
భావవ్యక్తీకరణకు వేదికలు తెలుగు బ్లాగులు
సురుచి కలగూరగంప వీవెనుడి టెక్నిక్కులు సరిగమలు సాహితి మనస్వి గీతలహరి సత్యశోధన మోహనరాగం అక్షరం తూర్పూ పడమర తూలిక భవదీయుడు సత్యాన్వేషి చదువరి నైమిశారన్యం తెలుగుపద్యం రాత గీత మనసులో మాట శ్రీలలిత నాతో నేను నా గురించి నా స్పందన బాతాఖానీ, రేఖాచిత్రం తెలుగుకళ ప్రసీద మంచుపల్లకి కొత్తపల్లి మాయాశశిరేఖ వెన్నెల సంతకం ఏటిగట్టు జ్యోతి నైమిశారణ్యం మనసులో అంతర్వాహిని హృదయస్పందన చిరుసవ్వడి మెంతిబద్దలు సత్యప్రియ దిరిసెన పుష్పాలు కృష్ణప్రియ జాజిపూలు బ్లాగాడిస్తా నెమలికన్ను తెలుగోడు జానుతెనుగు సొగసులు కబుర్లు. ...
ఇవన్నీ తెలుగుబ్లాగుల పేర్లే...
శరవేగంతో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో మార్పులు తెచ్చింది. ఇంకా తీసుకొస్తుంది కూడా. ఈ రోజుల్లో టీవీ, ఫ్రిజ్ లా దాదాపు ప్రతీ ఇంట్లో కంప్యూటర్, ఇంటర్నెట్ తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు అది ఇంగ్లీషు భాష కోసమే కాక తెలుగు చదువులు, రాతలకు కూడా ఉపయోగింపబడుతుంది. రాయాలనుకునే వాడిని రచయితను చేస్తుంది ఈ బ్లాగు.. అసలు బ్లాగు అంటే ఏమిటి? అంతర్జాలంలో మనకంటూ ఒక అందమైన ఇల్లు కట్టుకుని, దానిని అన్ని హంగులతో అలంకరించి, మన భావవ్యక్తీకరణకు వేదిక చేసి పదిమందితో పంచునేదే బ్లాగు. అసలు బ్లాగు ఎందుకు రాయాలి? ప్రత్యేకంగా మనకంటూ ఒక బ్లాగు ఉండాలా? ఇంటి అడ్రస్సు లేదా ఉత్తరం రాయాలంటే ఓ మెయిల్ ఐడి ఉంటుంది చాలదా? మరి ఇదేంటి కొత్తగా?? అంటారా??..... కొత్త సినిమా చూసి వచ్చాం. అది పరమచెత్తగా ఉంది. ఆ చిత్ర నిర్మాత, దర్శకులు కనిపిస్తే చితక్కొట్టాలన్నంత కోపం, ఉక్రోషం కలుగుతుంది. సెలవుల్లో లెదా ఆఫీసులో ఓక మరచిపోలేని సంఘటన జరిగింది. నిత్యావసరాల ధరలు, అద్దె ఇంటి తిప్పలు, స్కూలు ఫీజులు, ఇలా ఎన్నో సమస్యలు. ఎన్నో ఆలోచనలు, మాటలు మనసులో తిరుగుతున్నాయి. ఎవరితోనైనా పంచుకుని చర్చించాలి. ఎలా? స్నేహితులను ప్రతీ విషయంలో డిస్టర్బ్ చేయలేము. ఐనా మనకు నచ్చిన , నచ్చని విషయాలపై మన స్నేహితులు కూడా మనలాగే స్పందిస్తారా? లేదు... అందుకే మన ఆలోచనలకు, భావనలకు ఒక అనువైన చోటు బ్లాగు. వెబ్లాగ్ అనే పదం తెలుగులో బ్లాగు గా స్థిరపడింది. ఇది మీ ఆంతరంగిక స్నేహితుడు లేదా స్నేహితురాలు అనుకోండి. మీరు ఏది చెప్పినా వింటుంది. మీరు తోచింది, చెప్పాలనుకున్నది, రాయాలనుకున్నది సులువుగా తెలుగులోనే రాయవచ్చు. మీ చిన్ననాటి జ్ఞాపకాలు, సంతోషాన్నిచ్చిన, బాధపెట్టిన సంఘటనలు, అలుపొచ్చేదాకా రాస్తూ పోవచ్చు. అవి చదివి వెంటనే స్పందించడానికి ఎంతోమంది సహృదయులైన పాఠకులు ఉన్నారు.
ఈనాడు వెయ్యికి పైగా తెలుగు బ్లాగులు ఉన్నాయి. కాని అందులో సుమారు వంద బ్లాగులలో మాత్రమే క్రమం తప్పకుండా రాస్తున్నారు. ఈ బ్లాగులలో కొన్ని ప్రత్యేక అంశాల మీద మాత్రమే వ్యాసాలు లేదా టపాలు కలిగి ఉంటాయి. అవి రాజకీయాలు, పద్యాలు, ఆధ్యాత్మికం, సినిమా,పాటలు, శాస్త్ర విజ్ఞానం, అల్లరి.... ఇలా ఎన్నో రాస్తుంటారు. మరి కొన్ని బ్లాగుల్లో తమకు తోచిన అంశాలు, లేదా మనసులో మెదలిన ఏదైనా సంఘటన, స్పందన, ఆవేశం, జ్ఞాపకాలు రాసుకుని చర్చిస్తారు, వాదిస్తారు.. బాధను పంచుకుని సేదతీరుతారు. చాలా మంది బ్లాగును తమ అంతరంగం లేదా హృదయభాను అని వ్యవహరిస్తారు. ఎంతోమంది బ్లాగు రచనల ద్వారా మంచి స్నేహితులను పొందారు. వారి మధ్య ఆత్మీయమైన అనుబంధం ఏర్పడింది. బ్లాగుల ద్వారా తమ రాతలను రచనలుగా చేసుకున్నవారెందరో. తాజా రాజకీయ సంక్షోభాలు, సంచలన వార్తలు , కొత్త సినిమా కబుర్లపై సమగ్రమైన చర్చలు కూడా బ్లాగుల ద్వారా జరుగుతుంటాయి. ఇక్కడ భావవ్యక్తీకరణకు, రచనలకు ఎటువంటి హద్దులు ఉండవు. నిజం చెప్పాలంటే బ్లాగు ఒక పత్రికలాంటింది. తమ ఆలోచనలను, రచనలను నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా తమ బ్లాగులో వెల్లడించే స్వాతంత్ర్యం ఆ రచయితకు ఉంటుంది. బ్లాగు రాతలు ఆ వ్యక్తి స్వభావం, ఆలోచనావిధానాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ బ్లాగులు రాసేవాళ్లందరూ సాంకేతిక నిపుణులు కారు. వీరిలో తెలుగు పండితులు, విశ్రాంత వ్యక్తులు, ఉద్యోగస్తులు,,విధ్యార్థులు, పత్రికా ప్రతినిధులు, రచయితలు , గృహిణులు ఉన్నారు. ప్రపంచంలోని వేర్వేరు దేశాలలో, అందనంత దూరంలో ఉన్నా, పరిచయం, చుట్టరికం లేకున్నా బ్లాగులోకంలో కలుసుకుని ముచ్చట్లాడుకుంటారు.
ఇతర భాషా బ్లాగుల్లో లాగా తెలుగు బ్లాగుల్లో ఉబుసుపోక చర్చలు, అనవసరపు గొడవలు ఎక్కువగా ఉండవు. అప్పుడప్పుడు వచ్చినా అవి తొందరగానే సమసిపోతాయి. వాస్తవ ప్రపంచం లాగే ఈ మిధ్యా ప్రపంచంలో కూడా మంచి, చెడు, అసూయా , ద్వేషం కనిపిస్తాయి. అది మనకు ఎంత అవసరమో ఏది అవసరమో అదే తీసుకుంటే సరి. బ్లాగింగులో అనే కాదు.. ఇంటర్నెట్ వాడే ప్రతీవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుక్షణం జాగరూకులై ఉండాలి. తెలుగు మీది అభిమానం, తమకు తెలిసిన విషయాన్ని పదుగురితో పంచుకోవాలనే ఆరాటం, తపన, తెలుగు రాయడానికి ఖర్చులేని ,సులువైన పద్ధతుల వల్ల ఎంతో మంది ఔత్సాహికులు, భాషాభిమానులు తెలుగులో బ్లాగులు మొదలెడుతున్నారు. ఆదాయం విషయంలో ఎటువంటి లాభం లేకున్నా సంతృప్తి విషయంలో మాత్రం ఈ తెలుగు బ్లాగర్లు చాలా లాభపడుతున్నారన్నది కాదనలేని సత్యం.
బ్లాగు మొదలుపెట్టి ,దాన్ని అందంగా అలంకరించి, అవసరమైన హంగులన్నీ చేర్చడం అంత కష్టమేమీ కాదు. ఈ క్రింది సైట్లలోకి వెళ్లి మీ బ్లాగును మొదలుపెట్టండి.
http://www.blogger.com
http://www.wordpress.com
http://www.blaagu.com
http://www. space.live.కామ్
బ్లాగులకు సంబంధించి అన్ని సమస్యలు, సందేహాలు చర్చించడానికి ఒక ప్రత్యేకమైన గూగుల్ గ్రూపు ఉంది.
https://groups.google.com/group/telugublog?hl=en
ఇక బ్లాగుకు సంబంధించిన అన్ని రకాల పాఠాలు ఇక్కడ లభిస్తాయి.
http://telugublogtutorial.blogspot.com
మరి ఆలస్యమెందుకు? మీ ఫోన్ నంబర్, సొంత ఇల్లులాగా అంతర్జాలంలో కూడా మీకంటూ ఒక బ్లాగ్ ఇల్లు కట్టుకోండి