Saturday, 31 January 2009

ఆడాళ్ళూ మీకు జోహార్లు



నా స్నేహితుడు ఈ మధ్య పరిశోధన చేసి పి.హెచ్.డి. తీసుకున్నాడని తెలిసి అతనిని కలిసా. అతను అ.భా.భా.బా. సంఘం సెక్రటరీ అంట, మన విహారి లాగా. అతను తీసుకున్న విషయం ఏంటంటే “భార్యామణులతో బాధలు”. అతని ప్రొఫెసర్ కూడా బాధితుడే కాబట్టి రెండు నెలల్లో డాక్టరేట్ పుచ్చుకున్నాడు. అతని పరిశోధనలో రాసిన కొన్ని విషయాలు నిజమే అనిపించింది. అవి ఇక్కడ ఇస్తున్నాను. ఈ ప్రశ్నలకు వాళ్ళు ఎవో సమాధానాలతో తమను తాము సర్దిచెప్పుకున్నారు. నేను మన పాఠకులు ఏమంటారో అని ప్రశ్నలుగానే ఇచ్చా. మగాళ్ళందరూ ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నందుకు ఇది చదివి గంతులెయ్యండి. పండగ చేసుకోండి.


*. ఆడవాళ్ళు కొంటె పని చేస్తే సరదాగా చేసారంటారు. అదే మగవారు చేస్తే ఏదో ఉందనే అంటారు . ఈ భేదం ఎందుకు?


*. జుట్టును కొత్త స్టయిల్‍లో వేసుకున్నారు. సరే. ఇంకా అద్దంలో అటూ ఇటూ చూడటమెందుకు?


*. పెళ్ళిలో ఒకసారి వేసుకున్న డ్రెస్ ఇంకొకళ్ళ పెళ్ళిలో ఎందుకు వేసుకోరు?


*. బీరువానిండా బట్టలున్నాయి. అయినా ఏదీ కట్టుకోవడానికి మనసొప్పదు. ఎందుచేత?


*. శాస్త్రీయ సంగీతం, మోడర్న్ ఆర్ట్స్ గురించి తెలియనప్పటికీ ‘వాహ్వా, వాహ్వా’ అనడం ఎందుకు?


*. ఇంట్లో ఎన్నో బకెట్లున్నా, ఫ్రీగా దొరికే బకెట్ లేదన్న బాధ ఎందుకు?


*. పర్సులో పెట్టుకోవడానికి ఏమీ లేకపోయినా భుజానికి తగిలించుకుని వెళ్ళడం ఎందుకు?


*. చక్కగా తయారై ఇంటి నుంచి బయటికి వెళ్ళేముందు అత్తతో ” అత్తయ్యా ! మా అమ్మదగ్గరికి వెళ్ళి రానా?” అని కోడలు ఎందుకు అడుగుతుంది?


*. “ఏవండి! నేను చాలా రోజులుగా పుట్టింటికి వెళ్ళడం లేదని అందరూ అడుగుతున్నారు. నేనేం చెయ్యను?” అని భార్య ఎందుకు అడుగుతుంది?


*. పాలగిన్నెలో పాలు తీసి మిగిలిన మీగడను కూడా ఎందుకు తీస్తుంది?


*. రోడ్డుపై నడిచేటప్పుడు భర్త చేయి ఎందుకు పట్టుకుంటుంది? చేయి పట్టుకుని కూడా అడుగులో అడుగేస్తూ ఎందుకు నడుస్తుంది?


*. ఆడవాళ్ళ అలవాట్లు గురించి అడిగినప్పుడు కానీ, ‘ఆంటీ ‘ అని పిలిచినప్పుడు కానీ ఎందుకు కోప్పడుతుంది?


*. వేడి వేడి టీ తీసుకుని, చల్లారాక తాగుతుంది. ఇలా ఎందుకు చేస్తుంది?


*. తాను అందంగా ఉన్నానన్న విషయం రోజూ వినాలని ఎందుకనుకుంటుంది?


*. వంట చేసిన ప్రతిసారీ ‘ఎలా ఉంది?’ అని ఎందుకు అడుగుతుంది?


*. నాలుగు నెలలపాటు కప్‍బోర్డును సామాన్లతో నింపుతుంది. ఆ తరువాత అవన్నీ పాత సామాన్లవాడికి వచ్చిన ధరకు అమ్మేస్తుంది. ఇలా ఎందుకు చేస్తుంది?


*. దీపావళి వస్తుందనగానే ఇంటిలోని ప్రతిమూల, గోడలు, బూజులు అన్నీ శుభ్రం చేస్తుంది. ప్రతీ రోజూ శుభ్రం చేయవద్దని ఎవరైనా చెప్పారా?


*. ఇంట్లో పిల్లలని ఎత్తుకుంటుంది. మార్కెట్‍కుగానీ, రోడ్డుపైకి వెళ్ళినప్పుడుగానీ భర్త చేతికి పిల్లలను ఎందుకు ఇస్తుంది?


*. పాలను మరిగించడానికి పొయ్యి మీద గిన్నెను పెట్టి అక్కడే నిలబడి, తీరా పాలు మరుగుతున్నప్పుడు వేరే పని ఎందుకు చేస్తుంది?


*. మాటి మాటికి అద్దంలో మొహం చూసుకోవడమెందుకు? మొహం మారిపోయిందనా ?


*. పుట్టింటివాళ్ళు రాగానే కూరలు ఎందుకు బాగా రుచిగా వండుతారు? అన్నం ఎందుకు మాడిపోదు ?


*. మాట్లాడకుండా కూర్చుంటే మాట్లాడమని అంటుంది. మాట్లాడుతుంటే నోరు మూసుకోమంటుంది . ఎక్కువగా కోప్పడితే కోపం తెచ్చుకుంటుంది. ఎక్కువగా ప్రేమిస్తే అనుమానిస్తుంది . ఎందుకు?


*. పొరుగింటివాడిని గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతుండగా చూసి, భర్తపై ఓ కన్నేసి ఉంచడంలోని అర్ధం ఏమిటి?


*. తన భర్త పేరు చెప్పి బయట అందరిని భయపెడుతూ ఆ భర్తనే ఇంట్లో భయపెట్టడం ఎందుకు?


*. భర్త జీతం మాత్రం మొత్తం కావాలి. పనిని మాత్రం కుటుంబంలో అందరూ పంచుకోవాలి . ఎందుకు?


గతంలో పొద్దులో ప్రచురింపబడింది.. మళ్ళీ మీకోసం..

Friday, 30 January 2009

అదేంటోగాని....




అదేంటో గాని తెలుగు సినిమాలలో దర్శకుని పేరు ఆఖరున వేస్తారు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో సర్వసాధరణంగా విలన్ కూతుర్నే ప్రేమిస్తాడు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరోయిన్ ప్రమాదంలో ఉండగా ఎక్కడినుంచి
ఊడిపడతాడో తెలీదు కాని హీరో వచ్చేస్తాడు, ఫైట్స్ చేసేస్తాడు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో చెల్లెలే రేప్ కు గురవుతుంది.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో మారు వేషం వేస్తే మనకందరికి
తెలుస్తుంది కాని సిన్మాలో విలన్ గ్యాంగు వాళ్ళకు అస్సలు తెలీదు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో బాల నటులు అన్నీ ముదురు మాటలే మాట్లాడతారు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో లెక్చరర్లు, ప్రిన్సిపాల్, పంతుళ్ళు మరీ జోకర్లలాగా
ప్రవర్తిస్తుంటారు. పిల్లలకు భయపడుతుంటారు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో రిక్షావాడైనా రీబోక్ షూస్ మాత్రమే వేసుకుంటాడు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో హీరోయిన్లు ఎంత పేదవారైనా టక్కున
అమెరికా, ఆస్టేలియా వెళ్ళి పాటలు పాడేసుకుంటారు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో కాని హీరోయిన్ తల్లి ఇంట్లో మందులకు
కూడా డబ్బులుండవు కాని రెండువేలకు తక్కువ కాని జరీ చీర మాత్రమే కట్టుకుంటారు.

అదేంటోగాని హీరో ఎంత ఫైటింగ్ చేసినా షర్టు కాలర్ కూడా నలగదు.

అదేంటొగాని టీవీ సీరియల్లో ఆడాళ్లు ఎప్పుడూ ఎంబ్రాయడరీ చీరలే కట్టుకుంటారు.

అదేంటోగాని అత్త మీద చాడీలు చెప్పే కోడలు, తను అత్త అయ్యాక అన్నీ మర్చిపోతుంది.

అదేంటోగాని నాయకులు రొజూ మడత నలగని బట్టలేసుకుని బీదవాళ్ల కష్టాలు చూసి బాధపడతారు.

అదేంటోగాని అసెంబ్లీలో బండబూతులు తిట్టుకుంటారు . బయట పార్టీలలో మాత్రం నవ్వుకుంటూ చేతులు కలుపుకుంటారు.

అదేంటోగాని ఎంత హోటల్ ఓనర్ ఐనా, ఇంటికెళ్లి పప్పన్నమే తింటాడు.

అదేంటోగాని ఆడాళ్లు మొగుడికంటే పనిమనిషికి ఎక్కువ మస్కా కొడతారు.

అదేంటోగాని చాలా మంది అందంగా ఉంటారు , కాని వాళ్ల ఆలోచనలు చండాలంగా ఉంటాయి.

Thursday, 29 January 2009

పి.ఎస్.ఎం.లక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు

అంతరంగ తరంగాలలో ఆలోచనలు , యాత్రలో తన యాత్రానుభవాలు పంచుకునే లక్ష్మిగారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.. మేము తలపండినవారము కాము, తలపడేవారం అని మాకు సవాలు విసిరే లక్ష్మిగారు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని...




నా తరఫున మీకు చిన్న కానుక..

Get this widget | Track details | eSnips Social DNA

Tuesday, 27 January 2009

నటనం ఆడెనే....

ముందుగా కొత్తపాళీగారికి ధన్యవాదాలు. వారి మీసం కథతొ నా చిన్నప్పటి నాటకాలు, ప్రోగ్రాములు, మేకప్పులు గుర్తొచ్చాయి..

మొదటినుండి నేను ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. స్కూలు, ఇల్లు, చదువు అంతే నాకు తెలిసింది. నా మానాన నేను బుద్ధిగా చదువుకుంటుంటే , నా ఎత్తు నన్ను చిక్కుల్లో పడేసేది. క్లాసులో, లైన్లో వెనకాల ఉన్నా. ఏవైనా ప్రోగ్రాములు , డ్యాన్సులు గట్రా ఉంటే మాత్రం ముందు కనిపించేదాన్ని. అలాంటి సంధర్భాల్లో బెంచిలో ఎంత నక్కి కూర్చున్నా సరే తప్పించుకునే వీల్లేకుండా అయ్యేది. హాయిగా నీడపట్టున క్లాసులో ఉందామనుకుంటే ప్రాక్టీస్ అని లాక్కుపోయేవారు.


ఎనిమిదవ తరగతిలో ఒకసారి క్రిస్ట్ మస్ సందర్భంగా ప్రోగ్రాములు పెట్టారు. మాది కాన్వెంట్ కదా. సిస్టర్స్ ఉండేవాళ్లు. అందులో మా ప్రిన్సిపల్ ఒక చండశాసనురాలు. పోలీస్ ఆఫిసర్‌నైనా అందరిముందు దులిపేసేది. మాకైతే ఆమె ముందు కెళ్లాలంటేనే కాళ్లు వణికేవి. ఇక పెద్ద క్లాసులలోకొచ్చి పిల్లలను అలా ఏరుకుని తీసికెళ్లేవారు ప్రోగ్రామ్ ..ఈ ప్రోగ్రామ్ అని. ఇలాంటివి వస్తే కాస్త చదువుకు ఆటవిడుపుగానే ఉంటుంది కాని నాకే కాస్త చిరాకు. మేరీ మాగ్దలీన్ అనే వైశ్య కథను నృత్య నాటికగా వేసారు. నన్ను కూడా సెలెక్ట్ చేసారు. నాకేమో నాటకాలు రావు. ఏదో ఆటలు అంటే ఆడతాను కాని. మాట్లాడేది ఏమీ ఉండదు అని నన్ను ఒప్పించారు మా టీచర్. సరే కదా అని ప్రాక్టీసుకు వెళ్లేదాన్ని. నేను ఏసు ప్రక్కనే కూర్చోవాలి. ఒక్కో సీను రెండు మూడు సార్లు చేస్తుంటే చిరాకేసి , హే తొందరగా చెప్పు అని అరిచా.. అందరూ నవ్వారు. అసలు రోజు వచ్చింది. ఇంటినుండి చారలు కాని, గళ్లు కాని ఉన్న చీర తెచ్చుకోమన్నారు . పిసినారోళ్లు. డ్రెస్సులు ఇస్తే ఏం పోయేది అని తిట్టుకున్నాం.. అదేమో ఏసు క్రీస్తు సమయం నాటి వేషధారణ. సరే అని అమ్మ చీర, ఐ్‌బ్రో పెన్సిల్, పౌడర్, కాటుక దువ్వెన గట్రా తీసికెళ్లాను. ఇంట్లోవాళ్లను సాయంత్రం స్కూలుకు వచ్చేయమని నేను పొద్దున్నే వెళ్లిపోయా.. కడుపులో ఒకటే గుడుగుడు .. భయంతో, టెన్షన్ తో.. ముందేమో డైలాగులు లేవన్నారు కాని. నృత్యనాటిక కాబట్టి వెనకాల చెప్పే ఒకే డైలాగుకు కాస్త పెదవులు కదిపితే చాలు అన్నారు. అదో టెన్షన్. వానపడితే బాగుండు అనుకున్నా. డిసెంబర్‌లో పడవనే ఆలోచన కూడా రాలేదు.


ఇక మొహాలు కడుక్కుని తయారవుతుంటే మేకప్పు చేస్తారని తెలిసింది. వింత వింతగా ఉండింది. మొదటిసారి మొహానికి క్రీములు ఏవేవో పూస్తుంటే చల్లగా, చక్కిలిగిలిగా అనిపించింది. అందరం నవ్వాపుకోలేకపోయాం. మాదంతా అమ్మాయిల స్కూలు. ఇక నవ్వులకేం కొదవ. మేకప్పు ఐపోయింది. మీసాలు పెడతామన్నారు. కాటుకతో మేమే పెట్టుకోవచ్చు అని కొత్త డబ్బా తెచ్చుకున్నా. అది తుడుచుకోవడానికి ఒక గుడ్డ కూడ తెచ్చుకున్నా.. కాని మేకప్పు వాళ్లే ఏదో రంగు పూసారు లైట్ గా మీసాలు దిద్దారు. మాకైతే సత్యనారాయనవ్రతం రోజు పీటకు అలంకరించినట్టు అనిపించింది. తప్పదు కదా. అమ్మావాళ్లు, తమ్ముళ్లు వచ్చి నవ్వేసి వెళ్లిపోయారు. చీకటిపడ్డాక ప్రోగ్రాంస్ మొదలయ్యాయి. నాటిక పూర్తయ్యేవరకు నాకు ఒకటే భయం. అతి కష్టం మీద నా డైలాగ్ పూర్తి చేసా.(అదే ఊరికే పెదవులు కదిపా) మొహంలో కాస్త ఎక్స ప్రెషన్ ఇచ్చానో లేదో గుర్తులేదు. ఐనా చీకట్లో ఎవరు చూడొచ్చారులే అంత సూక్ష్మంగా అన్న చిన్న ధైర్యం కూడ ఉండింది. నాటిక ఐపోయి స్టేజీ దిగగానే ముందు చేసిన పని మొహం కడుక్కోవడం. ఏదొ మొహానికి అంటుకున్నట్టుగా ఉండింది.



ఇదే నాటిక మరోసారి, ఒక అబ్బాయిల స్కూలులో వేయాల్సి వచ్చింది. ఒకసారి చేసిన అనుభవం కదా. కాస్త ధైర్యం కలిగింది. ఇక అబ్బాయిలు అంటే .. సాయంత్రం ప్రోగ్రామ్స్ ఐతే మద్యాహ్నం వరకు అక్కడికి చేరుకున్నాం మా గ్యాంగ్ అంతా. మాకు నాలుగైదు క్లాసు రూములు ఇచ్చారు. ఇక అబ్బాయిలు ఎప్పుడూ చుట్టుపక్కలే తిరిగేవాళ్లు .. అప్పుడప్పుడు వచ్చి ఏమైనా కావాలా అంటూ .. మేము ఊరుకుంటామా. ఆకలేస్తుంది. తినడానికి కావాలి, టీలు కావాలి అని తెగ తిప్పించాం. ఎలాగోలా ప్రోగ్రాం అయ్యిందనిపించి ఇంటికి చేరేసరికి 7 అయ్యింది. ఇప్పట్లా అప్పుడు భయం లేకుండింది. ఆటోలు లేవు. బస్సులు రూట్ తెలీదు. రిక్షా మాట్లాడుకుని నేనే భయపడుతూ వచ్చా కాని మా అమ్మా హాయిగా వంట చేసుకుంటూ ఉంది.. ఫోన్లు కూడా లేని రోజులు.. నేను ఇప్పటికీ అడుగుతుంటాను. నువ్వేంటి అంత రాత్రైనా భయపడలేదు అని. అప్పట్లో అలా ఉంది మరి అంటుంది అమ్మ. కాని కొన్ని అనుభవాలు జీవితాంతం మరిచిపోలేము..

Monday, 26 January 2009

దోసేలమ్మ దోసెలు ....

నిన్నటి ఆంధ్రజ్యోతి నవ్య విభాగంలోనే వచ్చిన వ్యాసం. ఇది చూసి మగమహారాజులు నన్ను తిట్టుకోకూడదు. ఇలా వెరయిటీలు చూపించి చంపేస్తున్నారు అని. మీకు ఓపికుంటే చేసుకోండి హాయిగా. లేదా మీ ఆవిడను కాస్త మస్కా కొట్టి చేయించుకోండి. కాని మీరు సాయం చేయాలిసిందే తనకు. ఇవన్ని మాకు దొరకవే అనుకోకుండా. మీ ఊర్లో ఉన్నా ఇండియన్ స్టోర్స్ లో ప్రయత్నించండి. ఇక అలాంటి దుకాణాలు లేవు అంటే తూర్పు లేదా పడమర ఎటైనా తిరిగి దండం పెట్టండి. వేరే దారి లేదు. :)



మన దేశంలో దోసెలను ఒకో ప్రాంతంలో ఒకోలా తయారుచేస్తారు. ఎలా తయారు చేసినా రుచి మాత్రం అమోఘం. అద్వితీయం. కాకా హోటళ్లనుంచి కార్పొరేట్ హోటళ్లదాకా తిరుగులేని వివిధ దోసెల తయారీ విధానాలు మీకోసం..

గోల్డెన్ దోసె
బియ్యం: నాలుగు కప్పులు,
మెంతులు: అర స్పూన్,
పెసర పప్పు: అర కప్పు,
మినపప్పు: కప్పు,
శనగపప్పు: అర కప్పు. పప్పులు, బియ్యం కలిపి కడిగి మెంతులు వేసి కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి.
తరువాత మెత్తగా రుబ్బి ఎనిమిది గంటలన్నా అలా ఉంచాలి. తగినంత ఉప్పు వేసి కలిపి పలుచగా దోసెలు వేయాలి. కరకరలాడే దోసెలు రెడీ...


రాగి దోసె

రాగి పిండి: అర కేజీ,
ఉల్లిపాయలు: రెండు,
పచ్చి మిరపకాయలు: మూడు,
పుల్లపెరుగు: పావుకేజీ,
మినపప్పు: 100గ్రా,
ఉప్పు: తగినంత,
నూనె: అర కప్పు
రాగిపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిరపకాయ ముక్కలు, మినపప్పు, ఉప్పు పుల్లపెరుగు కలిపి దాదదాపు నాలుగైదు గంటలు నాన నివ్వాలి. గరిట జారుగా కలుపుకోవాలి. వేడి పెనంపై దోసెలు వేసుకుని పైన వెన్న, చిన్న బెల్లం ముక్క పెట్టి సర్వ్ చేస్తే బాగుంటుంది. చట్నీ సాంబారుతో తీసుకోవచ్చు.


తీపి దోసె

గోదుమ పిండి: నాలుగు కప్పులు, బియ్యపు పిండి: కప్పు, బెల్లం: రెండు కప్పులు, తాజా కొబ్బరి తురుము: అర కప్పు, యాలకుల పొడి: స్పూన్, నెయ్యి: అర కప్పు. బియ్యం పిండి గోధుమ పిండిని బాగా కలిపి ఉంచుకోవాలి, బెల్లాన్ని నాలుగు కప్పుల నీటిలో వేసి వేడి చేయాలి.కాస్త చల్లారాక అందులో పిండి మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇందులో తురిమిన కొబ్బరి, యాలకుల పొడి వేసి బాగా కలియబెట్టాలి. పెనంపై నెయ్యి వేసి దోసెలు వేసుకుని వేడివేడిగా తినాలి. పిల్లలకు ఈ దోసెలతో జాం కలిపి ఇస్తే ఇష్టంగా తింటారు.






గోధుమ రవ్వ- మైదా దోసె
గోధుమ రవ్వ: రెండు కప్పులు, మైదా: రెండు కప్పులు, బియ్యపు పిండి: అరకప్పు, ఉల్లిపాయ: ఒకటి, పచ్చి మిర్చి: మూడు, పుల్లటి పెరుగు: ఒక కప్పు, ఉప్పు: తగినంత, కొత్తిమిర: రెండు స్పూన్లు. గోధుమ రవ్వ, మైదాలను నాలుగు కప్పుల నీటిలో కలిపి రెండు గంటలపాటు నాన బెట్టాలి.తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమిర పచ్చి మిర్చి పెరుగు, ఉప్పు వేసి బాగా కలియ బెట్టాలి. పెనంపై దోసెలు పోసుకుని టమాటో సాస్‌తో వడ్డిస్తే చాలా బాగుంటుంది.


పేపర్ దోసె
మినపప్పు: అర కప్పు, బియ్యం: నాలుగు కప్పులు, ఉప్పు: తగినంత, జీలకర్ర: స్పూన్, నూనె: అర కప్పు. మినపప్పు, బియ్యాన్ని విడివిడిగా ఆరుగంటల పాటు నానబెట్టాలి. తరువాత విడిగానే మెత్తగా రుబ్బుకుని మరీ పలుచగా కాకుండా చేసుకుని రెండు మిశ్రమాలను బాగా కలిపి తగినంత ఉప్పు వేసి రాత్రంతా వుంచాలి. జీలకర్రను ముద్దగా చేసి రాత్రంతా నానిన మిశ్రమానికి కలిపి వేడి పెనంపై పేపర్‌లా పలుచగా దోసెలను వేసుకుని సన్నని సెగపై బంగారు రంగు వచ్చే వరకు కాల్చి చట్నీ, సాంబార్‌తో వడ్డిస్తే రుచిగా ఉంటుంది.


ఎగ్ దోసె

మినపప్పు: కప్పు,
బియ్యం: మూడు కప్పులు,
మెంతులు: టీస్పూన్,
మిరయాల పొడి: మూడు స్పూన్‌లు.
గ్రుడ్లు: మూడు, నూనె:
అర కప్పు. బియ్యం,
పప్పు, మెంతులు కలిపి ఆరుగంటలపాటు నాన బెట్టి మెత్తగా రుబ్బి ఉప్పు కలిపి రాత్రంతా ఉంచాలి.గ్రుడ్లు ఉప్పు కలిపి బాగా గిలక్కొట్టి ఉంచుకోవాలి. లేదా అలానే కొట్టి వేసుకోవచ్చు. వేడి పెనంపై దోసెవేసుకుని దానిపై గుడ్డు కొట్టి లేదా గిలక్కొట్టిన మిశ్రమం వేసి నిదానంగా కాలనివ్వాలి. పైన చిటికెడు మిరియాల పొడి చల్లి రెండో వైపు కూడా ఎర్రగా కాల్చి తినాలి.


సెట్ దోసె
మినపప్పు: ఒక కప్పు,
బియ్యం: మూడున్నర కప్పులు,
అటుకులు: అర కప్పు,
ఉప్పు: తగినంత,
కరివేపాకు: రెండు రెబ్బలు,
నూనె: అర కప్పు
మినపప్పు బియ్యం అటుకులు కలిపి ఆరుగంటలు నాన బెట్టాలి. తరువాత మెత్తగా రుబ్బి తగినంత ఉప్పు కలిపి చిన్న పరిమాణంలో కాస్త మందంగా దోసెలు చేసుకుని పైన తరిగిన కరివేపాకు వేసి కొబ్బరి చట్నీ, ఖుర్మాతో వడ్డించాలి. ఈ దోసెలకు కాస్త నూనె ఎక్కువగా ఉంటేనే బావుంటుంది.


మైసూర్ మసాలా దోసె

మినపప్పు: రెండు కప్పులు,
శనగ పప్పు: రెండు కప్పులు,
బియ్యం: పావు కప్పు,
ఉప్పు: తగినంత,
ఎండు మిర్చి: తగినన్ని,
పసుపు: పావు స్పూను,
ఉడికించిన బఠాణీలు: అర కప్పు,
పచ్చి మిర్చి: మూడు,
అల్లం: చిన్న ముక్క,
ఆవాలు: పావు స్పూన్,
మినపప్పు: టీస్పూన్,
శనగపప్పు: స్పూన్,
కరివేపాకు: రెబ్బ,
నూనె: రెండు స్పూన్‌లు

బియ్యం, పప్పులు విడివిడిగా కనీసం ఆరుగంటలు నాన బెట్టి తరువాత మెత్తగా రుబ్బి తగినంత ఉప్పు ఎండు మిరపకాయలు కలిపి మళ్లీ రుబ్బుకోవాలి. పిండిని బాగా కలియ బెట్టి గరిటజారుగా చేసుకుని వేడి పెనంపై కొంచెం నూనె వేసి దోసెలు చేసుకుని చేసిన కూరతోకలిపి వడ్డించాలి. కూర తయారి: బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి కొద్దిగా వేపి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు తరిగిన పచ్చి మిరపకాయ, అల్లం ముక్కలు కరివేపాకు వేసి కొద్దిగా వేపి బఠాణీలు, తగినంత ఉప్పు వేసి బాగా కలియ బెట్టి దోసెలతో కలిపి తినాలి.






కీర దోసకాయ దోసె

మినపప్పు: గ్లాసు,
బియ్యం: మూడు గ్లాసులు,
మెంతులు: అర స్పూన్,
దోసకాయ గుజ్జు: ఒక కప్పు,
ఉప్పు: తగినంత,
చట్నీ పొడి: రెండు స్పూన్‌లు,
కొత్తిమిర: రెండు స్పూన్‌లు,
పచ్చి మిరపకాయలు: రెండు,
నూనె: సరిపడ మినపప్పు,
బియ్యం, మెంతులు కలిపి కనీసం ఆరుగంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో కీర దోసకాయ గుజ్జుని కలిపి నాలుగు గంటలు పులియనివ్వాలి. తరువాత తగినంత ఉప్పు వేసి గరిట జారుగా కలుపుకుని వేడి పెనంపై పలుచగా దోసెలు పోసుకుని చట్నీ పొడి, కొత్తిమిర, సన్నగా తరిగిన పచ్చి మిరపకాయ ముక్కలు వేసి రెండవ వైపు కాల్చకుండా మడిచి తినేయడమే.

రవ్వదోసె
బొంబాయి రవ్వ: పావుకేజి,
శనగ పిండి: పావుకేజి,
బియ్యం పిండి: పావుకేజి,
మజ్జిగ: అర కప్పు,
పచ్చిమిరపకాయలు: మూడు,
జీలకర్ర: స్పూన్,
కొత్తిమిర: స్పూన్,
ఉప్పు: తగినంత రవ్వ,
శనగ పిండి, బియ్యంపిండి మజ్జిగలో వేసి ఉండలు కట్టకుండా బాగా కలిపి అందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర కొత్తిమిర కలిపి కనీసం అరగంట నానపెట్టి గరిటజారుగా కలుపుకుని పలుచగా దోసెలాగా పోసుకుని ఎర్రగా కాల్చి చట్నీతో తీసుకుంటే రుచిగా ఉంటాయి.





మసాలా దోసె

మినపప్పు: గ్లాసు, బియ్యం: మూడు గ్లాసులు, మెంతులు: టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: అర కప్పు,
మసాలా కూర తయారీకి
బంగాళాదుంపలు: పావుకేజీ,
పచ్చి మిరపకాయలు: రెండు,
కరివేపాకు: ఒక రెబ్బ,
కొత్తి మిర: రెండు స్పూన్‌లు,
ఆవాలు: పావు స్పూన్,
జీలకర్ర: పావు స్పూన్,
మినపప్పు: అర స్పూన్,
శనగ పప్పు: టీస్పూన్,
పసుపు: చిటికెడు,
ఉల్లిపాయ: ఒకటి,
నూనె: మూడు స్పూన్‌లు

పప్పు, బియ్యం మెంతులు కలిపి కనీసం నాలుగు గంటలు నాన బెట్టి మెత్తగా రుబ్బి ఆరుగంటలపాటు పులియ నివ్వాలి. తరువాత తగినంత ఉప్పు వేసి కలిపి ఉంచుకోవాలి. బంగాళాదుంపలు ఉడకపెట్టి పైచర్మం తీసి కావల్సిన సైజులో ముక్కలుగా చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. బణాలీలో నూనె వేడి చేసి పోపు సామానులు వేసి చిటపటలాడాక కరివేపాకు,

తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మరిపకాయలు వేసి అవి మెత్తబడే వరకు వేయించి చిదిమి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, పసుపు, వేసి బాగా కలియ బెట్టి అవసరమైతే కొద్దిగా నీరు- చల్లి ఐదు నిమిషాల పాటు వేయించాలి. దించే ముందు కొత్తిమిర చల్లి తీసి పక్కన పెట్టుకోవాలి. రుబ్బి పెట్టుకున్న పిండితో దోసె వేసి ఎర్రగా కాల్చి తిరగేయకుండా పైభాగాన గరిటెడు మసాలాకూర వేసి మధ్యకి మడిచి కిందికి దింపేయాలి.


కొన్ని చిట్కాలు..


-దోసెల పిండిని కలియ బెట్టే సమయంలో రెండు చిటికెల పంచదార వేసి కలిపితే అందంగా, కరకరలాడుతూ ఉంటాయి.
-దోసె రుచిగా ఉండాలంటే బియ్యం, పప్పుల పిండితో పాటు ఒక చిన్న చెంచాడు మెంతిపొడి కలపాలి. లేదా బియ్యంలోనే చెంచాడు మెంతులు కలిపి నానబెట్టాలి.. -దోసెలు పెనానికి అతుక్కోకుండా వుండాలంటే ఒక దోసె వేసి తీసిన ప్రతి సారీ సగం కోసిన ఉల్లిపాయతో లేదా చెక్కు తీయని పెద్ద అరటికాయ ముక్కతో పెనాన్ని రుద్దాలి.

-దోసె, ఉతప్పం మందంగా తయారవ్వాలంటే బియ్యంతోపాటు అరకప్పు అటుకులు కూడా కలపాలి.
-ఒక చెంచాడు తినేసోడాను పిండిలో కలిపి దోసె వేస్తే కరకరలాడుతూ రుచిగా ఉంటుంది.
-చలికాలంలో దోసెపిండిలో ఒక చిన్న చెంచాడు ఈనోసాల్ట్ కలిపితే త్వరగా పులిసి దోసె కొంచెం పుల్లగా కూడా ఉంటుంది.
-ఒక పెద్ద వంకాయను సగానికి కోసి నూనెలో ముంచి దానితో వేడి పెనాన్ని రుద్ది దోసె వేస్తే దోసె పెనానికి అతుక్కోకుండా నీట్గా వచ్చి దోసె కరకరలాడుతూ ఉంటుంది.

Sunday, 25 January 2009

వెలిగే జ్యోతి....

నన్ను ఎంతో అభిమానిస్తూ, ప్రోత్సహించే మిత్రులకు ముందుగా శతకోటి నమస్సులు.. ఈ రోజు ఆంధ్రజ్యోతి నవ్య లో నా బ్లాగు పరిచయం.. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం చెప్పనా.. సరిగ్గా ఏడాది క్రితం ఆంధ్రజ్యోతి లో నా మొదటి రచన ప్రచురింపబడింది.


'మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మీ జీవిత భాగస్వామి, స్నేహితుడు, పిల్లలు, గురువు.. కానీ మీకు క్లోజ్‌గా ఉండే ఆ నేస్తంతో మీ ఆలోచనలు, అనుభూతులు, సందేహాలు, సమస్యలు అన్నీ చర్చిస్తారా? ఇది సాధ్యం కాదేమో.. ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించండి. అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించే, మీకు తోడుగా ఉండే మీ స్నేహితుడు ఎవరో కాదు.. అది మీరే. అవును. మీకు మీరే గొప్ప స్నేహితులు. మిమ్మల్ని మీరు అభిమానించండి. గౌరవించుకోండి. మీ విలువ తెలుసుకోండి.' అంటూ సాగుతుందొక వ్యక్తిత్వ వికాస పాఠం. 'కట్నం అనేదొక సమస్యయిపోయింది. అమ్మాయిలు, అబ్బాయిలు, తల్లిదండ్రులు అందరూ మారాలి...' అంటూ సాగుతుందొక సామాజిక ఆలోచన. 'చాలామంది ఆడపిల్లనొక భారంగా అనుకుంటారు.

కానీ అమ్మాయిలు పాపగా, కన్యగా, తల్లిగా, అమ్మమ్మగా మారినా కూడా తల్లి కోసం ఆరాటపడుతూనే ఉంటుంది.. తన ఇంటి బాధ్యతలతో అలసిన మనసు అమ్మనే తలచుకుంటుంది..' అని సాగుతుందో చిన్న కవితాత్మక భావం. ఇన్ని రకాల రాతలతో అలరించే 'జ్యోతి' బ్లాగ్‌కు ట్యాగ్‌లైన్ సరదా సమాలోచనల పందిరి. అచ్చం అలాగే కాస్త సరదాగా, కాస్త ఆలోచనాత్మకంగా సాగుతుంది ఈ బ్లాగు. ఆటలు, పాటలు, జోకులు, వంటలు, పురాణ సంగతులు.. ఒకటేమిటి.. 'జ్యోతి'లో ప్రతి టపా ఓ విభాగం. ఇప్పటికి 32 వేల మందికి పైగా చూశారంటేనే అర్థమవాలి ఆ బ్లాగుకున్న ఆదరణ. హైదరాబాదీ గృహిణి జ్యోతి వలబోజు దీన్ని నిర్వహిస్తున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

కంప్యూటర్‌తో పరిచయమే లేని ఆమె ఈ స్థాయికి చేరుకోవడం వెనుక చాలా కృషి ఉంది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే - "ప్రతి గృహిణిలాగే భర్త , పిల్లలు, వంట, ఇల్లు, టీవీ సీరియళ్లు... అప్పుడప్పుడు ఇరుగమ్మ పొరుగమ్మలతో బాతాఖానీ.. జ్యోతిక్కూడా రోజులిలాగే గడచిపోయేవి. అప్పుడే పిల్లల కాలేజీలు, కోర్సుల గురించి ఇంటర్నెట్‌ను పరిచయం చేసుకున్నారామె. కొడుకు నేర్పించిన విషయాలకు తన శోధనను కలిపి, తెలుగు బ్లాగుల ప్రపంచాన్ని చూసిన జ్యోతి తన సొంత బ్లాగును ఏర్పాటు చేసుకున్నారు. "నెల సరుకుల జాబితా తప్ప వేరే రాతలు అలవాటు లేని నేను ఇప్పుడు కొన్ని దినపత్రికల్లో రచనలు చేస్తున్నానంటే అదంతా బ్లాగుల చలవే.

వీటివల్ల లాభం ఏంటంటే మనం ఆలోచించే విషయాలను ఎందరో చదువరులతో చర్చించవచ్చు.. తప్పులుంటే దిద్దుకోవచ్చు.. రాసే శైలిని మెరుగుపరుచుకోవచ్చు. సామాన్య గృహిణిగా ఉన్న నేను ఇప్పుడు తెలుగు బ్లాగర్‌ని

చిన్నపాటి రచయిత్రిని అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నానంటే ఈ క్రమంలోనే..' అంటారు జ్యోతి. విభిన్న విషయాలపై మరో ఆరు బ్లాగులను అలవోకగా నిర్వహిస్తున్నారామె. మంచి పాటల సాహిత్యాన్ని, వీడియోలనూ అందించే పందిరి 'గీతలహరి' బ్లాగు. రకరకాల వంటకాల తయారీ విధానాలను తేటతెలుగులో వివరిస్తుంది 'షడ్రుచులు'. అదే ఇంగ్లిష్‌లో 'అన్నపూర్ణ'గా మరికొన్ని వంటల తయారీని ఫోటోలతో సహా వివరిస్తారు.

ఆధ్యాత్మిక, పురాణ విశేషాలతో సాగుతుంది 'నైమిశారణ్యం'. మంచి ఫొటోలతో కొన్ని చిత్రాల మాలిక 'చైత్ర రథం'. ఈ జగన్నాటకంలో అందరూ పాత్రధారులే అన్న స్పృహను కనబరుస్తుంది 'జగన్నాటకం'. ఆరు బ్లాగులను నిర్వహిస్తున్న జ్యోతి శభాషనకుండా ఉండలేరెవరూ.
ఇదిగో ఆమె బ్లాగు చిరునామా : http://jyothivalaboju.blogspot.com

ఈ శుభ సందర్భంలో అందరికి ఒక చిన్ని కానుక.. ఆంధ్రజ్యోతి లో నే వచ్చిన దోసేలమ్మా దోసెలు వ్యాసం మీకోసం..

Tuesday, 20 January 2009

అంతర్జాలంలో తెలుగు సాహిత్యం



నిన్న సోమవారం 19-1-2009 సాక్షి దినపత్రికలో వచ్చిన వ్యాసం...



రకరకాల కారణాల వల్ల తెలుగులో సాహిత్య పత్రికల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. దినపత్రికల సాహిత్య పేజీల్లోనూ, ఆదివారం అనుబంధాల్లోనూ కేటాయించే ఒకటీ, అరా పేజీలే సాహిత్యాభిమానులకు దిక్కవుతున్నాయి. ఆయా పత్రికల అభిరుచులను బట్టి ఆ కాసిన్ని పేజీల్లోనూ ఎన్నో పరిమితులేర్పడతాయి. ప్రచిరితమైన రచనలపై తగిన చర్చ జరగటమూ అరుదుగానే మారుతోంది. ఈ సందర్భంలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన అంతర్జాల (ఇంటర్‌నెట్) పత్రికలు సాహిత్యాభిమానుల ఆదరణతో దినదినాభివృద్ధి చెందుతున్నాయి.


చదువులూ, ఉద్యోగాలూ, వృత్తులూ వంటి వ్యాపకాల కారణంగా తెలుగువాళ్లు వివిధ రాష్ట్రాలకూ, దేశాలకూ విస్తరించిన సందర్భం ఇది. వాళ్లలో తెలుగు భాషా, సాహిత్యాల మీద మక్కువ గలవాళ్ళ సంఖ్య కూడా అధికమే. ఐతే ప్రింట్ మీడియాలోని తెలుగు పత్రికలూ, పుస్తకాలూ వాళ్ళందరికీ దొరకటం మాత్రం అంత సులభం కాదు. ఈ లోటును పూరించుకోటానికి జరిగిన ప్రయత్నాలకు సాంకేతిక పరిజ్ఞానం సాయమందటంతో అంతర్జాల సాహితీ పత్రికలు రూపొందాయి. చిన్న పట్టణాల్లో కూడా ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్లా, తెలుగులో కంపోజ్ చేయటానికి సులభమైన ఉపకరణాలు లభించటం వల్లా, తక్కువ ఖర్చుతో ఎక్కువ పత్రికలను చదవగలిగే సౌలభ్యం దొరకటం వల్లా రచయితలూ, పాఠకులూ కూడా వీటిని ఆదరిస్తున్నారు. అంతర్జాల సాహిత్య పత్రికల్లో కొన్నిటిని ఇపుడు పరిచయం చేసుకుందాం...


తెలుగు భాషా, సాహిత్యాల వ్యాప్తిలో గొప్ప కృషి చేసిన అంతర్జాల పత్రికగా 'ఈ మాట'ను చెప్పుకోవాలి. వేలూరి వెంకటేశ్వర రావు, కె.వి.ఎన్.రామారావు, ఎస్. నారాయణస్వామి, సురేశ్ కొలిచాల, శంఖవరం పాణిని, పద్మ ఇంద్రగంటి సంపాదకవర్గంగా వస్తున్న ఈ పత్రిక నవంబరులో పదవ వార్షికోత్సవం జరుపుకుంది. ప్రింట్‌లో వస్తున్న తెలుగు పత్రికలకు రాసే విదేశాంధ్రులు మాతృదేశంలోని పాఠకుల అభిప్రాయాలకు భిన్నమైన భావాలను స్వేచ్చగా రాయలేకపోతున్నారనీ, వాళ్ల్లు మనసులు విప్పు మాట్లాడేందుకు వేదికగా తమ పత్రిక ఉంటుందనీ కె.వి.ఎస్. రామారావు అంటున్నారు.


'ఈ మాట' పాత సంచికలను తిరగేస్తుంటే ఓ సాహిత్యపు నిధిని తవ్వుతున్నట్టే ఉంటుంది. 'తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు' పేరిట భద్రిరాజు కృష్ణమూర్తిగారిచ్చిన ఇంటర్వ్యూ గొప్ప విశ్లేషణను అందించింది. అంతర్జాతీయ సినిమాల గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న రాస్తున్నా సమీక్షలూ, సంగీత విద్వాంసుల గురించీ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ రాస్తున్న వ్యాసాలూ పత్రికలో ప్రత్యేక ఆకర్షణలు. 'నాకు నచ్చిన పద్యం' శీర్షికన చీమలమర్రి బృందావనరావు సంప్రదాయ సాహితీ సౌందర్యాన్ని వివరించి చెప్తున్నారు. సాహిత్య విమర్శపై ఈ పత్రిక చేస్తున్న కృషి చెప్పుకోదగినది.



ఇక రెండేళ్ళ క్రిందట అంతర్జాలంలో పొడిచిన 'పొద్దు' కూడా పాఠకుల మనసుల్లో తనదైన ముద్ర వేసింది. ఎందరో ప్రముఖ రచయితలూ, బ్లాగర్లూ ఈ పత్రిక ద్వారా పాఠకుల ముందుకు వస్తుంటారు. 'పొద్దు' ప్రతినెలా నిర్వహించే 'గడి' శీర్షికా, బ్లాగుల సమీక్షా వ్యాసాలూ పాఠకులను బాగా ఆకర్షిస్తున్నాయి. ఉగాది, విజయదశమి పర్వదినాల సందర్భంగా ఈ పత్రిక నిర్వహించిన చక్కటి ప్రయోగం 'భువన విజయం'. త్రివిక్రమ్, స్వాతి, చదువరి, రానారే, సిముర్గ్, రాజేందర ఈ పత్రిక సంపాదకులు.



సినిమాల విశేషాలతో నిర్వహించే ప్రత్యేకమైన అంతర్జాల పత్రిక 'నవతరంగాం' వెంకట్ సిద్ధారెడ్డి, రాజేంద్రల సంపాదకత్వంలో వెలువడే ఈ పత్రిక తెలుగువే కాక , ఇతర భాషల సినిమాల గురించి కూడా చర్చిస్తుంది. సినిమాల్లోని సాహిత్య, సాంకేతిక విషయాలను గురించి అచ్చ తెలుగులో వివరించటమేగాక, నిష్పాక్షికమైన విమర్శల ద్వారా పాఠకుల అభిరుచుల్ని తీర్చిదిద్దటం ఈ పత్రిక ప్రత్యేకత.



కాలిఫోర్నియా బే కు చెందిన తెలుగు సాంస్కృతిక సంస్థ 'సిలికానాంధ్ర' కూడా 'సుజన రంజని' అనే పత్రికను నడుపుతోంది. మృత్యుంజయుడు, తల్లాప్రగడ రావు, ప్రఖ్య వంశీకృష్ణ, తమిరిళ జానకి, ఆనంద్, చెన్నయ్యలు నిర్వహించే ఈ పత్రిక ప్రాచీన సాహితీ విశేషాలు, జానపదకళలు, ప్రముఖ కళాకారుల పరిచయాలు వంటి అంశాలన్నిటినీ అందిస్తుంది. 'పద్యం హృద్యం' శీర్షిక ద్వారా పాఠకుల్లో పద్య రచనపై అభిరుచిని పెంపొందించటం మరో ప్రత్యేకత. వీటన్నింటితో బాటు ఆడియో, వీడియోలను కూడా పొందుపరచటంతో పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.


ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేసే లక్ష్యంతో హిమబిందు, చైతన్య, సాజీగోపాల్‌లు నిర్వహిస్తున్న పత్రిక 'ప్రజాకళ'. ఇందులో కవిత్వం, కథ, నవల, విమర్శ లాంటి ప్రక్రియలన్నింటినీ పరిచయం చేస్తున్నారు. ఈ పత్రిక రాజకీయాలు, సామాజిక శాస్త్రాలు, మానవ హక్కులు, సైన్స్ లాంటి రంగాలన్నింటిమీదా కూడా విశ్లేషణాత్మక వ్యాసాలను అందిస్తోంది. వివిధ పత్రికల నుంచి ఈ వ్యాసాలను సేకరించి ప్రచురిస్తున్నారు.


రచయిత కిరణ్ ప్రభ, కాంతి కలిసి 'కౌముది' అనే అంతర్జాల మాస పత్రికను ప్రచురిస్తున్నారు. ప్రముఖ ఆర్టిస్టుల చిత్రాలతో, ఫోటోలతో అందమైన ముఖ చిత్రాలను రూపొందించటం ఈ పత్రిక ఆకర్షణల్లో ఒకటి. అచ్చు పత్రికల్లో లాగా వైవిధ్యభరితమైన శీర్షికల్ని ఇందులో పొందుపరిచారు. సమకాలీన సాహిత్యంతో బాటుగా విలువైన పాత కథల్నీ, నవలల్నీ అందించటంతో వివిధ వర్గాల పాఠకులను 'కౌముది' ఆకట్టుకోగలుగుతుంది.


కొండవీటి సత్యవతి నిర్వహణలోని 'భూమిక', దక్షిణ భారత దేశంలోనే తొలి అంతర్జాల స్త్రీవాద పత్రిక. స్త్రీవాద సాహిత్యంతో బాటు సామాజిక, రాజకీయ సమస్యలను కూడా సమర్ధవంతంగా విశ్ళేషించే రచనలను 'భూమిక' అందిస్తోంది. సమస్యల్లో ఉన్న స్త్రీలకు ప్రత్యక్ష సహాయాన్ని అందించే లక్ష్యంతో 'భూమిక' నిర్వహిస్తున్న హెల్ప్ లైన్‌కు మహిళల నుండి మంచి స్పందన లభిస్తోంది.



ప్రారంభమైన ఏడాది కాలంలోనే అత్యధిక సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న అంతర్జాల పత్రిక 'ప్రాణహిత'. నారాయణ స్వామి, మమత, హిమబిందు, జయప్రకాశ్, చైతన్య, జి.ఎస్.రాం మోహన్‌లు ఈ పత్రికను నిర్వహిస్తున్నారు. విభిన్న కంఠాల సమ్మేళనమై వినబడే ప్రజాస్వామిక సాహిత్యానికి క్రియాశీల వేదికగా నిలవాలన్నది ఈ పత్రిక లక్ష్యం. మమత, ఎస్. వేణుగోపాల్‌లు అందిస్తున్న ధారావాహిక అనువాదాలతో బాటు, ప్రసిద్ధ రచయితల సాహిత్యాన్ని కూడా ప్రచురిస్తున్నారు. చక్కటి వర్ణచిత్రాలనూ, వీడియోలనూ కూడా 'ప్రాణహిత' అందిస్తోంది.


తెలుగు సాహిత్యానికి అంతర్జాతీయ వేదికను కల్పిస్తున్న అంతర్జాల పత్రికల్లో ఇవి కొన్ని మాత్రమే. ఎటువంటి ధనాపేక్షకూ తావు లేకుండా సాగుతున్న వీటి నిర్వహణ అభినందనీయం. ఇవి మరింతగా విస్తరిస్తాయని , మంచి ప్రమాణాలను సాధిస్తాయని చెప్పటానికి సందేహం అక్కర్లేదు.


కొన్ని అంతర్జాల పత్రికల లింకులు:

www.eemata.com

www.pranahita.org

www.poddu.net

www.navatarangam.com

www.prajakala.org

www.sujanaranjani.siliconandhra.org

www.koumudi.net

www.bhumika.org



- జ్యోతి వలబోజు

ఈ వ్యాసానికి ప్రేరణ గతంలో అంతర్జాల పత్రికలపై పొద్దులో వచ్చిన వ్యాసం..


చిన్న కొసమెరుపు...
ఈ వ్యాసం రాసేటప్పుడు జరిగిన సంఘటనలు తలుచుకుంటే నవ్వొస్తుంది.. వ్యాసం కోసం సమాచారం సేకరిస్తున్న సమయంలో నెట్ వాడితో గొడవ జరిగి, మూడు నెలలు బిల్లు కట్టలేదు. వాడు కనెక్షన్ కట్ చేసాడు. అంతకుముందే మా అబ్బాయి సిస్టమ్ format చేసాడు. లేఖిని లేదు, బరహా ఎగిరిపోయింది. మళ్లీ దించుకుందామంటే నెట్ లేదు . ఎప్పుడొస్తుందో తెలీదు. అప్పుడే కొన్న అను సాఫ్ట వేర్ ఉంది. అదంటే భయం. ఎలా రాయాలో తెలీదు. .ఏం చేద్దాం అని ఆలోచించి... చించి... లాభం లేదని.. అలవాటు తప్పినా తప్పని పరిస్థితుల్లో పేపర్ మీద రాసి పత్రికకు పంపించాను. కంప్యూటర్ లో ఐతే రాసింది ఉంటుంది. నేను రాసింది పెన్నుతో.. కాపీలు కూడా లేవు.. ఏం రాసానో గుర్తు లేదు. ఇలా ఆధారపడితే ప్రయోజనం లేదని పట్టుబట్టి భయాన్ని అణచిపెట్టి.. రోజుకు రెండు గంటలు కూర్చుని, రెండు రోజుల్లో అను నేర్చుకున్నాను (అప్పుడప్పుడు శ్రీధర్ బుర్ర తిన్నాననుకోండి.) హన్నా.. నన్ను భయపెట్టే ధైర్యమా అని అంతు చూడకుండా వదలలేదు.. బరహ కూడా మళ్లీ దించుకోలేదు..

Sunday, 18 January 2009

వెరైటీగా సలాడ్స్ చేసుకుందామా...



ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలోని నవ్య విభాగంలో నా రచన.. సులువుగా సలాడ్స్.. ఎలా తయారు చేయాలో వివరాలు కావాలంటే క్రింది బొమ్మను నాజూగా తట్టండి.







సులువుగా సలాడ్స్.......

క్యారట్-శనగల సలాడ్

క్యారట్ నాలుగు
కాబూలి శనగలు 50గ్రా
క్యాప్సికం 1
కొత్తిమీర 2 చెంచాలు
నిమ్మరసం ఒక చెంచాడు
ఉప్పు తగినంత
మిరియాల పొడి అర చెంచా
నూనె చెంచాడు
ఆవాలు చిటికెడు
కరివేపాకు ఒక రెమ్మ

తయారు చేసే విధానం:
శనగలను రాత్రి నానబెట్టి ఉంచుకోవాలి. క్యారెట్ చెక్కు తీసి సన్నగా తరిగి ఆ ముక్కలకు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కలాయిలో నూనె తీసుకుని వేడి చేసి ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ పోపును క్యారెట్ మిశ్రమంలో కలపాలి. నాన బెట్టిన శనగలు వడకట్టి నీళ్లలో కడిగి సిద్ధంగా ఉంచుకోవాలి. క్యాప్సికమ్‌ను సన్నని ముక్కలుగాతరగాలి. పోపు కలిపిన క్యారెట్ మిశ్రమానికి శనగలు, క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, నిమ్మరసం, మిరియాల పొడి కలిపి వడ్డించాలి.


కీరా-టమాటో సలాడ్

కీరా దోసకాయ ఒకటి
టమాటాలు రెండు
ఉప్పు తగినంత
కొత్తిమీర రెండు స్పూన్‌లు
పచ్చి బఠానీలు రెండు టీస్పూన్‌లు
వెనిగర్ ఒక టీస్పూన్
మిరియాల పొడి అర స్పూన్

తయారు చేసే విధానం:
కీరా దోసకాయ, టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో తరిగిన కొత్తిమీర, పచ్చిబఠానీలు, ఉప్పు మిరియాల పొడి, వెనిగర్ అన్నీ బాగా కలిపి కొద్దిసేపు ఫ్రిజ్‌లో చల్లబరచి తింటే బావుంటుంది. కావాలంటే ఇందులో కప్పు చిక్కటి పెరుగు కలిపి కూడా తినొచ్చు.


మొలకెత్తిన పెసలు-ఎగ్ సలాడ్

మొలకెత్తిన పెసలు ఒక కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి
ఉడికించిన కోడి గుడ్డు ఒకటి
సన్నగా తరిగిన టమాటా రెండు
తరిగిన కొత్తిమీర రెండు స్పూన్‌లు
ఉప్పు తగినంత
నిమ్మరసం ఒక టీస్పూన్
మిరియాల పొడి అర స్పూన్

తయారు చేసే విధానం:
ఒక వెడల్పాటి గిన్నెలో మొలకెత్తిన పెసలు టమాటా ముక్కలు ఉల్లిపాయల ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి ముక్కలన్నింటిని బాగా కలపాలి. చివర్లో కోడి గుడ్డు ముక్కలు వేసి కలపాలి.


తిరంగా సలాడ్
సన్నగా తరిగిన క్యారెట్ ఒక కప్పు
సన్నగా తరిగిన ముల్లంగి పావు కప్పు
సన్నగా తరిగిన కొత్తిమీర పావుకప్పు
ఉప్పు తగినంత
నిమ్మరసం ఒక స్పూన్
మిరియాల పొడి ఒక టీస్పూన్

తయారు చేసే విధానం:
క్యారెట్, ముల్లంగి, కొత్తిమీర ముక్కలను కలిపి ఈ మిశ్రమానికి ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడినికలిపి కాస్త చల్లబరిచి తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ సలాడ్‌తో ఒక కట్‌లెట్ కూడా జతచేస్తే కాంబినేషన్ అదుర్స్.



Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008