గడచిన రెండు సంవత్సరాలు నా జీవితంలో పెద్ద మలుపు తెచ్చాయి అని చెప్పొచ్చు. పిల్లలకోసం నెట్ కి వచ్చిన నేను నాకిష్టమైన తెలుగులో నా ఆలోచనలు, అభిరుచులను బ్లాగులుగా చేసి పెట్టుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కాని మొదటినుండి సరదాగా ఉండడం అలవాటు. నవ్వుతూ నవ్విస్తూ ఉండడమంటే నాకు ఇష్టం.
ఇంటర్‌నెట్ అంటెనే ఒక మాయాలోకం. అందులో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలీదు. అందునా ఆడవాళ్లు నెట్‌లో కనిపిస్తే వాళ్లని గురించి చాలా నీచంగా ఊహిస్తారు. ఆడపేరు కనిపిస్తేనే చాలు తింగరి వేషాలు. చాట్‌రూమ్స్ లో ఎక్కువ. చాలా గుంపులలో కూడా ఇదే తంతు. కాని నా అదృష్టవశాత్తు హైదరాబాద్ మస్తీ, తెలుగు బ్లాగ్ గుంపు దొరికాయి. బ్లాగు గుంపులో మాత్రం స్తీలంటే ఏంతో గౌరవం ఇచ్చారు, ఇస్తున్నారు కూడా.. నాకు మొదటినుండి సీరియస్సుగా ఉండడం చాతకాదు. గుంపులో తెగ అల్లరి చేస్తుంటే (అది కూడా తెలుగులోనే) సిబిరావుగారికి భలే కోపం వచ్చింది. నన్ను గుంపునుండి తీసేయమన్నారు కూడా కాని భోలాశంకరుడైన చావాకిరణ్ ఆపేసాడంట. చివరికి బ్లాగు గుంపుకు ఒక నియమావళి పెట్టేసారు (అది నా అల్లరి మహిమే అనుకుంటా). తప్పనిసరి గుంపులో తగ్గి బ్లాగు మొదలెట్టి అక్కడ రెచ్చిపోయాను. కాని మొదట్లో బ్లాగు గురించి ఏదీ తెలీదు. ఒక్కటొక్కటిగా నేర్చుకుంటూ వచ్చాను. ఇప్పటివాళ్లకంటె అన్ని సదుపాయాలు ఉన్నాయి. విహారి, తాడేపల్లిగారు, సాలభంజికలు, ఇలా చాలామంది ప్రముఖులు అప్పుడే బ్లాగులు మొదలెట్టారు. అంటే మేమందరం సహాధ్యాయులమన్నమాట. బ్లాగు మొదలెట్టిన ప్రారంభంలో రవి వైజాసత్య, శోధన సుధాకర్ , వీవెన్ సాంకేతికమైన విషయాలెన్నో ఓపికగా నేర్పించారు. అందుకే మొదటినెలలో తెలుగులో వంటలబ్లాగు మొదలెట్టాను. అలాగే మెల్లిగా పాటలు, ఆధ్యాత్మిక విషయాలు , ఇంగ్లీషులో వంటల బ్లాగు మొదలెట్టాను. నాకు నచ్చిన తెలుగులో నాకిష్టమైన విషయాలు రాసుకోవడమంటే తేలికే కదా.. మొదట్లో నాకు బ్లాగులో ఏమి రాయాలో, ఏమి రాయకూడదో భయంగా ఉండేది. ఏం గొడవలొస్తాయో అని. కాని రానారే చెప్పిన ఒక్కమాట " మీ బ్లాగుకు మీరు మహారాణి, మీ ఇష్టమున్నట్టు రాసుకోవచ్చు " నన్ను కాస్త డేరింగ్ చేసింది అని చెప్పొచ్చు. మొదట్లో వంటల కోసం బొమ్మలు నెట్‌లోనే దొరుకుతాయని తెలీదు. సో ఇంట్లోనే చేసి , ఫోటోలు తీసి పెట్టేదాన్ని. తర్వాత చేసిన పిండివంటలు తింటూ బ్లాగులు రాసుకునేదాన్ని అన్నమాట. భలే ఉంది కదా...
మొదట్లో బ్లాగులు చాలా తక్కువగా ఉండేవి. చిన్న కుటుంబంలా ఉండేది. అందరు బ్లాగర్లు మన కనుసన్నలలోనే చేతికందేలా ..ఉన్నట్టు ఉండేది. అప్పట్లో బ్లాగర్లందరూ సాంకేతికంగా నిపుణులే.. తమ తమ వృత్తులు, ప్రవృత్తులలో నిష్ణాతులే. నేనే ఏమి తెలీని మొద్దులా నాకు మనసులో తోచింది రాసుకుంటూ పోయేదాన్ని. లక్కీగా ఆ సరదా రచనలే అందరినీ మెప్పించాయి. అందుకే పొద్దు పత్రికలో సరదా శీర్షికని నిర్వహించమని ఆహ్వానించారు సంపాదకులు. నా శక్తి కొలది ప్రయత్నాలు చేసాను. కాని ఇంకా ఏదో నేర్చుకోవాలి. చేయాలి అన్న తపన నన్ను నిలువనీయలేదు. మావారు కూడా నన్ను ప్రోత్సహించేవారు. నాకు కావలసిన పుస్తకాలు , పాతల సిడీలు కొనిచ్చేవారు. నన్ను అందరు జ్యోతక్కా అంటారంటే జ్యోతక్క కాదు జ్యోతి పహల్వాన్ అని ఉడికించేవారు. ఎందుకంటే మన కథలన్నీ అలాగే ఉండేవి. నేను తప్పు కాదు అనుకున్నది చేసుకుంటూ పోవడమే. ఎవరేమనుకున్నా లెక్కచేయకుండా. అలాగే బ్లాగులో కూడా నా మీద అనవసరంగా ఆరోపణలు చేస్తే గొడవ పెట్టుకునేదన్ని. చీల్చి చెండాడేయడమే .. అందరేమో చాలా సున్నితంగా , మృదువుగా మాట్లాడేవారు. మనమేమో ఇలా!! ప్చ్..ఇప్పటికీ అంతే. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోగానీ పోవని ఊరకే అన్నారా పెద్దలు.
తన పత్రికలో వ్యాసం కోసం బ్లాగు గుంపులో కొచ్చిన నల్లమోతు శ్రీధర్ ని బ్లాగు మొదలెట్టేలా చేయడానికి అతనిని ఎంత బ్రెయిన్ వాష్ చేసానో ఎవ్వరికీ తెలీదు.. పాపం మొదట్లో అను, యూనికోడ్ .. రెండింటితో భలే తిప్పలు పడ్డాడు. సరే అని నెను సాయం చెస్తాను అన్నా. మరి సాంకేతిక విషయాలు బ్లాగులలో కూడా ఉండాలి కదా. కాని మొదటికే మోసం వచ్చింది. హాయిగా నా బ్లాగులు రాసుకుంటూ ఉన్న నన్ను తన పత్రికకి బ్లాగులు , వికీ మీద కవర్ స్టోరీ రాయమన్నాడు. అది కూడా కనీసం 30- 40 పేజీలు ఉండాలి. మంచి అవకాశం. వదలకూడదు. కాని ధైర్యం చాలలేదు. అంత సమాచారం ఎక్కడినుండి సేకరించాలో తెలీదు. మరికొందరు బ్లాగర్లను అడిగాను. చరసాల ప్రసాద్, నాగరాజుగారు, త్రివిక్రం, వీవెన్,.. వీరంతా నన్ను ప్రోత్సహించారు. మీరు రాయగలరు మొదలెట్టండి. అని కావలసిన వివరాలు ఎలా సేకరించాలో తెలియజేసారు. ఎలాగైతేనేమి వ్యాసం దిగ్విజయంగా పూర్తిచేసాను. స్కూలులో, కాలేజీలో తప్ప రాతలు అలవాటు లేని నేను బ్లాగు మొదలెట్టిన సంవత్సరంలోగా ఒక ప్రముఖ పత్రికలో కవర్ స్తోరి రాయగలిగాను అంటే నా తోటి బ్లాగర్లు, కుటుంబ సభ్యుల సహకారం ప్రోత్సాహమే కారణం. అదే నన్ను ఇప్పటిదాకా నడిపిస్తుంది.
వంద , ఐదువందలు, వెయ్యి, పదిహేనువందలు ఇలా అందరి ప్రోత్సాహముతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాను. కాని ఈ మధ్యే కాస్త బండి స్లో అయ్యింది. ఎందుకలా?? బ్లాగ్ వయసులో పెద్దరికం వచ్చిందా?? అదేమీ కాదేమో. కాస్త బద్ధకం ఎక్కువైంది. అప్పుడప్పుడు పత్రిక రచనలు కూడా ప్రయత్నిస్తున్నాను. ఇంతకు ముందు వంట, ఇల్లు సర్దుకోవడం, పిల్లలు, , టైం దొరికితే ఇరుగమ్మ పొరుగమ్మలతో సొల్లు కబుర్లు, ఫోన్లో ముచ్చట్లు, లేదా అర్ధరాత్రివరకు చెత్త సీరియళ్లు . ఇవీ నా దైనందిన కార్యక్రమాలు. అవన్నీ మానుకోవడానికి నేను బ్లాగింగ్ మొదలెట్టాను.నా ఖాళీ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాను అని సంతోషంగా ఉంది. కాని ఈ బ్లాగుల వల్ల నా ఆలోచనా శక్తి పెరిగింది. ఏ విషయమైనా అప్పటికప్పుడే చూసి వదిలేయకుండా , దాని గురించి విశ్లేషించడం అలవాటుగా మారింది. దానిని రాతలో పెట్టి బ్లాగేయడం. ఇంతకుముందైతే ఏ విషయమైనా మాట్లాడటానికి ఎవరూ ఉండేవాళ్లు కాదు. కాని బ్లాగులలో ఐతే నాలా ఆలోచించే, నా రచనలు విశ్లేషించే వాళ్లు ఎంతో మంది. తప్పులుంటే సరిదిద్దేవాళ్లు . దాని వలన నాకంటూ ఒక శైలి ఏర్పరుచుకోగలిగాను.
నాకు స్నేహితులు అంటూ ఎవరూ లేరు అని ఎంతో బాధపడుతుండేదాన్ని. కాని ఈ బ్లాగులవల్ల ఎంతో మంది ప్రముఖులు నాకు ఆత్మీయ స్నేహితులు అయ్యారు. నాకంటూ ఒక గుర్తింపు, గౌరవం లభించాయి. ఈ బ్లాగులవల్ల నాకంటే ఎక్కువ ఉపయోగం పొందిన వాళ్లు ఎవరూ లేరేమో ఇప్పటిదాకా. కాని నాకు బ్లాగింగ్ ఒక వ్యాపకమే కాని ఎప్పటికీ వ్యసనం కానివ్వలేదు నా తీరిక సమయంలోనే బ్లాగులు రాస్తున్నాను. నిజానికి ఒక చిన్న కుటుంబంలా ఉన్న ఈ బ్లాగ్లోకం ఇప్పుడు ఒక విశాల ప్రపంచం అయ్యింది అనొచ్చు. కాని నాకైతే ఒక కుటుంబంలా అనిపిస్తుంది. ఎందరో బ్లాగర్లతో నాకు ఆత్మీయ సంబంధం ఏర్పడింది. అంతా ఒక కుటుంబం లా ఉంటాం. ఈ విషయం చాలా మందికి తలకెక్కదు. పెడర్ధాలు తీస్తారు. అందుకే చాలా రోజులుగా కాస్త మౌనంగానే ఉంటున్నాను. ఈ బ్లాగుల వల్ల నాకు ఎన్నో విషయాలు అవగతమైనాయి. ముఖ్యంగా మనుష్యుల ప్రవర్తన.
కాని ఈ రెండేళ్లు చాలా సరదాగా గడిచిపోయింది. ఎదో చదివేసాము అన్నట్టు కాకుండా ఎన్నో టపాల మూలంగా నాకు తెలీని ఎన్నో విశేషాలు తెలిపాయి. కాదేదీ కవితకనర్హం అన్నట్టు కాదేదీ బ్లాగడానికి అనర్హం అన్నట్టుగా ఉంది. పాటలు, ఆటలు, సంగీతం, కవితలు, పద్యాలు, వంటలు, ఘాటైన చర్చలు, రాజకీయాలు, సినిమాలు, ఇలా ప్రతి విషయంలో నిత్యమూ చర్చలే. బ్లాగడం వల్ల లాభం డబ్బు రూపేనా కాదుగాని అంతకంటే విలువైన అనుబంధం ఏర్పడింది తెలుగు బ్లాగర్లలో . ఇది నిజం అని ఎంతో మంది ఒప్పుకుంటారు. ఇక్కడున్నవాళ్లంతా ఒకే ఉమ్మడి కుటుంబంలా అనిపిస్తుంది. అప్పుడప్పుడు అలకలు, కోపాలు, తాపాలు. బుజ్జగింపులు. ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్లని మిగతావారు ఉతికేయడం సర్వసాధారణమైపోయింది. అక్కడక్కడా ఈర్ష్యాసూయలు కనిపిస్తాయి కాని అంతగా పట్టించుకోరు ఎవ్వరూ. వేల మైళ్ల దూరంలో ఉన్నా కూడా చాలామంది చేతికందే దూరంలోనే ఒకరికొకరు అందుబాటులో ఉన్నారు. అందరూ ఉన్నది ఒకే తెలుగు బ్లాగ్‌లోకంలో అని భావిస్తున్నారు. కాదంటారా?? తమ తమ వృత్తులలో, ప్రవృత్తులలో ఎంత బిజీగా ఉన్నా ఈ చిన్ని ప్రపంచంలో అందరిని పలకరిస్తూనే ఉంటారు??
ఎవ్వరితో ఎక్కువగా కలవని నాకు ఈ రోజు ,,, నన్ను ప్రేమించే, గౌరవించే , ప్రోత్సహించే ఆత్మీయ స్నేహితులు ఈ బ్లాగ్ ప్రపంచం ఇచ్చింది. ఈ అదృష్టం నాకు దక్కినందుకు ఎంతో గర్వంగా ఉంది.. ఎప్పుడైనా దిగులుగా, దిగాలుగా, బోర్‍గా అనిపించినపుడు నా బ్లాగులోని పాత టపాలు, కామెంట్లు తీసి చదువుకుంటాను. అదో తుత్తి. కాని ఖచ్చితంగా అప్పటి జ్ఞాపకాలు మళ్లీ కళ్ల ముందు కదలాడుతాయి. కామెంటినవారందరు కనిపిస్తారు. ..
ఇదే నా బ్లాగ్ ప్రయాణం విశేషాలు. అనుభవాలు, మధురమైన అనుభూతులు.. మార్చుకోలేని అభిప్రాయాలు..
మరో ముఖ్య విషయం.. నేను మరో కొత్త బ్లాగు మొదలెట్టాను. ఫోటొబ్లాగు.. చైత్రరధం.. రాతలు అయ్యాయి. ఇక చిత్రాల మీద దాడి. ( ఈ మధ్యే కెమెరా కొన్నాలెండి. అదీ బడాయి.)