Monday, 21 April 2008

ఎక్కడికీ ప్రస్థానం ??

పసి మొహాల్లో దోబూచులాడవలసిన ఆనాందాతిరేకాలు.. యువ హృదయాల్ని ఓలలాడించే భావోద్వేగ తరంగాలు.. అచ్చ తెలుగు ఆడపిల్ల మోములో మెదలాడాల్సిన ముగ్ధత్వం.. పరిపూర్ణతకు మారుపేరుగా నిలవ వలసిన మధ్య వయస్కుని హుందాతనం... జీవితపు ప్రతి మజిలీ సృశించామన్న ముదుసలుల సంతృప్తి... ఇంటి లోగిళ్ళలో విరబూయాల్సిన నవ్వుల పువ్వులు.. మనుషుల మనసుల్లో మూర్తీభవించాల్సిన మానవత్వం... పర్వదినాల్లో పరిఢమిల్లవలసిన భక్తిభావం... గృహస్థు చూపించాల్సిన ఆతిథ్యం... రాజకీయంలో నైతికత్వం... వైద్యుల్లో సేవాభావం... మన మోముపై మెదలాడవలసిన చిరునవ్వు... క్రమేపీ అన్ని అనుభూతులూ హరించుకుపోతున్నాయి. ప్లాస్టిక్ పువ్వులు, కృత్రిమ నవ్వులు... హంగులు, ఆర్భాటాలు.. డాబులూ, దర్పాలూ, మేకపోతు గాంభీర్యాలు, అపార్ధాలు, అహంకారాలు, ఆభిజాత్యాలు.. ఫాల్స్ ప్రిస్టేజీలు.. ఈర్ష్యలు.. స్వార్ధాలు.. సకల కల్మషాలూ మనసుల్ని ఆవరిస్తున్నాయి. యంత్రాల మధ్య యంత్రాల్లా పనిచేస్తున్నాం. మనం సృష్టించుకున్న డబ్బు చుట్టూనే పరిభ్రమిస్తున్నాం... అనుబంధాలూ.. ఆత్మీయతాలు నాలికపైనే నర్తిస్తున్నాయి తప్ప హృదయాంతరాళాల్లో జనించడంలేదు. ఎక్కడైనా మనసున్న మనుషులు ఉంటే వారిని చేతగానివారిగా హేళన చేస్తున్నాం. ఏ ప్రశాంత క్షణమైనా .. మది పొరల్లో ఒదిగిపోయిన జ్ఞాపకాల దొంతరల్లోకి తొంగి చూడండి. ఎన్ని చట్రాల మధ్య మనల్ని మనం ఇరికించుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నామో ? ఆ చట్రాల మధ్య నలిగేటప్పుడూ మనసు పడిన మూగవేదనని భౌతిక ప్రయోజనాల కోసం తొక్కి పెట్టుకున్నామో ? మనసుని ఇరుకు చేసుకుంటూ మనం కోల్పోయిన మధుర క్షణాల్ని సజీవంగా మళ్ళీ అనుభవించగలమా ? యాంత్రికమైన జీవితంలో యంత్రాలకు, మనకూ మధ్య ప్రత్యేకతని చాటడం ప్రస్తుత మన ఆలోచనా విధానంలో, జీవన సరళిలొ సాధ్యమా ? మస్తిష్కంలో ముద్ర వేసుకుపొయిన కృత్రిమపు విలువలు, ప్రాధాన్యతలు, హంగులను పారదోలగాలమా ? మనకు మనం అంతర్ముఖులమై ఓసారి మనసు పొరలకు చెదలు దులిపి విశ్లేషించి చూద్దామా .....!!

నల్లమోతు శ్రీధర్

5 వ్యాఖ్యలు:

Anonymous

ఇంతకీ ఈ జీవిత పరమార్ధం ఏమిటంటారు?
అది అన్వేషిద్దామా?
:)

Unknown

నెటిజన్ గారు, జీవిత పరమార్థాన్ని నిర్వచించగల పరిపక్వత నాకు లేదు. కేవలం మనం జీవితంలో ఎదగడం కోసం ఎన్నింటిని కోల్పోతున్నామో కదా అన్న ఆలోచన నుండి రాసినదీ ఎడిటోరియల్.

Anonymous

Priorities శ్రీధర్ గారు, priorities.
జీవితంలో ఏది ముఖ్యమో తెలుసుకో గలిగిననాడు, కోల్పోయేవి ఏవి ఉండవు. కావాలనుకున్నవే ఉంటాయి. ఈ రొజున మీకు కూడలి, బ్లాగులు, కంప్యుటర్ ఎరా ముఖ్యమైనవి. రేపు ఇవి కాకపోవచ్చు.

Unknown

నెటిజన్ గారు, ఇది ఎప్పుడో కొన్ని నెలల క్రితం కంప్యూటర్ ఎరా మేగజైన్ లో నేను నా స్వంత ఫీలింగ్స్ ని ఎడిటోరియల్ గా ప్రచురించుకున్న అంశం. దీని గురించి మరింత చర్చకు నేను సుముఖత వ్యక్తం చెయ్యలేను, దీనికి ప్రధాన కారణం.. నా పరిమిత ఆలోచనావిధానంలో నాకు కరెక్ట్ అన్పించినది మీకు కాకపోవచ్చు, వ్యక్తికీ వ్యక్తికీ అనుభవాలు, పరిస్థితులను బట్టి ఆలోచనాసరళిలో చాలా వైవిధ్యత ఉంటుంది. ఆ వైవిధ్యతను ఆధారంగా చేసుకుని ఒక విషయం గురించి అంతగా ఆలోచించడం, దాని గురించి పెద్దగా చర్చించడం నాకు మొదటి నుండి నచ్చని వ్యవహారం. నా భావాలను ఒక ఎడిటోరియల్ రూపంలో రాసుకున్నాను. దానిని జ్యోతి గారు బాగున్నాయి అని నా అనుమతితో తన బ్లాగులో ప్రచురించుకుంటున్నారు. అంతకుమించి నా పోస్టులను చర్చాగోష్టికి పెట్టడం నాకు ఇష్టం లేదు. నా వాస్తవ స్థితిని అర్థం చేసుకుని అన్యధా భావించవద్దని విన్నపం.

netizen నెటిజన్

ఇది మీ స్వవిషయం. చర్చించాలి అన్న ఉద్దేశ్యం ఏ మాత్రం లేదు.అది పూర్తిగా మీ ఇష్టం. దీన్ని పొడిగించాలన్న ఆలోచన ఏ మాత్రం

లేదు. దీనిని ఇంతటితో ఆపేద్దాం!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008