ఇదేనా జీవితం? నవంబర్ 2010 కంప్యూటర్ ఎరా ఎడిటోరియల్
చిన్నప్పటినుండి మన లక్ష్యాలు చాలా చిన్నవి. చదువులో గొప్ప ర్యాంకులు, ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం, అర్ధం చేసుకునే లైఫ్ పార్ట్ నర్, పిల్లలు, సంసారం, సెలవుల్లో సినిమాలూ, సరదాలూ, మళ్లీ పిల్లల సెటిల్మెంట్, వారి పెళ్లిళ్లు, వృద్ధాప్యం, సాఫీగా సాగిపోతే చాలుననే భరోసా.... ఇవి ఉంటే చాలు జీవితం నెట్టుకురావడానికి! అంతకన్నా ఏ ఆలోచనా మనకు తట్టదు. ఇంచుమించు అందరి జీవితాలు అంతే... ఓ మూసలో సౌకర్యవంతంగా సాగిపోతూ ఉంటాయి. ప్రతీ క్షణం మనకు సామాజిక, ఆర్ధిక భద్రత ఉంటే చాలు. ఆ భద్రత సాధించడానికే మన జీవితం సృష్టించబడింది అన్నట్లు ఆ కొద్దిపాటి లక్ష్యాల కోసమే అమూల్యమైన జీవితాన్ని త్యాగం చేస్తుంటాం. చివరకు పిల్లలకూ అదే హితబోధ ... ఎంతో మందిని చూస్తుంటాను. అందరూ చెప్పేదొక్కటే.. ‘బాగా చదువుకో, బాగా సంపాదించు, లైఫ్లో సెటిల్ అవు '. అంతకన్నా జీవితం లేదా? ఒక మనిషి సాధించడానికీ, తనని తాను ఈ ప్రపంచంలో ఓ అద్భుతమైన శక్తిగా నిలబెట్టుకోవడానికి ఇంకేమీ ఉన్నతమైన లక్ష్యాలు లేవా? డబ్బూ, సామాజిక హోదా జీవిత పరమావధులు కావు. అవి మనకు సౌఖ్యాలు అందిస్తాయంతే. ప్రతీ మనిషిలోనూ నిగూఢంగా ఎన్నో శక్తియుక్తులు కేంద్రీకృతమై ఉంటాయి. ఎక్కడా ఎవరూ వాటిని తట్టిలేపడానికి ప్రయత్నించరు. స్టీరియోఫోనిక్గా జీవించమని ప్రబోధించేవారే గాని!
మనం గొప్పవాళ్ల పేర్లు చెప్పుకుంటూ ఉంటాం. వాళ్లు మాట్లాడిన మాటల్ని చిలకపలుకుల్లా వల్లె వేస్తుంటాం. వారంత గొప్పవారు ఎలా అయ్యారు? అసలు ఈ ప్రపంచంలో మన ఉనికిని నిలబెట్టుకోవడానికీ, 'యెస్.. నేను ఫలానా... నేను ఈ ప్రపంచానికి ది బెస్ట్ అందించగలుగుతున్నాను.. ఈ పనిని నేను తప్ప మరొకరు చెయ్యలేరు' అని ధీమాగా చెప్పుకోగలగడానికి మనకింకేమీ మార్గాలు లేవా? అస్సలు అందరితో పోల్చుకుంటూ, అందరికన్నా నాలుగు రాళ్లు ఎక్కువ సంపాదించడమో, కొద్దిగా ఎక్కువ పేరు తెచ్చుకోవడమో చేయగలిగితే చాలు అని సంతృప్తిపడగలుగుతున్నామంటే ఎంత అల్పసంతోషులమో అర్ధమవట్లేదూ? ఇంత చిన్న లక్ష్యాలకు ఇన్నేళ్ల జీవితం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఆర్ధిక, సామాజిక భరోసాలను చూసుకుంటూ, ఆస్థిపాస్థులను లెక్కించుకుంటూ జీవితం వెళ్లదీయడానికి మనం పుట్టింది సౌకర్యాలు అమర్చుకోవడానికీ, సౌఖ్యాలు అనుభవించడానికీ కాదు! సౌకర్యాలు, సౌఖ్యాలు మనదైన ప్రపంచాన్ని సృష్టించుకునే క్రమంలో మనకు భారం తగ్గించేందుకే తప్ప అవే జీవితం కాదు. వాటిని దక్కించుకోవడంతోనే జీవితాన్ని సరిపుచ్చుతున్నామంటే ఈ ప్రపంచంలొ మన బ్రతుకు మనం బ్రతికేసి ఎందుకూ కొరగాని జీవితాన్ని గడిపేసి వెళుతున్నామన్నమాట. అంతకన్నా మనం చేయడానికి చాలా ఉంది ఈ ప్రపంచంలో! అదేంటో కొంత మనసు పెట్టి ఆలోచించగలిగితే స్ఫురిస్తుంది. సామాజిక భద్రతను కాపాడుకుంటూనే ఈ ప్రపంచంలో మన ప్రత్యేకతను నిలబెట్టుకోవచ్చు. అంతేగాని సామాజిక భద్రత సాధన కోసమే జీవితం ధారపోయాల్సిన పనిలేదు. విజ్ఞులైన కొద్దిమంది పెద్దలైనా ఈ ప్రపంచానికి భవిష్యత్ తరాలనుండి ఏం కావాలో ఆలోచించగలిగి, వారికి స్టీరియోఫోనిక్ జీవితాల బదులు, ఆదర్శవంతమైన జీవనవిధానాన్ని, సందేశాన్ని బోధించగలిగితే చాలు. ప్రతీ వ్యక్తిలోని అద్భుత శక్తియుక్తులు మనం కళ్లారా చూస్తాం. ప్రపంచానికి మేలు జరుగుతుంది.
మీ నల్లమోతు శ్రీధర్






