Friday, 23 September 2016

నట్టింటి నుంచి నెట్టింట్లోకి - నవతెలంగాణ

 

ఇల్లలుకుతూ అలుకుతూ తన పేరు మరిచిపోయిందంట ఈగ. నేను కూడా అదే విధంగా చదువు, సంధ్య ఏమీ లేదు. నాకేమీ రాదు. భర్త, పిల్లలు, ఇల్లు ఇదే నా జీవితం. ఇంతకంటే ఏం చేయగలనులే అంటూ, అనుకుంటూ సాధారణంగా గడిపాను. కాని పదేళ్ల క్రితం మొదలుపెట్టి, క్రమంగా ఊహించని ఎన్నో మలుపులు తిరిగిన నా జీవితంలో నా పేరును ఎన్నో హంగులతో కనుగొనగలిగాను.
మరి నా ఈ జీవనపయనపు ముచ్చట్లను మరోసారి చదువుతారా??


 


Monday, 19 September 2016

ఏ లడ్డూ కావాలి బాబూ..? ఈనాడు



ఒక్కోసారి అతిథులు వచ్చినప్పుడు పెడదామంటే ఇంట్లో ఏమీ ఉండవు. లేదూ మనకే ఉన్నట్టుండి ఏదైనా తీపి తినాలనిపిస్తుంటుంది. అలాంటప్పుడు చాలా తేలిగ్గా అప్పటికప్పుడు చేసుకోగలిగే రుచికరమైన లడ్డూలు మీకోసం...


రోజ్‌ కొబ్బరి లడ్డూ
కావలసినవి
ఎండుకొబ్బరిపొడి: 2 కప్పులు, కండెన్స్‌డ్‌మిల్క్‌: అరకప్పు, రోజ్‌సిరప్‌: టీస్పూను, యాలకులపొడి: అరటీస్పూను, నెయ్యి: 3 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* పాన్‌లో నెయ్యి వేసి వేడిగా అయ్యాక కొబ్బరిపొడి, కండెన్స్‌డ్‌మిల్క్‌, రోజ్‌ సిరప్‌, యాలకులపొడి వేసి కలుపుతూ చిన్న మంటమీద ఉడికించాలి. మిశ్రమం మొత్తం ఉడికి ముద్దగా అయ్యాక దించి చల్లారనివ్వాలి.
* మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే చిన్న చిన్న లడ్డూల్లా చేసుకుని కొబ్బరిపొడిలో దొర్లించి ఆరనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఫ్రిజ్‌లో పెడితే త్వరగా గట్టిపడతాయి. లేదా గాలికి పూర్తిగా ఆరాక డబ్బాలో పెట్టి నిల్వ చేయాలి.


ఓట్స్‌ డ్రైఫ్రూట్‌ లడ్డూ
కావలసినవి
ఓట్స్‌: కప్పు, జీడిపప్పు, బాదం, పిస్తా: పావుకప్పు చొప్పున, వాల్‌నట్స్‌: 5, ఎండు అంజీరాలు: 8, ఖర్జూరం: 12, నువ్వులు: 2 టేబుల్‌స్పూన్లు, అవిసెగింజలు: 2 టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి: అరటీస్పూను, బెల్లంతురుము: రుచికి సరిపడా, నెయ్యి: తగినంత
తయారుచేసే విధానం
* ఎండుఅంజీరాలు, ఖర్జూరాలు ముక్కలుగా చేయాలి. ఓట్స్‌ రెండు నిమిషాలు వేయించాలి. అవిసెగింజలు, నువ్వులు, జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ అన్నీ విడివిడిగా ఓ నిమిషం వేయించాలి. మిక్సీలో అన్నీ విడివిడిగా పొడి చేసి తీయాలి. బెల్లంతురుము కూడా పొడి చేసి అన్నీ కలిపి పాన్‌లో వేసి మూడు నాలుగు నిమిషాలు సిమ్‌లో వేయించాలి. యాలకులపొడి కలిపి దించి ఆరాక నెయ్యి అద్దుతూ లడ్డూలు చుట్టాలి.


బిస్కెట్లతో...
కావలసినవి
మ్యారీ బిస్కెట్లు: 10, బెల్లం తురుము: ముప్పావు కప్పు, యాలకులపొడి: టీస్పూను, నెయ్యి: 3 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* మ్యారీ బిస్కెట్లను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అలాగే బెల్లం కూడా పొడి చేసుకోవాలి.
* ఓ గిన్నెలో బిస్కెట్ల పొడి, బెల్లం పొడి, యాలకులపొడి, కరిగించిన నెయ్యి వేసి కలిపి కావాల్సిన సైజులో ఉండల్లా చుట్టుకోవాలి. నెయ్యి ఇష్టం లేకపోతే ఒట్టి బెల్లం తురుముతో కూడా లడ్డూలు చేయవచ్చు.


పాప్‌కార్న్‌తో...
కావలసినవి
మొక్కజొన్న గింజలు: కప్పు, బెల్లంతురుము: ముప్పావుకప్పు, యాలకులపొడి: టీస్పూను, నెయ్యి: 3 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* మందపాటి గిన్నె లేదా కుక్కర్‌ గిన్నె వేడిచేసి అందులో కాస్త నూనె వేసి మొక్కజొన్న గింజలు వేసి మూతపెట్టి పాప్‌కార్న్‌ చేసుకోవాలి. లేదంటే విడిగా ఉప్పు వేయని పాప్‌కార్న్‌ తెచ్చుకుని కూడా చేసుకోవచ్చు.
* ఇప్పుడు పాప్‌కార్న్‌ను మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా రవ్వలా చేయాలి.
* బాణలిలో బెల్లంతురుము, పావు కప్పు నీళ్లు పోసి మరిగించి ముదురుపాకం రాగానే నెయ్యి, యాలకులపొడి, పాప్‌కార్న్‌ రవ్వ వేసి బాగా కలియతిప్పి దించాలి. ఇది వేడిగా ఉండగానే ఉండలు చుట్టాలి. చల్లారాక డబ్బాలో పెడితే వారం రోజులవరకూ నిల్వ ఉంటాయి.


పల్లీ ఖర్జూరం లడ్డూ
కావలసినవి
ఖర్జూరం: కప్పు, పల్లీలు: కప్పు, యాలకులపొడి: అరటీస్పూను, నెయ్యి: 3 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* పల్లీలను దోరగా వేయించాలి. చల్లారిన తరవాత పొట్టు తీసి బరకగా పొడి చేసుకోవాలి.
* ఖర్జూరాల్ని చిన్న ముక్కలుగా చేసి గ్రైండర్లో వేసి సన్నగా పొడి చేయాలి. పల్లీల పొడిలో ఈ ఖర్జూరం పొడి, యాలకులపొడి, నెయ్యి వేసి బాగా కలిపి కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఇందులో పల్లీలకు బదులు జీడిపప్పు, బాదం, పిస్తా, అక్రోటు, కిస్‌మిస్‌... వంటి నట్స్‌ను కూడా చిన్నముక్కలుగా చేసి వేసుకోవచ్చు.


పుట్నాలపప్పుతో...
కావలసినవి
పుట్నాలపప్పు: కప్పు, పంచదార: కప్పు, యాలకులపొడి: అరటీస్పూను, నెయ్యి: ముప్పావుకప్పు, జీడిపప్పు: అరకప్పు
తయారుచేసే విధానం
* పుట్నాలపప్పుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. పంచదార కూడా మెత్తగా పొడి చేయాలి. జీడిపప్పును చిన్న పలుకులుగా చేసి నేతిలో వేయించాలి. పుట్నాలపొడిలో పంచదార పొడి, యాలకులపొడి, జీడిపప్పు పలుకులు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కరిగించిన నెయ్యి పోస్తూ ఉండలు చేసుకోవాలి.


- జ్యోతి వలబోజు ...
హైదరాబాద్‌
 18-9-2016

Wednesday, 14 September 2016

అప్పుడే పదేళ్లయిందా?? Congratulations and Celebrations JYOTHI…







మీకో సంగతి చెప్పనా? నాకు ప్రతీ సంవత్సరం అన్ని పండగలకంటే డిసెంబర్, సెప్టెంబర్ నెలలంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటారా? డిసెంబర్ లో నా పుట్టినరోజు. సెప్టెంబర్ లో నా JYOTHI 10 పుట్టినరోజు. 


అదేంటి డిసెంబర్ పుట్టినరోజు సంగతి తెలుసు మరి ఈ JYOTHI ఎవరూ అనుకుంటున్నారా.. ఒకటి నేను ప్రాణం పోసుకుని ఈ లోకంలోకి వచ్చినరోజు.. ఇంకోటి నాలోని భావాలు, ఆలోచనలు, సంఘర్షణలు అన్నీ అక్షరరూపంగా దాచుకోవడం మొదలుపెట్టి, నేర్చుకుంటూ, నేర్చుకుంటూ, ఇంకా నేర్చుకుంటూనే ఉన్న నా బ్లాగు పుట్టినరోజు. ఓసోస్ బ్లాగు పుట్టినరోజుకే ఇంత సీన్ , సినిమా ఉందా అంటారా?? చాలా ఉంది.  సాధారణ గృహిణిగా ( ఈ మాటంటే కోప్పడతారు మా మిత్రులు నారాయణస్వామిగారు) జాలప్రవేశం చేసి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం గొప్ప కాదేంటి.. అంతేకాక వ్యక్తిగతంగా కూడా చాలా నేర్చుకుని, మారాను.. ఒకప్పుడు ఎంతో బేలగా, ప్రతీదానికి భయపడుతూ ఉండేదాన్ని. కాని ఇప్పుడు ఒక రాక్షసిలా మారా..  పని రాక్షసి అని పేరు తెచ్చుకున్నా. నాకు చాలా ఇష్టమైన గుర్తింపు ఇది..


కష్టాలు -  సుఖాలు, సంతోషం – దుఃఖం, పోరాటాలు – ఆరాటాలు, ఓటమి – గెలుపు  ప్రతీ మనిషికి అనుభవమే. విజయాలెప్పుడూ కొందరి సొంతం కాదు. నిజాయితీగా కష్టపడితే విజయం ముంగిట వాలుతుంది. కాని మనం అనుకున్నప్పుడే రాదు. కష్టాల ఆటుపోట్లతో రాటుదేలి మొండిగా తిరగబడి పనిచేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. కష్టం విలువ తెలిస్తేనే కదా సుఖం యొక్క ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించగలుగుతాం.. 
ఈ సంతోష సమయంలో ఈ మెట్టవేదాంతం ఎందుకు అనుకుంటున్నారా? పదేళ్ల క్రితం జ్యోతికి ఇప్పటి జ్యోతివలబోజుకు అస్సలు పోలిక లేదు. అప్పుడు తను ఒకరి కూతురు, ఒకరి భార్య, ఒకరి అమ్మగానే అందరికీ తెలుసు కాని ఇప్పుడు ??? పిల్లలకోసం అంతర్జాలాన్ని పరిచయం చేసుకుని , నాకిష్టమైన సంగీతం, సాహిత్యం అన్నింటికి మించి వంటలగురించి తెలియని విశేషాలు తెలుసుకుంటూ సాగిన పయనం నేటికి పది వత్సరాలు పూర్తి చేసుకుంది. నిజంగా నేను అంతర్జాలానికి ఎందుకు వచ్చానో కాని ఇలా కలలో కూడా ఆలోచించడానికి సాహసం చేయని సంఘటనలు, పరిచయాలు కలుగుతున్నాయి. చెప్పాలంటే నా గురించి చెప్పుకుంటే ఏమీ లేదు .. జీరో... చదువు లేదు, డబ్బు లేదు, ఫ్రెండ్స్ లేరు, సోషల్ సర్కిల్ లేదు. ఏధైనా చేయడానికి టాలెంట్ లేదు వంట కూడా సరిగా రాదు (ఇప్పటికీ మావారి అభిప్రాయం ఇదే). నాకున్న ప్రపంచం నాలుగుగోడల ఇల్లు, భర్త, పిల్లలు, వాళ్ల బాధ్యత మాత్రమే. అంతకంటే ఎక్కువ ఏమీ చేయలేనుగాక చేయలేను అని నిర్ణయించేసుకున్నాన్నమాట. వార పత్రికలు, సీరియళ్లు, కుట్లు అల్లికలు, ఇంతే జీవితం. కొన్నేళ్లైతే పిల్లలు, వాళ్లు పిల్లలను చూసుకోవడం తప్ప ఇంకేమీ లేదు అనుకునేదాన్ని. 


కాని ఆ  పైవాడు అలా అనుకోలేదు. నాకంటూ ఒక రాత రాసిపెట్టాడు. దానికంటే ముందు కొన్ని కాదు చాలా పరీక్షలు పెట్టాడు. చావు తప్ప గత్యంతరం లేదు అన్న స్టేజ్ కు తీసుకువెళ్లాడు. ఆ తర్వాతే నా పయనాన్ని మార్చాడు.  ఒకప్పుడు అసాధ్యం, అసంభవం అనుకున్నవి ఒకటొకటి నాకు సుసాధ్యం చేసాడు. నిజంగా ఇది నా నమ్మకం.. ఆనాటి జ్యోతికి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాని ఈనాటి జ్యోతి వలబోజుకు చెప్పడానికి ఒక పదం సరిపోవడం లేదు. ఇది అతిశయోక్తి, సొంతడబ్బా కాదండి. ఈ మధ్య కొందరు మిత్రులు మీరేం చేస్తారు, మీ పేరు పక్కన ఏమని రాయాలి? బ్లాగర్, రైటర్, ఫుడ్ కాలమ్నిస్ట్, ఎడిటర్, కుక్ బుక్ ఆథర్, పబ్లిషర్ .. ఏదని రాయము అన్నారు. జస్ట్ జ్యోతి వలబోజు చాలని చెప్తున్నాను.. 


ఎన్నో చెప్పాలని ఉంది. అదేంటోగాని నాకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువే అనుకుంటా. చాలా విషయాలు ఎప్పటికీ గుర్తుంటాయి.. ఇక నా జీవితం గురించి చేసిన ఈ  పోరాటంలో జరిగిన ఎన్నో విషయాలు అస్సలంటే అస్సలు మర్చిపోలేదు.  అవన్నీ రాయాలంటే ఓ నవల తయారవుతుంది. ఆ సోదంతా వద్దుగాని..  


 నేను నాటినుండి నేటివరకు ఇన్నివిధాలుగా ఎదగడానికి నన్ను ప్రోత్సహించి, సహాయపడిన ఎందరో మహానుభావులకు మనఃపూర్వక వందనాలు. బ్లాగుల్లో, ఫేస్ బుక్కులో , మీడియాలో, పబ్లిషింగ్ రంగంలో ఎంతో తోడ్పాటునిచ్చినవారందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అలాగే నా మీద ఈర్ష్య, కోపంతో విమర్శించినవాళ్లకు కూడా థాంక్స్.. తాత్కాలికంగా బాధ కలిగిన మరింత కసిగా ముందుకు సాగడానికి దోహదపడ్డారు కదా... ఈ పబ్లిషింగ్ వల్ల కూడా మంచి పేరు లభించింది... గొప్పగొప్పవాళ్ల  పరిచయాలు కలిగాయి.. మంచి పుస్తకాల ప్రచురణ చేయడం చాలా సంతృప్తిగా ఉంది.. ఎంతోమంది ప్రముఖ రచయితల పుస్తకాలు అచ్చువేయడం. వంగూరి వారి ప్రచురణల బాధ్యత, వంశీ ఇంటర్నేషనల్ కోసం కూడా వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 


ఏ సమయమైనా నేను పిలవగానే, అడగగానే సలహాలిచ్చి, సాంత్వననిచ్చే ఆత్మీయ మిత్రులు నాకు అంతర్జాలం ద్వారానే లభించడం ఒక వరం.. 


ఎన్ని విజయాలు, అభినందనలు వచ్చినా నన్ను నన్నుగా నిలబెట్టిన నా బ్లాగు జ్యోతి ఎప్పటికీ ఋణపడి ఉంటాను. నా పుట్టినరోజుతో పాటు నా బ్లాగు పుట్టినరోజు కూడా నాకు చాలా ముఖ్యమైనది... నా బ్లాగు సుందరి జ్యోతినన్ను నేను పరిశీలించుకుని, విమర్శించుకుని, విశ్లేషించుకునేలా చేసి ఆ భావాలను అక్షరాలలో నిక్షిప్తం చేసుకునేలా చేసింది. ఎన్నో అందమైన భావాలకు నిలయమైంది. వివిధ సందర్భాలలో నా సంఘర్షణ, నా స్పందన అన్నీ తనలో దాచుకుంది. అప్పుడప్పుడు నాలోని వేదనకు, ప్రశ్నలకు చర్చావేదికగా మారింది.. నాకు నచ్చిన పాటలతో సరాగాలాడింది. పద్యాల ఆటలాడింది. బొమ్మలతో మాటలాడింది. భక్తిసాగరంలో ఓలలాడించింది.. నాకంటూ ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులేసేలా చేసింది నా బ్లాగు.. అందుకే నిరంతరం నన్ను నేను నా బ్లాగులో చూసుకుంటూ ఉంటాను....


Happy 10th Anniversary JYOTHI…. 


మరో ముఖ్య విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దాదాపు పది సంవత్సరాలుగా వివిధ  పత్రికల్లో(వార్త, చినుకు తప్ప) వ్యాసాలు, వంటలు, కవర్ స్టోరీలు  రాస్తూ ఉన్నాను. అంతేకాక అంతర్జాల పత్రిక సంపాదకురాలిగా  ప్రెస్ క్లబ్ అప్ హైదరాబాదులో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా మెంబర్ షిప్ వచ్చింది..(అంటే నాకంటూ ఒక బండి కొనుక్కుంటే PRESS అన్న స్టిక్కర్ పెట్టుకోవచ్చన్నమాట..భలే ఉంటుంది కదా )


మరో అద్భుతాన్ని త్వరలో పంచుకుంటాను..




Friday, 9 September 2016

సావనీర్ స్పెషల్ వర్క్.. ATA, TCA...





అంతర్జాలంలో అడుగుపెట్టి దాదాపు పది సంవత్సరాలు కావస్తొంది. పిల్లల చదువులకోసం మొదలుపెట్టిన ఈ జాల ప్రయాణం. నాకు ఎన్నో అద్భుతాలను చూపించింది. నాచే ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేయించింది. సాథారణ గృహిణి అనుకునే నన్ను ఈనాడు ఎన్నో పాత్రలు పోషింఫజేసిన ఈ అంతర్జాలం నాకు అందించిన మరో పురస్కారం .. ఒకటి కాదు రెండు .. అసలు ఇదంతా నేను చేయగలిగాను అంటే నమ్మలేకుండా ఉన్నాను. నేను అంత టాలెంటెడ్ ఆ? అయ్ బాబోయ్ అనుకుంటున్నాను.

కాని నా మీద నాకంటే నా మిత్రులు, శ్రేయోభిలాషులకు చాలా చాలా నమ్మకం సుమండీ.. నా మానాన నేను పని చేసుకుంటూ ఉంటానా? కొత్త పని అప్పచెబుతారు. అమ్మో నావల్ల కాదు. నేను చేయలేను అన్నా వినరు. ఇప్పటికీ నాకు స్టార్టింగ్ ట్రబుల్ ఉంది. కాని రంగంలోకి దిగాక మాత్రం అంతుచూడకుండా వదలను. నాకు బాధ్యత అప్పజెప్పినవాళ్లకు ఈ సంగతి తెలుసు కదా..

ఇంతకీ సంగతేంటంటే....

రెండు నెలల క్రితం ATA ( American Telugu Association) వారి 25వ వత్సరపు సంబరాల సందర్భంగా తయారుచేసిన సావనీర్ (ప్రత్యేక సంచిక)"సంస్కృతి" సంపాదకవర్గంలో చోటు దొరికింది.. ఆ క్రమంలో నాకు తెలిసిన పరిచయమున్న మిత్రుల నుండి వ్యాసాలను సేకరించి ప్రచురించడం జరిగింది. ఆ వెనువెంటనే TCA (Houston) వారి 40వ వార్షికోత్సవ సంబరాలకోసం సావనీర్ "మధురవాణి" పనులను చేపట్టడం జరిగింది. దీనికోసం పేజ్ డిజైనింగ్, కథల డిటిపి, ప్రూఫ్ వగైరా చేయించడం జరిగింది. ఇందుకు Ramakrishna Pukkallaగారు లేఅవుట్ డిజైనింగ్ వర్క్ చేసారు. రెండు సావనీర్లు కూడా మంచి ప్రశంసలు పొందాయని తెలిసింది..

నేను కూడా హ్యాపీస్ అన్నమాట..


నామీద మీకున్న నమ్మకానికి , మీరిచ్చిన ప్రోత్సాహానికి థాంక్ యూ Bhardwaj Velamakanni and Chitten Raju Vanguriగారు

Saturday, 3 September 2016

కుడుంపట్టు - సాక్షిలో వినాయకచవితి స్పెషల్స్



విఘ్నాలు సర్వజ్ఞుల్ని ఏమీ చెయ్యలేవు.
విఘ్నం అంటే.. పనికి బ్రేక్.
సర్వజ్ఞత అంటే..
బ్రేకు పడ్డా ‘ఓకే ఇట్సాల్ రైట్’ అనుకోవడం.
బట్.. ఎంతటి సర్వజ్ఞులైనా...
ప్రసాదాల దగ్గర, నైవేద్యాల దగ్గర,
భోజనాల దగ్గర బ్రేక్‌ని తట్టుకోలేరు.
విఘ్నేశ్వరుడి ‘మెనూ’ దగ్గర ఆసలే ఆగలేరు.
ఉడుం పట్టులా... అదొక కుడుంపట్టు.
సర్వజ్ఞత వదిలి మీరూ ఓ పట్టు పట్టండి.
అడ్వాన్స్‌గా... హ్యాపీ వినాయక చవితి!
ఆరగించమని... లంబోదరునికీ వినతి!


****************************************************

క్యారట్ - పప్పు ఉండ్రాళ్లు
కావలసినవి: బియ్యప్పిండి- రెండు కప్పులు; క్యారట్ తురుము- పావు కప్పు; పెసరపప్పు - పావు కప్పు; జీలకర్ర- అర టీ స్పూన్; ఉప్పు- తగినంత; నెయ్యి- 3 చెంచాలు

తయారీ: పెసరపప్పు కడిగి నీరు పోసి కొద్దిసేపు నానపెట్టి తర్వాత కాస్త పలుకుగా ఉడికించి జల్లెడ లేదా చిల్లుల పాత్రలో వేయాలి. బియ్యప్పిండిలో ఉప్పు, జీలకర్ర, క్యారట్ తురుము, పెసరపప్పు వేసి కలిపి నీళ్లు పోసి కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు పక్కన ఉంచాలి. మిశ్రమం మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని జారుడుగానూ ఉండకూడదు. పూరీ పిండిలా ఉండాలి. ఈ పిండిని పెద్ద నిమ్మకాయంత ఉండలు చేసి ఇడ్లీ ప్లేట్లలో పెట్టి ఆవిరి మీద 15 నిమిషాల సేపు ఉడికించాలి. ఇష్టమైతే కొబ్బరి తురుముతో గార్నిష్ చేయవచ్చు.

కొబ్బరి కోజుకట్టై
కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము- ఒక కప్పు; బెల్లం తురుము- ముప్పావు కప్పు; ఏలకుల పొడి- ఒక టీ స్పూన్; బియ్యప్పిండి- ఒకటిన్నర కప్పులు; కొబ్బరి నూనె- రెండు టీ స్పూన్లు; ఉప్పు- చిటికెడు

తయారీ: బెల్లం తురుములో కొద్దిగా నీరు పోసి మరిగించి ముదురు పాకం వచ్చిన తర్వాత కొబ్బరి తురుము వేసి ఉడికించాలి. నీరు ఇగిరి పోయి ముద్దయిన తర్వాత ఏలకుల పొడి వేసి కలిపి దింపేయాలి. చల్లారిన తర్వాత కొబ్బరి మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లు మరిగించాలి. అందులో ఉప్పు, బియ్యప్పిండి వేసి కలుపుతూ దగ్గర అయ్యే వరకు సన్నమంట మీద ఉడికించాలి. ముద్దగా అయిన తర్వాత దించాలి. చల్లారిన తర్వాత పిండిని బాగా మర్దన చేసి మృదువుగా అయ్యాక నిమ్మకాయ సైజు ఉండలు చేసుకోవాలి. చేతికి కొబ్బరి నూనె రాసుకుని ఉండను కొంచెం వెడల్పుగా చేసి మధ్యలో కొబ్బరి ఉండను పెట్టి అన్ని వైపుల నుంచి మూసేయాలి. ఇలా పిండి మొత్తం చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో లేదా ప్రెషర్ కుకర్‌లో జల్లెడ వంటిది అమర్చి పైన కోజుకొట్టైలను పెట్టి ఆవిరి మీద 15 నిమిషాల సేపు ఉడికించాలి. గమనిక: కొంత బియ్యప్పిండిలో కేసర్ రంగు కలిపి దానిని మిగిలిన బియ్యప్పిండిలో కలిపి ఉండలు చేసుకుంటే కొబ్బరి కోజుకొట్టైలలో రంగు చారలుగా కనిపిస్తూ అందంగా ఉంటుంది.

పాల తాలికలు
కావలసినవి: బియ్యప్పిండి - ఒక కప్పు; బెల్లం తురుము - అర కప్పు; పంచదార - అర కప్పు; నెయ్యి - ఒక చెంచా; ఏలకుల పొడి - పావు టీ స్పూన్

తయారీ: ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్లు మరిగించి దించాలి. అందులో బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు పక్కన పెట్టాలి. ఈ లోపు మరొక గిన్నెలో పాలను మరిగించాలి. ఇప్పుడు చేతులకు నెయ్యి రాసుకుని వేడినీటితో తడిపిన బియ్యప్పిండి కొద్దిగా తీసుకుని అర చేతుల మధ్య మృదువుగా రుద్దితే పొడవుగా తాలికలుగా వస్తుంది. వీటిని వెడల్పుగా ఉన్న పళ్లెంలో వేసి పది నిమిషాల సేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత తాలికలను మరుగుతున్న పాలలో వేసి (తాలికలు ఒకదాని మీద ఒకటి పడి అతుక్కుపోకుండా జాగ్రత్తగా వదలాలి) ఉడికించాలి. తాలికలు ఉడికిన తర్వాత బెల్లం తురుము, పంచదార వేసి కలుపుతూ మరికొంత సేపు మరిగించాలి. పాలు చిక్కపడిన తర్వాత యాలకుల పొడి వేసి కలిపి దించాలి. ఇష్టమైతే జీడిపప్పు, బాదం, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు.

రవ్వ మోదక్
కావలసినవి: బియ్యప్పిండి- ఒక గ్లాసు; బొంబాయి రవ్వ- ఒక గ్లాసు; పంచదార- ఒకటింపావు గ్లాసు; నెయ్యి- 5 టీ స్పూన్‌లు; యాలకుల పొడి- అర చెంచా; ఉప్పు - తగినంత

తయారీ: ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు, చెంచా నెయ్యి వేసి మరిగించి, బియ్యప్పిండి వేసి ఉండలు కట్టకుండా కలిపి మూతపెట్టి పది నిమిషాల సేపు పక్కన ఉంచాలి
* పెనంలో చెంచా నెయ్యి వేడి చేసి రవ్వను దోరగా వేయించి రెండు గ్లాసుల నీరు పోసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. నీరు ఇగిరి, రవ్వ దగ్గరైన తర్వాత పంచదార, ఏలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి కలపాలి. మిశ్రమం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేయాలి. అరచేతికి నెయ్యి రాసుకుని బియ్యప్పిండి మిశ్రమాన్ని బాగా పిసికి పెద్ద నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి
* ఇప్పుడు ఒక బియ్యపిండి ఉండను వెడల్పుగా చేసి (చిన్న పూరీలా) మధ్యలో రవ్వ ఉండను పెట్టి అంచులు మూసేయాలి. ఇలా చేసుకున్న మోదక్‌లను ఇడ్లీ కుక్కర్ లేదా స్టీమర్‌లో పెట్టి ఆవిరి మీద 15 నిమిషాల సేపు ఉడికించాలి. తీసిన తరవాత పైన కొబ్బరి తురుము చల్లుకోవచ్చు.
గమనిక: మోదక్ మిశ్రమం చేయడం సులభమే కానీ అంచులు అందంగా అతికించడం నైపుణ్యంతో కూడిన పని. మోదక్‌లు చేయడానికి అచ్చులు దొరుకుతాయి. (కజ్జికాయల అచ్చుల్లాగ) వాటితో చేస్తే మోదక్ ఆకృతి చూడముచ్చటగా ఉంటుంది.

కొంకణి పాథోలి
కావలసినవి: బియ్యప్పిండి- ఒక కప్పు; నీళ్లు- ఒక కప్పు; ఉప్పు- చిటికెడు; నెయ్యి- 3 స్పూన్లు; తాజా కొబ్బరి తురుము- ఒక కప్పు; బెల్లం తురుము- అర కప్పు; ఏలకుల పొడి- ఒక టీ స్పూన్; పసుపు ఆకులు లేదా అరటి ఆకులు (పాథోలీ చుట్టడానికి)

తయారీ: ఒక గిన్నెలో నీరు పోసి ఉప్పు, ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి వేసి దించి ఉండలు కట్టకుండా కలిపి మూతపెట్టి ఒక నిమిషం సేపు మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత చేతికి నెయ్యి రాసుకుని బియ్యప్పిండిని మృదువుగా వచ్చే వరకు మర్దనా చేయాలి. ఒక పెనంలో కొద్దిగా నీరు పోసి సన్నమంట పెట్టి బెల్లం తురుము వేయాలి. బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి తురుము వేసి ఉడికించాలి. మొత్తం ఉడికి దగ్గరగా అయిన తర్వాత నెయ్యి, యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి. ఇప్పుడు పసుపు ఆకు లేదా అరటి ఆకు తీసుకుని బియ్యప్పిండి మిశ్రమాన్ని చిన్న బత్తాయి సైజులో తీసుకుని ఆకు మీద వేసి తడి అరచేత్తో వత్తాలి. మధ్యలో చెంచా బెల్లం, కొబ్బరి మిశ్రమం పెట్టి ఆకుతోనే మెల్లగా సగానికి మడత పెట్టాలి. అంచులు విడిపోకుండా పిండిని వత్తాలి. అంతా ఇలాగే చేసుకుని వాటిని స్టీమర్ లేదా ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద 15 నిమిషాల సేపు ఉడికించాలి. చల్లారిన తర్వాత ఆకును తీసేసి వడ్డించాలి.

శేవల పాయసం
కావలసినవి: గోధుమ పిండి - 200 గ్రా; బెల్లం తురుము - 250 గ్రా; పాలు- పావు లీటరు; ఏలకుల పొడి - ఒక టీ స్పూన్; నెయ్యి- 5 టీ స్పూన్లు; కొబ్బరి తురుము- ఒక టేబుల్ స్పూన్; గసగసాలు- ఒక టీ స్పూన్

తయారీ: గోధుమపిండిని చపాతీకోసం తడిపినట్లు తడపాలి. ఒక గంట సేపటి తర్వాత పిండిని అరచేతిలో వేసి రుద్దుతూ పొడవు తీగలుగా చేసి అరగంట సేపు ఆరబెట్టాలి. వీటిని శేవలు అంటారు. వాటిని కుకర్‌లో రెండింతలు నీటిని పోసి, ఒక చెంచాడు నెయ్యి వేసి ఉడికించాలి. నెయ్యి వేయడం వల్ల శేవలు ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. ఒక మోస్తరుగా ఉడికిన శేవలలో బెల్లం తురుము, వేడి పాలు వేసి గిన్నె అడుగు అంటుకోకుండా కలియబెడుతూ మరికొంత సేపు ఉడకనివ్వాలి. శేవలు మెత్తబడి, మిశ్రమం దగ్గరగా అయిన తరవాత ఏలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపాలి. చివరగా కొబ్బరి తురుము, గసగసాలు చల్లాలి. ఇష్టమైతే జీడిపప్పు, బాదం కూడా వేసుకోవచ్చు.

Friday, 2 September 2016

మాలిక పత్రిక సెప్టెంబర్ 2016 సంచిక విడుదల

 
Jyothivalaboju
Chief Editor and Content Head


అనివార్య కారణాల వల్ల గతమాసపు మాలిక పత్రిక విడుదల కాలేదు. దానికి క్షమాపణలు కోరుతున్నాము.

ఒక నెల పత్రిక రాకున్నా ఆ లోటును సంపూర్ణంగా భర్తీ చేస్తూ మరిన్ని ఎక్కువ కథలు, వ్యాసాలు, కవితలు, కొత్త సీరియళ్లతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉంది మాలిక  పత్రిక.. రచయితలు, పాఠకులు, మిత్రులు ప్రోత్సాహం, ఆదరణకు మనఃఫూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మాసపు సంచికలోని  30 విశేషాలు తెలుసుకుందాం.. తీరిగ్గా చదువుకోండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మార్పులు, చేర్పులు , సలహాలు కూడా పంపించగలరు..


మీ రచనలు పంపడానికి : editor@maalika.org

 1. చపలమహర్షి
 2. ఆమె అతడిని కొట్టింది
 3. ఫట్, ఫ్లాప్, పరమచెత్త
 4. బ్లాక్ మెయిల్
 5. నాన్నమొస్తుంది
 6. కళాచికిత్స - ఒక ఆత్మవైద్యము
 7. బ్రహ్మలిఖితము
 8. సస్పెన్స్ కథలు - 1
 9. మాయానగరం - 29
10. శుభోదయం - 7
11. Gausips - ఎగిసే కెరటం - 6
12. జీవితం ఇలా కూడా ఉంటుందా -5
13. ఆదర్శ కళ్యాణ వైభోగం
14. చారిత్రిక నవలా సాహిత్యం
15. ఆదర్శ దాంపత్యం
16. అమెరి 'కలకలం'
17. మూడవ మనిషి
18. పురాణము - పరిశీలనము
19. శ్రీకృష్ణదేవరాయ వైభవము - 5
20. ముదనష్టపు మధుమేహము
21. నందోరాజా భవిష్యతి
22. మన వాగ్గేయకారులు - 8
23. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి - 9
24. కృష్ణ, వేణిల సంగమం
25. అస్త్ర సన్యాసం
 26. తాను - నేను
27. చేయగలిగేదేముంది
28. మధ్యతరగతి మిధ్యా సూరీడు
29. కాసేపు నీతో ప్రయాణం
30. కవిత్వమంటే

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008