ఆకాశంలో సగమైనా, అంతరిక్షంలోకి దూసుకెల్లినా మన దేశంలో ఇంకా ఎందరో ఆడపిల్లలను భారంగానే భావిస్తున్నారు. పుట్టకముందు,పుట్టాక ఆడపిల్ల అని చంపేస్తున్న కసాయివాల్లెందరో ఈ సమాజంలో ఉన్నారు. ఈ వాస్తవ సత్యాలను నమ్మక తప్పదు.
తెలుగు సాహిత్యంలోని అందాన్ని ఆస్వాదించాలంటే పండితుడే కానక్కరలేదు . పురాణ గ్రంధాలైన రామాయణ , మహాభారత, భాగవతాలనుండి ఎన్నో పద్యాలు సామాన్య జన జీవనంలో విరివిగా వాడబడ్డాయి. ఆ మహాకావ్యాలలో ప్రస్తావించబడిన ఎన్నో పద్యాలు ఇప్పటికీ మన నిత్య జీవతంలో అన్వయించుకుంటాము కూడా. పోతన కవిత్వం మాధుర్యానికి పెట్టింది పేరు. భాగవతంలో ఎన్నో పద్యాలు తెలుగునాట ప్రతినోటా నానాయి. అలాంటి కొన్ని భాగవత పద్యాలు చూద్దాం. ఇందులో ఎన్నో పద్యాలు స్కూలులో చదివినవే .ఇవి చదువుతుంటే నా స్కూలు రోజులు గుర్తొచ్చాయి. ప్రతి పరీక్షలో ముందు రాయాల్సిన ప్రతిపదార్ధం . అది మొత్తం కరెక్టుగా రాస్తే వచ్చే ఫుల్ మార్కులు.. ఆ తెలుగు టీచర్. ఆవిడని విసిగించిన సంఘటనలు..
మన సారధి ,మన సచివుడు మన వియ్యము, మన సఖుండు,మన బాంధవుఁడున్ మన విభుడు, గురువు, దేవర మనలను దిగనాడి చనియె మనుజాధీశా.
తమ నేస్తం, సారధి, మంత్రి లా సలహాలు ఇచ్చినవాడు, వియ్యంకుడు, బందువు ఐన శ్రీకృష్ణుడు అస్తమించిన పిమ్మట అర్జునుడు సర్వం కోల్పోయినవాడై దిగులుగా అన్నతో చెప్పిన మాటలివి. మనకు బాగా కావలసిన వాడు, మిత్రుడు , బంధువు చనిపోయినప్పుడు ఇలాగే అనిపిస్తుంది కదా. మనకు సర్వస్వం ఐన వ్యక్తి దూరమైనపుడు సర్వం శూన్యంగా అనిపిస్తుంది.
గజేంద్ర మోక్షంలోని ఈ పద్యం తెలుగువారికి చిరపరిచితమే. మొసలి నోట చిక్కిన గజేంద్రుడు ఆ సర్వేశ్వరుడిని శరణు వేడిన విధంబిది. అసలు భగవంతుడు ఎవ్వడు అనే ప్రశ్నకు సమాధానం ఈ పద్యంలో లభించవచ్చు. ఈ జగత్తు ఉద్భవించడానికి కారణం అతడే, జగం అతనిలో ఉంది. అతనితో ముగుస్తుంది. మొదలు, తుది ..సర్వమూ తానే ఐన ఆ భగవంతుడు తనంతట తానుగా జన్మించినవాడు. సృష్టికి మూలకారణము అని ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన నిజము. అప్పుడు కాని మనిషిలోని గర్వం అణిగి, తానే గొప్ప అని విర్రవీగడు
వామనావతార ఘట్టములో దానమడగడానికి వచ్చిన బాలుడు మహావిష్ణువు అని తెలుసుకున్న దానవ గురువు శుక్రాచార్యుడు బలి చక్రవర్తితో ఇలా అన్నాడంట. స్త్రీల విషయములో, వివాహ విషయములో, ప్రాణానికి , సంపదకు, మానమునకు హాని కలిగే సందర్భంలో, గోవులను, బ్రాహ్మణులను రక్షించు సమయములో అబద్ధము ఆడ వచ్చును.అందుకే బలిచక్రవర్తిని ఇచ్చిన మాటను వెనక్కి తీసుకొని తన ప్రాణాలు కాపాడుకోమని అద్భుతమైన సలహా ఇచ్చాడు ఆ గురువు. పైగా అది తప్పు కాదంట.. కాని ఇపుడు అవసరానికి అలవోకగా అబద్దాలాడేస్తుంటారు చాలా మంది.
ఊరక రారు మహాత్ములు వా రధముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం గారణము మంగళములకు నీ రాక శుభంబు మాకు . నిజము మహాత్మా !
శ్రీకృష్ణుడి కుశలము తెలుసుకుని రమ్మని వసుదేవుడు తన పూరోహితుడిని పంపిస్తాడు. అతనికి అతిథి సత్కారాలు చేసి నందుడన్న మాటలివి. ఇప్పటికీ మనం ఎవరైన గొప్పవాళ్లు మన ఇంటికి వస్తే ఊరకరారు మహాత్ములు. మాలాంటి సామాన్యులు, పేదవారింటికి మీలాంటి పెద్దలు రావడం శుభకరం అని అంటారు. ఇందులో అవతలి వ్యక్తి సంపూర్ణ గౌరవంతో అన్నాడా? , వెటకారంగా అన్నాడా అన్నది తెలియడం అవసరం. అది అతని ఉచ్చారణలో తెలిసిపోతుంది. ఏమంటారు.. నిజమేకదా..
ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటి పై నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై !!
బలి చక్రవర్తి వద్ద మూడడుగులు దానంగా స్వీకరించాక పొట్టి వడుగు వామనుడు భూమిని, ఆకాశాన్ని,మబ్బులను, సూర్యచంద్రులను, ధృవుని, మహాలోకాలన్నింటినీ దాటిపోతూ పెరిగిపోయాడు. ఆ చిన్ని వడుగు ముల్లోకాలన్నీ ఆక్రమించేటంతగా ఎదిగిపోయాడు. "ఇంతింతై వటుడింతై" అనే పదం నానుడిగా మారిపోయింది. ఒక వ్యక్తి క్రమంగా ఎదుగుతూ వృద్ధి చెందినప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగిపోయాడు అని అనడం సర్వ సాధారణం. చిన్ని బాలుడైనా కృషితో వామనుడిలా విశ్వరూపం దాల్చవచ్చు , ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అని భావం.
అప్పుడప్పుడు సామూహిక టపాలు రాయడం మహిళా బ్లాగర్లకు అలవాటైన విషయం. అదే క్రమంలో కృష్ణాష్టమి కూడా మన బ్లాగుల్లో జరుపుకుందామని నిర్ణయించుకోవడం జరిగింది. ప్రతి మహిళా బ్లాగర్ విశిష్టమైన రీతిలో స్పందించారు. ఒక్కొక్కరిది ఒక్కో వ్యక్తీకరణ.. ఆ ప్రత్యేకమైన టపాలన్నీ ఒక్కచోట సమీకరించడం జరిగింది. నేనూ రాస్తాను అని గీతాచార్య గారు పండగయ్యాక ప్రచురించారు.. కాని అది సృజన టపాకు ముందు భాగమని తెలిసింది.
ప్రేమ , కర్తవ్యం,గురువు అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడే.. లీలామానుషధారి, ఆపధ్బాంధవుడు, ఇష్టసఖుడు.. పుట్టినది మొదలు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, తరతరాలకు తరగని నిధివంటి భగవద్గీతను అందించాడు. యావత్ప్రపంచానికే జగద్గురువు అయ్యాడు. తానుగా యుద్ధం చేయకపోయినా, నమ్మిన వారికి అండగా ఉండి స్నేహశీలిగా , ప్రేమమూర్తిగా కర్తవ్యం బోధించాడు. జగత్తుకే నాధుడు, చక్రవర్తి ఐన కృష్ణుడికి వెన్న దొంగతం ఎందుకు చేయవలసి వచ్చింది? భక్తుల మెదళ్లలో పిడతలనే చీకటిలో పేరుకుని ఉన్న అజ్ఞానాన్ని తొలగించేందుకే వెన్న అనే జ్ఞానాన్ని బయటకు తీసి వెన్నదొంగగా నిష్టూరాలు పడ్డాడు.
ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ..
ధర్మానికి హాని కలిగినపుడు చెడు చేతిలో మంచి బాధపడుతున్నప్పుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం ఏదో ఒక రూపంలో ఇలపై అవతరించాడు ఆ దేవదేవుడు. అవే దశావతారాలు.
గీతగోవిందంలో జయదేవుడు రచించిన అష్టపదుల్లో మొదటి అష్టపది... దశావతారాలు.
మంగళశాసనం
"యది హరి స్మరణే నిరతం మనః
యది విలాస కలాసు కుతూహలమ్,
శృణు తదా జయదేవ సరస్వతీం
మధుర కోమల కాంత పదావళీమ్"
ఆ శ్రీమన్నారాయణుని ధ్యానించుటకు, సేవించి తరించుట యందు అనురాగము, అభిరుచి, కళలందు ఆసక్తి ఉంటే కోమలము, సుమధురమైన పదములతో నిండిన జయదేవుని కవితా సరస్వతిని వినమని కావ్యారంభంలో శ్రీసూక్తి ద్వారా ప్రార్ధిస్తాడు జయదేవుడు.
సకల లోకములకు ప్రభువైన ఓ కృష్ణా! హరి భక్తుల కష్టములను తీర్చువాడివికనుక ఈ ప్రపంచాన్ని రక్షించేందుకు ఏడు సముద్రాలూ ఒక్కటై జల ప్రళయముసంభవించినప్పుడువేదములు మునిగిపోకుండా మత్స్యావతారమును ఎత్తి రక్షించితివి.
ఓ సర్వలోక రక్షకుడవైన ఓ కృష్ణయ్యా! నీకు జయము కలుగు గాక! నీవుసర్వోత్కృష్టుడవయి ఉండుము. వరాహావతారమున నీవు పాతాళమున దిగబడిన భూమిని నీప్రకాశవంతమైన కోరలతో ఎత్తి రక్షింపగా అది చంద్రుని పై ఉన్న మచ్చ వలేవాటియందు ప్రకాశించినది.
ఓ సర్వలోక రక్షకుడవైన ఓ కృష్ణయ్యా! నీకు జయము కలుగు గాక! నీవుసర్వోత్కృష్టుడవయి ఉండుము. నరసింహావతారమున తామర పూల వంటి నీ గోళ్ళతోభీకరాకారముగల హిరణ్యకశిపుని శరీరమును చాల చిత్రముగ చీల్చితివి.
ఛలయసి విక్రమణే బలి మద్భుత వామన పదన ఖనీర జనిత జన పావన కేశవా ధృత వామనరూప! జయ జగదీశ హరే
ఓ సర్వలోక రక్షకుడవైన ఓ కృష్ణయ్యా! నీకు జయము కలుగు గాక! నీవుసర్వోత్కృష్టుడవయి ఉండుము. నీవు అద్భుతమైన రీతిలో వామనాకారమును (మరుగుజ్జు) దాల్చి, బ్రహ్మచారివి అయి, బలిచక్రవర్తిని మూడు అడుగుల నేలనుఅడిగితివి.ఆనక త్రివిక్రముడవయి, ముల్లోకముల వ్యాపించి, నీ కాలిగోటినుండిపుట్టిన గంగను భువిపైన ప్రవహింపజేసి, దానియందు స్నానమాచరించిన వారుపవిత్రులగుదురను అనుగ్రహవర్షమును కురిపించితివి.
ఓ సర్వలోక రక్షకుడవైన ఓ కృష్ణయ్యా! నీకు జయము కలుగు గాక! నీవుసర్వోత్కృష్టుడవయి ఉండుము. నీవు పరశురామావతారమునెత్తి ఇరవై ఒక్క సార్లుదండెత్తి క్షత్రియులను సంహరించితివి. వారి రక్తమచే నిండిన శ్యమంతక పంచకమనుఐదు సరస్సులను కల్పించి, వానియందు స్నానమాచరించిన వారు తమ పాపములను, సంసారతాపములను పోగొట్టుకునునట్లు అనుగ్రహించినాడవు.
ఓ సర్వలోక రక్షకుడవైన ఓ కృష్ణయ్యా! నీకు జయము కలుగు గాక! నీవుసర్వోత్కృష్టుడవయి ఉండుము.నీవు రఘువంశమున శ్రీరామునిగా జన్మించి దశకంఠరావణుని శిరములను ఛేదించి, పది దిక్కులలో ఉన్న దిక్పాలకులకు ప్రీతితోబలియిచ్చినావు కదా!
ఓ సర్వలోక రక్షకుడవైన ఓ కృష్ణయ్యా! నీకు జయము కలుగు గాక! నీవుసర్వోత్కృష్టుడవయి ఉండుము. నీవు కలియుగమున బుద్ధావతారమునెత్తి, యఙ్ఞసమయమున పశువులను వ్యర్థముగ చంపరాదని చెప్పినావు. అహింసయె పరమ ధర్మమనిశాసించినావు.
ఓ సర్వలోక రక్షకుడవైన ఓ కృష్ణయ్యా! నీకు జయము కలుగు గాక! నీవుసర్వోత్కృష్టుడవయి ఉండుము. కలియుగమున ధర్మరక్షణార్థము నీవు తోక చుక్క వంటిఖడ్గమును ధరించి కల్క్యావతారమును దాల్చిదుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసెదవు.
ఓ సర్వలోక రక్షకుడవైన ఓ కృష్ణయ్యా! నీకు జయము కలుగు గాక! నీవుసర్వోత్కృష్టుడవయి ఉండుము. దశావతారములను ధరించిన ఓ కేశవా!లోకోత్తరమైనదియు, సంసార భంధనములను వదిలించునదియు, సౌఖ్యములను ఇచ్చునదియుఅయిన జయదేవుని గీతమును ధరించుము.
ఇదేంటా అని ఆశ్చర్యపోతున్నారా??? ఈ మధ్య తెలుగులో బ్లాగుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుంది. ఊరికే కంప్యూటర్ ముందు కూర్చుని సమయం వృధా చేస్తున్నారని అనేట్టు లేదు . ఆటలు, చాటింగు, చెత్త వాగుడు గట్రా లేవు. . ఎంచక్కా తెలుగులో రాసుకుంటూ. చదువుకుంటూ ఉన్నారు. మంచిదే.. ఒకసారి మొదలెడితే అది వ్యాపకం బదులు వ్యసనం అయిపోతుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నేర్చుకోవడం, జాలంలో వెతకడం. ఇదేపని.. పక్కన ఉన్నవారు ఏమైనా వాళ్లకు పట్టదు. ఎదోలోకంలో మునిగిపోతున్నారు. ఎలా చచ్చేది ఈ బ్లాగర్లతో ..
ఇవీ నేను తెలుసుకున్న కొందరు బ్లాగర్ల కుటుంబ సభ్యుల మనోభావాలు. ముఖ్యంగా మహిళా బ్లాగర్ల మీద ఈ ఆరోపణలు ఎక్కువగా ఉంటున్నాయని తెలిసొచ్చింది. నాకు తెలీక అడుగుతాను. మగవాళ్ళు ఎంత సేపైనా భార్యాపిల్లలు అని పట్టించుకోకుండా ఎంత రాత్రి వరకైనా,ఎన్ని గంటలయినా పని చేస్తారు. అదేమని అడగొద్దు. ఎపుడు ఎం చేసేది,ఎక్కడున్నదీ చెప్పరూ. కాని భార్య ఇంటి పనులు పూర్తి చేసుకుని బ్లాగింగు,అంతర్జాల విహారం చేసి మంచి విషయాలు అదీ మాతృభాషలో చేస్తుంటే కంప్లెయింట్లు. తన తీరిక సమయంలో తనకిష్టమైన పని చేసుకుంటుంది లే అని వదిలేయచ్చుగా. ఉహూ.. వాళ్ళు ఇంట్లో ఉంటే ఎదురుగా తిరుగుతూ ఉండాలి. ఇది చాలా దారుణమని నేను నొక్కి వక్కానిస్తున్నాను . ఏదో ఇలా అన్నా బయట తిరుగుళ్ళు, సినిమాలు , షాపింగ్ అని సతాయించడం లేదు అని సర్డుకుపోవచ్చుగా. ఉహూ..
ఈ పరిణామ క్రమంలో గతంలో నేను పొద్దు కోసం రాసిన వ్యాసం గుర్తొచ్చింది. బ్లాగ్బాధితుల సంఘం.... ఎవరైనా మొదలెడుతున్నారా మరి..
*నియమావళి…. ఇందులో బ్లాగులవలన బాధపడ్డవాళ్ళందరూ చేరవచ్చు . ప్రవేశం ఉచితం బ్లాగులలాగే. ఆడామగా బేధంలేదు. కాని ఇందులో సభ్యుల భార్యలు లేదా భర్తలు విధిగా బ్లాగరులై ఉండాలి .
ఈ సంఘం మొదలెట్టడానికి గల పరిస్థితుల గురించి వివరిస్తాను. నేను ప్రెసిడెంటుని కదా !.
మా వారు ఇప్పుడు ప్రముఖ బ్లాగరు. ఈ సమస్యలు మాకు ( అంటే నాలాంటి మరికొందరు భార్యలు అన్నమాట) గత ఆరునెలల నుండి మొదలయ్యాయి. ముందు నా సంగతి చెప్తున్నాను. మావారికి తెలుగు అంటే ఇష్టం ..సరే ..బానే ఉంది. ఆరునెలల క్రింద వరకు మా వారు ఆఫీసు నుండి రాగానే హాయిగా కబుర్లు చెబుతూ నేను చేసిన పకోడీలు తింటూ టీ త్రాగి పేపర్ ఓసారి తిరగేసి ..వంట చేస్తున్న నాతో కబుర్లాడుతూనే పిల్లల హోంవర్క్ చేయించేవారు. రాత్రి భోజనం అయ్యాక కాసేపు టీవీ చూసి లేదా అలా వాకింగుకి వెళ్ళి వచ్చేవాళ్ళం . అప్పుడప్పుడు సెకండ్ షోకి కూడా వెళ్ళేవాళ్ళం. కాని ఇప్పుడు???.
అసలు ఎవడు చూపించాడో కాని ఈ తెలుగు రాయడం . బ్లాగు రాయడం. ముందు నెట్ సెంటర్ కెళ్ళి రెండు మూడు గంటలు కూర్చునేవారు. తరువాత వాయిదా పద్ధతిలో కంప్యూటర్ కొన్నారు. రాగానే బట్టలు మార్చుకుని మొహం కడిగి ఏమోయ్ టీ అంటూ ఆర్డరేసి దాని ముందు సెటిల్ అయ్యేవారు. కొత్తలో అది ఎలా వాడాలో నేర్చుకుని మెల్లగా తెలుగు టైపింగ్ ఎలా చేయాలో తెలుసుకుని బ్లాగులు చదవడం మొదలెట్టారు. ఒక మంచిరోజు చూసి బ్లాగు మొదలెట్టి రాయడం మొదలెట్టారు. నేను వంటతో సతమతమవుతూ పిల్లల హోంవర్క్ చేయించేదాని. పోనీలే మన మాతృభాష కదా మంచిదే అని…టిఫిన్ లేకుండానే టీ ఇచ్చినా అలాగే కూర్చునేవారు. చూద్దాం అడుగుతారో లేదో అని నేను ఎన్ని రోజులు చూసా! ఊహూ…సర్లే నాకే పని తప్పింది అని ఊరకున్నా.
ఆఫీసులో అన్ని బ్లాక్ చేసి ఉంటాయంట. అందుకే ఇంటికి రాగానే ముందుగా కంప్యూటర్ స్విచ్చి ఆన్ చేస్తూ చెప్పులు విప్పుతారు. ముందుగా తను రాసిన టపాకు వచ్చిన కామెంట్స్ చదవడం , తర్వాత కూడలి, తేనేగూడు ఇలా అన్ని మెయిల్స్ చూసేసరికి రెండుగంటలు. అయన వెనకాల ఇంట్లో ఏం జరుగుతుందో , ఎవరెలా ఉన్నారో ఎమీ పట్టదు. ప్చ్ ….ఇవన్నీ నాకెలా తెలుసనుకుంటున్నారా? ఆడవాళ్ళం ఒకసారి ఒకే పని చేయం కదండీ. నా పని చేస్తూనే ఆయన మీద ఓ కన్నేసి చూస్తుంటా. ఎవరైనా ఆడాళ్లతో చాటింగ్ గట్రా చేస్తున్నారేమో అంత ధీర్ఘంగా కూర్చుంటే అని సందేహం కూడా కలిగింది. పోనీలే పోనీలే అని ఊరుకుంటే ఈ బ్లాగ్పిచ్చి పెరుగుతూనే ఉంది. పైగా ఇంటికొచ్చిన ప్రతి వారితో బ్లాగులగురించి ముచ్చట్లు. మా తమ్ముడికి కూడా చెప్పబోతుంటే వాడిని పంపేసా వెళ్ళరా మీ ఆవిడ ఎదురుచూస్తుందని. నా కష్టాలు తెలిసి తెలిసి వేరొకరిని పడనిస్తానా.
ఇవన్నీ చేసి నా వ్రేళ్ళు లాగుతున్నాయి కాస్త జండూబామ్ రాయవే అంటారు రాత్రి ..తిక్క రేగి నేను పెట్టను అని పడుకుంటా .మీరే చెప్పండీ. ఇదేమన్నా బావుందా. ఆ కంప్యూటర్ నాకు సవతి అయినట్టుంది . ఎప్పుడో దాని కనెక్షన్లన్నీ పీకి పడేస్తాను. కాని అన్నేసి వేలు పోసి కొన్నది కదా మనసు రాదు. రాసుకోండి, చదువుకోండి నేనొద్దనను. మరీ అలా నన్ను పిల్లలను గాలికొదిలేసి అందులోనే మునిగిపొమ్మన్నారా? ఇలాగే మా కాలనీలో నాలాంటి బాధితులు ఓ పదిమంది దొరికారు. సరే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలంటే మేమందరం ఏకమై ఆలోచించాలి. అని సంఘం పెట్టుకున్నాము.
ఓ రోజు ఒకతను వచ్చి “నేను కూడా బ్లాగ్బాధితుడినే . నన్ను చేర్చుకోండి మీ సంఘంలో” అన్నారు . ఆశ్చర్యపోయాము. ఆడాళ్ళవల్ల కూడా బాధింపబడే మొగుళ్ళూన్నారా అని. అతను చెప్పింది విని వెంటనే చేర్చుకున్నాం ..ఇంతకీ ఏమన్నాడో తెలుసా?? “నేను ఆఫీసుకెళ్ళాక బోరు కొడుతుందంటే నా కంప్యూటర్ నేర్పించా … మెల్లిగా బ్లాగు రాయడం నేర్చుకుంది. ప్రొద్దున లేచి మొహం కడుక్కుని టీ తాగుతూ కూడలి చూస్తుంది. అప్పటికింకా ఎవరూ లేవరు . తర్వాత వంట పనీ అదీ త్వరగా పూర్తి చేసి నేను ఆఫీసుకెల్లేది ఆలస్యం మళ్ళీ ఆన్ చేసి అన్నీ చదువుతూ కూర్చుంటుంది. ఇల్లు సర్దేది లేదు . దుమ్ము దులిపేది లేదు. మద్యాహ్నం కాస్త పడుకుంటుందేమో. తన బ్లాగులో కొత్త కొత్త విషయాలు రాయడానికి పుస్తకాలు కొనిమ్మని నాతో పోరు .నేను తెచ్చినవి నచ్చలేదంటే తననే తీసికెళ్ళి దుకాణంలో వదిలేసి చూసుకో నేను బిల్లు కడతా అని పేపర్ చదువుతూ కూర్చున్నా. పోనీలే మాతృభాషాభిమానం కదా అని . ఇప్పుడు పలు రకాల టిఫిన్లు చేయదు. ఎక్కడికన్నా వెళదామంటే మీరెళ్ళండి నేను రాసుకోవాలి . అంటుంది. ఒక్కడిని పార్కుకో సినిమాకో వెళ్ళనా. ఏం చేయాలో తోచటం లేదు . కాస్త మీరన్నా ఉపాయాలు చెప్పండి. మా సంసారాన్ని నిలబెట్టండి.” అంటు వాపోయాడు .
ఇది చదివే వాళ్ళంతా మా సంఘం గురించి మీ భార్యలకు కాని, భర్తలకుకాని చెప్పరని తెలుసు. కాని వారి వద్దకు ఎలా చేరాలో మాకు తెలుసు కాని మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మేము దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాము . బ్లాగులు రాసుకోండి ఎవరూ వద్దనరూ. అందులోను మన తేనెకన్నా తీయనైన మాతృభాష. కాని కాస్త మీ భార్యలు , భర్తలు, పిల్లల గురించి పట్టించుకోండి. ఇలాగే ఉన్నారనుకోండి . పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు.
గత నెలలో ఎయిర్ టెల్ వాడి ఫోన్ బిల్లు తెలుగులో పంపినట్టు గమనించాను. భలే భలే అనుకున్నా.. కాని ఒక్కోటి చదువుతుంటే తికమకగా ఉంది. అదేం తెలుగో ?అదేం పదాలో?? ఇందులో అన్నీ సరియైనవేనా కాస్త చెప్పండి ప్లీజ్..
నాకైతే ఆ బిల్లు లో తెలుగు పదాలు పెట్టినవాడిని ఫోన్ చేసి మరీ తిట్టాలనిపిస్తుంది.
బొమ్మ మీద తట్టి పెద్దగా అయ్యాక చూడండి.. అర్ధమవుతుంది..
ముందుగా బ్లాగ్ మిత్రులందరికీ మైత్రీదినోత్సవ శుభాకాంక్షలు ...
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక? అమ్మ, నాన్న, తమ్ముడు, అత్త, మామ ... ఇలా మన జీవితంలోని ఎన్నో అనుబంధాలను ఆ దేవుడు మనకిచ్చాడు. కాని మనకు మాత్రమే సొంతం పరిమితమైన స్నేహితులను మాత్రం ఎంచుకునే హక్కు మనకే వదిలిపెట్టాడు. మీ బాగోగులు చూసి మిమ్మల్ని ఎల్లప్పుడు వెన్నుతట్టి నడిపే స్నేహితుడిని నువ్వే వెతికి పట్టుకో.పదిలంగా చూసుకో అని మనకు ఒక మహత్తరమైన అవకాశం ఇచ్చాడు ఆ దేవదేవుడు. అదీకాక నీ స్నేహితులను గురించి చెప్పు , నీ గురించి సమస్తం నేను చెప్తాను అని ఎవరో మహానుబావుడు అన్నాడు కూడా. చాలా వరకు బంధాలు, బంధుత్వాలు ఏదో ఒక కారణం, ప్రతిఫలం లేకుండా కొనసాగదు. ఆ బంధం ఎల్లకాలం కొనసాగుతుంది అని చెప్పలేము. ఆ బంధాలను మనం భద్రంగా చూసుకోలేమో కూడా. కాని ఇద్దరు స్నేహితుల మధ్య ఎటువంటి ప్రతిఫలం లేకుండా , ఆడా - మగా, పేదా గొప్ప అనే తారతమ్యాలు ఉండవు.
మనం జీవితప్రయాణంలో కలిసిన ప్రతివారిని ,లేదా పలకరించి కొన్ని సార్లు ముచ్చట పెట్టిన ప్రతీవాళ్లని అంత తేలికగా స్నేహితులుగా చేసుకోలేము కదా. "నా స్నేహితుడు" అని కొందరు ప్రత్యేకమైన వ్యక్తులను మాత్రమే పేర్కొంటాము. నిజమైన స్నేహితులు అంటే మనలోని బాధను మనం చెప్పకుండానే గుర్తుపట్టి దానిని పారద్రోలడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. అంతవరకు మనని వదలరు. నేను ఎప్పుడు నీ వెంట ఉన్నాను అనే మనోధైర్యాన్ని ఇచ్చేది స్నేహితుడే. ఆ స్నేహితుడు తమ జీవితభాగస్వామి ఐతే మరీ మంచిది. మన స్నేహితులు మనకే తెలీని, మనలోదాగి ఉన్న ప్రతిభని గుర్తించి , దానిని బయటకు తీస్తారు. అలాగే ఎప్పటికప్పుడు మనని ఓ కంట కనిపెడుతూ ఎక్కడైనా తప్పటడుగు పడితే వెంటనే హెచ్చరించి సరిచేస్తారు. అంతటి అద్భుతమైన స్నేహితులను పొందడం నిజంగా మన అదృష్టం.వారిని ఎప్పుడు కూడా అనవసరంగా నొప్పించక గాజుబొమ్మలా కాపాడుకోవాలి.
కాని అందరూ ఇలాంటి స్నేహితులు కానక్కరలేదు. అవసరానికి మనతో స్నేహం చేసి, పిమ్మట మననే దుమ్మెత్తి పోస్తూ హేళన చేస్తారు. అప్పుడు బాధపడేది కూడా మనమే. అయ్యో ..నా స్నేహితుడు అకారణంగా నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నాడు అని బాధపడతాము. కాని అవతలి వ్యక్తికి కీడు చేయాలనే ఆలోచన కూడా రాదు. అదే స్నేహానికున్న గుణం, విలువ.. అవసరానికి స్నేహం చేసి తరవాత అవలీలగా దాన్ని తృంచేస్తారు కొందరు. అలాంటప్పుడు స్నేహం అనే బంధం కూడా కంటగింపుగ అనిపిస్తుంది. అందుకే స్నేహంలో కూడా అవతలి వ్యక్తి మీద నమ్మకం ఉండాలి.
జీవితపు ప్రయాణంలో మనకు లక్షలు, కోట్ల కన్నా ఆత్మీయతానురాగాలతో కూడిన స్నేహాన్ని పొందడం ,దాన్ని పదిలంగా భద్రపరుచుకోవం చాలా ముఖ్యం. లేకపోతే జీవితం అంటే బ్రతకడానికే కాని మనఃస్పూర్థిగా, అన్ని ఆనందాలను అనుభవిస్తూ జీవించడం కాదు అనిపిస్తుంది.
స్నేహం అనేది తెలీని వ్యక్తుల మధ్యే కాదు . మన కుటుంబ సభ్యులు కూడా స్నేహితుల్లా ఉండాలి. తండ్రి అనగానే దర్పం, అధికారంతో ఉంటేనే పిల్లలు భయపడతారు అనుకోవడం పొరబాటు. పిల్లలతో చేరి ఆటలు, పాటలు, చదువులు అన్నీ పంచుకుంటే వాళ్లు కూడా సంతోషంగా ఉంటారు.ఈ విధంగా వారిని చెడుద్రోవ పట్టకుండా ఆపొచ్చు. వారికి తెలీనివి ఒక మంచి స్నేహితుడిలా చెప్పాలి .. పిల్లలు , తల్లితండ్రులు మంచి స్నేహితుల్లా ఉండడం చాలా మంచిది.అది వారి మధ్య సంబంద బాంధవ్యాలను మరింత దగ్గర చేస్తుంది. కష్టసుఃఖాలను అర్ధం చేసుకుని పంచుకునేలా చేస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కూడా బంధం కంటే స్నేహం ఉండడం ముఖ్యం. ఆ స్నేహం ఎప్పటికి పాతబడదు. ప్రతి విషయం కలిసి చర్చించుకోవడం వల్ల ఎన్నో అపార్ధాలు తొలగిపోతాయి. అనుబంధం పెరుగుతుంది. అనుమానాలు దరిచేరవు. అసలు ప్రతి మనిషిలో స్నేహాన్ని చూడడం అనేది మహోన్నతమైన సద్గుణం..