Saturday, 11 January 2014

హ్యాపీ న్యూ ఇయర్ ?????????????????



మమ్మీ ! హ్యాపీ న్యూ ఇయర్!!

అత్తా! హ్యాపీ న్యూ ఇయర్!!

నేస్తం! హ్యాపీ న్యూ ఇయర్!!

జ్యోతక్కా! హ్యాపీ న్యూ ఇయర్!!  ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు న్యూ ఇయర్. ఏదైనా స్పెషల్ ఆ??

ఏంటి హ్యాపీ న్యూ ఇయరా?? మతుండే మాట్లాడుతున్నావా? నువ్వు కూడా నాలా మధ్యతరగతి ఇల్లాలివే కదా. కొత్త సంవత్సరం మొదలు కావడం నిజంగా నీకు సంతోషంగా ఉందా??

అదేంటక్కా అలా అంటావ్? నేనేమన్నానని?

నువ్వన్నావని కాదు వారం రోజులనుండి చూస్తున్నాను. కొత్త సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి. తర్వాత పార్టీలు, గుళ్లు. అందరికి ఓ వింతలా, సంతలా అయిపోయింది. జనాలందరికి పిచ్చి పట్టిందనిపిస్తుంది.

అయ్యో అలాంటవేంటక్కా?

లేకుంటే  నువ్వే చెప్పు...ఈ కరువు కాలంలో కొత్త సంవత్సరం జరుపుకునేట్టుగా ఉందా? అన్ని ఖర్చులూ పెరిగిపోతున్నాయి కాని దానికి తగ్గట్టుగా ఆదాయం పెరగదు. ఒకరికి ముగ్గురు పని చేసినా ప్రతీ నెలాఖరుకు వెతుకులాటే అవుతుంది. కనీసం రోజు తినే తిండి అన్నా  కడుపునిండా, ఇష్టపూర్వకంగా తిందామా అంటే అదీ కుదరదు. ఉల్లిపాయ నుండి చికెన్ వరకు అన్ని ధరలు పేలిపోతున్నాయి.  ఇప్పుడు కొంచం మేలు కాని ఉల్లిపాయ, టమాటాలు ఆకాశానికెక్కి కూర్చున్నాయా. ఉల్లిపాయలైతే కోయకుండానే, తలుచుకోగానె కంట నీరు తెప్పించాయా? మిగతా కూరగాయలైతే  కిలో యాభైకి  తక్కువ ఏవీ లేవు.  ఇంతకు ముందు డబ్బులు, సంచీ తీసుకుని వెళ్లి నచ్చిన కూరగాయలు ఏరుకుని తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు డబ్బులు  పట్టుకెళ్లినా  కూరగాయలు అన్నీ చూసి ధర అడిగే ధైర్యం కూడా చేయలేక తక్కువలో ఉన్న రెండు మూడు కూరగాయలు తెచ్చుకుంటున్నాం. బంగారం అంటే కొనడం మానేయొచ్చు కాని తిండి ఎలా తగ్గించేది? .. హోటళ్లకు తగలెట్టకున్నా కనీసం ఇంట్లో వండుకుని తిందామంటే కుదరదాయే.  చికెన్ కొందామంటే రెండొందలంట, గ్రుడ్లు ఐదు రూపాయలు.  కనీసం ఆమ్లెట్ వేసుకుందామని ఒక గుడ్డు పట్టుకుంటే అమ్మో ఇది ఐదురూపాయలు అనే హెచ్చరిక కళ్ళముందు ప్రత్యక్షమవుతుంది. బియ్యం కూడ కిలోకి యాభై పెట్టాల్సిందే.

ఇవి సరే గ్యాస్ బండ కూడా తక్కువ తినలేదు కద. గవర్నమెంటుకు ఏం తిక్కో అర్ధం కాదు.. గ్యాస్ సిలిండర్‌ని ఆధార్ కార్డుకు జత చేసారు.  అసలు నాకు తెలీకడుగుతా ఇంటికి ఒకటే కనెక్షన్, రెండే సిలిండర్లు అని కోత పెట్టారు. పెద్ద కుటుంబం ఉంటే సిలిండర్ ఒక్కటి సరిపోదు. రెండు కనెషన్లు తీసుకుంటే ఏమవుతుంది. వాళ్ళేమీ ఉచితంగా వాడుకోవట్లేదు కద. డబ్బులిచ్చి కొనుక్కుంటున్నారు. ఇవ్వడానికేం మాయరోగమంట ఆయిల్ కంపెనీలకు, ఈ ప్రభుత్వానికి. గ్యాస్ సప్లైలు మరీ అంత తక్కువగా ఐతే లేవుగా.  పైగా ఇంటింటికీ పైపులేసి మరీ గ్యాస్ అందిస్తాం అని ఎవరో అన్నట్టున్నారు కదా.. తుగ్లక్ పాలన కాకపోతే గ్యాస్ సిలిండర్‌కి, ఆధార్ కార్డుకు లింకెందుకు.. ముందేమో వెయ్యి పైన డబ్బులు తీసుకుంటారు. మళ్లీ నాలుగు రోజులకు ఆ డబ్బులు మన అకౌంట్‌లో వేస్తారు. తీసుకోవడమెందుకు, మళ్ళీ వేయడమెందుకు.  ఇచ్చేటప్పుడు ప్రాణాలు విలవిలలాడతాయి. వేరే ఏ ఖర్చును దాటవేద్దామా? తర్వాత చేద్దామా అని ఆలోచించాల్సి వస్తుంది. ఈ పనిలో ఏమైనా అరకాసు, తిరకాసులున్నాయేమో.... అసలు ఈ తిప్పలన్నీ బాగా డబ్బులు ఉన్నవాళ్లకి, అస్సలు లేనివాళ్లకి ఉండవు. మధ్యతరగతి అభాగ్యులకే కష్టాలు.

అదెలా??

ఎలాగేంటి? ఉన్నవాడికి ఎంత ధరలు పెరిగినా వాళ్లుకు ఎటువంటి కష్టం ఉండదు కనుక  అన్నీ కొంటూనే ఉంటారు కదా. లేనివాడు ఉంటే కొందాం లేకుంటే లేదు అని ఊరుకుంటాడు. కాని మధ్యతరగతివాళ్లు అటు వదిలేయలేరు, ఇటు చేయనూలేరు. ఇది బట్టలు, బంగారం లాంటివే అని కాకుండా కాకుండా అన్ని విషయాల్లోనూ .. ఇప్పుడు చూడు దీపావళి పండగొచ్చిందనుకో... ఉన్నవాడు ఇంచక్కా అన్నీ కొనేసుకుని గ్రాండ్‌గా పండగ చేసుకుంటాడు. పేదవారు ఒక దీపం పెట్టి ఉంటే ఏదో ఒకటి చేసుకుని తినేస్తారు. వాళ్లకు ఎలాంటి కంగారు, పటాటోపం ఉండదు. సో వీళ్లిద్దరూ హ్యాపీస్. అవునా? మరి మనకు అలా కుదరదే. పండగలు జరుపుకోవాలి. నోములు, వ్రతాలు, సినిమాలు, షికార్లు అన్నీ కావాలి. ఈ ధరలతో అన్నీ కుదరవు. తగ్గిద్దామంటే మనసు ఒప్పుకోదు, మనుషులు ఒప్పుకోరు. మరీ భారీగా కాకున్నా కొంచం బానే చేసుకోవాలి కదా పండగలు , పబ్బాలు. కష్టం మీద డబ్బులు సమకూర్చుకునో, అప్పు చేసో ఆ కార్యక్రమం అయిపోయిందనిపించుకుంటాం.... ఇలా చెయడంలో ఎంతమందిని బుజ్జగించాల్సి వస్తుందో, కోప్పడాల్సి వస్తుందో, విసుక్కోవాల్సి వస్తుందో నీకు తెలియంది కాదు. అలాంటప్పుడు 365 రోజులు ఐపోయి కొత్త సంవత్సరం, కొత్త కాలెండర్ ఒక్క నంబర్ మార్పుతో జరుగుతుంటే అది ఒక  పండగ చేసుకోవాలా? అది కూడా హ్యాపీగా..

ఇంకో విషయం చెప్పనా? అసలు ఈ న్యూ ఇయర్ మన పండగ, పబ్బము కానే కాదు... మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాదికే మొదలవుతుంది.  ఇంగ్లీషు కాలెండర్ ప్రకారం రాత్రి పన్నెండు గంటలకు తేదీ మారుతుంది కాని మన భారతీయులం మాత్రం సూర్యోదయ వేళ చీకట్లు తొలిగి వెలుగు రేఖలు ప్రసరించడం మొదలవ్వడమే కొత్త రోజుగా, కొత్త ప్రారంభంగా అనుకుంటాం కదా. డిసెంబర్ 31  కి కాని, జనవరి 1 ఇంత గ్రాండ్‌గా పండగ జరుపుకుంటారు అసలు ఆ తేదీ మారడానికి, మారే సమయంలో ఏదైనా ప్రత్యేకత కనిపిస్తుందా? చిమ్మ చీకటిలో తేదీ మారిపోతుంది. కాని మన కొత్త సంవత్సరాది ఉగాది నాడు ప్రకృతి కూడా ఎన్నో మార్పులు సంతరించుకుని కొత్త గ్రహగమనాలతో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. సంక్రాంతి కూడా అంటే కదా.. ఏదో ఊరికే పండగ అని జరుపుకుంటామా. మన పండగలన్నింటికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అది కూడా ప్రకృతితో మమేకమైనది. గ్రహాలు, రుతువులకు అనుసంధాణమై జరిగే మార్పులు, విశేషాలను మనం పండగలుగా జరుపుకుంటాం. మరి ఏ మార్పు తీసుకువస్తుందని విదేశీయుల కొత్త సంవత్సరానికి మనం సంబరాలు చేసుకోవాలి. అలా అని అస్సలు చేసుకోవద్దు అనడం లేదు. మరీ అతి కూడదు అంటున్నా. 

ఎక్కడికెళ్లాలన్నా తిప్పలు. ఆటొలో వెళదామంటే వాళ్లు ఇష్టమొచ్చినట్టు ఇమ్మంటున్నారు. వందలో ఒక్కరు మీటర్ మీద వస్తున్నారు. ఏమంటే మీటర్ పాడైంది, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి అని చెప్తున్నారు. అవి మనకు పెరగలేదా. మనకు ఇబ్బందేగా. ఇలా వాళ్లతో గొడవెట్టుకోవడం తప్పడం లేదు. సొంతబండి కొనుక్కుని తిరుగుదామంటే మూడు నెళ్లకోసారి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. వాటికి తగ్గట్టు మన ఆదాయం పెరగడం లేదు కదా. ఇక పండగలైనా , హ్యాపీ న్యూ ఇయర్ ఐనా ఎలా జరుపుకునేది?  అందుకే నాకు హ్యాపీ న్యూ ఇయర్ అనగానే పెరిగిన ధరలు, ఇంటా బయట పెరుగుతూనే ఉన్న ఖర్చులు, కుదించుకుంటున్న అవసరాలు కళ్లముందు  నిలబడి వికటాట్టహాసం చేస్తున్నాయ్.. 

1 వ్యాఖ్యలు:

suchitra

well said jothy garu...........

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008