Sunday, 19 December 2010

ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

టీవీ చూడడం,వంట చేయడం (ఇది తప్పదనుకోండి) , కుట్లు అల్లికలు, బ్లాగులు రాయడం కాకుండా నేను చేసే ఇంకో పని గురించి చెప్తాను. అదేంటంటే ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా అవసరమైన బట్టలు ఉతికే పొడి, గిన్నెలు తోమే పొడి, ఫినాయిల్, లిక్విడ్ సోప్.. బయట ఎన్నో రకాలు దొరుకుతాయి. అయినా మురికిపొదు. వందలు పెట్టి కొనాలంటే స్తోమతు లేదు. అందుకే అవి ఎలా చేయాలో నేర్చుకున్నా. నాకు అవసరమైనట్టుగా ఒక్కోటి మార్పులు చేసుకుంటూ ఒక లెక్క దగ్గర ఫిక్స్ ఐపోయా. దాదాపు పదేళ్లనుండి ఇంట్లోనే తయారు చేసుకుంటూ వాడుకుంటున్నా. ఐదేళ్ళు మార్కెటింగ్ కూడా చేసాను కాని వదిలేసా. ఇంట్లో ఉండి ఏదైనా పని చేయాలనుకునేవాల్లకు నాలా బాధితులైన మధ్యతరగతి ఇల్లాళ్ళకి ఉపయోగపడుతుంది అని ఈ వస్తువుల గురించి ఈటీవీ సఖిలో ప్రోగ్రాం కూడా ఇచ్చాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆంధ్రభూమి దినపత్రికలో కూడా వచ్చిన ఈ వస్తువుల ఎలా తయారు చేసుకోవాలో చూడండి.


ఈరోజు మనకు బజారులో ఎన్నో రకాల వాషింగ్ పౌడర్లు, క్రీనింగ్ పౌడర్లు, ఫినాయిల్, లిక్విడ్ సోప్ వంటివి లభిస్తున్నాయి. కాని అవన్నీ అందరికి అందుబాటు ధరల్లో ఉండవు. ఒకోసారి ధర పెట్టినా మురికి పోదు. పనిమనుషులను నమ్ముకోక తప్పదు. అలాంటప్పుడు ఈ వస్తువులన్నీ మనమే ఇంట్లో తయారుచేసుకోవచ్చు. అందుకు అవసరమయ్యే ముడి సరుకు కూడా సులువుగానే దొరుకుతుంది. దీనివల్ల డబ్బు ఆదా, మురికి వదిలిందన్న సంతృప్తి కలుకుతుంది.



వీటి వలన మన చేతులకుగాని, బట్టలకు , వస్తువులకు గాని ఎటువంటి హాని కలగదు. ఇచ్చిన కొలతలతో తయారుచేసుకుంటే ఎటువంటి హాని లేదు. కాని ఈ మిశ్రమాలను కలిపేటప్పుడు కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే చాలు. వీటిని కలపడానికి ప్లాస్టిక్ లేదా కర్ర సామగ్రి మాత్రమే ఉపయోగించాలి. ముడి సరుకులన్నీ సికిందరాబాదు జనరల్ బజార్ , హైదరాబాదులో తిలక్ రోడ్ .. ఆబిడ్స్ లోని ఇండస్ట్రియల్ కెమికల్స్ అమ్మే దుకాణాల్లో దొరుకుతాయి. మీకు ఇంట్లో చేసుకోవడానికి వీలు కాకపోతే మీరు ముడిసరుకు కొన్న దుకాణంలోనే కాసిని డబ్బులిచ్చి అన్నీ కలిపించి తీసికెళ్ళండి. మూడు నెలలకోసారి వెళితే సరిపోతుంది. ఇవి బజారులో దొరికే వస్తువులకంటే ఎక్కువ మన్నికగా పని చేస్తాయి. ప్రతి ఇంట్లో తప్పకుండా అవసరమయ్యే ఈ వస్తువులు ఇంట్లో తయారుచేసి మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు.

ముడిసరుగు దొరికే దుకాణం...


Opera Trading corporation


Opp. Endowment Office. Tilak Road .


Hyderabad.


Ph.. 24753932



వాషింగ్ పౌడర్


బట్టల సోడా (Soda ash ) 2.5 kg


సోడియమ్ సల్పేట్ (Sodium Sulphate ..S.S ) 500 gm


సోడియమ్ బొరాన్సెలో (Sodium Borancelo …S.B.C ) 500 gm


సోడియమ్ టైఫాలీ ఫాస్పేట్ (Sodium Typholi Phosphate…S.T.P ) 50 gm


కార్బాక్సి మిధైల్ సెలో (Carboxy Methyl Celo …C.M.C ) 50 gm


ట్రైసోడియమ్ ఫాస్ఫేట్ (TriSodium Phosphate…T.S.P ) 250 gm


సోడియమ్ మిధైల్ సల్పేట్ (SodiumMethylSulphate…S.M.S) 500 gm


సోడియమ్ పెర్బోరేట్ ( Sodium Perborate ) 50gm


ఆసిడ్ స్లరీ (Acid Slurry ) 1200 gm


బ్లూ కలర్ (Blue color) 200 gm


టినోపాల్ (Tinopal ) 50 gm


పెర్ఫ్యూమ్ (Perfume) 25 ml


ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకుని ఆసిడ్ స్లరీ, పెర్ఫ్యూమ్ తప్ప మిగిలిన పొడి వస్తువులన్నీ వేసి అన్నీ సమానంగా, ఉండలు లేకుండా కర్రతో కలపాలి.. ఎప్పుడు కూడా చేతితోగాని, స్టీలు , ఇనుప వస్తువులుగాని ఉపయోగించకూడదు. తర్వాత ఆసిడ్ స్లరీని మెల్లిగా పొడిలో పోస్తూ కర్రతో మొత్తం కలిసేట్టుగా కలపాలి. పెర్బ్యూమ్ కూడా వేసి మొత్తం పొడిని బాగా కలిపి అరగంట అలా వదిలేయాలి. తర్వాత ఈ పొడిని జల్లించి ప్లాస్టిక్ డబ్బాలో కాని, ప్లాస్టిక్ కవర్లలో కాని వేసి పెట్టుకోవాలి. జల్లించేటప్పుడు చేయితో పొడిని తాకినా ఏమీ కాదు.




వైట్ ఫినాయిల్ ….



వీడాల్ ( Veedol ) 1/4 lit


పైన్ ఆయిల్ ( Pine oil ) 1/2 lit


సోప్ ఆయిల్ ( Soap oil ) 1/2 lit


సెటోనిల్ ( Cetonil ) 50 ml


మంచినీరు ( Water ) 6 lit



ఒక ప్లాస్టిక్ బకెట్లో ఆరు లీటర్ల మంచినీరు పోసి పై వస్తువులు ఒక్కటొక్కటిగా వేసి కలపాలి. బాగా కలిపి సీసాల్లో భద్రపరచుకోవాలి. ఈ ఫినాయిల్ చేయడానికి ఎప్పుడూ త్రాగునీరు మాత్రమే వాడాలి. బోర్ వాటర్ వాడితే తెల్లగా ఉంఢక నూనెలాగా ఉంటుంది. చిక్కగా ఉందనుకుంటే అవసరమున్నంత నీరు కలుపుకోవచ్చు.







లిక్విడ్ సోప్ ….



కాస్టిక్ సోడా ( Caustic soda ) 100 gm


ట్రై సోడియమ్ ఫాస్ఫేట్ ( Tri Sodium Phosphate )..T.S.P 50 gm


యూరియా ( Urea ) 100 gm


ఆసిడ్ స్లరీ ( Acid slurry ) 600 gm



ముందుగా పది లీటర్ల నీరు ఒక బక్కెట్‍లో తీసుకుని అందులో యూరియా, సోడా, ఆసిడ్ స్లరీ ఒక్కొక్కటిగా కర్రతో కలపాలి. T.S.P ని విడిగా ఒక మగ్గులో అర లీటరు నీటిలో వేసి జాగ్రత్తగా కర్రతో కలిపి మొత్తం కరిగాక మిగతా మిశ్రమానికి కలపాలి. మొత్తం మళ్ళీ బాగా కలిపి అరగంట వదిలేసి సీసాల్లో వేసి భద్రపరచుకోవాలి.

ఇది చేతులు కడగటానికి, ఇల్లు కడగటానికి, బాత్రూమ్స్, టైల్స్ వంటివి కడగడానికి వాడుకోవచ్చు. చిక్కగా ఉందనుకుంటే కావలసినంత నీరు కలుపుకోవచ్చు.




క్లీనింగ్ పౌడర్


డోలమైట్ ( Dolomite ) పౌడర్ 10 kg


ఆసిడ్ స్లరీ ( Acid slurry ) 300 gm


బట్టల సోడా ( Soda ) 500 gm


వెడల్పాటి ప్లాస్టిక్ టబ్‍లో ముందుగా డోలోమైట్ పౌడర్, సోడా వేసి బాగా కలిపాలి. తర్వాత ఆసిడ్ స్లరీ వేసి కలిపి కొద్ది సేపు వదిలేయాలి. తర్వాత పొడినంతా జల్లించి సంచీలో కాని , డబ్బాలో కాని వేసుకోవాలి.


ఇందులో సబ్బు శాతం సరియైన మోతాదులో కలపబడిఉంది. మామూలుగా బజారులో దొరికే క్లీనింగ్ పొడిలో మళ్ళీ మనం కొద్దిగా వాషింగ్ పౌడర్ లేదా సబ్బు కలుపుకుంటాము. కాని ఇలా తయారుచేసుకున్న క్లీనింగ్ పొడిలో అలా అవసరం లేదు. ఒక చిట్కా. ఒక చిన్నె గిన్నెలో పొడి వేసి కొద్దిగా నీరు పోసి ముద్దగా చేసి వాడుకుంటే గిన్నెలకు పొడి అంటుకోదు. అలాగే పొడిగా వాడితే గిన్నెలకంతా పొడి ఉంటుంది ఆరిన తర్వాత. పొడి కాస్త బరకగా ఉంటుంది కాబట్టి మాడినవి, పెనంలాంటివి త్వరగా శుభ్రం అవుతాయి.

Friday, 10 December 2010

500 - భారతీయ వ్యక్తిత్వ వికాసం


మధ్య కమ్యూనికెషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అనే మాటలు తరచూ వినబడుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్నవాళ్లకు ఇది చాలా అవసరమంటున్నారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసాక ఉద్యోగాల వేటలో పడ్డవాళ్లు ముందుగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలంట. అసలు కమ్యూనికేషన్ స్కిల్స్. వ్యక్తిత్వ వికాసం ఏంటి? దానికోసం పుస్తకాలు, సిడిలు, క్లాసులు తీసుకోవాలా?? అవి లేకుండా తెలుసుకోలేమా? నేర్చుకోలేమా? కొన్నేళ్ల క్రిందవరకు లేని కొత్త కోర్సులు ఇప్పుడెలా పుట్టుకొచ్చాయి?? ఒక వ్యక్తి నిర్మాణం ఒక రోజులో , కొన్ని క్లాసులలో , కొన్ని పుస్తకలతో జరిగే పని కాదు. ప్రతీ వ్యక్తిత్వ నిర్మాణం నిరంతరంగా అవిశ్రాంతంగా సాగే ఒక తపస్సు, చిన్న చిన్న పాయలను కలుపుకుంటూ సాగే మహానదీ ప్రయాణం లాంటిది. కాదంటారా?? విషయాలు కేవలం ఉద్యోగాలు సంపాదించుకోవడానికి వాటిని నిలబెట్టుకుని విజయాలు సాధించడానికి మాత్రమే కాదు. మన జీవితాన్ని అత్యున్నత విలువలతో తీర్చి దిద్దుకోవడానికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం.

ప్రతీ జీవితం ఒడిదుడుకుల మయం. ప్రతీ వ్యక్తి తన జీవితంలో ఎన్నో తుఫానులు, భూకంపాలను ఎదుర్కొనక తప్పదు. అలాగని జీవితమంతా కష్టాల సాగరం కాదు. ప్రతీ సమస్యని, సంకటాన్ని ధైర్యంతో , వివేకంతో ఎదుర్కొని జీవితాన్ని సుందరమయం చేసుకోవాలి తప్ప కృంగిపోకూడదు. కష్టసుఖాలు సరిసమానంగా ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు ఎంతగా అనందిస్తామో, దుఖం కలిగినప్పుడూ అంతే ఆనందంగా స్వీకరించాలి. ఇలాటి జీవిత సత్యాలెన్నింటినో మనకు అరటిపండు వలిచి చేతిలోపెట్టినట్టు చెప్తుంది భగవద్గీత. నాడు, నేడు, రేపూ కూడా ఎంతో ఉన్నతమైన, ఉత్కృష్టమైన వ్యక్తిత్వ వికాస పుస్తకం భగవద్గీత. అలాగే భర్తృహరి సుభాషితాలు, మహాభారతం, భాగవతం, వేమన, సుమతీ, భాస్కర శతకాలు మొదలైన గ్రంధాలెన్నో మనకు జీవిత సత్యాలు తెలిపాయి.

వ్యక్తిత్వ వికాసం అంటే వ్యక్తి యొక్క వికాసం . కాని భారతీయ వ్యక్తిత్వ వికాసం అంటూ ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు కస్తూరి మురళీకృష్ణగారు. వ్యక్తిత్వ వికాసం అనేది మధ్య పుట్టుకొచ్చిన పదం కాదు. యుగాలనుండి ఎందరో మహానుభావులు ప్రతీ వ్యక్తి తెలుసుకోవలసిన, నేర్చుకొని పాటించవలసిన వ్యక్తిత్వ వికాసం పాఠాలు చెప్పారు. వివరాలను మనకు పుస్తకం "భారతీయ వ్యక్తిత్వ వికాసం" లో కూలంకషంగా వివరించారు మురళీకృష్ణగారు.

మీకు తెలుసా? అమ్మకంటే పెద్ద మేనేజిమెంట్ గురు ఎవరైనా ఉన్నారా?? బామ్మ, తాత కంటే వ్యక్తిత్వ వికాసాల పాఠాలు చెప్పే గురువులు ఉన్నారా? పిల్లలకు చిన్నప్పటినుండి చెప్పే రాముడి కథలు, కృష్ణుడి లీలలు, ప్రహ్లాదుడు, నీతి కథలు, పంచ తంత్ర కథలు .. ఎన్నో విలువైన విషయాలు నేర్పిస్తాయి. తల్లి పాడే లాలి, జోలపాటలు, బుజ్జగింపులు, తండ్రి నేర్పే నడకలు, జాగ్రత్తలు, పెద్దల మార్గనిర్దేశం పిల్లవాడిని సరియైన వ్యక్తిత్వ సాధన మార్గంలో నడిపిస్తాయి. తాను విన్న కథలసారం నుండి నేర్చుకున్న అంశాలను భవిష్యత్తులో ఉపయోగించుకుంటాడు. కాని నేడు పిల్లలకు ఎక్కడుంది? . టీవీ, మొబైల్ గేమ్స్. యాంత్రికంగా పోటీ తత్వంతో సాగిపోయే చదువులు పిల్లలను స్పందన లేని యంత్రాలుగా మారుస్తున్నాయి. అందుకే పెద్దయ్యాక వారికి వ్యక్తిత్వ వికాసం పాఠాలు నేర్చుకోవలసి వస్తుంది.

మనం మరచిపోయిన, తెలిసినా పట్టించుకోని వ్యక్తిత్వ వికాస పాఠాలను పురాణ గ్రంధాలనుండి సేకరించి మనముందుంచారు రచయిత. ఇది ఒక పాఠ్య పుస్తకంలా కాక భారతీయ సంస్కృతిలోని విశిష్టతను కూడా తెలుసుకునేలా చేస్తుంది .. వ్యక్తిత్వం వికసింపచేసుకోవాల్సింది ఒక ప్రత్యేకమైన అంశంలోనే కాదు. అందుకే వ్యక్తిత్వ వికాసం గురించి వివిధ వర్గాలుగా విభజించి విశ్లేషించారు.
1. వ్యక్తిత్వం - విజయం
2. వ్యక్తిత్వం - మనస్సు
3. వ్యక్తిత్వం - దైవభావన
4. వ్యక్తిత్వం - ఆదర్శం
5. వ్యక్తిత్వం - మాట
6. వ్యక్తిత్వం - భయం
7. వ్యక్తిత్వం - ఆలోచనలు
8. వ్యక్తిత్వం - బ్రహ్మచర్యం
9. వ్యక్తిత్వం - శాంతం
10. వ్యక్తిత్వం - ధనం
11. వ్యక్తిత్వం - అధికారం

ఈనాడు లభిస్తున్న వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, వ్యక్తిత్వ వికాస డాక్టర్లు బోధిస్తున్నదంతా మన పూర్వీకులు ఏర్పరచిన వ్యవస్థలోనే పొందు పరచబడి ఉంది. దానిని వెలికి తీసి మనకు అందించారు రచయిత కస్తూరి మురళీకృష్ణ. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, సుమతీ, భాస్కర, వేమన శతకాలు, రామాయణ, భారత,భాగవత,భగవద్గీత మొదలైన గ్రంధాల ఆధారంగా "భారతీయ వ్యక్తిత్వ వికాసా"న్ని విశ్లేషిస్తూ, వివరిస్తూ రాసిన వ్యాసాల సంకలనం. తప్పకుండా మన ఇంట ఉండవలసిన అమూల్యమైన పుస్తకం ఇది.

ప్రచురణ: ఎమెస్కో బుక్స్
వెల : రూ. 150 /-

ఇది నా 500 టపా..

Thursday, 9 December 2010

అంతర్జాతీయ తెలుగు బ్లాగరుల సమావేశం




కొత్తగా వచ్చిన బ్లాగర్లకు బ్లాగుల దినోత్సవం గురించి తెలీదనుకుంటా. అందుకే మరోసారి.. గత రెండేళ్లుగా డిసెంబర్ నెలలో వచ్చే రెండవ ఆదివారం తెలుగు బ్లాగుల దినోత్సవం జరుపుకుంటున్నాము. హైదరాబాదులో, బెంగళూరులో,చెన్నైలో ఎక్కడున్నా సరే బ్లాగర్లు ప్రత్యక్షంగా కలిసి ముచ్చటించుకోవడం జరుగుతుంది. అలా కలవడం అందరికీ సాధ్యం కాదు కదా.అందుకే ఆన్లైన్లో కూడా ప్రపంచ తెలుగు బ్లాగుల దినోత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఆదివారం హైదరాబాదు కృష్ణకాంత్ పార్కులో తెలుగు బ్లాగర్ల సమావేశం ఏర్పాటు చేయబడింది. వీలైనంతమంది బ్లాగర్లు పాల్గొనగలరు. ఈ క్రమంలో ఎల్లుండి శనివారం కూడలి కబుర్లలో అంతర్జాతీయ తెలుగు బ్లాగులు (బ్లాగర్ల) సమావేశం ఏర్పాటు చేయబడింది. బ్లాగులు రాసేవాళ్ళు, చదివేవాళ్ళు అందరూ ఆహ్వానితులే. సీనియర్లు, జూనియర్లు అంటూ ఏమి లేదు. అందరూ పాల్గొనగలరు.. ఇదే మా ఆహ్వానం..

సమావేశ స్థలం.. కూడలి కబుర్లు..
సమయం... శనివారం సాయంత్రం.. 6 గంటలనుండి. (భారతీయ కాలమానం ప్రకారం).

Tuesday, 7 December 2010

పేపర్ కటింగ్స్...

మీకు పేపర్ లో నచ్చిన వ్యాసాలు, కథలు కట్ చేసి దాచుకునే అలవాటు ఉందా?? నాకైతే ముప్పై ఏళ్ల నుండి ఈ అలవాటు ఉంది. ఆ కాలంలో ఎన్నో సీరియల్లు ముఖ్యంగా యండమూరివి, మాదిరెడ్డి రాసినవి ప్రతి వారం కట్ చేసి పుస్తకంలా బైండింగ్ చేయించి పెట్టుకున్నవి ఇంకా ఉన్నాయి. అలాగే నెహ్రూ, ఇందిరాగాంధీ చనిపోయిన నాటి పేపర్లు ( మా నాన్నగారి దగ్గరనుండి తీసుకుని జాతీయం చేసేసా).. అప్పుడప్పుడు అవి తీసి చదువుతుంటే అదో లోకంలోకి వెళ్ళిపోయినట్టు, ఆ వార్తను మళ్ళీ కొత్తగా అదేరోజు పేపర్లా అనిపిస్తుంది. ఈ పేపర్ కటింగ్స్ గురించి నేను రాసిన వ్యాసం ఆంధ్రభూమిలో ఈరోజు ప్రచురించారు.

కొన్ని పదార్థాలు వేడివేడిగా వున్నప్పుడు తింటేనే మజాగా ఉంటుంది. వార్తలూ అంతే ! ఒక రకంగా చెప్పాలంటే న్యూస్ పేపర్ అనేది వేడి వేడి పకోడీలుంచిన ప్లేటు వంటిదన్నమాట. టీయో , కాఫీయో ఒక చేత్తో పట్టుకుని మరోచేత్తో పేపర్ చదువుతూ దినచర్య మొదలెట్టేవారు కోకొల్లలు. ముందుగా ముఖ్య వార్తలు, రాశిఫలాలు, సంచలన వార్తలు, సినిమాలు, క్రీడావిశేషాలు, బులియన్ హెచ్చుతగ్గులు వగైరా చదివేసి తర్వాత తీరిగ్గా మొదటి పేజీ నుండి చివర్లో ఇచ్చే సంతాప సందేశాలు కూడా చదవితే గాని పేపర్ చదివిన తృప్తి ఉండదు. పేపర్ రాత్రి పడుకునేవరకు కూడా మన చేతుల్లో నలుగుతూనే ఉంటుంది. ఎన్ని టీవీ చానెల్స్ వచ్చినా కూడా పత్రికలకున్న ఆకర్షణ, అనుబంధం చెక్కుచెదరలేదు.

కాని పత్రికల్లో ఒక్క వార్తలే కాదుకదా ఉండేది . వ్యాఖ్యలు, వార్తల వెనుక అసలు సిసలు కథలు, వివిధ అంశాలపై ఆయా రంగాల్లో నిపుణులైన వారి విశ్లేషణలు, అపురూపమైన ఫోటోలు, రాజకీయాలపై గిలిగింతలు పెట్టే కార్టూన్లు, ప్రభావితం చేసే సంపాదకీయాలు, ఇలా ఎన్నో విషయాలు నిండిన దినపత్రికలు పుష్పక విమానాలు. పూలు సాయంత్రానికి వాడిపోవచ్చు. కాని మన మనసుని దోచుకున్న వాటి పరిమళం అంత త్వరగా మనల్ని వీడిపోదు. అలాగే ఒక పత్రిక జీవితం ఒక్కరోజైనా, నలిగిపోయి జీవం కోల్పోయినా కూడ మనల్ని మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకుని , దాచుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. వార్తా పత్రికల్లో వచ్చే అనేక ఆసక్తికరమైన విషయాల్ని అలా చదివేసే వదిలేయకుండా, అవసరమైనపుడు మళ్ళీ రిఫర్ చేసుకోవాలనుకున్నపుడు వాటిని కత్తిరించి దాచుకోవాలి. మొత్తం పేపర్లు దాచుకోలేము కదా.



పత్రికల్లో వచ్చే వివిధ విషయాలు, అవసరమనిపించినవి సంక్షిప్తంగా డైరీలో రాసుకోవడం కొందరి అలవాటు. కొన్ని అంశాలు మొత్తంగానే భవిష్యత్తులో ఉపయోగపడేవి కావచ్చు. అన్నీ రాసుకోవడం అయ్యే పని కాదు. ఇలాంటి సంధర్భాల్లో నచ్చిన అంశాన్ని కట్ చేసి దాచుకోవడం ఒక్కటే దారి. "అవుటాఫ్ సైట్ , అవుటాఫ్ మైండ్" అన్నారు కదా! ఒకసారి మనకి నచ్చిన సంగతుల్ని భద్రపరచుకోవడానికి బద్ధకిస్తే, ఆ విషయాలు మర్చిపోతాము. మళ్ళీ అదే విషయాల గురించి వివరాలు తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సొస్తుంది. ప్రతీ దానికి మార్కెట్ కెళ్ళి పుస్తకాలు వెతికి కొనలేము కదా!. అయ్యో! ఈ విషయం, సంఘటన ఎప్పుడో చదివాము కదా అనిపిస్తుంది.


కొంతమంది మరీ ముఖ్యమనుకున్న విషయాల్ని ఫోటోకాపీ చేసి పెట్టుకుంటారు. కొంతమంది కటింగ్స్ ని పుస్తకాలుగా కుట్టి దాస్తారు. కొందరు ఫైల్ చేస్తారు. కొందరు తెల్లకాగితాలపై ఈ కటింగ్స్ ని అతికించి పుస్తకాల్లా తయారుచేసుకుంటారు. పేపర్ కటింగ్స్ సేకరించే హాబీ, మానసికానందాన్నే కాక మానసిక వికాసానికి దోహదం చేస్త్తుంది. పిల్లలకు ఈ అలవాటు చేయడం వల్ల వారికి ప్రోజెక్ట్ వర్క్స్ కోసం, పోటీ పరీక్షలకు పనికొచ్చే ఎన్నో విషయాలు తెలుస్తాయి. దీని వల్ల పిల్లల్లో విషయసేకరణ, వ్యక్తీకరణ, అలవడుతుంది. ఏళ్ళ తరబడి ఈ కటింగ్స్ ని సేకరించగలిగితే , ఒక మినీ లైబ్రరీ మన చెంత ఉన్నట్టే. ఏ విషయం మీదైనా సమగ్రంగా మాట్లాడాలన్నా, రాయాలన్నా, మనం సేకరించిన పేపర్ కటింగ్స్ ఎంతో ఉపయోగపడతాయి.

ఒకప్పుడు ఆంగ్లపత్రికల్లో ముఖ్యంగా ఆగిపోయిన ఇలస్ట్రేటెడ్ వీక్లీ లాంటి పత్రికల్లో ఎన్నో అపురూపమైన వ్యాసాలు, ఫోటొలు వచ్చేవి. అయితే పత్రికా ప్రచురణలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న సాంకేతికాభివృద్ధి కారణంగా తెలుగు పత్రికల్లో సైతం ఎన్నో ఉపయుక్తమైన వ్యాసాలు, ఫోటోలు వస్తున్నాయి. వీటిని భద్రపరుచుకుని, అప్పుడప్పుడు చూసుకుంటుంటే చాలా థ్రిల్లింగ్‍గా ఉంటుంది. కోన్నేళ్ల తర్వాత ఈ పేపర్ కటింగ్స్ ని తిరగేస్తుంటే పాతమిత్రుల్ని అనుకోకుండా కలిసినంత ఆనందంగా ఉంటుంది. మంచి వ్యాసాలు, వంటలు, కుట్లు అల్లికలు, సీరియల్ కథలు, మొదలైనవి తర్వాత చదూకోవచ్చు అనే ప్రతి పేపర్ కటింగ్ ని జాగ్రత్త పరిచి పుస్తకాలు బైండ్ చేసి పెట్టుకోవడం చాలా మంచి,ఉపయోగకరలైన అలవాటు. అప్పుడప్పుడు ఈ పేపర్ కటింగ్స్ ముందు పెట్టుకుని ఒక్కోటి చదువుతుంటే ఎన్నో ఏళ్లు వెనక్కి వెళ్లిపోతాయి మన ఆలోచనలు, వాటితోపాటే మనసు కూడా..

ఎన్నో వందల గ్రంధాలు ఒక్క ఇ బుక్‍ లో ఇమిడిపోయే ఈ రోజుల్లో ఇంకా ఈ పేపర్ కటింగ్స్ ఎందుకంటారా? ఎన్ని స్టార్ హోటల్స్ ఉన్నా, ఇంటి వంట రుచి తగ్గిపోతుందా? సాటివస్తుందా??



మూడు రోజుల క్రింద ప్రచురించబడిన మరో వ్యాసం.వయసైపోయింది..


ఏదన్నా ఒక కొత్త విషయం గురించి చెబితే మనవాళ్ళూ అదే మంత్రం జపిస్తూంటారు, అబ్బ వైసైపోతోంది ఇప్పుడింకా కొత్త విషయాలేం వంటపడతాయి? అని. వయసు... ప్రతి నిమిషానికి పెరుగుతూ ఉంటుంది. అది శరీరానికి మనసుకు కూడా.. కాని నలభై దాటగానే చాలామంది అనే మాట పెద్ద వయసు వచ్చేసింది. ముందులాగా పనిచేయలేను, ఆలోచించలేను అంటారు. అప్పటికి పిల్లలు కాలేజీలలోకి వచ్చేస్తారు లేదా పెద్దవాళ్ల అవసరం అంతగా ఉండదు వాళ్లకి. చిన్నగా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. డాక్టర్లు కూడా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక జారీ చేస్తారు. ఈ అనారోగ్యం శరీరానికే. కాని చాలామంది మనసుకు కూడా వయసు పెరిగిపోతుంది. ఒక్కో వయసులో ఒక్కో రకమైన పనులు చేయాలని మనని మనమే నియంత్రించుకుంటాం. అది ఆహారమైనా, దుస్తులైనా, ప్రవర్తన ఐనా ఇప్పుడు ఇలా ఉండాలి అని అందరూ అంటుంటే మనం కూడా ఓహో అలాగే ఉండాలి. లేకుంటే సమాజం వెక్కిరిస్తుంది. చుట్టాలు ఆడిపోసుకుంటారు అనుకుని వయసుతో పాటు మనసుని కూడా ముసలిదాన్ని చేసేస్తాం. అదే కాక ఈ జీవన ప్రయాణంలో కుటుంబ నిర్వహణ, పిల్లల సంరక్షణ కోసం పని చేయడం అత్యవసరమై మిగిలిన విషయాలకు అంత ప్రాముఖ్యం ఇవ్వరు . ముఖ్యంగా వాళ్లకు ఇష్టమైనవి. కాలక్రమేణా అసలు తమకు నచ్చేది ఏంటో కూడా తెలీనంతగా మర్చిపోతారు. ఇంటద్దె కట్టాలి. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి, వాళ్లకు మంచి ఉద్యోగాలు రావాలి, పెళ్లిల్లు చేయాలి అనే కోరికలు ప్రతీ తల్లితండ్రులను పూర్తిగా ఆక్రమించేసుకుంటాయి. దీనికోసమే అహర్నిశలు ఆలోచిస్తూ, పని చేస్తుంటారు. ఈ క్రమంలో పిల్లలు స్ధిరపడ్డాక వేరే ఏదైనా ఆలోచించడానికి, చేయడానికి ఓపిక ఉండదు మానసికంగా, శారీరకంగా అలసిపోయామనుకుంటారు. అనుభవించవలసిన కాలం గడిచిపోయింది. పిల్లలు బాగుపడ్డారు. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో నిలదొక్కుకున్నారు. మంచిసంబందాలు చూసి పెళ్లిల్లు చేసాం. బాధ్యత తీరిపోయింది. ఇక మనకంటూ ఏం చేసుకుంటాములే అంటారు. మళ్లీ పిల్లలు , వాళ్ల పిల్లల గురించే శ్రమ పడతారు.


ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటుంది. ఒక స్టేజ్ వచ్చాక పెద్దల జీవితం పెద్దలదే. పిల్లల జీవితం పిల్లలదే. వాళ్లకు అవసరమైనంతవరకు తల్లితండ్రులు చేయూత నివ్వాలి. తర్వాత వాళ్లని స్వతంత్రులను చేసి వదిలేయాలి. తల్లితండ్రుల ఎప్పుడూ పిల్లలమీద భారం కాకూడదు. వాళ్ల జీవితంలో అడ్డు కాకూడదు. అలా అని వారితో అనుబంధం తెంచుకోవాల్సిన పనిలేదు. ఇంతకుముందులా ఉమ్మడి కుటుంబం అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఉద్యోగ, వ్యాపారరీత్యా వేరుగా ఉండక తప్పడం లేదు. పిల్లలు, తల్లితండ్రులు కూడా ఈ మార్పులు అంగీకరించాలి తప్పదు. అలా అని పిల్లలను వదిలేయాల్సిన పని లేదు. బాధ్యతలు తగ్గించుకోవాలి. పెద్దవయసు వచ్చాక పిల్లల అండ ఉండాలంటారు. వయసు అనేది మన శరీరానికే వచ్చింది. కాని మనసుకు కాదు. అది మనం ఎలా ఉండాలని అనుకుంటే అలా ఉంటుంది. అలా మలుచుకోగలం కూడా. వయసు పెరిగి, శారీరకంగా అలసిపోయి ఇక మనమేం చేయలేము అనుకునేవారు ఎందరో. అలాగే ఇప్పుడు కొత్తగా ఏం చేస్తాంలే? ఇప్పుడు కొత్తగా నేర్చుకుని ఏం చేయాలి? అని అంటారు. కాని తీరిగ్గా కూర్చుని మనగురించి ఆలోచిస్తే ఎన్నో చేయగలం. అవి శారీరక శ్రమ కలిగించని పనులు కూడా ఉంటాయి. అందులో లలితకళలు, చదవడం, రాయడం, సహాయం చేయడం మొదలైనవి. కాలేజీ చదువులు, పోటీ పరీక్షలు, సంసార ప్రయాణంలో మనమే మర్చిపోయిన ఇష్టాలెన్నో.. వాటిని పునరిద్ధరించుకుని మళ్లీ మొదలుపెట్టడంలో తప్పు లేదు. ఇలా చేయడంవల్ల ఎవరో నవ్వుతారు, వెక్కిరిస్తారు అనుకోవడం వృధా. ఏడ్చేవాళ్లు ఎప్పుడూ ఏడుస్తారు. నవ్వేవాళ్ల నాపచేనే పండుతుంది .. తెలుసు కదా. మీకే తెలియని , మీకు ఇష్టమైన పనులు చేయండి. వీటికి ఖర్చు స్వల్పమే కాని దానివలన లభించే ఆనందం,సంతృప్తి అనంతం.


చాలామంది పిల్లల బాధ్యత తీరిపోయాక ఇక చేసేదేముంటుంది. రిటైరయ్యాము. ఇన్నేళ్లు కష్టపడ్డాం. అలసిపోయాం అనుకుంటారు. అలా అనుకుంటే జీవితం ఇంకా నిస్సారంగా మారుతుంది. అలసట అనేది శరీరానికే కలుగుతుంది. మనసు అలిసి, ముసలిదైంది అనుకోవడం పొరపాటు. తమకంటూ ఒక వ్యాపకం, జీవితం సృష్టించుకోవాలి. అది కుటుంబానికి అతీతంగా వెళ్లడం కాదు. వయసు పైబడగానే పూజలు, ఆధ్యాత్మిక విషయాలు చదవడం, మాట్లాడుకోవడం కాదు. తమకు ఇష్టమైన, చేయాలనుకుని చేయలేకపోయిన పనులు చేయాలి.

ఫలానా వయసులో అనుకోవడం వల్ల సగం నీరసం వచ్చెస్తుంది పెద్దవాళ్ళకి. ఏమయినా నేర్చుకోమంటే ఊళ్ళేలాలా ఉద్యోగాలు చేసి అంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండదు, ఆ... పెళ్ళయ్యి పిల్లలున్న నన్ను ఎవరు చూస్తారు అనే ఫీలింగు తెలీకుండానే చాలామంది ఆడవాళ్ళలో చొచ్చుకొచ్చి వాళ్లని వేరే ఆలోచించనివ్వదు.. సమాజం ఏమంటుందో అనే భావన చాలా మంది ప్రతిభని తొక్కి పెట్టెస్తుంది. ముసలి వయసు కన్నా ముసలి మనసు ప్రమాద కారి.… మనిషి బ్రతికుండగా చేయగలిగిన పనులు చేయడానికి వయసుతో నిమిత్తం లేదు. కొన్ని వయసు కు తగ్గట్లు వుండాలి కొన్ని ఎప్పటీకి మనసును నిత్య నూతనం గా వుంచుకుని ఆలోచించగలగాలి చెయ్యగలగాలి.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008