ఆపన్నహస్తం - ఫిబ్రవరి 2011 కంప్యూటర్ ఎరా సంపాదకీయం
ఓ సంఘటన తాలూకూ విపరీతమైన ఆందోళన తర్వాత రాస్తున్న సంపాదకీయం ఇది. మా బంధువుల్లో ఒకమ్మాయి అకస్మాత్తుగా కన్పించకుండాపోయింది. ఉదయం 8 గంటల నుండి మరుసటిరోజు వేకువజామున 4 గంటల వరకూ అన్ని రకాల ప్రయత్నాలూ చేశాం. వేకువజాము 4 గంటలకు తన ఫోన్ కలిసింది. మాట్లాడితే హైదరాబాద్ నుండి రాములవారి భద్రాచలం ఓ డిప్రెస్డ్ మూడ్‌లో ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిందని తెలిసింది. వెళ్లిన వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులు పేదవాళ్లకు పంచేసింది. ఆ భగవంతుడి దయతో తన మనసుమారింది కాబట్టి సరిపోయింది.. మాకు ఫోన్ కలిసింది. తీరా తిరుగు ప్రయాణం అవుదామంటే తన దగ్గర ఐదు రూపాయలు తప్ప బస్ ఛార్జీలకు కూడా డబ్బులు లేవు. ఆ సమయంలో మన ‘కంప్యూటర్ ఎరా’ పాఠకులు భద్రాచలం లో నివశిస్తున్న మధుసూదనరావు గారి నెంబర్ ఇప్పటివరకూ తమ వివరాలు అందించిన సుమారు 6000 మంది మన పాఠకుల వివరాల్లో నాకు లభించింది. ఆయనకు ఫోన్ చేసి సహాయం కోరడం ఆలస్యం.. అంత వేకువజాము వాళ్ల కూతురిని తోడుగా నిద్రలేపి ఉన్న ఫళంగా బస్టాండ్‌కి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఎందుకు ఇదంతా రాస్తున్నానని మీకు అన్పించవచ్చు. దాదాపు 20 గంటల పాటు అందరం ఎంత నరకయాతన అనుభవించామో ఆ స్థితిలో ఉన్న మాకే తెలుసు. ఇలాంటి పరిస్థితులు మన పాఠకుల్లో ఎవరికైనా ఎప్పుడైనా తలెత్తవచ్చు. ప్రతీ ఊళ్లోనూ మన పాఠకులు ఉంటారు. ఆపత్కాలంలో ఒకరికొకరు మాట సాయమో, స్వల్ప ఆర్థిక సాయమో చేసుకోవడానికి మించిన మానవత్వం ఏముంటుంది? మేము ఎదుర్కొన్న స్వీయ అనుభవం నుండి ఓ ఆలోచన ఉద్భవించింది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రతీ ఊళ్లో ఉన్న పాఠకులు మానవత్వంతో ఇతరులు ఎవరికైనా తమకు సాధ్యమైనంత సాయం చేయగలిగిన అవకాశం ఉండి ఉంటే మీ పేరు, ఊరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడిలను http://computerera.co.in అనే మన వెబ్‌సైట్‌లో ఎంటర్ చేయండి. ఎవరికైనా, ఎప్పుడైనా, పైన తెలిపిన దయనీయ పరిస్థితులు ఏర్పడినట్లు మా దృష్టికి వస్తే వారికి మీ వివరాలు అందిస్తాము. అలాగే మీలో, మీ బంధువుల్లో, స్నేహితుల్లో ఎవరైనా ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఇరుక్కుని ఉంటే ఒక్కసారి 9000239948 అనే నెంబర్‌కి ఫోన్ చేసి ఊరు కాని ఊళ్లో మీకు ఏర్పడిన క్లిష్టమైన పరిస్థితిని వివరించి ఆ ఊళ్లలో నివశిస్తున్న మన ‘కంప్యూటర్ ఎరా’ పాఠకుల వివరాలను పొందవచ్చు. కేవలం మానవత్వంతో, సేవాభావంతో నిర్వహించదలుచుకున్న ఈ సర్వీస్‌ని సద్వినియోగం చేసుకోగలరు, మనసున్న మనుషులుగా ఇందులో మీరూ భాగస్వాములైతే ఆపత్కాలంలో ఎందరికో మనవంతు సాయాన్ని అందించగలిగిన వాళ్లం అవుతాము. సెల్‌ఫోన్లు, ఇ`మెయిళ్లు.. అధునాతన కమ్యూనికేషన్ టెక్నాలజీ వల్ల మానవత్వం మంటగలిసిపోతోందన్న అన్న తప్పుడు అభిప్రాయాన్ని చెరిపేద్దాం. మనలోనూ సున్నితత్వం, స్పందించే హృదయం ఉందన్న విషయాన్ని నిరూపించుకుందాం. ఈ సర్వీస్‌లో మీరూ భాగస్వాములు అవాలనుకుంటే మీ వివరాలు http://computerera.co.in అనే వెబ్‌సైట్‌లో ఎంటర్ చేయండి. అలాగే మీ మిత్రులకూ ఈ సర్వీస్‌ని పరిచయం చేయండి. మీ వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశమే లేదు. ఆపత్కాలంలో మీ వివరాలను ఇతరులకు అందించడంతోపాటు నెలకొక్కసారి మన మేగజైన్ రిలీజ్ అయ్యే తేదీ మాత్రం మీకు SMS చేస్తుంటాం. ఓ క్లిష్టపరిస్థితిలో తన సహాయం అందించి ఇటువంటి సర్వీస్‌కి శ్రీకారం చుట్టడానికి కారకులైన మధుసూదనరావు గారికి మరోసారి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ..
మీనల్లమోతు శ్రీధర్