Sunday 2 August 2009

స్నేహం


ముందుగా బ్లాగ్ మిత్రులందరికీ మైత్రీదినోత్సవ శుభాకాంక్షలు ...


ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక? అమ్మ, నాన్న, తమ్ముడు, అత్త, మామ ... ఇలా మన జీవితంలోని ఎన్నో అనుబంధాలను ఆ దేవుడు మనకిచ్చాడు. కాని మనకు మాత్రమే సొంతం పరిమితమైన స్నేహితులను మాత్రం ఎంచుకునే హక్కు మనకే వదిలిపెట్టాడు. మీ బాగోగులు చూసి మిమ్మల్ని ఎల్లప్పుడు వెన్నుతట్టి నడిపే స్నేహితుడిని నువ్వే వెతికి పట్టుకో.పదిలంగా చూసుకో అని మనకు ఒక మహత్తరమైన అవకాశం ఇచ్చాడు ఆ దేవదేవుడు. అదీకాక నీ స్నేహితులను గురించి చెప్పు , నీ గురించి సమస్తం నేను చెప్తాను అని ఎవరో మహానుబావుడు అన్నాడు కూడా. చాలా వరకు బంధాలు, బంధుత్వాలు ఏదో ఒక కారణం, ప్రతిఫలం లేకుండా కొనసాగదు. ఆ బంధం ఎల్లకాలం కొనసాగుతుంది అని చెప్పలేము. ఆ బంధాలను మనం భద్రంగా చూసుకోలేమో కూడా. కాని ఇద్దరు స్నేహితుల మధ్య ఎటువంటి ప్రతిఫలం లేకుండా , ఆడా - మగా, పేదా గొప్ప అనే తారతమ్యాలు ఉండవు.



మనం జీవితప్రయాణంలో కలిసిన ప్రతివారిని ,లేదా పలకరించి కొన్ని సార్లు ముచ్చట పెట్టిన ప్రతీవాళ్లని అంత తేలికగా స్నేహితులుగా చేసుకోలేము కదా. "నా స్నేహితుడు" అని కొందరు ప్రత్యేకమైన వ్యక్తులను మాత్రమే పేర్కొంటాము. నిజమైన స్నేహితులు అంటే మనలోని బాధను మనం చెప్పకుండానే గుర్తుపట్టి దానిని పారద్రోలడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. అంతవరకు మనని వదలరు. నేను ఎప్పుడు నీ వెంట ఉన్నాను అనే మనోధైర్యాన్ని ఇచ్చేది స్నేహితుడే. ఆ స్నేహితుడు తమ జీవితభాగస్వామి ఐతే మరీ మంచిది. మన స్నేహితులు మనకే తెలీని, మనలోదాగి ఉన్న ప్రతిభని గుర్తించి , దానిని బయటకు తీస్తారు. అలాగే ఎప్పటికప్పుడు మనని ఓ కంట కనిపెడుతూ ఎక్కడైనా తప్పటడుగు పడితే వెంటనే హెచ్చరించి సరిచేస్తారు. అంతటి అద్భుతమైన స్నేహితులను పొందడం నిజంగా మన అదృష్టం.వారిని ఎప్పుడు కూడా అనవసరంగా నొప్పించక గాజుబొమ్మలా కాపాడుకోవాలి.



కాని అందరూ ఇలాంటి స్నేహితులు కానక్కరలేదు. అవసరానికి మనతో స్నేహం చేసి, పిమ్మట మననే దుమ్మెత్తి పోస్తూ హేళన చేస్తారు. అప్పుడు బాధపడేది కూడా మనమే. అయ్యో ..నా స్నేహితుడు అకారణంగా నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నాడు అని బాధపడతాము. కాని అవతలి వ్యక్తికి కీడు చేయాలనే ఆలోచన కూడా రాదు. అదే స్నేహానికున్న గుణం, విలువ.. అవసరానికి స్నేహం చేసి తరవాత అవలీలగా దాన్ని తృంచేస్తారు కొందరు. అలాంటప్పుడు స్నేహం అనే బంధం కూడా కంటగింపుగ అనిపిస్తుంది. అందుకే స్నేహంలో కూడా అవతలి వ్యక్తి మీద నమ్మకం ఉండాలి.



జీవితపు ప్రయాణంలో మనకు లక్షలు, కోట్ల కన్నా ఆత్మీయతానురాగాలతో కూడిన స్నేహాన్ని పొందడం ,దాన్ని పదిలంగా భద్రపరుచుకోవం చాలా ముఖ్యం. లేకపోతే జీవితం అంటే బ్రతకడానికే కాని మనఃస్పూర్థిగా, అన్ని ఆనందాలను అనుభవిస్తూ జీవించడం కాదు అనిపిస్తుంది.



స్నేహం అనేది తెలీని వ్యక్తుల మధ్యే కాదు . మన కుటుంబ సభ్యులు కూడా స్నేహితుల్లా ఉండాలి. తండ్రి అనగానే దర్పం, అధికారంతో ఉంటేనే పిల్లలు భయపడతారు అనుకోవడం పొరబాటు. పిల్లలతో చేరి ఆటలు, పాటలు, చదువులు అన్నీ పంచుకుంటే వాళ్లు కూడా సంతోషంగా ఉంటారు.ఈ విధంగా వారిని చెడుద్రోవ పట్టకుండా ఆపొచ్చు. వారికి తెలీనివి ఒక మంచి స్నేహితుడిలా చెప్పాలి .. పిల్లలు , తల్లితండ్రులు మంచి స్నేహితుల్లా ఉండడం చాలా మంచిది.అది వారి మధ్య సంబంద బాంధవ్యాలను మరింత దగ్గర చేస్తుంది. కష్టసుఃఖాలను అర్ధం చేసుకుని పంచుకునేలా చేస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కూడా బంధం కంటే స్నేహం ఉండడం ముఖ్యం. ఆ స్నేహం ఎప్పటికి పాతబడదు. ప్రతి విషయం కలిసి చర్చించుకోవడం వల్ల ఎన్నో అపార్ధాలు తొలగిపోతాయి. అనుబంధం పెరుగుతుంది. అనుమానాలు దరిచేరవు. అసలు ప్రతి మనిషిలో స్నేహాన్ని చూడడం అనేది మహోన్నతమైన సద్గుణం..

9 వ్యాఖ్యలు:

తృష్ణ

baagundi.baagaa raasaaru.

psm.lakshmi

కుటుంబ సభ్యులమధ్య స్నేహం..చక్కగా చెప్పారు. మీరు పెట్టిన బొమ్మ చాలా చాలా బాగుంది.
psmlakshmi

Srujana Ramanujan

Nice post.

Padmarpita

స్నేహితులదినోత్సవ శుభాకాంక్షలు!!!

శ్రీలలిత

జ్యోతిగారూ,

స్నేహమంటే ఏమిటో, అది ఎలా వుండాలో చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా ఈ
రోజుల్లో మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు తగ్గిపోతున్న సమయంలొ ఒక్క
స్నేహితుడే మనకు సాంత్వన కలిగించగలిగే మనిషి. చేయి చాచి స్నేహాన్ని
అందిస్తే అది అందుకోలేని వ్యక్తి ఎంత దురదృష్టవంతుడో అనిపిస్తుంది. కాని
మనం అలా కాదు కదా. ఎవరైనా పలకరించడం చాలు.. ప్రాణం పెట్టేస్తాం. హాయిగా
స్నేహితులతో కలిసి సరదాగా నవ్వుకుంటే వుండే సంతోషం ఎన్ని కోట్లు వుంటే
వస్తుంది చెప్పండి.


మీ శ్రీలలిత

పరిమళం

చాలా బాగా చెప్పారు బొమ్మ బాగుంది.
happy friendship day!

కెక్యూబ్ వర్మ

స్నేహమేర జీవితం, స్నేహమేర శాశ్వతం అన్న గీతం మరల గుర్తు తెచ్చారు. స్నేహితుల మద్యే కాదు కుటుంబ సభ్యుల మద్యన కూడా అరమరికలు లేని స్నేహం జీవితానికి పరిపూర్ణత్వాన్నిస్తుందని బాగా చెప్పారు. ధన్యవాదాలు.

జ్యోతి

తృష్ణ, మాల, లక్ష్మి, సృజన,పద్మ,లలిత,వర్మ ..
ధన్యవాదాలు.

నిజంగా రక్తసంబంధంకంటే మిన్నయైనది స్నేహబంధం. రెండేళ్లక్రిందవరకు నాకు మనసువిప్పి మాట్లాడుకునేందుకు స్నేహితులు లేరు.కాని అంతర్జాలానికి వచ్చాక మంచి స్నేహితులు కలిసారు. ఈ టపాలో చెప్పినవన్నీ నా అనుభవాలే. నా మూడ్ బాలేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటే కావాలని వచ్చి డిస్టర్బ్ చేసేది మన మేలు కోరే స్నేహితులే కదా.. ఇక కుటుంబ సభ్యుల మధ్య తప్పకుండా అనుబంధంతోపాటు స్నేహం ఉండాలి. అది నిత్యనూతనం.మీరు కూడా మీ అమ్మను మీ ఫ్రెండ్ గా చేసుకోండి. నేను మాత్రం ఈ సూత్రాన్ని తప్పక పాటిస్తాను. మా పిల్లలతో కుటుంబ ఆర్ధిక సమస్యలతో పాటు సినిమా ముచ్చట్లు, పెళ్లి, కట్నం,వగైరా సమస్యలు సమానంగా చర్చిస్తాను. దానివల్ల వాళ్లకు తెలియని విషయాలెన్నో మనం చెప్పొచ్చు. దానికి మనం కూడా వారితో సమానంగా ఉండాలి. నా బ్లాగులోని ఎక్కువ టపాలలోని అంశాలు మావారితో చర్చ జరిపినవే. నాకు సమాధానం దొరకక ఇక్కడ అడుగుతాను. ముఖ్యంగా బార్యాభర్తల మధ్య స్నేహం అనే బంధనం ఉండాలి. అఫ్పుడు సంసారజీవితం ఆహ్లాదంగా, హాయిగా ఉంటుంది.

Unknown

sneham annivayassularitonu undali happy friendshipday

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008