు సమానంగా తమ ప్రతిభను చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్న
మహిళలు అంతర్జాలంలో కూడా తమ కంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకుని ఇంటిపనులు చేసుకున్నంత సునాయాసంగా కంప్యూటర్‌ని కూడా ఉపయోగిస్తున్నారు. తమ
వైవిధ్యమైన రాతలతో తెలుగు బ్లాగులకు కొత్త సౌందర్యాన్ని తీసుకొచ్చారు. తెలుగులో రాయడం, చదవడం
ఎంతో సులువుగా, ఖర్చులేకుండా ఉండడంతో అందరూ ఇష్టపడే కథలు, కవితలు, వంటలు, పాటలు, హాస్య సంఘటనలు, సినిమాలు... ఇలా వైవిధ్యమైన అంశాలతో రాస్తూ బ్లాగులలో ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారు మహిళలు.
వీరిలో కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులు, గృహిణులు, రచయిత్రులు, వయసు
పైబడినవారు అంటూ తేడా లేదు. తెలుగు భాష
మీది అభిమానం, రాయాలి, తమలా
ఆలోచించేవారితో పంచుకోవాలి, చర్చించాలి అనే తపనతో ఎన్నో
విభిన్నమైన సంఘటనలు, సమస్యలు తమదైన శైలిలో రాస్తున్నారు. మాట్లాడుకోవాలనుకుంటే ఎన్ని
విషయాలు లేవు.. తమ ఉద్యోగానుభవాలు, నిత్య జీవితంలో ఎదుర్కునే
సమస్యలు, ఉద్వేగాలను మనసుకు హత్తుకునేలా వెల్లడి చేయడంలో
మహిళలను మించినవారు లేరేమో? పాతిక నుండి ముప్పాతిక ఏళ్ల పైబడి
ఉన్న మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా, హాస్యపూరకంగా,
వ్యంగ్యంగా, సూటిగా, ఘాటుగా
ఔరా అనిపిస్తూ తమ రాతలకు వన్నెలద్దుతున్నారు. వీరిలో సమయం కుదిరినప్పుడు తీరిగ్గా రాసేవారు కొందరైతే , ఏదైనా
విషయం వెంటనే పంచుకోవాలి అని అనుకున్న వెంటనే
బ్లాగులొ రాసుకునేవారు.. కొందరు ఇలా రాయడం
ద్వారా తమ భావాలను, ఆలోచనలను,
ప్రతిభను ప్రదర్శిస్తూ, మెరుగు పెట్టుకుంటూనే
కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ
ఉత్సుకత చూపిస్తున్నారు. ఇక ఉద్యోగాలు చేసే మహిళలు తమ వృత్తితో పాటు బ్లాగింగును
కూడా ఒక ఉపయుక్తమైన ప్రవృత్తిగా నిర్వహిస్తున్నారు. బ్లాగులవల్ల పైసా ఆదాయం
లేకున్నా దానివల్ల దొరికే మానసిక ఆనందం , ఉపయోగం మాత్రం
ఎక్కువే. ఇక్కడ మరో ముఖ్య విషయం చెప్పుకోవచ్చు. ఎక్కువమంది మహిళ బ్లాగర్లు తమ భర్త,
పిల్లల మూలంగానే కంప్యూటర్ వినియోగం, తెలుగులో
రాయడం, బ్లాగుల గురించి తెలుసుకోవడం జరిగింది. ఊరికే టీవీ
సీరియల్స్ ఏం చూస్తావని అమ్మను, అమ్మమ్మను, బామ్మను కంప్యూటర్ ముందు కూర్చొబెట్టిన
పిల్లలు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
తెలుగుబ్లాగుల్లో మహిళలు రాయడం 2005 లో మొదలైంది. అప్పట్లో కంప్యూటర్, అంతర్జాల
వినియోగం, అందులో తెలుగు ఉపయోగం చాలా తక్కువ అని చెప్పవచ్చు.
కాని 2006 నుండి కంప్యూటర్లో తెలుగు రాసే
ఉపకరణాలు ఒక్కటొక్కటి తయారు చేయడం
మొదలుపెట్టారు సాంకేతిక నిపుణులు. అప్పటినుండే తెలుగు బ్లాగులు అందులో మహిళల
ప్రవేశం పెరిగింది. 2007 వరకు కాస్త నత్త నడక నడిచిన మహిళా బ్లాగులు 2007....2008
వచ్చేటప్పటికి పరుగు అందుకున్నాయి.
విభిన్న రంగాల నుండి వచ్చిన వారు--గృహిణులు, రచయిత్రులు,
కవయిత్రులు, ఉద్యోగినులు, స్త్రీవాదులు, ఎందరెందరో బ్లాగులు మొదలుపెట్టారు. పత్రికలలలో వచ్చే రచనలు చేరేది వాటిని
కొనేవారికి మాత్రమే. ఆ పత్రికలు రాష్ట్రంలోని, దేశంలోని
అన్ని ప్రాంతాలలో సులువుగా లభించవు. అదీ కాక ఒక రచన పత్రికలో ప్రచురించబడాలంటే అంత
సులువు కాదు. ముందుగా రచన సదరు
పత్రికలవాళ్లకు నచ్చాలి. నచ్చినా అందులో మొత్తం వేస్తారో లేదో తెలీదు. ఎప్పుడు
వేస్తారో అస్సలే తెలీదు. కాని ఎవరి బ్లాగు వారికి సొంతమైన పత్రికలాంటిది. తమకు
ఆలోచన వచ్చిన నిమిషంలోనే ఒక కథలాగో, కవితలాగో, వ్యాసంలాగో రాసి ప్రచురించుకోవచ్చు. బ్లాగుల్లో ఉన్న మరో సౌకర్యం
వ్యాఖ్యలు. ఒక బ్లాగులో ఒక రచన ప్రచురించగానే అది చదివిన పాఠకులు వెంటనే తమ
అభిప్రాయాన్ని వ్యాఖ్యలుగా అక్కడే చెప్పే అవకాశం ఉంది. దీనివల్ల ఆ రచన మీద మంచి
చర్చ జరుగుతుంది. ఒకోసారి వాదోపవాదాలు జరగవచ్చు. ఇలా జరగడం వల్ల రాసినవారికి,
చదివినవారికి కూడా మంచి సమాచారం లభిస్తుంది. సద్విమర్శల వల్ల
తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు కూడా. ఎందుకంటే విమర్శ అనేది వేషం మార్చుకుని వచ్చిన
ప్రశంసలాంటిదే..ఇలా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, తమ రాతలను మెరుగు పరుచుకున్న
మహిళా బ్లాగర్లెందరో ఉన్నారు.. వారిలో కొందరిని పరిచయం చేసుకుందాం..
డాక్టర్ చందు శైలజ : వృత్తిరీత్యా గైనకాలజిస్ట్ ఐన శైలజ తన హాస్యరసపూరితమైన బ్లాగు రచనలతో చాలా త్వరగా ఎంతో మంది అభిమానులను కూడగట్టుకున్నారు. మనసు బాగోలేకపోతే హాస్యానికి పెట్టింది పేరైన శైలజ బ్లాగు చదివితే చాలు అనుకుంటారు పాఠకులు. ఆవిడ ఎంత హాస్యం రాస్తారో, సీరియస్ విషయాల్లో అంత సీరియస్ గానూ ఆలోచిస్తారు. కాని శైలజ రాసే టపాలన్నీ పాఠకులను నవ్వించి, నవ్వించి చంపేస్తాయి. ప్రతీ వాక్యం ఓ హాస్య విస్పోటనం.. ఆవిడ రాసే టపాలు చదవాలంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఉద్యోగస్ధులు. ఆఫీసులో కాని చదువుతూ ఎడతెరిపి లేకుండా నవ్వుతుంటే మిగతావాళ్లు పిచ్చెక్కిందేమనని చూస్తారంట. ఇంట్లో కూడా ఎవరూలేకుండా చూసి చదువుకుని నవ్వుకుంటామని చెప్పుకుంటారు. అంత సరదాగా రాస్తారు డా.శైలజ.. అసలిది
పోస్టా,
జంధ్యాల సినిమానా? జంధ్యాల సినిమాలో కూడా ఓ
పావు వంతు నవ్వకుండా కూచోవచ్చు. కాని శైలజ రాసిన ప్రతీ లైన్‌కి పొట్ట
పగిలిపోయేట్టు నవ్వకుండా ఉండడం మావల్ల కాదు బాబోయ్ అని మొత్తుకుంటారు కొందరు
ప్రవాస భారతీయ పాఠకులు....
వరూధిని: తన భర్త అస్తమానం కంప్యూటర్ ముందు ఏదో ఒకటి రాసుకుంటూ
ఉండదంతో కాస్త కోపంగానే బ్లాగు మొదలెట్టారు వరూధిని. బ్లాగు రాయడం అంటే పనీపాటా
లేని వాళ్లు చేసే పని అనుకుంటూ బ్లాగు మొదలెట్టినా, తినగ తినగ వేము తియ్యగనుండు అన్న
చందాన మిగతా బ్లాగులు చదువుతూ , చర్చిస్తూ ఎంతగా మారిపోయారంటే
బ్లాగు అవిడకొక నేస్తంలా మారిపోయింది. ఇక్కడ మనకు నచ్చింది స్వేచ్చగా రాసుకోవచ్చు.
ఎలాంటి నియమాలు, నిష్ఠలు, ముందస్తు
ఒప్పందాలు, చావు గీతలు, లక్ష్మణ రేఖలు
ఉండవు. మనం తప్పులు రాసినా ముద్దుగా చెప్పేవాళ్ళే కాని విసిరిగొట్టటాలు, గోడ కుర్చీలు, ఇంపొజిషన్సు ఉండవు అంటారావిడ. ఆవిడ
బ్లాగులో టపాలు ఒక అంశం అనే కాదు. పిల్లల గురించి, సినిమాలు,
పరీక్షలు, పల్లెటూరి ముచ్చట్లు, పండగ సంబరాలు, స్నేహితుల జ్ఞాపకలు ఇలా మనసును తాకే
కబుర్లెన్నో చెబుతారు. ప్రతీ టపాలొ ఒక ఆత్మీయత, అభిమానం
ఉంటుంది. కొన్ని మాటలు చదివినవారిని కూడ తమ జ్ఞాపకాల్లోకి తీసికెళితే కొన్ని ఆలోచింపచేస్తాయి..
వనజ : పిల్లలు, వంట, చీరలు, నగలు, సినిమాలు తప్ప మహిళలు రాయదగ్గ విషయాలేముంటాయి
అనే అపోహ చాలా మందికి ఉంది. కాని సామాజిక
సృహ కలిగిన కథలు,కవితలు
రాయడం. నిత్య జీవనంలో ఎదురయ్యే అనుభవాలను, వేర్వేరు
సంధర్భాలలో ఈ సమాజం చూపించే స్పందన గురించి మనసుకు హత్తుకునేలా, ఆలోచింపజేసేలా రాయడం వనజ
ప్రత్యేకత. అందుకే బ్లాగ్లోకపు ఉక్కుమహిళ అని పేరు పొందారు. తన జీవన ప్రస్ధానంలో
ఎదురైన అనుభవాలను సామాజిక సృహతో ఆలోచించి రాస్తున్నారు. కాని వాటిని ఆమె
వ్యక్తిగతం అనుకుని హేళన చేసినవాళ్లు కూడా
ఉన్నారు. తమ పేరు కూడా చెప్పుకునే ధైర్యం
లేకుండా అనామకులుగా వచ్చి తమ వ్యాఖ్యలతో ఆమె రాసిన అంశాలను ఎత్తిపొడిచి
బాధపెట్టేవారు, స్త్రీల సమస్యలపై ఘాటుగా స్పందించి ఏది
రాసినా వ్యక్తిగతంగా దాడి చేసిన సంఘటనలు కూడా జరిగాయి. కాని వాటినన్నింటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కుని బ్లాగ్ముఖంగా తన రచనా వ్యాసంగాన్ని
కొనసాగిస్తున్నారు.
మాలా కుమార్ : అమెరికాలో
ఉన్న మనవడితో మాట్లాడడానికి కంప్యూటర్ ముందు కూర్చునే అలవాటు ఆ తర్వాత పేకాట
ఆడడం.. కాని కొంతకాలానికి అది విసుగొచ్చి ఒక దినపత్రికలో బ్లాగుల గురించి, సులువుగా
తెలుగు రాయొచ్చన్న విషయం తెలుసుకున్న మాల
తన కొడుకును అడిగి బ్లాగు మొదలుపెట్టారు. అరవయేళ్ల వయసులో కంప్యూటర్ క్లాసులకు
వెళ్లి కంప్యూటర్ ఎలా ఉపయోగించుకోవాలో
నేర్చుకుని బెరుకు బెరుకుగా ఒక వింతలోకంలోకి వచ్చినట్టుగా బ్లాగులోకంలోకి ప్రవేశించి ఒక్కొక్కటి తెలుసుకుంటూ నేర్చుకుంటూ,
చదవడం తప్ప రాయడం అస్సలు అలవాటు లేకున్నా తనకు తెలిసిన, నచ్చిన విషయాలను రాస్తూ వచ్చారు. తన జీవితానుభవాలను సరదాగా పంచుకుంటూ
ఎంతోమంది అభిమానం పొందారు. ఆమె ఆసక్తి, పట్టుదల గమనించిన
పిల్లలు ఆమెకోసం ఓ లాప్‌టాప్, ఓ కెమెరా కొనిచ్చారు. సినిమాలు,
పుస్తకాలు, పిల్లలు, పూజలు,
పండగలు, పుట్టినరోజులు , డబ్బు ముచ్చట్లు అంటూ ఏదో ఒకటి రాస్తూ తన పేకాట వ్యసనాన్ని మించిన బ్లాగు
వ్యసనానికి బానిసనైనాని ఆనందంగా చెప్పుకుంటున్నారు. ఇలా రాయడం వల్ల తనలోని
ఒంటరితనం పోయిందని. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడంతో ఉత్సాహంగా ఉండడంతో పాటు ఈ
వయసులో మనసులోని ఆలోచనలను, భావాలను ఇలా పంచుకోవడం వల్ల
ఆత్మసంతృప్తి కలుగుతుందని అంటుంటారు.
పి.ఎస్.ఎమ్.లక్ష్మి : ప్రభుత్వ ఉద్యోగి ఐన లక్ష్మి దంపతులకు ఉన్న
అభిరుచి యాత్రలు చేయడం. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక దొరికిన కొద్దిపాటి ఖాళీ సమయంలో రాష్ట్రంలోని వివిధ యాత్రా స్థలాలను
దర్శించడం మొదలుపెట్టారు. అలా వెళ్ళేటప్పు ఆయా స్థలాల గురించి తెలుసుకోవడానికి , అక్కడి
భోజన, వసతి, రవాణా సౌకర్యం విషయాలలో
ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. . అప్పుడే తెలుగు బ్లాగుల గురించి తెలుసుకుని తను
పడ్డ కష్టాలు అందరికీ అనుభవమే కాబట్టి ఆ
వివరాలు, ఆ యాత్రా స్థలాల గురించి
వివరంగా రాస్తే
బావుంటుంది. కొందరికైనా ఉపయోగపడుతుందని
బ్లాగు మొదలెట్టారు. ఆమె రాసే యాత్ర బ్లాగు ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరుపొందిందంటే
ఆవిడను యాత్రాలక్ష్మిగా గుర్తించసాగారు. ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలోగాని, దేశంలో గాని ఏదైనా యాత్రా స్థలం గురించి తెలుసుకోవాలంటే టక్కున లక్ష్మిగారి
యాత్ర బ్లాగు తెరిచేస్తారు. .. తమకు
తెలిసిన విషయాలు, ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బ్లాగులో
రాస్తే ఆ ప్రదేశాలు చూడాలనుకునేవాళ్లకు
కొన్ని ఇబ్బందుల గురించన్నా తప్పించినవాళ్లమవుతాము, వెళ్లలేనివాళ్లు
తన బ్లాగులో ఆ ప్రదేశాల ఫోటోలు చూసి మన ప్రాచీన, నవీన దేవాలయాల
గురించి, విహార స్ధలాల గురించీ తెలుసుకుంటారన్న తపనతో బ్లాగును కొనసాగిస్తున్నారు
జ్ఞానప్రసూన : ప్రముఖ
గీత రచయిత రావూరి సత్యనారాయణగారి కూతురు జ్ఞానప్రసూన 72 ఏళ్ల వయసులో కంప్యూటర్ గురించి
తెలుసుకుని బ్లాగు మొదలుపెట్టారు. ఈ వయసులో ఈ విషయాలన్ని నాకు రావులే అని అనుకోకుండా ఎందుకు రాదు అని సాంకేతిక
విషయాలను కూడా నేర్చుకుంటూ తన అభిరుచులను, అమెరికా వెళ్లినప్పుడు అక్కడి
విశేషాలు, చిన్న నాటి ముచ్చట్లు, పెయింటింగులు,
పూజలు, పండగ సరదాలు. ఇలా ఎన్నో
రాస్తుంటారు. ఆవిడ దృష్టిలో బ్లాగ్ అంటే
ఆలోచనా తరంగం. ఒక్కొక్క తరంగానికి అక్షర రూపం ఇవ్వడమే తప్ప దానికి ఒక పరిమితి,
నియమం, నియంత్రణ లేదు ఒక వర్ణన, ఒకడైరీ, ఒక ఆశ్చర్యం, ఒక ఆనందం, ఒక పొగడ్త, ఒక వేదన.ఏదైనా కావచ్చు. దీనిలో అంతస్సూత్రంగా ఒక గొంతు వుంటుంది. అది
స్వానుభవాలని, అభిప్రాయాలని, ఆశని
వెలువరిస్తుంది. ఈ ఆలోచనా తరంగాలని కాగితం మీద పెట్టి,అప్పుడప్పుడూ
పైకి తీసి, పట్టుచీరలా చూసి మురుసుకోవచ్చు. . కంది పచ్చడి చేసినా కళాఖండం సృష్టించినా-
ఎదుటి వారు మెచ్చుకొంటేనే తృప్తి. వీటన్నింటికి అద్భుతమైన వేదిక బ్లాగు అని ఆవిడ
నమ్మకం. అది కాదనేవారెవరూ లేరు కూడా..
ఇంతవరకు చెప్పుకున్నది అసలు రాయడం అలవాటు లేని
మహిళలు బ్లాగులు మొదలుపెట్టి తమ మాటలను రాతలుగా మార్చుకుని, చర్చించుకుని,
వాటిని మెరుగుపరుచుకున్నారు. బ్లాగులు తమ రాతనే మార్చేసాయి అని
అందరూ ఒప్పుకునే మాటే. కొందరు మహిళలు బ్లాగులనుండి పత్రికా రచనకు వెళ్లిపోయారు
అంటే ఈ మాట సరైనదే కదా. ఐనా నేర్చుకోవాలనే కుతూహలం, పట్టుదల,
ఆత్మవిశ్వాసం ఉంటే సాధ్యం కానిదేమైన ఉందా? తెలుగు
బ్లాగులలో సాధారణ మహిళలే కాకుండ లబ్ధ ప్రతిష్టులైన రచయితలు కూడా ఉన్నారు. అందులో
కొందరు ప్రముఖ స్త్రీవాద రచయితలు. వారికి రాయడం
అనేది చేయితిరిగిన విద్య. కలం పట్టుకుని రాసిన వ్రేళ్లు ఈ కంప్యూటర్ కీబోర్డుమీద టకటకలాడించడం కూడా
నేర్చుకున్నాయి. ఇక ఆ కదలిక వేగం పుంజుకుని వారి రచనలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న
తెలుగు భాషాభిమానులకు అందించాయి. ఇప్పుడు తెలుగు బ్లాగుల్లో ఉన్న మహిళా రచయిత్రులు...
స్వాతి శ్రీపాద, శ్రీవల్లీ రాధిక, నాగలక్ష్మి వారణాసి, కొండవీటి సత్యవతి, కల్పన రెంటాల, చంద్ర లత, జగద్ధాత్రి,
మంధా భానుమతి, పి.సత్యవతి , శైలజ మిత్ర, నిడుదవోలు మాలతి, సి.ఉమాదేవి ,
మల్లీశ్వరి , జర్నలిస్టులైన సుజాత, అరుణ పప్పు మొదలైనవారు బ్లాగుల ద్వారా దేశవిడేశాల్లో ఉన్న పాఠకులకు మరింత
దగ్గిరయ్యారు. కల్పన రెంటాల తన బ్లాగులో సీరియల్ గా రాసిన తన్హాయి కథ విశేష ఆదరణ పొంది తర్వాత పాఠకుల కోరికమేరకు పుస్తకంలా ప్రచురించబడింది. అంతేకాదు కొందరు
మహిళలు బ్లాగులతో పాటు వెబ్ పత్రికలు కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆముక్తమాల్యద,
విజయవిలాసం కావ్యాలను బ్లాగుల రూపంలో పద్యాలు, వివరణ, శ్రవ్యకాలతో అందిస్తున్నారు.
వేలల్లో ఉన్న తెలుగు బ్లాగుల్లో వందల్లో
ఉన్న మహిళా బ్లాగులు రాసిలో తక్కువైనా వాసిలో మిన్న అని వాటికున్న ఆదరణ
తెలుపుతుంది. బ్లాగులో రాయడానికి ఎటువంటి
హద్దులు, పరిమితి, నియమాలు, నిర్దేశాలు లేవు. ఎవరికి నచ్చింది వారు తమ తమ సమయానుకూలంగా రాసుకోవచ్చు.
నిజ జీవితంలో ఉన్నట్టే ఈ మిధ్యాప్రపంచంలో కూడా మంచి, చెడూ
రెండూ ఉన్నాయి. అవకాశాలు ఉన్నాయి, హద్దులు లేవని
ఇష్టమొచ్చినట్టు రాయడం కూడా ప్రమాదమే.
ఒక్కోసారి మంచి అంశం మీద రాసినా కొందరు మూర్ఖుల రాసే అసభ్యకరమైన వ్యాఖ్యలు
క్లేశాన్ని కలిగిస్తాయి. దానివల్ల సున్నితమనస్కులైన వారు బాధపడతారు. కాని ఇటువంటి
సమయాల్లో మిగతా బ్లాగర్లు వారికి బాసటగా నిలిచి ,ఎంతో ధైర్యం చెప్తారు.
ప్రోత్సహిస్తారు. మహిళలు బ్లాగుల్లో వీలైనంతవరకు తమ వ్యక్తిగత సమాచారం
ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాఖ్యలను నియంత్రించుకుని అనవసరమైన వ్యాఖ్యలను
నిస్సంకోచంగా తీసేయొచ్చు. అలాగే సద్విమర్శలను గమనించి తమని తాము మెరుగుపరుచుకోవాలి... బ్లాగులు రాయడానికి కధలు, కవితలు లాంటి రచనలు మాత్రమే చేయనక్కరలేదు.
తమకు నచ్చిన, ఎంతోమందికి ఉపయోగపడే వంటలు, కుట్లు, అల్లికలు, ముగ్గులు,
అభిరుచులు, భక్తి గురించి రాయొచ్చు
.రాస్తున్నారు కూడా.
మహిళా బ్లాగర్లు తమకు తోచినప్పుడు రాయడమే కాక అప్పుడప్పుడు సామూహిక
సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొందరు మహిళా బ్లాగర్లు
"ప్రమదావనం" పేరుతో ఒక ప్రత్యేక గుంపు మొదలుపెట్టి సరదా ముచ్చట్లతో పాటు
తమకు తోచిన సొమ్ము పోగు చేసి వృద్ధాశ్రమమ, బాలికల అనాధాశ్రమమ, మానసిక వికలాంగుల పాఠశాలలకు అవసరమైన వస్తువులు ఇవ్వడం, చలికాలంలో రోడ్ల మీద, దుకాణాల పక్కన నిద్రపోయే
అభాగ్యులకు దుప్పట్లు పంచడం, వరద బాధితులకు, విద్యార్తులకు ధన సహాయం
చేసారు. ఎప్పుడు ఎవరి బ్లాగులో
వారికిష్టమైనది రాసుకోవడమేనా అందరం కలిసి
ఒకే అంశం మీద రాద్దాం అనుకుని కృష్ణాష్టమి అని, నచ్చిన పాటలు
అని, వానా కాలం అని, నచ్చిన చెట్టు గురించి,, ఇలా ఒకేరోజు ఒకే అంశం మీద రాస్తారు. ఈ మహిళా
బ్లాగర్లు చేసే మరో ముఖ్యమైన సంబరం వన భోజనాలు. ప్రతీ సంవత్సరం కార్తీక పున్నమి
రోజు బ్లాగుల్లో వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. కంప్యూటర్లో భోజనాలు ఏంటి అనుకుంటున్నారా?
అందరూ కాకున్నా చాలా మంది మహిళా బ్లాగర్లు తమ తమ బ్లాగులో ఏదో ఒక
వంటకం గురించి రాసి దాని ఫోటో పెట్టి ప్రచురిస్తారు. ఉదయం అల్పాహారం నుండి రాత్రి
వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఆ రోజు తెలుగు బ్లాగులోకం మొత్తం ఘుమఘుమలాడిపోతుంది. ఇది చూసిన మరికొందరు పురుష
బ్లాగర్లు మేమూ చేస్తాం అంటూ ముందుకు
వస్తారు.
అన్ని రంగాలతో పాటు ఈ
ఆధునిక సాంకేతికరంగంలో కూడా మాకు ఎదురు
లేదు అంటూ ముందుకు దూసుకెల్తున్న మహిళా బ్లాగర్లు తమలో అంతర్గతంగా ఉన్న ప్రతిభను వెలికి
తీసి దానికి మెరుగుపెడుతూ లాభపడుతున్నారు. అందరినీ అలరిస్తున్నారు.అంతర్జాలాన్ని
సక్రమంగా ఉపయోగించుకుంటే ప్రపంచం మనచేతిలో ఉండడంకాదు ప్రపంచానికే మనం
పరిచయమవుతాం.. అని నిరూపిస్తున్నారు.
జ్యోతి వలబోజు
21 వ్యాఖ్యలు:
చాలా చాలా బాగుంది జ్యోతీ.. మీ అన్ని వ్యాసాల్లాగానే.
Bhanumathi.
చాలా చాలా బాగా చెప్పారు...అభినందనలు...
chalaa baagundi jyothi
బాగు బాగు తెలుగు బ్లాగు!
బాలా బలాగు భళీ భళీ !
బాగుందండి ఆర్టికల్ ! బ్లాగులకి ఎడిటర్లు వస్తే ??
జిలేబి.
శ్రీమాత్రేనమః
మంచి ఆర్టికల్ జ్యోతి గారు..:-)
bagundeevyasam!patrikalalo blogula gurchi migata bloggers viriviga vrastundali!kottavaallu tayaru kaavaali!
జ్యోతి గారు.. చక్కని ఆర్టికల్ .
మన మహిళా బ్లాగర్స్ ని పరిచయం చేసిన తీరు చాలా బావుంది . అందరిలో నేను ఉన్నందుకు ధన్యవాదములు
pramadaavanam lo memandaram vunnatte anukunnamu indaaka ee vishayam marachipoya
అందరికీ ధన్యవాదాలు.. ఈ వ్యాసం తెలుగు బ్లాగులను మహిళలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు. ఎలా లాభపడుతున్నారు. కొత్తవాళ్లకి ఈ వేదిక ఎలా ఉపకరిస్తుంది అనే విషయాలను ప్రముఖంగా చెప్పడం జరిగింది. ఈ వ్యాసం ప్రధాన ఉద్ధేశ్యం తెలుగు మహిళా బ్లాగర్లను పరిచయం చేయడం కాదు. కొత్త వాళ్లని ఇటువైపు ఆకర్షించడం. అందుకే నాకు కావలసిన వాళ్లను చాలామందిని చేర్చడం కుదరలేదు.
చాలా బాగుంది, ఈ పత్రికల వారు బ్లాగు ఆడ్రెస్ ఎందుకు ఇవ్వరో , తెలుగు వెలుగు వారు రచయితల మొబైల్ నెంబరు ఇస్తున్నారు , ధన్యవాదములు
మీ శ్రేయోభిలాషి
కశ్యప్
జ్యోతిగారు, వ్యాసం ఎంతో చక్కగా రాసారు. అందరిగురించి రాసారు. అంతమంది మంచి రచయిత్రుల మధ్యలో మీపేరు మిస్ అవడం నాకేం నచ్చలేదు. అసలు నచ్చలేదు.
కశ్యప్ వాళ్ల రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయో మరి??
సుధగారు మీరు మరీనండి.ఇప్పటికే చాలామంది పేర్లు రాయలేదని కొందరు మొత్తుకుంటుంటుంటే నా గురింఛి నేను డబ్బా కొట్టుకోవాలంటారా??
మీరు చెప్పారు కదా,బ్లాగుల వేపు ఆకర్షించడానికి అని ఆ ప్రయోజనం చక్కగా నెరవేరింది మీ వ్యాసంలో.మరి చాలామంది బాగా రాస్తున్నా అందరిపేర్లు రాయడం కుదరదు కానీ, మీ పేరు మాత్రం ఉండి తీరవలసిన పేరు అనిపించి అలా అన్నాను.
chala bagaa vrasaru jyoti akka ....abhinandanalu
మీ అభిమానానికి ధన్యవాదాలు సుధ. నాగురించి నా బ్లాగే చెప్తుంది. ఎందుకంటే ఇది నా హృదయభాను..:)
జ్యోతిగారు,కొత్తవారికే కాదు,అప్పుడప్పుడు అక్షరసన్యాసం చేసే పాతవారికీ మీ వ్యాసం ఉద్దీపనే!
Nice write up Jyothi garu :)
జ్యోతి గారు,మీ వ్యాసం చాలా బావుంది.సమగ్రంగా అనిపించింది.పూలను కలిపే దారంలా బ్లాగర్లని కలుపుతూ వారి వారి బ్లాగుల లింకులు provide చేస్తూ దాచుకోవలసిన వ్యాసాన్ని అందించారు! అభినందనలు!
జ్యోతి గారు ,
చాలా చాలా బాగుంది.....
అమ్మా! మహిళా దినోత్సవం సందర్భముగా మీకు, మహిళా లోకానికి నా శుభాకాంక్షలు.
మీరు ఒక మహిళ ఎలాగ ఉండాలి అనడానికి ఉదాహరణగా నిలిచారమ్మా. అందరినీ వెలుగులోకి తెస్తున్న మీరు ఎలా ప్రకాశిస్తున్నారో మిగిలినవారిని ఎలా ప్రకాశింప జేస్తున్నారో అర్థమౌతోందమ్మా. అభినందనలు.
Post a Comment