Friday, 29 October 2010

హ్యాపీ బర్త్ డే నేస్తమా...







.వె! కష్టకాలమందు కడగళ్ళ వానలో
తడసి అలసి యున్న తరుణమందు
సేద దీర్చి, నాకు బోధను జేసిన
మాట మరువగలనె! మాన్య మూర్తి!

.వె! మంచి పంచి ఇచ్చు మనుజులు యెందరు?
మార్గదర్శి గాను మదిని నిలిచి
మంచి గంధమోలె పంచిన నెయ్యము
వీడదెపుడు తావి, వీసమయిన.

.వె! జన్మ దినము నేడు! సన్మంగళము నీకు!
జయము గలుగునెపుడు జగతి యందు,
ఆది దేవుడిచ్చు ఆయువు నిండుగ!
శుభము గలుగు నీకు నభయ మిదియె!

Tuesday, 26 October 2010

టంటంట టంటంట

ఒకరోజు భోజరాజు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా సభకు వచ్చాడు. సింహాసనం మీద కూర్చుని "టంటంట" అంటూ కూనిరాగం తీయసాగాడు. అలా కూనిరాగం తీస్తూనే సభకు వచ్చిన కవులను, మంత్రులను పలకరించాడు. ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాని ఇదేంటని అడగడానికి ధైర్యం చాలడంలేదు. మంత్రి సభను ప్రారంభించడానికి మహారాజు అనుమతి కోరి సభలోని కవులకు ఆనాటి సమస్యను ఇవ్వమన్నాడు.. దానికి కూడా రాజు ""టంటంట టంటం - టంటంట టంటః " " అన్నాడు. ఇది ఆఖరి పాదంగా తీసుకొని మిగిలిన మూడు పాదాలు చెప్పి శ్లోకాన్ని పూర్తి చేయమన్నాడు. అది విన్న కొందరు కవులకు కోపం వచ్చింది, కొందరికి ఆశ్చర్యమేసింది. మరికొందరు మహారాజుకు మతిపోయిందేమో అనుకున్నారు కూడ. కాని మహాకవి కాళిదాసు మాత్రం ఎటువంటి భావం చూపకుండా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అప్పుడు మహారాజు " మహాకవీ! " "టంటంట టంటం - టంటంట టంటః " " ఇంద్ర వజ్ర వృత్తంలో పాదం ఇది. ఈ వృత్తం మీకు కొట్టినపిండి కదా కానివ్వండి మరి " అన్నాడు.

కాళిదాసు ఊరుకుంటాడా? కొద్ది క్షణాలు ఆలోచించుకుని ఇలా చెప్పాడు.

"రాజ్యాభిషేకే మద విహ్వలాయా:
హస్తాత్ చ్యుత: హేమ ఘట: యువత్యా!
సోపాన మార్గేషు కరోతి శబ్దం
"
టంటంట టంటం - టంటంట టంటః "

రాజుగారికి పరిచారికలు స్నానం చేయిస్తున్నారు. వారిలో ఒక పరిచారిక రాజుగారి అందాన్ని చూస్తూ మైమరచి తన చేతిలోని బంగారుగిన్నె జారవిడిచింది. ఆ గిన్నె స్నానఘట్టం మెట్ల మీదుగా దొర్లుతూ, రాజుగారు చెప్పినట్టు..."టంటంట.. టంటంట.. టంటంట.. టంటంట " అని మోత చేసింది .. అంతే..

ఎంతైనా మహాకవి . రాజుగారి మన:స్థితి తెలిసినవాడు కదా..

అసలు చందస్సు గుర్తుపెట్టుకోవడానికి ఇలా ఓ కూనిరాగం కొండగుర్తుగా పెట్టుకుంటే బావుంటుంది కదా. ఎలాగంటారా?? గుర్వులూ, లఘువులూ, గణాలు అంటూ కష్టపడి గుర్తుపెట్టుకునే బదులు హాయిగా టటట లేదా లలలా అంటూ పద్యపాదం గుర్తుపెట్టుకుంటే సరి.

ఉదా.. ఉత్పలమాల లో భరనభభరవ అని బట్టీయం పట్టేబదులు ఇలా ఐతే ఎలా ఉంటుంది చూడండి..

టాటట, టాటటా, టటట, టాటట, టాటట,టాటటా, టటా!
బూవులు గోట మీ టుతఱిఁ బోయెడు తేఁటుల మ్రోఁత కా మి శం

మరో విధానం చూద్దాం..
మత్తేభంలో సభరనమయవ అని గణాలు గుర్తుపెట్టుకునే బదులు ఇలా ప్రయత్నించి చూడండి.
లలలా లాలల లాలలా లలల లా లాలా లలాలాలలా
అరి చూ చున్ హరి చూచు సూ చకము లై అందంద మందార కే

మరి ఆలస్యమెందుకు? మీరు ఈ కొత్త ప్రయోగం మొదలెట్టండి..

Sunday, 17 October 2010

అమ్మలగన్నయమ్మ...


శ్రీలన్ భక్తులపాలు సేసి; మహదాశీర్వాదముల్ కొల్పి; నీ
మ్రోలన్ భక్తిగ వ్రాల జేసి; సుజనామోదంబుగా నుండగా
లీలన్ జేతువు భక్తులన్ కరుణతో లీలావతీ! నీ కృపన్
జాలన్ వర్ణన సేయగా ననుపమా! ఛాముండికా! శాంభవీ!



నవ దుర్గా మహనీయ భావముల నానందంబుగాఁ జూపగా
నవ మాసంబులు మ్రోయు తల్లివిగ నానా రూప సంపూజ్యగా;
ధవళాక్షీ వర సౌమ్య రూపవతిగా; దాక్షాయినీ! వెల్గెదే?
శివసన్మానస హారిణీ! మముల నాశీర్వాదమున్ దేల్చుమా!



కాల విచిత్ర చక్రమున కల్పనలెవ్వియొ? గమ్య మెద్దియో?
చాల మెఱుంగ మేము. నెఱ జాణవు నీవ! మహేశ్వరీ! కృపన్
జాలము సేయకమ్మ! వివశత్వులఁ గాంచుమ! కావుమా! మహా
భీల మదాది రుగ్మతల పీచ మడంచుమ. భక్త బాంధవీ!
జ్యోతిస్వరూపిణిగ; భీతాపహారిణిగ; నీతి ప్రదీపిని వనన్
నీ తీరు జూపగ గుణాతీతుడే పొగడ; భాతిన్ కవిత్వ మగుచున్
శ్వేతాశ్వధాటిగ ప్రభాతారు ణాద్భుత ప్రపూ తామృతాంశ మనగా
మాతా! జనింప గదె? నా తప్పులన్ మరచి; మాన్యత్వముం గొలుపగా!

దుర్గమ మైన నీ హృదయ దుర్గము నీశ్వరుడేలు గాదే! మా
దుర్గ వటంచు మ్రొక్కితిమి దుష్టత బాపి; గ్రహింప రాదొకో?
భర్గుఁడు భక్త బాంధవుఁడు. భార్గవి వీవు గణించి; మమ్ము నీ
వర్గమునందు చేర్చి; వర భక్తి ప్రపత్తుల గొల్వఁ జేయుమా!




పద్యరచన: చింతా రామకృష్ణ
పద్యగానం : సనత్ శ్రీపతి


Wednesday, 13 October 2010

పాటలపల్లకి

ఇవాళ ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. మా ఇద్దరిది ఒకే కులం. అదేనండి ఇద్దరం హైదరాబాదు వాళ్ళం, ఇంకా వనితా కాలేజి విద్యార్థినులం అన్నమాట. కాని పరిచయం అయింది ఆరునెలల క్రింద మాత్రమే. తను దుర్గ. సరే తను ఏం చేస్తుంది అంటే. పూసలు మొదలైనవాటితో ఎన్నో రకాలైన నగలు చేస్తుంది కూడాను. ఆ నగలన్నీ ఇక్కడ చూడొచ్చు. ఒకవైపు భయంకరమైన వ్యాధి తనపై తరచూ దాడి చేసి హింసిస్తున్నా కూడా తట్టుకుని, ధైర్యంగా ఎదుర్కుంటూ, మధురమైన పాటలతో teluguone సైట్లో పాటల పల్లకి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఆ పాటల పల్లకి రెండో వార్షికోత్సవ సందర్భంగా చేసిన ప్రత్యేక కార్యక్రమం. ముందుగా తన గురించి తన మాటల్లోనే తెలుసుకుందాం..

పాటలపల్లకి, నా అనుభవాలు - దుర్గ

నేను పాటలపల్లకి గత 2 ఏళ్ళుగా టోరి వారికి చేస్తున్నాను. పాటలపల్లకి ప్రత్యేకత యెమిటంటే మనం అరుదుగా వినే పాటలు, పాత, కొత్త పాటలు మంచి సాహిత్యం, మంచి సంగీతం కలిగి వున్న పాటలను ఎన్నుకొని వాటికి నా వ్యాఖ్యానాన్ని జోడించి రాసి ప్రసారం చేస్తూ ప్రారంబించడం జరిగింది. తర్వతర్వాత మరి కొన్ని విషయాలు నాకు తెలియకుండానే చోటు చేసుకోవడం జరిగాయి. శ్రోతలు నాకు ఆత్మీయులయ్యారు, సో అందుకని వారితో అన్ని కబుర్లు, కాకరకాయలు, ముచ్చట్లు పెట్టడం అలవాటయ్యింది. కాని నాకు మొదటి వార్షికోత్సవం వరకు నా ప్రోగ్రాం ఎవరైనా వింటున్నారో లేదో, ఎవరికైనా నచ్చిందో లేదొ నాకు తెలియదు. శ్రోతలకిష్టమైన పాటలు పంపిస్తే నేను నా వ్యాఖ్యానాన్ని జోడించి మొదటి వార్షికోత్సవంలో ప్రసారం చేస్తానన్ని ప్రకటించడంతో నా అనుమానాలన్ని పటాపంచలు చేస్తూ ప్రపంచం నలుమూలలనుండి కేవలం పాటలు కోరడమే కాదు, పాటలపల్లకి వారి జీవితాల్లో ఎలా ముఖ్యమైన భాగమైపోయిందో ఎంతో మంది శ్రోతలు వారి అభిప్రాయాలు రాసి నన్ను వారి అభిమానంతో ఉక్కిరి బిక్కిరి చేసేసారు.
నా అనారోగ్యం వల్ల ఒకోసారి మానేద్దామా అని ప్రోగ్రాం చేయలేనప్పుడు ఆలోచన వచ్చినా మళ్ళీ నొప్పి తగ్గగానే ఎప్పుడెప్పుడు ప్రోగ్రాం చేద్దామా ఈసారి శ్రోతలతో ఏం కబుర్లు చెబుదామా అనే ఆతృత పెరిగేది.

2వ వార్షికోత్సవం ఒక ప్రఖ్యాత సినీ గేయ రచయిత ఇంటర్వ్యూ చేసి శ్రోతలను ఆశ్చర్యంలో ముంచేద్దామనుకున్న నా ప్రయత్నం ఫలించలేదు అందువల్ల మళ్ళీ అదే అయిడియాని వుపయోగించుకున్నా ఈ సారి కొంచం ప్రత్యేకంగా వుండాలని శ్రోతలను బాగా కదిలించిన, స్ఫుర్తిని కలిగించిన, ప్రేమ భావాలను మేల్కొలిపినా, ఒక్క మాటలో చెప్పాలంటే వారిని బాగా ప్రభావితం చేసిన పాటలను పంపించమన్నాను. మా నాన్నగారికి, మా నాన్నలాంటి నాన్నలందరికి అంకితం చేసిన కార్యక్రమం విని ఎంతో మంది సుమారుగా నేనెదుర్కున్న పరిస్థితులనే వారు ఎదుర్కున్నారని వారి అనుభవాలను నాతో పంచుకున్న శ్రోతలందరికి, అలా పంచుకుంటూ మంచి స్నేహితులుగా అయిన వారికి మన:స్ఫుర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాటలపల్లకి గురించి చెబితే సరిపోదు ప్రతి ఒక్కరూ వినాలి, విని ఎవరికివారే అనుభూతిని పొందాలి. టోరిలో ప్రసారమయ్యే పాటలపల్లకి దుర్గ కార్యక్రమం కాదు పాటని ఇష్టపడే ప్రతి ఒక్కరి సొత్తు పాటలపల్లకి!

మరి ఆ మధురమైన పాటలు విందామా..




Monday, 11 October 2010

స్వరాల ఊయలూగు వేళ ...

మనం ఎన్నో పాటలు వింటుంటాం. చూస్తుంటాం కదా!. వేల పాటల్లో కొన్నిమాత్రమే మనకు ఎప్పటికీ స్పెషల్ గా అనిపిస్తాయి. ఆ పాటలు ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఎందుకంటారు?. ఆ పాటల సంగీతం, సాహిత్యం, ఆయా గాయకుల స్వరం, చివర్లో ఆ నటీనటుల అభినయం.. ఇవన్నీ కలిసి మనకో మరపురాని, మరవలేని అనుభూతిని ఇస్తాయి. ఆ పాటలు విన్నప్పుడు మనం చేస్తున్న పనులు ఆపేసి అందులో లీనమైపోతాం. అది పూర్తయ్యేవరకు ఆ మత్తులోనే మునిగిపోతాం. కాదంటారా? అలాగే ఆ పాటల పదాల సయ్యాటలో ఊయలూగుతాము. తలలూపుతాం.. మనమూ ఊగుతాం. ఏమంటారు? నాకైతే ఈ మూడు పాటలు అలాంటి అనుభూతిని ఇస్తాయి. రెపీటెడ్ గా ఐదుసార్లన్నా వింటాను. :)



క్షణక్షణం చిత్రంలోని ఈ పాటలోని బాలు పదాల విరుపులు, సంగీతం ఒకదానికొకటి కలిసి అల్లరి చేసేస్తాయి. బాధపడుతున్న హీరోయిన్ ని నిద్రపుచ్చడానికి హీరో పాడిన ఈ జోలపాట వింటుంటే మనమూ ఆ అడవిలోకి వెళ్లిపోయినట్టు ఉంటుంది. వాళ్ల నటన కూడా ఎంత సహజంగా ఈజ్ గా ఉంటుంది. అమాయకమైన శ్రీదేవి మొహం. దేవుడ దేవుడ అంటూ ఖంగారు పడే దృశ్యం మీకు గుర్తుందా?




సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని ఈ పాట.. అమెరికా అమ్మాయి ఐన మీనా తాతగారి పల్లెటూరికి వచ్చి బావతో పందెం కడుతుంది తన వాయులీనానికి పదాలు కూర్చమని. పచ్చని పంటపొలాలు, పళ్లతోటల మధ్య పరికిణీ, ఓణీ వేసుకుని పొడవాటి జడ దాని చివర ఊగే జడకుప్పెలతో మీనా వాయించే స్వరానికి నాయకుడు అల్లిన పదలహరి కుర్రకారుని గుండెలలో గిలిగింతలు పెట్టదంటారా??




సాగరసంగమంలోని ఈపాట కూడా అద్భుతమని చెప్పవచ్చు. ఈ పాట వింటుంటే బాలు, జానకిలకు జోహారు చెప్పకుండా ఉండలేము. ఎంత మత్తు, మాధుర్యం. ఆ సంగీతం వింటుంటేనే ఆ రాత్రి, చల్లని గాలి మనను కూడా తాకక మానదు. ఒకరిమీద ఒకరికి ప్రేమ ఉన్నా ధైర్యం చేసి చెప్పలేని పరిస్ధితి, మౌనంగానే వాళ్ల మనసు చెప్పే ఊసులు ఈ పాటలో దాగి ఉన్నాయి.

పాటలు వింటుంటే మీకే అర్ధమవుతుంది. వ్యక్తపరచలేని భావాలు. మనసును తాకే మధురమైన సంగీతం..

Thursday, 7 October 2010

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ...

ఈ రోజు మహాలయ అమావాస్య. ఈ రోజునుండి తెలంగాణా ప్రాంతంలో బతుకమ్మ పండగ మొదలువుతుంది. ఇక రేపటి నుండి దేవీనవరాత్రులు. ఈ సందర్భంలో ఈనెల చిత్ర మాసపత్రికలో ప్రచురించబడిన వ్యాసం..



మన పండగలు అనగానే కొత్త బట్టలు, పూజలు, పిండివంటలు మాత్రమే కాదు. ప్రతి పండగకు ప్రత్యేకమైన అర్ధం ,పరమార్ధం ఉంటుంది. ఈ పండగలను ఎంతో సంతోషంగా, నియమ నిష్టలతో జరుపుకుంటారు. కొన్ని పండగలు విశేషంగా ప్రకృతికి సంబంధించినవి అనవచ్చు.. అలాంటి వాటిలో ముఖ్యమైనది బతుకమ్మ పండుగ. తెలంగాణా ప్రాంత సంస్కృతీ, సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టుగా ప్రతిబింబించే ఈ బతుకమ్మ పండగ అంటే ఆడపిల్లలకు చాలా ఇష్టం. కొత్త పెళ్లికూతుర్లు పుట్టింటికి వచ్చి ఎంతోమురిపెంగా ఈ పండగ జరుపుకుంటారు. ఈ పండగలో పేద ధనిక అనే తేడాలు లేకుండా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ పాల్గొంటారు. బతుకు అమ్మా అని ఆ మహాశక్తిని కీర్తిస్తూ జరుపుకునే పండగ బతుకమ్మ పండగ. బతుకమ్మ అంటేనే పూలపండగ. ఈ పండగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికి వర్షాల వాళ్ళ వాగులు,చెరువులు నిండిపోతాయి. రంగు రంగుల పూలు విరబూసి నవ్వుతుంటాయి. ప్రకృతి అంతా పచ్చగా, ఎన్నో రంగులతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ కాలంలో గునుగుపూలు,తంగేడు, బంతి , చామంతి, గోరింట మొదలైన పూలు విరగ కాస్తాయి. అదే విధంగా సీతాఫలాలు కూడా చేతికంది వస్తాయి. జొన్న పంట నేను మాత్రం తక్కువ తిన్నానా అంటూ కోతకు సిద్ధమై వయ్యారంగా తలలూపుతూ ఉంటుంది. ఇలా తమ చుట్టూ ఉన్న పూలను సేకరించి వాటికి అందమైన రూపమిచ్చి ప్రకృతి మాత ఒడిలో ఆడి పాడతారు.


బతుకమ్మ ఆడడం అనేది వినాయక చవితి తర్వాత మహాలయ పక్షం మొదలైన నాటినుండి మొదలవుతుంది. ప్రతి రోజు సాయంత్రం ఇంటిముందు కల్లాపు జల్లి , ముగ్గులు పెడతారు . తరవాత పేడతో గొబ్బెమ్మలు చేసి వాటికి పసుపు, కుంకుమ,పూలు పెట్టి వాకిట్లో ముగ్గు మధ్యలో పెట్టి చుట్టుపక్కల ఉన్న పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళందరూ కలిసి చప్పట్లు కొడుతూ ,పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతారు. అందరికీ ఇదో ఆటవిడుపుగా ఉండేది. అలా అయినా అందరు ఒకదగ్గర చేరి మాట్లాడుకునేవారు. తర్వాత అటుకులు, పుట్నాలు,బెల్లం కలిపి ప్రసాదం పంచుతారు. చివరిలో ఈ గొబ్బెమ్మలను గోడకు పిడకలుగా కొడతారు. మహాలయ అమావాస్య నాడు చిన్న బతుకమ్మ అని పూలతో బతుకమ్మలను చేసి ఆడతారు. ఇలా రోజూ ఆడుతూ తొమ్మిదవ రోజైన దుర్గాష్టమి నాడు పెద్ద బతుకమ్మ లేక సద్దుల

బతుకమ్మ అని ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు మగవాళ్ళు చుట్టూ పక్కల తోటలన్నీ తిరిగి లేకుంటే కొని , గునుగు,తంగేడు, బంతి,చామంతి, మొదలైన పూలు తీసుకొస్తారు. గునుగు పూలను వివిధ రంగుల్లో అద్ది ఆరబెడతారు. ఒక ఇత్తడి లేదా రాగి పళ్ళెం తీసుకుని దాని మీద వెడల్పాటి ఆకులను పరుస్తారు. దానిమీద వివిధ రకాల పూలతో వరుసగా, తీరైన బతుకమ్మను పేరుస్తారు. మధ్య మధ్య వాటిని విడిపోకుండా గట్టిగా అదిమి పెడతారు ఇలా రంగురంగుల బతుకమ్మ పేర్చిన తర్వాత పైన తమలపాకు పెట్టి దాని మీద పసుపుతో చేసిన గౌరమ్మను పెడతారు. బతుకమ్మను సంబరంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ పండగ ఈ దుర్గాష్టమి నాడు జరుపుకుంటారు. సద్దులు అంటే చద్దులు. ఈ రోజు మాత్రం తప్పకుండా అన్న ప్రసాదాలు చేయాల్సిందే. పులిహోర, దద్ధోజనం, మలీద అని రొట్టెలు,బెల్లం కలిపి చేసే ఉండలు చేస్తారు. అందంగా తయారుచేసిన బతుకమ్మను దేవుడి ముందు పెట్టి పూజచేసి తర్వాత కొత్త బట్టలు ధరించి,అలంకరించుకుని , ఇంటిముందు కల్లాపు జల్లి ముగ్గు పెట్టి ఆ ముగ్గు మధ్యలో ఈ బతుకమని పెడతారు. ఇరుగు పొరుగు ఆడవాళ్ళు కూడా తమ బతుకమ్మలను తీసుకొచ్చి , అందరు కలిసి లయబద్ధమైన అడుగులు వేస్తూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ దానిచుట్టూ తిరుగుతారు. చిన్నా,పెద్దా తేడా లేకుండా అందరూ ఒక్కటై ఐక్యత, సోదరభావము, ప్రేమను కలిపి రంగరిస్తూ అడుగులో అడుగు కలుపుతూ వలయాకారంగా తిరుగుతారు. ఒకరు పాట పాడుతుంటే మిగిలినవారు గొంతు కలుపుతారు. కాస్త నడవలేని ముసలమ్మలు కూడా పక్కన కూర్చుని " ఏం పిల్లలో ఏమో? పాటలు రావంటారు. మా కాలంలో ఐతేనా? అంటూ ఒకదాని తర్వాత ఒకటి అలా రాగయుక్తంగా పడుతుంటారు. ఇవి అలాంటిలాంటి పాటలు కావు నీతి కథలు, జానపద కథలు, కొత్త పెల్లికూతురుకు చెప్పాల్సిన విషయాలు, కిటుకులు, ఆడవారి కష్టాలు ఇలా ఎన్నో ఉంటాయి.

ఇద్దరక్క చెల్లెళ్ళను ఉయ్యాలో ఊక్కూరికిస్తే ఉయ్యాలోఒక్కడే మాయన్న ఉయ్యాలో ఒచ్చైనా పోడు ఉయ్యాలో అంటూ అన్న చెల్లెల్ల అనుబంధంగురించి

ఏమమ్మ గోపమ్మ ఉయ్యాలో యశోద నందనా ఉయ్యాలో

మీవాడు గోపమ్మ ఉయ్యాలో యెంత కొంటెవాడు ఉయ్యాలో

అంటూ యశోద కృష్ణుల గురించిన అపురూపమైన పాటలు జాలువారేవి. ఇలా ప్రతి ఇంటి ముందు తమ బతుకమ్మలను పెట్టి కొద్ది సేపైనా పాటలు పాడుతూ ఆడతారు.

సామూహికంగా బతుకమ్మ ఆడేవాళ్ళు ఒకరికొకరు పరిచయం, స్నేహం ఉండాల్సిన పనిలేదు. అందరూ ఒకటే అన్నట్టుగా ఉంటారు. చీకటి పడుతుంది అనగా స్త్రీలందరూ ఈ బతుకమ్మలను చేత బట్టుకుని లేదా తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఊరిలో ఉన్న పెద్ద చెరువు కాని ,బావి కాని ఉంటె అక్కడికి వెళతారు. అందంగా అలంకరించుకున్న ఆడవాళ్ళు చేతిలో రంగు రంగుల బతుకమ్మలతో వెళ్ళే దృశ్యం అత్యంత రమణీయంగా , మనోహరంగా ఉంటుంది. వారి పాటలు,నవ్వులతో వీధులు కళకళ లాడుతుంటాయి. చెరువు దగ్గరకు రాగానే మళ్ళీ అందరి బతుకమ్మలను ఒక చోట పెట్టి బతుకమ్మ ఆడతారు. పండగ శోభ, హడావిడి అంతా ఇక్కడే ఉందా? అనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఆటపాటలలో అలిసి , చీకటి పడిందని తెలిసి ఒకరికొకరు పసుపు కుంకుమలు ఇచ్చుకుని ప్రసాదాలు పంచుకుంటారు. తర్వాత కూతురిని అత్తవారింటికి పంపినట్టుగా బతుకమ్మను నెమ్మదిగా నీటిలో వదులుతారు. అది అలా కదిలిపోతుంటే చూసి భారంగా వెనుదిరుగుతారు.

ఈ పండగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మని లేదా గౌరమ్మని కీర్తిస్తూ జరుపుకునే పండగ. ఏ పండగైనా, పబ్బమైనా కుటుంబం చల్లగా ఉండాలనే కోరుకుంటారు కదా. అందుకే బతుకమ్మ పండగ ప్రకృతిని ఆరాధించే పండగ. పూలు బాగా వికసించే కాలంలో, చెరువులు, వాగులు నీటితో కళకళలాడే సమయంలో వచ్చే ఈ బతుకమ్మ పండగ భూమి, జలంతో గల మానవ అనుబంధాన్ని ఒక సంబరంగా ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ పండగ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందునా తెలంగాణా ప్రాంతం వారు ఎంతో ఉల్లాసంగా ఆయా ప్రాంతాల్లో తమకు లభించే పూలతోనే బతుకమ్మ పండగ జరుపుకుంటారు.


కొన్ని బతుకమ్మ పాటలు ..

Saturday, 2 October 2010

సమూహంలో మనం! అక్టోబర్ 2010 కంప్యూటర్ ఎరా ఎడిటోరియల్

మనసు దేన్నో అనుసరిస్తోంది.. చిత్తం ఏకాగ్రం అవడం మానేస్తోంది. జ్ఞానేంద్రియాల్ని బలవంతంగా వర్తమానంలో కుదేద్దామన్న ప్రయత్నమూ భరించలేని చిరాకుగా నుదుట చిట్లుతోంది. గమ్యమెరుగక సంచరించే మనసుకి గాలమేసి స్థిమితపడడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతీ ఆలోచనలోనూ ఎన్నో సంక్లిష్టతలు. ఏదో చిక్కుముడి వద్ద ఒరుసుకుపోతూ నలిగిపోతుంటాం. అలల్లా కల్లోలపరుస్తూ.. వలల్లా పెనవేసుకుపోయే ఆలోచనలకు బంధనాలు వేయాలని పూనుకుంటాం. ఆలోచనల్ని బంధించాలన్న ఆలోచనే ఎన్నో జ్ఞాపకాలను తవ్వుకుంటూ మళ్లీ ఆ ఛట్రంలోనే మనల్ని బంధించేస్తుంది. ఒక ఆలోచనని జతగా చేసుకుని మనసు సంచరించే సరళిని విశ్లేషిస్తే ప్రతీ క్షణం, ప్రతీ సంఘటనా మనోఃఫలకంపై ఎలా ముద్రించుకుపోతోందో గమనింపుకు వస్తుంది. కొన్ని ఆలోచనల్లో భాగంగా జ్ఞప్తికి వచ్చే సందర్భాలను తరచిచూస్తే అసలు అవి మన ప్రమేయం లేకుండా జ్ఞాపకాల దొంతరల్లో ఎలా చేరిపోయాయో అంతేపట్టదు. మనసుకి ఆలోచనలే ఆహారం. ఏదో వలయంలో చిక్కుబడిపోయి ఆ చిక్కుముడులు విప్పుకునే ప్రయత్నమమే అది చేస్తుంటుంది. ఆ వలయం ధనార్జన, వస్తువ్యామోహం వంటి విషయకాంక్షల చుట్టూ పరిభ్రమించవచ్చు.. అనుబంధాలనే జీవితబంధాల చుట్టూ తిరుగాడవచ్చు..


కీర్తిప్రతిష్టల కోసం పాకులాడనూవచ్చు. మనం ఏ లక్ష్యం కోసమైతే పరితపించి జ్ఞానేంద్రియాలనూ, భౌతిక శక్తులను కేంద్రీకరిస్తున్నామో ఆ లక్ష్యం సాకారం అవదన్న సందేహం చుట్టుముట్టిన క్షణం మనసు గమనం అస్థిరమవుతుంది. కక్ష్య నుండి వేరుపడిన ఉపగ్రహంలా గమ్యమెరుగక కొట్టు మిట్టాడుతుంది. ఆ అసహనాన్ని భరించలేక మానసిక శక్తులను ప్రోదిచేసుకుని బలవంతంగా మళ్లీ ఏదో ఒక లక్ష్యం వైపు మళ్లించబడనిదే మనసుకు ఊరట లభించదు. అందుకే మనసుకి ఏ ఆలంబనా లభించనప్పుడు అంతర్ముఖులమై మనల్ని మనం తరచిచూసుకునే ధైర్యం చాలక లౌకిక ప్రపంచంలోని పరిసరాల తీరుతెన్నులు, మనుషుల ప్రవర్తనని బేరీజు వేయడానికి పూను కుంటాం. అంటే మన ఆలోచనల్ని సరిచేసుకునే ప్రయత్నం నుండి పారిపోయి ప్రపంచంలో కలిసిపోయి వేలెత్తిచూపడానికి ఉద్యుక్తులమవుతాం. ప్రతీ మనిషికీ ఒంటరిగా ఉండడం కన్నా సమూహంలో భాగంగా ఉండడమే ఎంత ఇష్టమో గమనిస్తే మనల్ని మనం ఎంత ఆస్వాదించు కుంటున్నామో, మన అస్థిత్వాన్ని మనమొక్కళ్లమే ఎంత కోరుకుంటున్నామో అర్థమవుతుంది. ఆలోచనల్ని మనవైపు తిప్పుకునే ధైర్యం లేనప్పుడు అవి జీవితాంతం లౌకిక ప్రపంచపు అడుగు జాడల్లోనే తచ్చాడుతూ ఉంటాయి. ఆ ప్రపంచపు వైకల్యాలన్నింటినీ చీదరించుకుంటూ భరిస్తూ మనమొక్కరమే వైకల్యం అంటనట్లు భ్రమిస్తూ సాగిపోతుంటాం. ఈ క్రమంలో లౌకిక ప్రపంచంలో మన ఉనికిని చాటుకునే కొన్ని తాత్కాలిక ప్రయత్నాలూ, వాటి ఫలితాలూ మనసుని క్షణకాలిక ఆనందంలో ముంచెత్తుతూ మరుక్షణమే నిరాశపరుస్తూ మనం ‘ఒంటరి’గా లేమన్న ధీమాని మిగుల్చుతుంటాయి. ‘ప్రపంచం మన వెంటే ఉందన్న భరోసా చాలు జీవితం గడిపేయడానికి.. మనకి మనం ఉన్నామన్న భరోసా లేకపోయినా!’



కంప్యూటర్ ఎరా పాఠకులకు 10వ వార్షికోత్సవ శుభాకంక్షలు

మీ
నల్లమోతు శ్రీధర్

Friday, 1 October 2010

సంతృప్తిగా 10వ సంవత్సరంలోకి..

ICWAI చదివి.. సినిమా జర్నలిస్ట్ గా దాదాపు పెద్ద నటీనటులందరితోనూ పనిచేసి.. 1996లో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ సాహిత్యానికి శ్రీకారం చుట్టే అదృష్టం లభించీ.. ఎన్నో మలుపులతో సాగిన నా ప్రస్థానం 2001 అక్టోబర్ నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక ద్వారా తెలుగు ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే క్రమంలో కొనసాగుతూ వచ్చింది. ఈ అక్టోబర్ 2010తో "కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగిడబోతోంది. ఈ తొమ్మిదేళ్ల ప్రయాణంలో నిఖార్సయిన నాలెడ్జ్ ని అందించడానికి, పాఠకులకు వీలైనంత సమాచారం ఇవ్వడానికి అహోరాత్రాలు ఎంత శ్రమించానో నా ఒక్కడికే తెలుసు! కారణం "కంప్యూటర్ ఎరా"ని 9 సంవత్సరాల పాటు మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకూ ప్రతీ లైనూ ఒక్కడినే రాస్తూ, టైప్ చేస్తూ, పేజ్ మేకప్ చేస్తూ నిర్వహిస్తూ వస్తున్నాను కాబట్టి.. ఇంత బాధ్యతని నిర్వర్తించడం వెనుక ఎంత చిత్తశుద్ధితో పనిచేసి ఉంటానో నాకు తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు. ఇది అతిశయోక్తిగా చెప్పడం లేదు. సగర్వంగా చెప్పుకుంటున్నాను.

1996లో తెలుగులో టెక్నికల్ లిటరేచర్ ని మొదటిసారిగా మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకూ ఎంతోమంది నా మిత్రులు, ఆత్మీయులు, పాఠకులు నా గైడెన్స్ లో అనేక సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉన్నతస్థానంలో స్థిరపడుతూ వచ్చినా ఇప్పటికీ సాధారణ ఎడిటర్ గా పనిచేస్తూ పాఠకులకు మంచి నాలెడ్జ్ ని అందించాలన్న తపనని ఇంకా కాపాడుకుంటూ రాగలుగుతున్నానంటే ఖచ్చితంగా అది నా స్థిరనిశ్చయాన్ని ప్రతిఫలిస్తుంది.

ప్రమాదంలో రెండు కాళ్లూ పోగొట్టుకుని కంప్యూటర్ ఎరా ద్వారా నేను రాసే ఎడిటోరియల్స్ స్ఫూర్తితో, మేగజైన్ లో రాసే టెక్నికల్ కంటెంట్ తో నాలెడ్జ్ ని పెంచుకుని ఇంటర్నెట్ సెంటర్ నడుపుతూ ఆశావాదంతో జీవితం సాగిస్తున్న ఓ పాఠకుడూ, 65 ఏళ్ల వయస్సులోనూ వేరే ఊరి నుండి నన్ను ఎలాగైనా కలుసుకోవాలని వచ్చి నేను అందుబాటులో లేకపోతే నడివేసవిలో పగలంతా బయటతిరిగి సాయంత్రం వరకూ నా కోసం వెయిట్ చేసిన నాగార్జునసాగర్ కి చెందిన ఓ పెద్దాయనా, అస్థవ్యస్థమైన జీవనశైలి నుండి ఎలాగైనా జీవితంలో పైకెదగాలని పట్టుదలతో ఏకలవ్యశిష్యునిలా నన్నూ, కంప్యూటర్ ఎరానీ ఆసరాగా చేసుకుని ఈరోజు అద్భుతమైన ప్రతిభతో NTV వంటి ఛానెల్ లో వీడియో ఎడిటర్ గా పనిచేస్తున్న మరో ఆత్మీయుడూ.. ఇలా ఎందరో ప్రత్యక్ష్యంగానూ, పరోక్షంగానూ తమ ఆశీర్వచనాలను అందిస్తూ నాకు మనోస్థైర్యాన్ని అందిస్తున్నారు.

వీళ్లందరినీ కాదనుకుని నేను ఇప్పటికన్నా గొప్పగా జీవించగలను.. కానీ ఎందరికో జీవితంలో స్థిరపడడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించగలిగే గురుతర బాధ్యత ముందు నా ఒక్కడి స్వార్థం సరైనదని అనుకోను. అందుకే ఇప్పటికీ తొమ్మిదేళ్లు గడిచినా "కంప్యూటర్ ఎరా"లో నాదైన పర్సనల్ టచ్ ఉంటూనే ఉంటుంది. మార్కెట్లో ఎన్నో కంప్యూటర్ పత్రికలు ఉండొచ్చు.. ఏరోజూ "కంప్యూటర్ ఎరా"ని ఇతర పత్రికలతో పోల్చుకోలేదు.. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీషువి గానీ, తెలుగువి కానీ ఇతర కంప్యూటర్ పత్రికలు నేను తిరగేసి చూసింది చివరిగా 2005లో.. అదీ ఓ బుక్ స్టాల్ మిత్రుడి కోరిన మీదట. మొదటి నుండి "కంప్యూటర్ ఎరా"ని ఓ సాధారణ పత్రికగా కాకుండా పదిమందికీ నాలెడ్జ్ ని పంచిపెట్టే ఓ చక్కని అవకాశంగా భావిస్తూ వచ్చాను. అందుకే వీలైనంత వరకూ పాఠకులకు అందుబాటులో ఉంటూ వచ్చాను. 2001 నుండి 2005 వరకూ రోజుకి 60-65 మందికి ఫోన్ ద్వారా డౌట్లు క్లారిఫై చేస్తూ వచ్చాను.. తర్వాతి కాలంలో సమయాభావం వల్ల పాఠకులు ఒకరికొకరు హెల్ప్ చేసుకునేలా 13,000 మందితో 2007 నుండి 2009 జూలై వరకూ "కంప్యూటర్ ఎరా" ఫోరమ్ ని నిర్వహించడం జరిగింది. పలు టెక్నికల్, సంస్థాపరమైన, ఇతర కారణాల వల్ల ఫోరమ్ ని నిలిపివేయవలసి వచ్చింది.

రోజు మొత్తంలో 60-65 ఫోన్ కాల్స్ కి డౌట్లు చెప్పేటప్పుడూ, ఫోరమ్, ఛాట్ సర్వీసులను నిర్వహించి రెండేళ్లకు పైగా ఆరోగ్యం అశ్రద్ధ చేస్తూ వేకువజాము 2-3 వరకూ సమయాన్ని దాని నిర్వహణపై వెచ్చించినప్పుడూ గుర్తుకురాని నేను.. ఎప్పుడైతే పరిస్థితులు అనుకూలించక ఆ సర్వీసులను నిలిపివేయడం జరిగిందో అప్పుడు నిష్టూరమాడడానికి కొంతమంది పాఠకులకు టార్గెట్ గా నిలిచాను. అయినా రకరకాల మనుషుల మనస్థత్వం మొదటినుండీ అలవాటైనదే కావడం వల్ల సైలెంట్ గా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. నిజంగా నాకు ఇంతటి గొప్ప బాధ్యతని అప్పజెప్పినందుకు భగవంతునికి ఎల్లవేళలా కృతజ్ఞుడనై ఉంటున్నాను. సమాజం పట్ల నా బాధ్యతని తీర్చుకునే అవకాశం నాకు కలిగింది. అందుకే నన్ను ఎంతోమంది అర్థం చేసుకున్నా, కొందరికి నేను సరిగ్గా అర్థం కాకున్నా నాకెవరూ శత్రువులు లేరు.. అందరూ నాకు శ్రేయోభిలాషులే.. అందరి శ్రేయస్సునూ అభిలషించే వాడినే! మొదటి నుండి ఎలాంటి పబ్లిసిటీ హంగామా లేకపోయినా "కంప్యూటర్ ఎరా" తెలుగు పత్రికని ఆదరించి, తమకు తెలిసిన పదిమందికీ పరిచయం చేస్తూ మా కష్టం మరెంతో మందికి నాలెడ్జ్ అందించేలా సహకరిస్తున్న పాఠకులకు వందనాలు.

తొమ్మిదేళ్ల పాటు ప్రతీ నెలా 1వ తేదీకల్లా పత్రికను మార్కెట్లోకి తీసుకురావడానికి ఒంటిచేత్తో మేగజైన్ రాస్తూ ఎన్ని ముఖ్యమైన శుభకార్యాలు, సంఘటనల్ని మిస్ చేసుకున్నానో, అనారోగ్య కారణాల వల్ల అతి కొద్ది సందర్భాల్లో మేగజైన్ మార్కెట్లో విడుదల అవనప్పుడు ఫోన్ల ద్వారా ఆరా తీసే రీడర్స్ కి నా వ్యక్తిగతమైన ఇబ్బందులను వివరించలేక ఎన్ని తంటాలు పడ్డానో అవన్నీ ఇంత సుదీర్ఘమైన మైలురాళ్ల ముందు దిగదుడుపుగానే భావిస్తున్నాను. ఒక్కటి మాత్రం నిజం "కంప్యూటర్ ఎరా" లాంటి చిత్తశుద్ధి, పర్సనల్ టచ్ తో కూడిన ఏ పత్రికనూ పాఠకులు ఎప్పటికీ చూడలేరు. ఇది అతిశయోక్తిగా భావిస్తే ఓసారి 2001 నుండి 2010 వరకూ విడుదలైన అన్ని సంచికలూ కనీసం పేజీలైనా తిరగేసి చూడండి.. ఎందుకింత థీమాగా మాట్లాడుతున్నానో!

చివరిగా ఇంతకాలం స్వంత వ్యక్తిగా ఆదరించిన పాఠకులకు హృదయపూర్వక ధన్యవాదాలతో..

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మాసపత్రిక
http://computerera.co.in

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008

Jump to TOP