Saturday, December 14, 2013

చీర పజ్యాలు - పుస్తకావిష్కరణ


చీరస్తూ.. శుభమస్తూ అంటూ చీర పజ్యాల ఆవిష్కరణకు సాదర ఆహ్వానం:
చీర శతకం గురించి,,,


శ్రీమతి జ్యోతి వలబోజుగారికి బహిరంగ లేఖ!!!


మేడం... మీరే ముహూర్తాన మాలిక పత్రికలో "చీర సొగసు చూడ తరమా" అంటూ పద్యాలు రాయమన్నారోగానీ,

వాటిని విశ్లేషిస్తావా... అని నన్నడిగారోగానీ,

విశ్లేషించావు సర్లే.. నువ్వో నాలుగు పద్యాలు రాయని ఆదేశించారోగానీ,

శతకమై చీర పద్యాల మాల పూర్తవాలని బుర్ర మొరాయిచి మరేపని చెయ్యనివ్వలేదు! చీర మాయ అదని తెల్సుకునేటప్పటికి వంద పూర్తయి.. ఇంకా కంద దురదలా వదలని 'కందం' వరదలవుతోంది.అచ్చుకిచ్చి పిన్ వెయ్యకపోతే వెయ్యి దాటే ప్రమాదం కనిపించింది.

అంచేత... ముప్ఫై 2 పేజీల దగ్గర ఆగిపోమని మా ప్రింటింగ్ ప్రెస్ మిత్రుడు కంచేశారు.

రెండో భాగం రాసి మిమ్మల్నీ, పాఠక మిత్రుల్నీ హింసించను..

'సిస్తా'నేమోనని భయంగా వున్నమాట పచ్చి నిజం...

మధ్యమధ్యలో ఎవరైనా బాగోలేదంటే బ్రేకు పడుతుందన్న ఆశగా కొంత మంది మిత్రులకి చూపించాను. కొన్నింటికి నవ్వారు. కొన్ని నిజమే కదా అని నిట్టూర్చారు. కొన్నింటికైతే మా ఆవిడకివ్వాలి జెరాక్స్ తీసుకుంటా అన్నారు..

బాపుగారైతే.. ఓకే.. ప్రొసీడూ అని బొమ్మ వేసి మెయిల్ కొట్టారు..

ఇలా... మీరంటించిన సీమటపాకయగుత్తి వంద దాటి, పేలి ... పేట్రేగింది..
ఈ కథంతకీ.. మూలకారణంబైన.. మిమ్మల్ని అంత తేలిగ్గా వదల్రాదని.. 'చేసుకున్నవాళ్లకి చేసుకున్నంత మహాదేవా!' అన్నట్లు.. 'ఆవిష్కరణ శిక్ష' విధించాలని నిశ్చయించుకున్నాను.

ఒక మిత్రుడు.. నా బేంక్‌లోంచి డబ్బులు తీయకుండా. బేక్ కవర్ గమ్మత్తు చేశారు.

మరి విడుదల ముహూర్తం....?!

మా ప్రియమైన, మీకూ, అందరికీ ఇష్టమైన బాపుగారి పుట్టిన్రోజు..

"చీరస్తూ.. సుఖమస్తూ!!' అంటూ.. పైగా బాపురమణగార్లకి అంకితం చేయాలని డిసైడయిపోయా..

అసలీ తెలుగుతనం ఫతిఫలించే.. చీరలో కనిపించే.. అందమైన ఆడవాళ్లకి మరింత అందం 'చీర మాత్రమే' అని బుర్రకెక్కించిన వారిద్దరే ఇందుకు అర్హులుగా .... ఎంచి.... సమర్పించడానికి నిశ్చయించుకున్నాను. కొందరు గొప్పవాళ్లని మాత్రం ఈ పేరంటం జయప్రదం చెయ్యమని కోరాను. సరే అన్నారు..

అంచేత.. మీకు థేంక్స్‌లూ, స్వాగతాలూ చెప్పడానికి ఈ పొడుగాటి లేఖ! బహిరంగంగా ప్రేమలేఖ...


బ్నిం

4 వ్యాఖ్యలు:

Zilebi


చీర కి ఇంత విలువన్న మాట !!

'చీరస'
జిలేబి !

సి.ఉమాదేవి

అమ్మ లాలిపాటకు చీరే తూగుటుయ్యాల
పరిణయానికి సొగసు సరిగంచు పట్టుచీర
సంప్రదాయానికి నిలువుటద్దం చీరకట్టు
శ్రీమతులకు చీరే కదా ప్రియ బహుమతి
జ్యోతిగారికి,బ్నిం గారికి శుభాభినందనలు.

Hymavathy.Aduri

చీర జారేయ బూనిన దుశ్శాసనుండు,
చీరలాగంగ చూడదలంచిన దుష్ట దుర్యోధనుండు,
చీరల నక్షయముగ నిచ్చిన ఆపద్భాంధవుండు,
చీరగట్టిన ద్రౌపదివలనగదా!శాశ్వత యశస్వులైరి!
ఆదూరి.హైమవతి

Dantuluri Kishore Varma

రాసిన బ్నింగారికి, ఆవిష్కరిస్తున్న మీకు, అంకితం తీసుకొంటున్న బాపు, రమణగార్లకూ అభినందనలు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008