Sunday 4 April 2010

జీవితపు పరమార్ధం - ఏప్రిల్ 2010 కంప్యూటర్ ఎరా ఎడిటోరియల్

అందరికీ అన్నీ తెలిసినవే ! తమకు తెలియనివి కొన్ని విషయాలు ఉంటాయనీ, తమనితాము వ్యక్తిత్వపరంగానూ, జ్ఞానంలోనూ ఉన్నతుల్ని చేసుకోవడానికి మరింత కృషి చేయవలసి ఉందని గ్రహించేవారే లేరు. 'ఇప్పటికి తెలిసింది చాల్లే..' అనే ధీమా, 'తెలుసుకుని ఏం చేస్తాం...' అనే ఉదాసీనతా అందరి మెద్దళ్లకూ తాళం వేస్తోంది. ఆ బంధనాలు తెరుచుకునేవరకూ కొత్త విషయమేదీ మన బుర్రలను తాకలేదు. ఎక్కడ చూసినా జీవితం అంటే ఓ రకమైన నిర్లిప్తత! ఏదోలా రోజులు గడిపేస్తే చాలనే నిరాసక్తి, మన జీవితానికి పరమార్ధమేమిటో అంతుపట్టని స్థితిలో కూరుకుపోయి ఉంటున్నాం. అందుకే కోటికో, నూటికో తప్ప ఏ జీవితానికీ నిర్ధిష్టమైన లక్ష్యాలు ఉండవు. జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న దాఖలాలు కనిపించవు. ఒక గమ్యం మనిషిని శక్తివంతం చేస్తుంది..ఆ శక్తి ఎంతో ధైర్యాన్నిస్తుంది. ఆ ధైర్యం ఆనందాన్ని ప్రసాదిస్తుంది. రోజువారీ యాంత్రిక జీవితంలో గడుపుతున్న ప్రతీ క్షణాన్ని బేరీజు వేసుకుని ఎంత పరిమిత చట్రంలో మనల్ని మనం ఇరికించుకున్నామో అర్ధం చేసుకోగలిగితె .. ఆ చట్రపు సరిహద్దులను మానసికంగానైనా దాటగలిగితే మరింత విస్తృతమైన జీవితపు పరిధిలోకి మన ఉనికిని వ్యాపింపచేసుకోవడానికి ప్రయత్నాలు ఆరంభిస్తాం.



ఈ క్షణం మనది. ఈ క్షణాన్ని ఈ ప్రపంచంలో మనం గడపగలుగుతున్నందుకు ఎంతో సంతోషించాలి. ఆ సంతోషం కలగాలంటే కాలం యొక్క విశిష్టత అర్ధం కావాలి, కాలాన్ని భారంగా గడిపినంత కాలం సంతోషం ఎక్కడనుండి వస్తుంది? మనకు నిరంతరం ఎన్నో సవాళ్లు, మానసిక వత్తిడులు! ఇన్ని ఇబ్బందుల మధ్య జీవితమెందుకా అన్నంత వైరాగ్యతా వెంటాడుతూనే ఉంటుంది. అయినా ఆ వత్తిడి నుండి ఊరట లభించి మెరుగైన జీవితం వైపు మన గమ్యం మరలినప్పుడు కలిగే ఆనందం ముందు ఈ సవాళ్లేపాటి? ఒత్తిడులను మెదడుకెక్కించుకున్నంత బలంగా మనం మెరుగైన జీవితపు క్షణలను సంతోషంగా అనుభవించం. అందుకే ఆనందమూ మనల్ని సంతుష్టులని చెయ్యలేదు. ఎలాగోలా ఇబ్బందికరమైన జీవితం నుండి మెరుగైన క్షణాలను అనుభవిస్తున్నామన్న ఊరటే మనసులో నిలుపుకుంటాం తప్ప గతంలో అనుభవించిన ఇబ్బందికరమైన జీవితాన్ని ప్రస్తుతపు ఆనందంతో ముడిపెట్టకుండా దీన్ని మనసారా ఆస్వాదించము. లక్ష్యాలు నిర్దేశించుకోవడం, వాటికోసం కృషి చేయడం, బాధ్యతలు నిర్వర్తించడం వంటివి బలవంతంగా చేయాల్సిన పనులు కాదు. ఒక్కోసారి ఎటూ చెయ్యక తప్పని పనుల్ని కూడా ప్రపంచాన్ని మోస్తున్నంత భారంగా చేస్తుంటాం.. అలసట రాక ఏం చేస్తుంది? అందరూ చెప్తుంటారు.. 'ప్రతీ పని ఇష్టంలో చేయాలి కానీ కష్టంతో కాదూ అని! ఆ సత్యం విని వినీ దాని సారం మాత్రం బుర్రకు ఎక్కించుకోలేకపోతున్నాం. ఆచరణలో దాన్ని అనుసరిస్తెనే వృత్యాసం అవగతమవుతుంది. ఒక్కటి మాత్రం నిజం... జీవితం అంటే ఏదోలా రోజుల్ని, సంవత్సరాల్ని గడిపేయడం కాదు.. ప్రతీ జీవితానికి ఓ అర్ధం ఉండాలి.. ఎన్నో నేర్చుకోవాలి... ఎంతో ఎదగాలి. అలాగే మానసికంగా అంతే ఒదిగిపోవాలి. అదే నిజమైన జీవితం...

మీ
నల్లమోతు శ్రీధర్...

5 వ్యాఖ్యలు:

S. Suresh

Chaalaa baaga teliyajesaaru sridhar gaaru.

SADASIVARAO

బహు చక్కటి ఎడిటోరియం వ్రాశారు. చాలా బావుంది. చాలా మంది గమ్యం లేకుండానే కాలం వెల్లదీస్తున్నారు.ఏదో ఎలా జరగాలని వుంటే అలా జరుగుతుంది పలాయన విధానమన్నమాట .చాలామందికి లక్ష్యాలు వుండవు మీరన్నట్టుగా, మీ ఎడీటోరియం తప్పనిసరిగా కొందరికైన ఉత్తేజమిస్తుందని భావిస్తున్నా ! . ...............................................................సదాశివరావు

srinivasrjy

ఎడిటోరియల్స్ లొ చెప్పేవి బాగానే ఉంటాయి...
అనుసరించేవారే కరువయ్యారు ( శ్రీధర్ తో పాటు కలిపి )
..
నిజానికి నేను రెగ్యులర్ "ఎరా" రీడర్ ని... క్రొద్ది మాసాలలోనే ఎరా తో పాటూ శ్రీధర్ కూడా మారాడు...
గమనింఛారా???

జ్యోతి

శ్రీనివాస్ గారు,

కాలంతో పాటు మనుష్యులూ , వారి ప్రవర్తన మారుతుంటుంది. మనకు కలిగే అనుభవాలు, స్నేహితులనుకున్నవారి స్వభావాల మూలంగా ప్రతీ మనిషి మారక తప్పదు.

Unknown

@ సురేష్ గారూ, ధన్యవాదాలు.
@ సదాశివ గారూ, ధన్యవాదాలండీ.

@ శ్రీనివాస్ గారూ, ధన్యవాదాలండీ.. మీ పనులు మానుకుని మరీ నన్ను మీ ఊహల్లో గమనిస్తూ "నేను మారానని" నిర్థారణకు వచ్చినందుకు :) ఒక మనిషిలో మార్పుని అసలు పరిచయం లేకుండానే, నేరుగా ఒక్కక్షణం కూడా స్పెండ్ చెయ్యకుండానే ఇంత సులభంగా గ్రహించి స్టేట్ మెంట్లు ఇచ్చేయొచ్చని నాకు తెలియదు. హ్యాట్సాఫ్! ఇకపోతే జీవితంలో మార్పులు సహజం. నేను మరింత పరిపూర్ణ మనిషిగా మారుతూ ఉన్నానా, దిగజారిపోతున్నానా అన్నది నా మనస్సాక్షికి మాత్రమే తెలుస్తుంది. నా మనస్సాక్షిని నేనెప్పుడూ చంపుకోను.

ఇకపోతే చెప్పేవి బాగానే ఉంటాయి, అనుసరించేవారే కరువయ్యారు అన్నారు... హహహహహ కరెక్టే. నేను రాసేవి నేను అనుసరిస్తున్నానా లేదా అన్నది నా లైఫ్ స్టైయిల్ ని, నా ఆలోచనా విధానాన్ని నా బుర్రలోకి పరకాయ ప్రవేశం చేసి మరీ అన్వేషించి తెలుసుకోజూసినందుకు కూడా మీకు ధన్యవాదాలు. నాతో సహా మనం అందరం మూర్ఖులుగా ఎందుకు ఉంటున్నామంటే ఎక్కడైనా నాలుగు మంచి మాటలు రాయబడి ఉంటే వాటిని మనసుకు స్వీకరించి ఆచరించడానికి బదులు చెప్పిన వ్యక్తి ఆచరిస్తున్నాడా లేదా అని పనిలేని పనిపెట్టుకుని అవతలి వ్యక్తి మీద అపోహలు వస్తే మనమూ ఆచరించడం మానేస్తున్నందున! మంచి మాటలు మనం ఆచరిస్తే బాగుపడతాం, రాసిన నాబోటి వారు ఆచరించకపోతే ఆ నష్టం మాబోటి వారికే తప్ప మీకు కాదు కదా?

మీరు నా గురించి ఎలా అనుకున్నా, మీరే కాదు ఎవరైనా నా గురించి ఏం అనుకున్నా నాకు ఇబ్బంది లేదు. నేనేంటో నాకు తెలిసినప్పుడు ఎవరెలా ఊహించుకుంటే, భావించుకుంటే నాకేంటి? బట్ ఒక మనిషిని అన్ని కోణాల్లో పరిశీలించి, వీలైతే ఆ మనిషిని కొంతకాలంపాటు సమీపంగా గమనించి వారిలోని మంచి గుణాలు, చెడ్డగుణాలు పూర్తిగా అర్థమైన తర్వాత అభిప్రాయానికి రావడం మంచిదేమో.. ఆలోచించండి. అది మీ ఇష్టం!! ఇది మీకు నేను ఇచ్చే చివరి రిప్లై. ఈ విషయాన్ని కొనసాగించడం, సమయం వృధా చేసుకోవడం నాకిష్టం లేదు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008